మూక దాడులకు ఇదా విరుగుడు?

7 Jul, 2018 01:12 IST|Sakshi

సామాజిక మాధ్యమాలే వాహికలుగా వదంతులు చెలరేగి ఉన్మాద మూకలు అమాయకుల్ని కొట్టి చంపుతున్న ఉదంతాలపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కదిలింది. ప్రపంచంలోనే అత్యధిక శాతం మంది వినియోగదారులున్న భారత్‌లో భద్రతకు సంబంధించిన అంశాలపై వాట్సాప్‌ సంస్థ శ్రద్ధ పెట్టడం ముఖ్యమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ హితవు పలికారు. అంతే కాదు... పోలీసు, న్యాయ విభాగాలతో అది కలిసి పనిచేయాలని కోరారు. ఆ సంస్థ కూడా వెను వెంటనే స్పందించి కొన్ని సాంకేతిక పద్ధతుల్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. వాట్సాప్‌లో ప్రచారమయ్యే వార్తల్లోని నిజానిజాలు తనిఖీ చేయడం, కొన్ని నియంత్రణలు పెట్టడం, డిజిటల్‌ లిటరసీని పెంచడం వంటి చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పింది.

వీటితోపాటు విచారణ సంస్థల వినతులకు అనుగుణంగా పూర్తి వివరాలు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఆటవిక యుగాన్ని తలపించేలా పదులకొద్దీమంది వ్యక్తులపై దాడులు చేయటం, నెత్తురోడేలా కొట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం, ప్రాణాలు తీయడం సర్వసాధారణమైంది. ఒక నివేదిక ప్రకారం నిరుడు మే నెలతో మొదలుపెట్టి ఇంతవరకూ 9 రాష్ట్రాల్లో 27మందిని మూకలు కొట్టి చంపాయి. ఇటీవల ఒక చోట అయితే తీవ్ర గాయాలతో మరణించినవారి మృత దేహాలను అక్కడికక్కడే పెట్రోల్‌ పోసి నిప్పంటించడానికి ఒక గుంపు ప్రయత్నించింది. ఈ భయంకర ఘటనల పరంపర చూస్తున్నవారెవరికైనా కేంద్ర ప్రభుత్వం చేసిన వినతి, అందుకు వాట్సాప్‌ సంస్థ స్పందించిన తీరు ఉపశమనం కలిగిస్తుంది. ఇకపై ఈ ఆటవిక ఉదంతాలు ఆగిపోతాయన్న ఆశ కలుగుతుంది.

అయితే ఈ వదంతుల మూలాల్లోకి వెళ్లి కారకులెవరో, వారికున్న ప్రయోజనాలేమిటో కూపీ లాగి చర్యలు తీసుకోవడం వల్ల ఇంతకన్నా మెరుగైన ఫలితం వస్తుంది. అంతేతప్ప సామాజిక మాధ్య మంపై నిఘా మొదలుపెడితే అది దేనికి దారితీస్తుందో వేరే చెప్పనవసరం లేదు. వివిధ అంశాలపై న్యాయమైన, సహేతుకమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారిని నియంత్రించేందుకు ప్రభు త్వాలు పూనుకుంటాయి. భావప్రకటనా స్వేచ్ఛకు ముప్పు ఏర్పడుతుంది. 

వదంతుల వ్యాప్తి వాట్సాప్‌తోనే మొదలుకాలేదు. మన దేశంలో ఫోన్‌ సౌకర్యం కూడా సరిగా లేనప్పుడు కూడా వదంతులు రాజ్యమేలాయి. దేశ చరిత్రలో రుధిరాధ్యాయాలుగా నమోదైన అనేక ఉదంతాలు గుర్తుకు తెచ్చుకుంటే ఈ సంగతి ధ్రువపడుతుంది. భావోద్వేగాలు కట్టలు తెంచుకున్న దేశ విభజన సమయంలో అన్య మతస్తులపై ఇక్కడా, పాకిస్తాన్‌లోనూ ఎంతటి దారుణ ఉదంతాలు చోటుచేసుకున్నాయో విన్నప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇరుపక్కలా వందలాదిమంది చనిపోయారు. వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో తరలిపోయాయి. ఈ భావో ద్వేగాల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే... మహాత్మా గాంధీని దుండగులు పొట్టనబెట్టుకున్నప్పుడు ఆ దుండగుల కులాన్ని కూడా ఆనాటి కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రసారం చేయించవలసి వచ్చింది.

