ట్రంప్‌ ప్రమాదకర విన్యాసాలు

11 Sep, 2019 00:36 IST|Sakshi

అమల్లో ఉన్న విధానాలన్నిటినీ బేఖాతరు చేసి అఫ్ఘానిస్తాన్‌లో శాంతి కోసం  తన దూతల ద్వారా గత ఎనిమిది నెలలుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తాలిబన్‌లతో సాగిస్తున్న రహస్య మంతనాలు భగ్నమయ్యాయి. మరికొన్ని రోజుల్లో అమెరికాలోని క్యాంప్‌డేవిడ్‌లో ఒప్పందంపై సంతకాలు కాబోతుండగా, ఈ చర్చల్ని నిలిపేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. చర్చలు నిజంగా ఆగి నట్టేనా లేక ఈ ప్రకటన ట్రంప్‌ వ్యూహంలో భాగమా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఎందుకంటే ఇవి ఆగిపోవడానికి కారణం తాలిబన్‌లు హింసను కొనసాగించడమేనని ట్రంప్‌ చెబుతున్నారు. నిజానికి ఎప్పుడూ హింస ఆగింది లేదు. 

‘యాక్షన్‌ ఆన్‌ ఆర్మ్‌డ్‌ వయెలెన్స్‌’ సంస్థ వెబ్‌ సైట్‌ ప్రకారం కేవలం మొన్న జూలై నెలలోనే వేయిమంది హింసాత్మక దాడుల్లో మరణించారు.  2017 తర్వాత ఇంత భారీ సంఖ్యలో మరణాలు ఉండటం ఇదే మొదటిసారి. ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో వివిధ ఘటనల్లో 4,000మంది పౌరులు బలయ్యారు. అంతక్రితంతో పోలిస్తే తాలిబన్‌ల హింస చర్చల ప్రక్రియ మొదలయ్యాక 27 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించిన ఘటన ఈ నెల 5న జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ‘గ్రీన్‌ జోన్‌’ ప్రాంతంలోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలో ఒక దుండగుడు బాంబులున్న కారు నడుపుకుంటూ వచ్చి తనను తాను పేల్చుకున్నాడు. ఇందులో పదిమంది అఫ్ఘాన్‌ పౌరులతోపాటు అమెరికా సైనికులిద్దరు మరణించారు. ఈనెల 28న జరగబోయే అఫ్ఘాన్‌ అధ్యక్ష ఎన్నికలు రద్దు చేయాలని, శాంతి ఒప్పందానికి ముందు ఇవి ఎలా జరుగుతాయని తాలి బన్‌లు మొదటినుంచీ ప్రశ్నిస్తున్నారు. ఆ ఎన్నికలను ఆపడానికే ఈ విచ్చలవిడి హింసాకాండ.

ఈ చర్చల ప్రక్రియంతా ఎలా సాగిందో చూస్తే ఇది ఎందుకు విఫలమైందో అర్ధమవుతుంది. అఫ్ఘానిస్తాన్‌లో పద్దెనిమిదేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి తమ సైన్యాన్ని అక్కడి నుంచి ఉపసంహరించుకోవాలని ట్రంప్‌ తహతహలాడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారసభల్లో పలుమార్లు ఈ సంగతి ప్రకటించారు. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల నాటికి ఆ వాగ్దానాన్ని నెరవేర్చినట్టు అమెరికా ప్రజలకు కనబడాలని ట్రంప్‌ ఆత్రంగా ఉన్నారు. కానీ అఫ్ఘాన్‌ నుంచి అర్ధంతరంగా ఉపసంహరించుకున్నట్టు కనబడితే పరువు పోతుందని భావించి ఈ చర్చల నాటకాన్ని మొదలుపెట్టారు. అఫ్ఘానిస్తాన్‌ పౌరులకు మాత్రమే కాదు... ఈ ప్రాంత దేశాల భద్రతకు పెను ముప్పు కలిగిస్తున్న ఉగ్రవాద ముఠాను దారికి తీసుకొస్తామంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. 

కానీ అఫ్ఘాన్‌ను పరిపాలిస్తున్న ప్రభుత్వానికిగానీ, అక్కడి పౌరులకుగానీ భాగస్వామ్యం లేకుండా...వారికి ఏం జరుగుతున్నదో కూడా తెలియకుండా సాగిన ఈ ప్రక్రియ అంతిమంగా మేలుకన్నా కీడే చేస్తుంది. అక్కడ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామంటూ ప్రక టించి 2001లో ఆ దేశంలో అడుగుపెట్టిన అమెరికా ఎన్నో నష్టాలు చవిచూసింది. ఈ యుద్ధంలో దాదాపు 4,000మంది అమెరికా సైనికులు, దాని నేతృత్వంలోని సంకీర్ణ దళాల సైనికులు మరణిం చారు. అమెరికా 13,200 కోట్ల డాలర్లు ఖర్చుచేసింది. కానీ వీసమెత్తు ఫలితం లేకపోగా దేశంలో సగభాగం పూర్తిగా తాలిబన్‌ల అధీనంలో ఉంది. వారు ఆ ప్రాంతాలకు మాత్రమే పరిమితంకాక అప్పుడప్పుడు రాజధాని కాబూల్‌లోని ‘గ్రీన్‌జోన్‌’లోకి సైతం చొరబడుతున్నారు. 

