పంజాబ్‌లో బహుపరాక్‌!

20 Nov, 2018 00:36 IST|Sakshi

పంజాబ్‌లో తిరిగి ఉగ్రవాదం తలెత్తే ప్రమాదం కనబడుతున్నదని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెచ్చరించిన కొద్దిరోజులకే అమృత్‌సర్‌ శివారులోని నిరంకారి భవన్‌పై ఆదివారం గ్రెనేడ్‌ దాడి జరిగింది. ఇంటెలిజెన్స్‌ సంస్థలు సైతం ఉగ్రవాద కదలికలపై ముందస్తు సమాచారమిచ్చాయని చెబుతున్న నేపథ్యంలో ఈ దాడి దిగ్భ్రాంతికలిగిస్తుంది. ఇది ఉగ్రవాద దాడే  నని, దీనికి మతంతో సంబంధం లేదని ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ చెబుతున్నా సిక్కులకూ, నిరంకారీలకూ మధ్య అక్కడుండే వైరుధ్యాలు... గతంలో ఉగ్రవాదంతో ఆ రాష్ట్రం అట్టుడికిన తీరు గుర్తుకుతెచ్చుకుంటే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. ఈ దాడిని ఏదో చిన్న ఘటనగా కొట్టి పారేయడానికి లేదు. ఇందులో ముగ్గురు మరణించడంతోపాటు 23మంది గాయాలపాలయ్యారు.

ఈ ఉదంతానికి రెండురోజుల ముందు పఠాన్‌కోట్‌ జిల్లాలో నలుగురు దుండగులు రివాల్వర్లు చూపి బెదిరించి ఒక కారును అపహరించినట్టు ఫిర్యాదు వచ్చింది. వారు ఉగ్రవాదులే కావొచ్చునని అను మానిస్తూ పోలీసులు రాష్ట్రమంతటా హై అలెర్ట్‌ ప్రకటించారు. ఢిల్లీలో ఉగ్రవాద చర్యలకు పాల్ప డేందుకు దాదాపు ఏడుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్‌ నుంచి పంజాబ్‌లోకి ప్రవేశించారని అయిదు రోజులక్రితం ఇంటెలిజెన్స్‌ సంస్థలు హెచ్చరించాయి. ఇన్ని హెచ్చరికలున్నా ముందస్తు చర్యలు సరి గాలేవని ఈ ఉదంతం నిరూపిస్తోంది. ఘటన జరిగిన ప్రాంతం ఏదో మారుమూల లేదు. అది అమృత్‌సర్‌ శివారు గ్రామం. పైగా అంతర్జాతీయ విమానాశ్రయానికి చాలా సమీపంలో ఉంది. ఇక నిరంకారిల సమావేశం జరుగుతున్నచోట సర్వసాధారణంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు. కానీ ఘటన జరిగినచోట అదేమీ లేదు.

పంజాబ్‌ పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రం. ఇటీవలికాలంలో చెప్పుకోదగ్గ ఘటనలేమీ జరగకపోయినా...అక్కడ సిక్కులకూ, నిరంకారీలకూ మధ్య ఉన్న వైషమ్యాలు అందరికీ తెలిసినవే. 1929లో ప్రారంభమైన సంత్‌ నిరంకారీ మిషన్‌తో ఆదినుంచీ సిక్కుల్లోని ప్రధాన వర్గానికి పేచీ ఉంది. సిక్కు మత గ్రంథం గురుగ్రంథ్‌ సాహిబ్‌కు నిరంకారీలు అపచారం చేస్తున్నారన్నది వారి ప్రధాన ఆరోపణ. ఈ వైషమ్యాలు తీవ్ర స్థాయికి పోయి 1978 ఏప్రిల్‌లో బైశాఖి ఉత్సవం రోజున నిరంకారీలకు, సిక్కులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. అందులో 13మంది సిక్కులు మర ణించారు. అనంతరకాలంలో రెండు వర్గాల మధ్యా కొనసాగిన ఘర్షణలు, పరస్పర హననం ఆ రాష్ట్రాన్ని అట్టుడికించి ఉగ్రవాదానికి దారితీశాయి. 1980లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో అప్పటి నిరంకారీ పీఠం అధిపతి బాబా గురుబచన్‌సింగ్‌ను దుండగులు హత్య చేశారు.

