మళ్లీ సంక్షోభంలో లంక

30 Oct, 2018 01:20 IST|Sakshi

పట్టుమని మూడేళ్లు కాకుండానే శ్రీలంక మళ్లీ అస్థిరతలోకి జారుకుంది. ఈసారి సంక్షోభం పూర్తిగా అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సృష్టి. మరో ఏడాదిలోగా దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాల్సి ఉండగా... దేశ రాజకీయ రంగంలో తాను ఏకాకిగా మారుతున్నానని గ్రహించిన సిరిసేన, ఉన్న ట్టుండి ప్రధాని రణిల్‌ విక్రమసింఘేను తొలగించి ఆయన స్థానంలో మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సను ఆ పీఠం ఎక్కించారు. అంతేకాదు... ఆ దేశ పార్లమెంటును మూడు వారాలపాటు సస్పెండ్‌ చేశారు. తన మతిమాలిన చర్యకు పార్లమెంటులో ప్రతిఘటన రావొచ్చునన్న భయమే ఇందుకు కారణం. 

225మంది సభ్యులున్న పార్లమెంటులో విక్రమసింఘే పార్టీకే అత్యధికంగా 106 మంది సభ్యుల మద్దతుంది. అటు సిరిసేన పార్టీ, ఇటు రాజపక్స పార్టీకి కలిసి 95కి మించి స్థానాలు లేవు. సిరిసేన ఒకప్పుడు రాజపక్సకు అత్యంత సన్నిహితుడు. 2015 జనవరిలో అధ్యక్ష ఎన్నికలు జరగడానికి రెండు నెలల ముందు వరకూ రాజపక్స కేబినెట్‌లో ఆయన నంబర్‌ టూ. అప్పటికి దాదాపు పదేళ్లుగా ఆయనతో కలిసి అధికార భోగాలు అనుభవించారు. కానీ అధ్యక్ష ఎన్నికలు ప్రకటించాక విపక్ష శిబిరంలోకి లంఘించి అధ్యక్ష పదవికి పోటీచేసి విజయం సాధించారు.   

తమిళ టైగర్ల బూచిని చూపి దేశంలో నిరంకుశ పాలన చలాయించిన రాజపక్సపై ఎన్నో ఆరో పణలున్నాయి. ఆయన అవినీతి, బంధుప్రీతి సంగతలా ఉంచి తమిళ టైగర్లను అణిచే పేరిట ఆయన  ప్రభుత్వం సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు. ఆయన సాగించినదంతా నరమేథమని, అందులో 40,000మంది అమాయక పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి కమిటీ అంచనా వేసింది. ఎందరో మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరిగాయి. పసివాళ్లను సైతం నిర్దాక్షి ణ్యంగా హతమార్చారు.  దాదాపు 65,000మంది తమిళులు ఆచూకీ లేకుండాపోయారు. తన విధా నాలను విమర్శించినవారిని జాతి వ్యతిరేకులుగా ముద్రేయడం, రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టి వారిని భయభ్రాంతులకు గురిచేయడం రాజపక్స ఒక కళగా అభివృద్ధి చేసుకున్నారు. ప్రభుత్వం లోని అన్ని వ్యవస్థల్లోనూ తన అనుచరులను చొప్పించి వాటిని నియంత్రణలోకి తెచ్చుకున్నారు.  

వీటన్నిటి విషయంలో రాజపక్సపై వెల్లువెత్తుతున్న అసంతృప్తిని గమనించే అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు సిరిసేన విపక్ష శిబిరానికి ఫిరాయించారు. అధ్యక్ష పదవికి పోటీచేసి నెగ్గారు. కానీ ఆ సందర్భంగా ఆయన చేసిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. రాజపక్స సాగించిన నియంతృత్వానికి అధ్యక్షుడికుండే అపరిమిత అధికారాలే మూల కారణమని, వాటిని రద్దు చేసి అధ్యక్ష తరహా పాల నకు స్వస్తి పలుకుతానని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు తగినట్టు రాజ్యాంగానికి 19వ సవర ణను తీసుకొచ్చారు. దాని ప్రకారం పార్లమెంటు అనుమతి లేకుండా ప్రధానిని తొలగించకూడదు. అలాగే  ప్రధానితో సంప్రదించాకే కేబినెట్‌ మంత్రులుగా ఎవరినైనా నియమించాలి. 

