రెబెల్‌ న్యాయవాది

10 Sep, 2019 01:10 IST|Sakshi

కొందరు ప్రశ్నించడానికే పుట్టినట్టుంటారు. ఎంతటివారినైనా నిలదీస్తారు. ఆ క్రమంలో ఎంత పరుషంగా మాట్లాడటానికైనా సిద్ధపడతారు. అవతలివారిని ఇరకాటంలోకి నెడతారు. అందుకే వారిని చూస్తే అధికార పీఠాలు వణుకుతాయి. ఆదివారం ఉదయం కన్నుమూసిన సుప్రసిద్ధ న్యాయకోవిదుడు రాంజెఠ్మలానీ ఆ కోవకు చెందిన అరుదైన వ్యక్తి. ‘తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వెనుదీయని ధైర్యశాలి జెఠ్మలానీ’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాట అక్షరసత్యం. 2015లో చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌(సీవీసీ)గా కెవి చౌదరి నియామకం జరిగినప్పుడు ‘ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను ఎంతమాత్రం అనుకోలేదు. 

మీపై క్రమేపీ తగ్గుతూ వస్తున్న గౌరవం, ఇవాళ్టితో పూర్తిగా అడుగంటింది’ అని మోదీకి ఘాటైన లేఖరాసినా...‘మీరు విశ్వాసఘాతకులు. నాకు కృతజ్ఞతగా ఉండాల్సిన మీరు శత్రువుగా మారి వంచకులతో చేతులు కలిపారు’ అంటూ బీజేపీ కురువృద్ధుడు ఎల్‌ కే అడ్వాణీపై నిప్పులు చెరిగినా...మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అధికారంలో ఉండగా ఆయనకు బోఫోర్స్‌పై రోజుకు పది ప్రశ్నలతో లేఖలు సంధిం చినా అది రాంజెఠ్మలానీకే చెల్లుతుంది. ఆ లేఖల గురించి ఒకరు ప్రస్తావించినప్పుడు రాజీవ్‌గాంధీ సహనం కోల్పోయి, ‘అరిచే ప్రతి కుక్కకూ జవాబివ్వాల్సిన అవసరం లేద’ని ఈసడిం చగా...‘అవును నేను కుక్కనే. ఈ ప్రజాస్వామ్యానికి కావలి కుక్క’ను అని రాంజెఠ్మలానీ తడుము కోకుండా ప్రత్యుత్తరమిచ్చారు. 

పదవుల పంపకం జరిగినప్పుడల్లా అవి దక్కనివారు అలగటం, నిష్టూరంగా మాట్లాడటం ఇంచుమించు అన్ని పార్టీల్లో గమనిస్తాం. ఆ ధోరణి జెఠ్మలానీలో కూడా కనబడుతుంది. అయితే ఆయన అలక విలక్షణమైనది. ముందూ మునుపూ ‘పనికొస్తుంద’ని ఏ విషయం దాచుకోవడం అంటూ ఉండదు. తాను ఏం ఆశించాడో, ఎందుకు ఆశించాడో చెప్పడంతోపాటు... నాయకుడు తన నెలా నట్టేట ముంచాడో కుండబద్దలు కొట్టడం జెఠ్మలానీ ప్రత్యేకత. ఆయన కాంగ్రెస్‌ మొదలుకొని అన్ని పార్టీల్లోనూ చేరారు. ఇంచుమించు అంతే వేగంగా బయటికొచ్చారు. 

రాజ్యసభ సభ్యత్వమో, మరొకటో ఇస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత మాట తప్పినప్పుడు నిప్పులు చెరగడం జెఠ్మలానీకి రివాజు. అలా అని ఆయన్ను సగటు రాజకీయ నాయకుడిగా భావించలేం. అనుకున్న పదవి దక్కి నిక్షేపంగా ఉన్నప్పుడు సైతం ఆయన మౌనంగా, ప్రశాంతంగా గడిపిన సందర్భం లేదు. అటల్‌ బిహారీ వాజపేయి కేబినెట్‌లో న్యాయ శాఖమంత్రి ఉంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఏఎస్‌ ఆనంద్‌కు వ్యతిరేకంగా ప్రకటన చేసి జెఠ్మలానీ పదవి పోగొట్టుకున్నారు. తదనంతరం 2004లో ఆయన వాజపేయిపైనే లక్నో నియోజకవర్గం నుంచి పోటీచేశారు. బీజేపీలో ఉంటూనే 2012లో అప్పటి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీకి లేఖరాస్తూ  యూపీఏ ప్రభుత్వ అవినీతిపై పార్టీ నేతలెవరూ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీయడంతో ఆగ్రహించిన పార్టీ ఆయన్ను ఆరేళ్ల పాటు బహిష్కరించగా, పార్టీపైనే పరువు నష్టం దావా వేశారు. 

ఆ సందర్భంలోనే అడ్వాణీపై నిప్పులు చెరిగారు. ఆయనే ఇతరులతో చేతులు కలిపి తన బహిష్కరణకు కారణమయ్యారని విమర్శించారు. జైన్‌ హవాలా కేసులో వాదించి ఆయన్ను నిర్దోషిగా నిరూపిస్తే, ఇది అడ్వాణీ చేసిన ప్రత్యుపకారమని దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా ఆయన మౌనంగా లేరు. రోజూ ఆయన చేసే పదునైన విమర్శలను తట్టుకోలేని ఇందిర ప్రభుత్వం ఆయనపై అరెస్టు వారెంట్‌ జారీ చేస్తే దానిపై బొంబాయి హైకోర్టు స్టే విధించింది. అనంతరం ఆయన కెనడా వెళ్లి అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఉద్యమించారు. దాన్ని తొలగించాకే దేశంలో అడుగుపెట్టారు. 

క్రిమినల్‌ కేసులు స్వీకరించడంలోనైనా, వాటిని వాదించడంలోనైనా జెఠ్మలానీ వ్యవహారశైలి ఎవరి ఊహకూ అందేది కాదు. సాక్షుల్ని క్రాస్‌ ఎగ్జామ్‌ చేయడంలో ఆయన సాటి దేశంలోనే మరెవరూ లేరంటారు. దాని వెనకున్న రహస్యాన్ని ఆయనొకసారి చెప్పారు. కక్షిదారు చెబుతున్న అంశాలపైనే ఆధారపడినా, కేవలం చట్టనిబంధనలు చదువుకు వెళ్లినా అనుకున్న ఫలితం రాదని... స్వయంగా ఘటనా స్థలానికెళ్లి సొంతంగా పరిశోధించి జరిగిందేమిటో తెలుసుకున్నప్పుడే ఏ కేసునైనా సమర్థవంతంగా వాదించగలుగుతామన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. 

ఏడు దశాబ్దాల న్యాయవాద వృత్తిలో గడించిన అపారానుభవం నుంచి చెప్పిన మాటలవి. దేశంలో నేర న్యాయ వ్యవస్థ ఒక రూపం సంతరించుకోవడంలో జెఠ్మలానీ పాత్ర ఎనలేనిది. ఆయన వాదించిన కేసులు చూస్తే జెఠ్మలానీ విలక్షణ శైలి అర్ధమవుతుంది. 70వ దశకంలో పేరుమోసిన స్మగ్లర్‌ హాజీ మస్తాన్‌ మొదలుకొని 90లనాటి హర్షద్‌ మెహతా, కేతన్‌ పారిఖ్‌ వంటి స్టాక్‌ మార్కెట్‌ స్కాం నిందితుల వరకూ...ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్య కేసు నిందితులు, పార్లమెంటుపై దాడి కేసులో ఉన్న అప్పటి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎస్‌ఏఆర్‌ జిలానీ వరకూ జెఠ్మలానీ స్వీకరించిన కేసులన్నీ దిగ్భ్రాంతిపరిచేవే. ఈ కేసుల్లో ఆయన మొక్కుబడిగా వాదించడం కాదు... తన వాదనా పటిమతో ఆ కేసుల్లోని బహుముఖ కోణాలను విప్పి చెప్పి, నిందితుల నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి  చేసే ప్రయత్నాలు న్యాయమూర్తులనే అబ్బురపరిచేవి. 

సమాజం గీసే లక్ష్మణరేఖలు ఎప్పుడూ జెఠ్మలా నీని నివారించలేకపోయాయి. ఈ కేసుల్లోని నిందితులు జాతి వ్యతిరేకులని, దేశద్రోహులని, వారి తరఫున వాదించినవారూ ద్రోహులేనని గుండెలు బాదుకుంటున్నవారిని చూసి ఆయన జాలిపడి ఊరుకునేవారు. నేర నిరూపణ జరిగేవరకూ ఏ కేసులోని నిందితులైనా నిరపరాధులేనన్నది ఆయన నిశ్చిత భావన. సంపన్న కక్షిదారుల నుంచి ఫీజు రూపంలో భారీగా వసూలు చేయడం, నిస్సహాయ కక్షిదారుల తరఫున ఉచితంగా వాదించడం జెఠ్మలానీ ఎంచుకున్న విధానం. ఆయన జీవిత చరిత్ర పుస్తకం పేరు ‘తిరుగుబాటుదారు’. జెఠ్మలానీ చివరి వరకూ అలాగే జీవించారు.

>
మరిన్ని వార్తలు