సిక్కుల్లో ఉన్న అసంతృప్తిని ఆసరా చేసుకుని భింద్రన్‌వాలే రంగంలోకొచ్చి మిలిటెంట్‌ సంస్థల్ని నెలకొల్పడం చరిత్ర. అనంతరం దశాబ్దకాలంపాటు ఉగ్రవాద చర్యలతో పంజాబ్‌ అట్టుడికింది. ఉగ్రవాద చర్యల్లో, దానికి వ్యతిరేకంగా పోలీసులు ప్రారంభించిన పోరాటంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. 2009లో ఎక్కడో వియన్నాలో ఉన్న గురుద్వారాలో దేరా సచ్‌ఖంద్‌ వర్గానికి చెందిన గురువును కొందరు దుండగులు హత్య చేసినప్పుడు పంజాబ్‌లోని అనేక నగరాలు అల్లర్లతో అట్టుడికాయి. భారీయెత్తున ఆస్తుల విధ్వంసం చోటు చేసుకుంది. ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించాల్సివచ్చింది. అలాంటి రాష్ట్రంలో నిరంకారీ ఉత్సవం జరుగుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో పోలీసులకు ఎవరూ చెప్పనవసరం లేదు. పైగా పాకిస్తాన్‌ నుంచి ఉగ్రవాదులు ప్రవే శించారన్న సమాచారం అందాక రెట్టించిన అప్రమత్తత అవసరమవుతుంది. కానీ ఆ విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని చెప్పాలి. 

నిరంకారీ భవన్‌ వద్ద లభించిన గ్రెనేడ్‌ శకలాలు పరీక్షిస్తే అవి పాకిస్తాన్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో తయారయ్యాయని తెలుస్తున్నదని ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ చెబుతున్నారు. గత నెలలో పోలీసులు స్వాధీనం చేసుకున్న 84 గ్రెనేడ్‌లు కూడా ఈ తరహావేనని ఆయన అంటున్నారు. తాజా ఉదంతం సిక్కులకూ, నిరంకారీల వివాదం కానేకాదని వివరిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రకటనలు ఉపశమనాన్ని ఇవ్వవు. సామాజిక మాధ్యమాల ప్రాధాన్యత పెరిగిన ప్రస్తుత కాలంలో పరస్పర అనుమానాలు, అపోహలు పెను వేగంతో వదంతులకు దారితీస్తాయి. అందువల్లే అవాంఛనీయ ఘటనల్ని నివారించటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించటం చాలా అవసరం. ఇప్పుడు ఈ ఉదంతం చోటుచేసుకున్న ప్రాంతంలోగానీ, రాష్ట్రంలోని మరికొన్ని ఇతర ప్రాంతాల్లో కానీ సీసీ టీవీ కెమెరాలు లేవని చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతంలోని రాష్ట్రంగా శాంతిభద్రతల విషయంలో అన్నివిధాలుగా అప్రమత్తతతో వ్యవహరించాల్సినచోట కనీసం సీసీ టీవీ కెమెరాలు కూడా లేవంటే ఆశ్చర్యం కలుగుతుంది.  పంజాబ్‌ ప్రాంతంలో పాకిస్తాన్‌తో మనకు 553 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇనుప కంచెతో దీన్ని మూసివేశారు.

గత ఏడాదిన్నరకాలంలో రాష్ట్రంలో 15 ఉగ్రవాద ముఠా లను పట్టుకోగలిగామని, శాంతిభద్రతల విషయంలో తామెంతో అప్రమత్తంగా ఉన్నామనడానికి ఇదే రుజువని అమరీందర్‌ చెబుతున్న మాటలు ఎవరినీ సంతృప్తిపర్చవు. ఎన్నిటిని నివారించినా, ఒక్క ఉదంతం చాలు... మొత్తం కృషిని నీరుగారుస్తుంది. ఉగ్రవాదులకు ఎక్కడలేని ధైర్యాన్నిస్తుంది. ఈ ఘటన ద్వారా ఇరు వర్గాల మధ్య చిచ్చు రగిల్చి శాంతిభద్రతల సమస్య తలెత్తేలా చేద్దామని దుండగులు పథకం రచించి ఉండొచ్చు. విధి నిర్వహణలో పోలీసులు చూపే నిర్లక్ష్యం అలాంటి ఎత్తుగడలకు పాల్పడేవారికి ఊతాన్నిస్తుంది. దశాబ్దకాలంపాటు ఉగ్రవాదంతో అట్టుడికిన రాష్ట్రంలో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే పోలీసులు ఎంతో అప్రమత్తంగా ఉంటారని అందరూ అను కుంటారు. కానీ ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా దీని వెనకున్నదెవరో పోలీసులు రాబట్ట లేకపోయారు. పంజాబ్‌లో పోలీసు యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అమరీందర్‌ గుర్తించాలి.

మరిన్ని వార్తలు