పార్లమెంటును రద్దు చేయడానికుండే అధికారాలను కత్తిరించడం, రాజ్యాంగమండలి అనుమతి లేకుండా ఉన్నతా ధికారుల నియామకం చేయకూడదనటం వంటివి అందులో ఉన్నాయి. అధ్యక్షుడి పదవీకాలాన్ని ఆరేళ్ల నుంచి అయిదేళ్లకు మార్చారు.  పర్యవసానంగా ఆయనకు కొన్ని అంశాల్లో భంగపాటు తప్ప లేదు. ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి పంపిన సిఫార్సులను రాజ్యాంగమండలి తోసిపుచ్చడం ఆయనకు ఆగ్రహం కలిగించింది. 

దానికితోడు జనతా విముక్తి పెరుమున(జేవీపీ) పార్లమెంటులో ప్రవేశపెట్టిన 20వ సవరణ ముసాయిదా అధ్యక్ష అధికారాలకు మరింత కోత పెడుతోంది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల ద్వారా కాక, రహస్య బ్యాలెట్‌ విధానంలో పార్లమెంటు సభ్యులు దేశాధ్యక్షుణ్ణి ఎన్నుకోవాలన్న నియమం ఉంది. అలాగే అధ్యక్షుడిని అభిశంసించే విశేషాధికారాన్ని ఈ సవరణ బిల్లు పార్లమెంటుకు ఇస్తోంది. నిజానికి ఈ ముసాయిదా సవరణలోని నిబంధనలేవీ సిరిసేన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధం కాదు. ఇప్పటికే కొన్ని అధికారాలను వదులుకోవాల్సి వచ్చిందని చింతిస్తున్న సిరిసేకు ఈ పరిణామం నచ్చలేదు. 

ఒకపక్క విక్రమసింఘేతో ఉన్న విభేదాలు రోజురోజుకూ ముదరడం, మరోపక్క తన అను చరులైన ఎంపీల్లో చాలామంది రాజపక్సకు అనుకూలురుగా ఉండటం ఆయన్ను కలచివేస్తోంది. అధికారంలో ఉండగా అధ్యక్ష స్థానాన్ని అపరిమిత అధికారాలతో పటిష్టం చేసుకోవడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ అధికారాలకు కోత వేయాలనడం శ్రీలంకలో దశాబ్దాలుగా సాగుతున్న నాటకమే. సిరిసేన కూడా దాన్నే కొనసాగించారు. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల సమయానికి బలపడకపోతే రాజకీయంగా కనుమరుగవుతానని ఆయన ఆందోళన పడుతున్నారు. 

అటు రాజపక్స సైతం ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకుని 2020లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. అందుకే  2015లో తనపై తిరగబడి ప్రత్యర్థులతో చేతులు కలిపిన సిరిసేన ఊహించని రీతిలో అందించిన స్నేహహస్తాన్ని ఆయన అందుకున్నారు. రాజపక్స చైనాకు సన్నిహితుడు. ఆయన హయాంలోనే మన దేశంతో శ్రీలంక సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అక్కడ చైనా ప్రాబల్యం పెరిగింది. ఆయన మళ్లీ అధికారంలోకి రావడం సహజంగానే చైనాకు మేలు చేస్తుంది. 

నిర్మాణంలో ఉన్న మన ప్రాజెక్టులకు ఇబ్బందులేర్పడతాయి. పదవీ చ్యుతుడైన  విక్రమసింఘే భారత్‌కు సన్నిహితుడన్న పేరుంది. ఇప్పటికే మన పొరుగునున్న మాల్దీ వుల్లో అనిశ్చితి అలుముకుని ఉంది. అక్కడి ఎన్నికల్లో విజయం సాధించిన విపక్ష కూటమి అభ్యర్థి మహ్మద్‌ సోలిహ్‌కు ప్రస్తుత అధ్యక్షుడు యామీన్‌ అధికార పగ్గాలు అప్పగిస్తారా లేదా అన్న సందేహాలున్నాయి. కనుక శ్రీలంక పరిణామాలపై మన దేశం ఆచితూచి అడుగేయాలి. పెద్దన్న పాత్ర పోషిస్తున్నదన్న నింద పడకుండా మన ప్రయోజనాల పరిరక్షణ  విషయంలో చాకచక్యంగా వ్యవహరించాలి.

మరిన్ని వార్తలు