అస్తమించిన ‘సూర్యుడు’

8 Aug, 2018 01:44 IST|Sakshi

నిరంతరం ఆటుపోట్లతో, అడుగడుగునా సవాళ్లతో, అంతుచిక్కని సుడిగుండాలతో నిండి ఉండే రాజకీయ రంగంలో ఎనభైయ్యేళ్ల సుదీర్ఘకాలం తలమునకలై ఉండటం... అందులో యాభైయ్యే ళ్లపాటు తిరుగులేని నాయకుడిగా ప్రజానీకంపై తనదైన ముద్ర వేయటం అసాధారణం. మంగళ వారం తన 94వ ఏట కన్నుమూసిన ముత్తువేల్‌ కరుణానిధి అటువంటి అరుదైన చరిత్రను సొంతం చేసుకున్న అసాధారణ నాయకుడు. పెరియార్‌ రామస్వామి సారథ్యంలో ప్రారంభమైన అట్టడుగు కులాల ద్రవిడ ఆత్మ గౌరవ ఉద్యమం మద్రాస్‌ ప్రెసిడెన్సీని దావానలంలా చుట్టుముట్టిన తరుణంలో కళ్లు తెరిచిన కరుణానిధి పద్నాలుగేళ్ల వయసొచ్చేసరికి అందులో భాగస్వామిగా మారడమే కాదు... అనంతరకాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ 48 ఏళ్ల వయసుకే ముఖ్య మంత్రి కావడం, చివరి వరకూ ఆ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయడం గొప్ప విషయం.

ద్రవిడ ఉద్యమ నాయకుడు పెరియార్, ఆయనతో విభేదించి డీంఎకేను స్థాపించి ముఖ్యమంత్రి పదవిని అధి ష్టించిన అన్నాదురైల కోవకు చెందిన కరుణానిధి... వారికంటే ఒకడుగు ముందుకు వేయగలిగారు. ఉద్యమ దిగ్గజంగానే కన్నుమూసిన పెరియార్‌కుగానీ, సీఎం పదవిలోకొచ్చిన రెండేళ్లకే తనువు చాలించిన అన్నాదురైకుగానీ దక్కని అరుదైన అవకాశం కరుణానిధికి లభించింది. అట్టడుగు వర్గాల సంక్షేమానికి తోడ్పడే అనేక పథకాలను ఆచరణలో పెట్టి వారి అభ్యున్నతికి కృషి చేయడం, పాల నాదక్షుడిగా రాణించడం కరుణానిధికి సాధ్యమైంది. దేశ ప్రజలందరికీ కళ్లజోడు లేని కరుణానిధిని ఊహించుకోవటం అసాధ్యం. దీంతోపాటు ఏ వేదికెక్కినా తీయని తమిళంలో తన అభిమానుల్ని ఉద్దేశించి ‘నా జీవితం కన్నా నేను మహోన్నతంగా భావించే నా సహో దరులారా...’ అంటూ ఆయన నోటి వెంబడి వెలువడే తొలి పలుకులు తమిళనాడు ప్రజానీకం అంతరాంతరాల్లో శాశ్వ తంగా నిలిచిపోతాయి. ఉద్యమాలనుంచి ప్రభవించే నాయకులకు అరుదైన ఉపన్యాస కళ సహజాభరణంగా ఒదుగుతుంది.

బ్రాహ్మణాధిపత్యాన్ని సవాలు చేసిన ప్రచండ ద్రవిడ ఉద్యమంలో ఎదిగివచ్చిన నాయకుల సంగతి చెప్పేదేముంది? అంతేకాదు... వ్యాసరచన, కథ, కవిత్వం, నవల, నాటకం వగైరాల్లో ద్రవిడ ఉద్యమంలోనివారు పదునుదేరారు. అనం తరకాలంలో బలమైన మాధ్యమంగా రూపొందిన సినీ రంగానికి సైతం ఆ సంప్రదాయం విస్తరించింది. వీటన్నిటా కరుణానిధి చెరగని ముద్ర వేయగలిగారు. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్‌ వంటివారు తెరపై ఓ వెలుగు వెలిగి ఉండొచ్చు. కానీ వారికొచ్చిన ఆ కీర్తిప్రతిష్టల్లో సింహ భాగం కవిగా, కథా రచ యితగా, సంభాషణల రచయితగా పనిచేసిన కరుణకు దక్కుతుంది. ద్రవిడ ఉద్యమ పటిష్టతకు, బ్రాహ్మణేతర కులాల అభ్యున్నతికి రాజకీయ సమీకరణ కీలకమని గుర్తించి... అందుకు సినీ మాధ్యమాన్ని మించిన ఉపకరణం లేదని డీఎంకే గ్రహించటంలో ఆయన పాత్ర ఎన్నదగినది.

కరుణానిధి తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు దక్షిణామూర్తి. లోకానికి ఆది గురువుగా హిందువులు భావించే శివుడి ప్రతిరూపమది. తాను పుట్టిన ఇసై వెల్లార్‌ (నాయీ బ్రాహ్మణ) కులా నికి దైవ సాన్నిధ్యంలో నిత్యం ఎదురవుతున్న వివక్షను చిన్ననాటినుంచీ గమనిస్తూ వచ్చిన దక్షిణా మూర్తి అనంతరకాలంలో ద్రవిడ ఉద్యమ భాగస్వామి కరుణానిధిగా, హేతువాదిగా రూపాంతరం చెందటం యాదృచ్ఛికం కాదు. ఆయన చిన్నతనంలోనే ‘మానవర్‌ నేసన్‌’ పేరిట రాత పత్రిక వెలు వరించారు. ఇరవైయ్యేళ్లకే సినీ రచయిత అయ్యారు. 33 ఏళ్లకే తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశిం చారు. ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం. ప్రజాదరణ పొందటంలో పార్టీకి అవాంతరాలు ఎదురై ఉండొచ్చుగానీ వ్యక్తిగతంగా కరుణానిధి ఎప్పుడూ ఓటమి చవిచూడలేదు.

సంక్షోభ సమయాల్లో సైతం నాయకుడన్నవాడు ఎంత నిబ్బరంగా ఉండాలో, ఎలా ఆచితూచి ప్రవర్తించాలో ప్రతి రాజకీయవేత్తా కరుణానిధిని చూసి తెలుసుకోవాలి. డీఎంకేలో తన సహ భాగస్వామిగా ప్రయాణిస్తూ పార్టీకి జనాదరణను సమీకరించడంలో కీలక భూమిక పోషించిన ఎంజీ రామచంద్రన్‌ను సరిగా అంచనా కట్టడంలో... ఆయన్ను తన శిబిరం దాటిపోకుండా చూడ టంలో కరుణానిధి విఫలమై ఉండొచ్చు. ఎంజీఆర్‌ కేంద్రాన్ని ప్రభావితం చేసి తన ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయించిన తీరు ఆయనను కలవరపెట్టి ఉండొచ్చు. ఎంజీఆర్‌ జీవించి ఉన్నంతవరకూ తాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేకపోయి ఉండొచ్చు. అవినీతి ఆరోపణలు చుట్టు ముట్టినప్పుడు, జయలలిత కక్షగట్టి అరెస్టు చేయించినప్పుడు తన భవితవ్యం ఏమవుతుందన్న సంశయం వచ్చి ఉండొచ్చు.

కానీ ఈ సన్నివేశాలన్నిటా ఆయన నిలకడగా, నిబ్బరంగా ఉన్నారు. ఓపిక పట్టారు. పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. శ్రేణులు చెదరకుండా చూసుకున్నారు. కింది స్థాయి నాయకులతో నిరంతరం సంబంధాలు కొనసాగించారు. ఇవే ఆయన్ను తిరిగి అందలం ఎక్కించాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండింటితో ఆయన భిన్న సందర్భాల్లో సన్నిహితంగా మెలిగారు. అలాగని తమిళుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. కేంద్ర పాలకుల ముందు మోకరిల్లలేదు. కీలక మంత్రిత్వ శాఖలు డిమాండు చేసి, వాటిని సాధించుకుని తన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దారు. ఐటీలో రాష్ట్రానికి రెండో స్థానం దక్కేలా చేశారు.

20 నెలలక్రితం మరణించిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత తర్వాత అన్నాడీఎంకే, ఆ పార్టీ ఏలు బడిలోని ప్రభుత్వం ప్రహ సనప్రాయమయ్యాయి. కానీ కరుణానిధి తన వారసుడు స్టాలిన్‌ను తీర్చి దిద్దారు. నిరుడు ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించారు. అయితే కరుణానిధి స్థాయిలో స్టాలిన్‌ నాయకత్వ పటిమను ప్రద ర్శించగలరా అన్నది వేచి చూడాలి. ద్రవిడ ఉద్యమం సృజియించిన దిగ్గజాల పరంపరలో కరుణ ఆఖరివారని చెప్పాలి. ఆయన కనుమరుగైనా తమిళ రాజకీయాలపై ఆయన ముద్ర ఎన్నటికీ శాశ్వతంగా ఉండిపోతుంది.

మరిన్ని వార్తలు