ఈ చర్చల ప్రక్రియ మొదలయ్యాక తాలిబన్‌లు మరింత పేట్రేగారు. అలాగైతేనే తాము చర్చల్లో పైచేయి సాధించగలమని వారి విశ్వాసం. ట్రంప్‌ మాత్రం వారిలో పరివర్తన సాధ్యమేనని నమ్మారు. అందరినీ నమ్మమన్నారు. చర్చల సరళి ఏమిటో, ఏయే అంశాలు ప్రస్తావనకొస్తున్నాయో అఫ్ఘాని స్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీకి ఎప్పుడూ చెప్పలేదు. ఈ చర్చల ద్వారా ట్రంప్‌ ఆశించింది వేరు. తాలిబన్‌లు ఆశించింది వేరు. ఏదో మేరకు ఒప్పందం కుదిరిందని ప్రకటిస్తే అక్కడి నుంచి ‘గౌరవ ప్రదం’గా నిష్క్రమించవచ్చునని ట్రంప్‌ భావించారు. తాలిబన్‌లకు కూడా అలాంటి ‘గౌరవమే’ కావాలి. తాము ఏమాత్రం తగ్గకపోయినా అమెరికా దిగొచ్చిందని ప్రపంచానికి చాటాలి. దాన్ని సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి సాగనంపితే యధావిధిగా ఇష్టానుసారం ‘తమదైన’ పాలన కొనసాగించవచ్చునని వారి కోరిక. 

చర్చల్లో అమెరికా తరఫున మంతనాలు సాగిస్తున్న జల్మాయ్‌ ఖలీ ల్‌జాద్‌ పాక్‌ సైనిక దళాల చీఫ్‌ జావేద్‌ బజ్వా, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ల ప్రాపకంతో రంగంలోకి దిగాడు. చర్చలు బ్రహ్మాండంగా సాగుతున్నాయని, తాలిబన్‌లతో ఒప్పందానికి చేరువ అవుతున్నా మని చెప్పడమే తప్ప, ఈ చర్చలకు ప్రాతిపదికేమిటో, ఏయే అంశాల్లో విభేదాలున్నాయో, వేటిపై అంగీకారం కుదిరిందో ఏనాడూ ఆయన చెప్పలేదు. అఫ్ఘాన్‌లో తాలిబన్‌ల రాజ్యం వస్తే మళ్లీ తమ పంట పండినట్టేనని పాకిస్తాన్‌ ఉవ్విళ్లూరుతోంది. తాలిబన్‌ల హవా నడుస్తున్నప్పుడు కశ్మీర్‌లో వారిని ప్రయోగించి పాక్‌ ఎంతటి మారణహోమాన్ని సృష్టించిందో మరిచిపోలేం. దాన్ని పునరా వృతం చేయొచ్చునని అది కలలు కంటున్నది. ఒక సాయుధ బృందాన్ని చర్చలకు ఒప్పించడానికి రహస్య మంతనాలు అవసరం కావొచ్చు. 

కానీ అసలు చర్చలే గోప్యంగా జరగడంలో అర్ధముందా? ఆ దేశాధ్యక్షుడికి తెలియకుండా, అక్కడి మహిళా ప్రతినిధులు కోరుకుంటున్న దేమిటో తెలుసుకో కుండా ఇవి సాగించడం వల్ల ఏం ప్రయోజనం? ఆ దేశ పునర్నిర్మాణ ప్రక్రియలో పాలుపంచుకుం టున్న మన దేశంతో కూడా ట్రంప్‌ మాట్లాడలేదు. అఫ్ఘాన్‌ను అర్థంతరంగా వదిలి వెళ్తే ఇన్నాళ్లూ సాధించిందంతా కుప్పకూలుతుందని మన దేశం వాదిస్తోంది. తాలిబన్‌ల పుట్టుకకూ, వారి ఎదుగు దలకూ కారణమై, అనంతరకాలంలో వారిని అణిచివేసే పేరిట ఆ దేశాన్ని వల్లకాడు చేసిన అమె రికా... ఇప్పుడు ఏదో వంకన అక్కడినుంచి నిష్క్రమించడానికి బాధ్యతారహితంగా వేస్తున్న అడు గులు ఆ దేశ పౌరుల్ని మరింత అధోగతికి నెడతాయి. ఇలాంటి చేష్టలకు అమెరికా స్వస్తి పలకాలి.

మరిన్ని వార్తలు