మళ్లీ ‘రాజద్రోహం’

10 Jul, 2019 01:01 IST|Sakshi

అసమ్మతి స్వరాలను అణిచేయడానికి వినియోగపడుతున్నదని ముద్రపడిన రాజద్రోహ చట్టం 124ఏ గురించిన చర్చ మరోసారి ఎజెండాలోకి వచ్చింది. ఈ చట్టంకింద తమిళనాడుకు చెందిన ఎండీఎంకే నాయకుడు వైకోకు అక్కడి ప్రత్యేక న్యాయస్థానం ఏడాది జైలు, రూ. 10,000 జరిమానా విధించడం ప్రస్తుత చర్చకు సందర్భం. ‘ఐ అక్యూజ్‌’ పేరుతో ఆయన రచించిన గ్రంథాన్ని 2009 జూలై 15న ఆవిష్కరించినప్పుడు ఆయన చేసిన ప్రసంగం ఆధారంగా ఈ కేసు పెట్టారు. సరిగ్గా పదేళ్లక్రితం శ్రీలంకలో తమిళ టైగర్ల కార్యకలాపాలను సమర్థిస్తూ చేసిన ఆ ప్రసంగం హింసను రెచ్చగొట్టేదిగా ఉందని ప్రాసిక్యూషన్‌ అప్పట్లో ఆరోపించింది. లంకలో రాజపక్స ప్రభుత్వం సాగి స్తున్న యుద్ధంలో టైగర్లకేమైనా జరిగితే మన దేశం ఇప్పటిలా ఐక్యంగా ఉండే అవకాశం లేదని ఆయన హెచ్చరించారు.

అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉంది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఉంది. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేని ఫెస్టోలో తమకు అధికారం అప్పగిస్తే ఈ రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. డీఎంకే తన మిత్రపక్షమైన కాంగ్రెస్‌ను కాదని ఒక్క ఎమ్మెల్యే కూడా లేని వైకోకు ఈ నెల 18న జరిగే రాజ్యసభ ఎన్నికలకు టిక్కెట్టు ఇచ్చింది. అంటే గతంలో వైకోపై ఈ కేసు పెట్టిన డీఎంకే ఇప్పుడాయనకు సన్నిహితమైంది. రాజద్రోహ చట్టాన్ని అందరికన్నా ఎక్కువ దుర్విని యోగం చేసిన కాంగ్రెస్‌ దాన్ని రద్దు చేస్తామన్నది. ఇలా ఎవరికివారు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారు గనుకే రాజద్రోహ చట్టం స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా కొనసాగుతోంది. 

వైకోపై ఆ చట్టాన్ని ప్రయోగించినప్పుడు కనీసం దాన్ని సమర్థించుకోవడానికి ఆనాటి సర్కా రుకు ఏదో సాకు చెప్పే అవకాశమైనా ఉంది. ఆ ప్రసంగంవల్ల మున్ముందు సమస్యలు రావొచ్చు నని, హింస చోటుచేసుకునే అవకాశమున్నదని ప్రభుత్వం వాదించవచ్చు. కానీ పదేళ్లు గడిచాక వెనక్కి తిరిగి చూస్తే తమిళనాడులో వైకో వల్ల ఏ సమస్యా తలెత్తలేదు. హింసాత్మక ఉదంతం ఒక్కటైనా జరగలేదు. కనుక ఆనాటి ప్రభుత్వం చేసిన ఆరోపణలకు ఏ ప్రాతిపదికా లేదని అర్ధమ వుతుంది. న్యాయస్థానం మాత్రం ప్రభుత్వం అనుమానించినట్టు హింస జరిగిందా లేదా అన్నది అప్రస్తుతమని స్పష్టం చేసింది. వైకో ప్రసంగాన్ని విన్నవారెవరైనా ప్రభుత్వంపై విద్వేషాన్ని పెంచు కుంటారని అభిప్రాయపడింది.

చట్టప్రకారం వైకో ప్రసంగం పర్యవసానంగా హింస జరిగితేనే శిక్ష విధించాలన్న నియమం లేదని తెలిపింది. హింసను సమర్ధించడం ఆ ప్రసంగం సారాంశమని, అది శిక్షార్హమైన నేరమేనని స్పష్టం చేసింది. అయితే ఆయన్ను కనికరించి ఏడాది జైలు శిక్ష, రూ. 10,000 జరిమానా విధిస్తున్నామని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శాంతి తీర్పునిచ్చారు. శిక్ష అమ లును ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌కు వీలుగా నెలరోజులు నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. అదృ ష్టవశాత్తూ ఎవరెవరు ప్రజాప్రతినిధులుగా పోటీకి అనర్హులో ఏకరువు పెట్టే ప్రజా ప్రాతినిధ్య చట్టం లోని సెక్షన్‌8(1)లోని జాబితాలో ‘రాజద్రోహం’ లేదు. అలా ఉంటే తాజా రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి వైకో అనర్హులయ్యేవారు. 