లేదంటే అనవసర అపోహలు వ్యాపిస్తాయని ఆందోళనపడింది. 1983నాటి అస్సాం లోని నెల్లీ మారణకాండ, ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో ఢిల్లీలో మూడురోజులపాటు సాగిన సిక్కుల ఊచకోత, 2002నాటి గుజరాత్‌ నరమేథం వగైరాలన్నీ కేవలం వదంతుల పర్యవసానంగా పుట్టుకొచ్చి విస్తరించినవే. కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు దురుద్దేశంతో వదంతుల్ని ప్రచారంలో పెట్టడం వల్లే ఇవన్నీ జరిగాయి. వ్యక్తుల ప్రమేయం లేకుండా, ఎవరికీ ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఇవి వ్యాపిస్తున్నాయనుకుంటే అది తెలివితక్కువతనం. ఆవేశం ముదిరి, అది ఉన్మాద స్థాయికి చేరుకుని చంపడానికైనా, చావడానికైనా సిద్ధపడే వ్యక్తుల సమూహాన్ని గుంపు అంటారని నిఘంటువులు చెబుతాయి. కానీ అందులో వ్యక్తులుంటారు. వారిని ప్రేరేపించినవారుంటారు. ప్రభుత్వాలు చురుగ్గా కదిలితే బాధ్యుల్ని పట్టుకోవటం కష్టం కాదు. 

దేశంలో గత మూడు నాలుగేళ్లుగా గోరక్షణ పేరుతో మూకలు రెచ్చిపోయాయి. పశువుల్ని కబేళాలకు తరలిస్తున్నారని, పశు మాంసాన్ని దగ్గరుంచుకున్నారని ఆరోపించి ఎందరిపైనో దాడులకు దిగాయి. ఇందులో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లోని ఉనాలో తగిన పత్రాలతో పశువుల్ని తీసుకెళ్తున్న అయిదారుగురు యువకుల్ని చేతులు విరిచికట్టి బహిరంగంగా కొట్టడం దృశ్య సహితంగా ప్రచారంలోకొచ్చింది. ఇవి ఇంకా ఆగాయో లేదో చెప్పలేంగానీ... ఈలోగా ‘పిల్లల అపహరణ’ సీజన్‌ మొదలైపోయింది. వీటిని నియంత్రించడంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసి 24 గంటలు గడవక ముందే అస్సాంలోని దిమా హసావ్‌ జిల్లాలో శుక్రవారం రైలు దిగిన ముగ్గురు కాషాయాంబరధారులను వందలమంది చుట్టుముట్టి వారి చేతులు కట్టి దౌర్జన్యం చేస్తుండగా దగ్గరలోని సైనిక జవాన్లు, పోలీసులు అడ్డు పడ్డారు.

వారు జోక్యం చేసుకోకపోయి ఉంటే ఆ ముగ్గురినీ గుంపు కొట్టి చంపేది. దేశాన్ని అప్ర దిష్టపాలు చేస్తున్న మూక దాడులకు అడ్డుకట్ట వేయాల్సిందే. కానీ నిర్దిష్టమైన ఘటనలో కాల్‌ రికార్డులు తనిఖీ చేసి నేర నిర్ధారణను రుజువు చేయడానికి ప్రయత్నించడం వేరు. మొత్తంగా పౌరులందరి ఫోన్‌ సంభాషణలపై టోకున నిఘా పెట్టడం వేరు. ప్రభుత్వం తన అధీనంలోని సంస్థలన్నిటినీ, వాటి సమస్త వనరుల్నీ వినియోగించుకుని నేరగాళ్ల ఆచూకీ పట్టాలి. కానీ ఆ పేరిట మాధ్యమాలను నియంత్రించడం మొదలుపెడితే అది త్వరలోనే దుర్వినియోగ మయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది.

మరిన్ని వార్తలు