నకిలీ ‘శాంతి ఒప్పందం’

4 Mar, 2020 00:52 IST|Sakshi

హడావుడి ఒప్పందాలు, చిత్తశుద్ధిలేని ఎత్తుగడలు ఒక జటిలమైన సమస్యకు పరిష్కారం చూపలేవని అఫ్ఘానిస్తాన్‌లోని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తాలిబన్‌లతో ‘శాంతి ఒప్పందం’ కుదుర్చుకుని నిండా మూడు రోజులు గడవకుండానే అఫ్ఘానిస్తాన్‌ మళ్లీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లు తోంది. అక్కడ యధాప్రకారం సైనిక బలగాలపైనా, సాధారణ పౌరులపైనా దాడులు కొనసాగుతు న్నాయి. తగవులో మూడు పక్షాలున్నప్పుడు ఆ మూడూ ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటే, తమ మధ్య ఒక అవగాహన కుదిరిందని ప్రకటిస్తే దాన్ని ఎంతో కొంత విశ్వసించవచ్చు. కానీ ఈ శాంతి ఒప్పందం అలాంటిది కాదు. అఫ్ఘాన్‌ రాజధాని కాబూల్‌లో అక్కడి ప్రభుత్వంతో, ఖతార్‌లోని దోహాలో తాలిబన్‌ల ఆధ్వర్యంలోని ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్ఘానిస్తాన్‌(ఐఈఏ)తో వేర్వేరుగా అమెరికా కుదుర్చుకున్న ఒప్పందమిది.

దీని ప్రకారం ఆ దేశం నుంచి మరో 14 నెలల్లో అమెరికా దళాలు, నాటో దళాలు పూర్తిగా వైదొలగవలసివుంటుంది. తక్షణం 4,000మంది అమెరికా సైనికులు ఇంటి ముఖం పడతారు. ఆ దేశానికే చెందిన మరో 8,600మంది సైనికులు, నాటో సైనికులు 39,000మంది కూడా క్రమేపీ తగ్గుతూ వచ్చి, చివరకు నిష్క్రమిస్తారు. ఈ ఒప్పందంలో భాగంగా అఫ్ఘాన్‌ ప్రభుత్వం జైళ్లలో వున్న 5,000మంది తాలిబన్‌ ఖైదీలను విడుదల చేయాల్సివుంటుంది. దానికి బదులుగా తమ అధీనంలోని వేయిమందికి ఈ నెల 10లోగా తాలిబన్‌లు స్వేచ్ఛ కల్పిస్తారు.

మిగిలినవారిని మే నెలాఖరుకు విడిచిపెడతారు. అప్పటికల్లా తాలిబన్‌లపై ఐక్యరాజ్యసమితి విధిం చిన ఆంక్షలు తొలగించడానికి అమెరికా చర్యలు మొదలు పెడుతుంది. ఆగస్టుకి అవి రద్దవుతాయి. పైపైన చూస్తే ఇందులో ఎవరికీ అభ్యంతరం అనిపించదు. పద్దెనిమిదేళ్లుగా ఆ దేశాన్ని సంరక్షించే సాకుతో అక్కడ తిష్ట వేసిన అమెరికా, నాటో బలగాలు స్వస్థలాలకు పోతాయంటే వద్దనేవారుండరు. కానీ అమెరికా ఇప్పటికిప్పుడు హడావుడిగా ఎందుకు తొందరపడిందో, అందుకు బదులుగా తాలి బన్‌ల నుంచి అది పొందిన హామీలేమిటో తెలిస్తే అందరూ నిర్ఘాంతపోతారు. ఈ ఒప్పందానికి ప్రతిఫలంగా తాలిబాన్‌లు చేయాల్సిందల్లా అల్‌–కాయిదాతో చెలిమిని విడనాడటం. దాంతోపాటు వారు మరో హామీ కూడా ఇచ్చారు.

అమెరికా ప్రయోజనాలకు ముప్పు కలిగించేవారికి వారు ఆశ్రయం ఇవ్వరు. అలాగే అమెరికాకు ప్రమాదకరంగా పరిణమించవచ్చని అనుమానం వచ్చిన అప్ఘాన్‌ వాసుల్ని దేశం విడిచివెళ్లకుండా చూసే బాధ్యత కూడా తాలిబన్‌లదే. వారికి బయటి దేశాలకు వెళ్లడానికి వారు ఎలాంటి పత్రాలూ జారీ చేయరు. అమెరికా శత్రుగణంతో చేతులు కలపొద్దని తమ సభ్యులకు స్పష్టంగా ఆదేశాలిస్తామని కూడా వారు హామీ ఇచ్చారు. స్వీయ రక్షణ కోసం ఇంతగా తంటాలు పడిన అమెరికా, మనతోపాటు అఫ్ఘాన్‌ ఇరుగుపొరుగు దేశాల భద్రత కోసం ఒక్క షరతు కూడా విధించలేదు. 

ఒకటా, రెండా... వరసగా పద్దెనిమిదేళ్లుగా అఫ్ఘాన్‌ని చెరబట్టిన అమెరికా ఇంత హడావుడిగా ఇలాంటి ఒప్పందం ఎందుకు కుదుర్చుకుందన్నది బహిరంగ రహస్యమే. ముంచుకొస్తున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో వరసగా రెండోసారి విజయం సాధించాలంటే ఇది అవసరమని డోనాల్డ్‌ ట్రంప్‌ భావి స్తున్నారు. తాను అధ్యక్ష పీఠం ఎక్కితే అఫ్ఘాన్‌లోని అమెరికా సైనికులందరినీ వెనక్కి తీసుకొస్తానని గత ఎన్నికల్లో ట్రంప్‌ హామీ ఇచ్చారు. దాన్ని ఏదోమేరకు నెరవేర్చినట్టు చూపాలని ఇంచుమించు ఏడాదిగా ఆయన తాపత్రయపడుతున్నారు. మొండిగా వ్యవహరిస్తున్న తాలిబన్‌లతో దాదాపు పది సార్లు చర్చలు విఫలమయ్యాక దిక్కుతోచని స్థితిలో ట్రంప్‌ ఈ ఒప్పందానికొచ్చారు. అయితే ఒక అంశంపై ఇద్దరితో వేర్వేరు ఒప్పందాలు కుదిరినప్పుడు కనీసం రెండింటిలోనూ ఒకే రకమైన అంశా లుండాలి. అప్పుడే దాన్ని ఒక ఒప్పందంగా పరిగణించవచ్చు. అది ఏదో ఒకమేర ఫలప్రదమవు తుంది.

తాలిబన్‌లతో కుదిరిన ఒప్పందంలో 5,000మంది తాలిబన్‌ ఖైదీల విడుదలకు పూచీ పడే క్లాజు వుంది. కానీ అఫ్ఘాన్‌ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఆ మాట లేదు. అందుకు బదులు ‘బందీల విడుదలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను తాలిబన్‌లూ, ప్రభుత్వమూ నిర్ధా రించుకోవాల’ని చెబుతోంది. పొంతన లేని ఈ మాటలే ఇప్పుడు సమస్యాత్మక మయ్యాయి. చర్చల తర్వాతే ఖైదీలను విడుదల చేస్తామని ఘనీ సర్కారు... విడుదల చేస్తేనే చర్చలకొస్తామని తాలిబన్‌లు భీష్మించుకున్నారు. అది నెరవేరలేదన్న సాకుతో హింసాకాండకు దిగడం మొదలెట్టారు. అమెరికా తల్చుకుంటే అష్రాఫ్‌ ఘనీని దారికి తేవడం కష్టం కాదు. ఆయన తన మాట వినడనుకుంటే ఘనీ పదవి ఊడగొట్టేందుకు కూడా అమెరికా వెనకాడదు. కానీ తేలాల్సిన వేరే అంశాలు  చాలా వున్నాయి.

ప్రపంచంలో తమది ప్రాచీన ప్రజాస్వామిక దేశమని చెప్పుకునే అమెరికాకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం వున్నా అఫ్ఘాన్‌లో మహిళల కనీస హక్కుల పరిరక్షణకు తాలిబన్‌లిచ్చే హామీ ఏమిటో తేల్చు కునేది. తమ ఏలుబడిలో షరియా పేరు చెప్పి మహిళలను తాలిబన్‌లు ఎలా అణిచేశారో ఎవరూ మర్చిపోలేరు. వారిని విద్యకూ, ఉద్యోగాలకూ పూర్తిగా  దూరం చేశారు. మతం పేరిట వారిపై అనేక అణచివేత చర్యలకు పూనుకున్నారు.  ప్రస్తుత ఒప్పందం మహిళల హక్కుల రక్షణ గురించి పూర్తిగా విస్మరించింది. అలాగే దేశంలో పష్తూన్, తాజిక్, హజారా తెగల కోర్కెల విషయంలోనూ ఒప్పందం మౌనమే పాటించింది.

మరి ఆచరణలో అఫ్ఘాన్‌కు ఒరిగేదేమిటి? అటు అల్‌–కాయిదా, ఇటు ఐఎస్‌ ఉగ్రవాద బృందాలు తాలిబన్‌ల ఒప్పందాన్ని తప్పుబడుతున్నాయి గనుక అవి తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఈ పరిస్థితిని వినియోగించుకుంటాయి. ఏతావాతా పాకిస్తాన్‌ ఆసరాతో అమెరికా కుదుర్చుకున్న ఈ ఒప్పందం అఫ్ఘాన్‌ సమస్యల్ని పరిష్కరించదు సరికదా...దాన్ని మరింత జటిలం చేస్తుంది. అది సహజంగానే మన దేశ భద్రతకు కూడా ముప్పుగా పరిణమిస్తుంది. అఫ్ఘాన్‌పై దురా క్రమణకు దిగడంలో చేసిన తప్పునే అక్కడినుంచి నిష్క్రమించడంలోనూ అమెరికా ప్రదర్శిస్తోంది. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యం.

మరిన్ని వార్తలు