ఈ చట్టంలోని సెక్షన్ల పరిధి చాలా విస్తృతమైనది కావడం సమస్యలకు దారితీస్తోంది. ప్రభుత్వాలను విమర్శించినా, వాటిపై వ్యంగ్యచిత్రాలు గీసినా, ఛాయాచిత్రాలు ప్రదర్శించినా అవి ‘రాజద్రోహ’ చర్యలవుతున్నాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్‌–ఎన్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతిపై వ్యంగ్య చిత్రాన్ని గీసిన కాన్పూర్‌ కార్టూనిస్టు ఆసిమ్‌ త్రివేదీని ముంబై పోలీసులు రాజద్రోహం నేరం కింద అరెస్టు చేశారు. పటేల్‌ కులానికి రిజర్వేషన్లు కావాలంటూ ఉద్యమాలు నిర్వహించిన హార్దిక్‌ పటేల్‌ను కూడా ఈ చట్టం కిందే అరెస్టు చేశారు. ఇంకా బినాయక్‌ సేన్, అరుంధతీరాయ్, కన్హయ్యకుమార్‌ తదితరులపైనా ఈ కేసులు పెట్టారు. రాజ్యాంగంలోని 19(1)(ఏ) అధికరణ పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు, వ్యక్తీకరణకు హామీ ఇస్తోంది. అదే సమయంలో 19(2) దానికి కొన్ని పరిమితులు విధించింది. చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకే ప్రాధాన్యమిచ్చినా రాజద్రోహ చట్టం రాజ్యాంగబద్ధమైనదేనని తేల్చిచెప్పాయి.

1958లో రాం నందన్‌ కేసులో అలహాబాద్‌ హైకోర్టు ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం దానికి రాజ్యాంగబద్ధత ఉన్నదని 1962లో కేదార్‌నాథ్‌ కేసులో తేల్చిచెప్పింది. ఏదైనా ప్రసంగం లేదా రచన ప్రజల్ని హింసకు ప్రేరేపించిందని, అందువల్ల పరిస్థితులు విషమించాయని నిరూపించగలిగినప్పుడే దీన్ని ప్రయో గించాలని సూచించింది. కానీ ప్రభుత్వాలకు ఇదేం పట్టడం లేదు. రచయితలు, కవులు, కళా కారులు, ఉద్యమకారులు ఎవరైనా ఈ చట్టం కింద నిందితులవుతున్నారు. శిక్ష మాట అలా ఉంచి ముందు ఆ చట్టంకింద అరెస్టయినవారికి, వారి కుటుంబాలకు ఏళ్లతరబడి మానసిక క్షోభ తప్పడం లేదు. జీవితంలో విలువైన సమయమంతా వారు కోర్టుల చుట్టూ తిరిగాక చివరకు నిర్దోషిగా బయటపడినా ఆ జీవితం వెనక్కి రాదు.

భుత్వాల తీరెలా ఉంటున్నదో చెప్పడానికి వైకో కేసే ఉదాహరణ. ఆయనపై 2009లో నేరారోపణ చేస్తే 2017 వరకూ ఆయన్ను అరెస్టు చేయనేలేదు. నిజంగా అంత పెద్ద నేరం చేశారని ప్రభుత్వం భావించినప్పుడు ఎనిమిదేళ్లపాటు ఆయన్నెలా స్వేచ్ఛగా ఉండనిచ్చారో ఆశ్చర్యకరం. వైకో కేసులో అప్పీల్‌కు వెళ్లినప్పుడు ఉన్నత న్యాయస్థానాల్లో ఏం తేలుతుందో చూడాలి. ఈ చట్టాన్ని రద్దు చేయడమే ఉత్తమం. దీన్ని సమీక్షిస్తామని మూడేళ్ల క్రితం ఎన్‌డీఏ ప్రభుత్వం తెలిపింది. కనీసం ఆ ప్రక్రియ పూర్తయినా పరిధులు, పరిమితులు నిర్ధార ణవుతాయి. అటు తర్వాత వాటిలోని లోటుపాట్లు చర్చించవచ్చు. ఇప్పటి మాదిరిగా చట్టంలో అస్పష్టతలుంటే వైకో మాదిరే ఎవరైనా ‘నేరస్తుడి’గా మారే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు