కమ్యూనిస్టు రారాజు!

28 Feb, 2018 00:32 IST|Sakshi
చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌

సమష్టి నాయకత్వ ప్రాధాన్యతను ప్రవచించే కమ్యూనిస్టు పార్టీలు చివరకు వ్యక్తి ప్రాధాన్యమున్న పార్టీలుగా రూపాంతరం చెందడం ప్రపంచంలో కొత్తగాదు. అధికారం ఉన్నచోటా, లేనిచోటా ఇది కనబడుతూనే ఉంటుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా అదే తోవన వెళ్లదల్చుకున్నదని ఆదివారం వెల్లడైన ప్రతిపాదనలు ధ్రువీకరిస్తున్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను యావజ్జీవ అధ్యక్షుడిగా చేయడం, ఉపాధ్యక్ష పదవికి కూడా అదే వర్తింపజేయడం ఆ ప్రతిపాదనల్లో అతి కీలకమైనది.

సోమవారం ప్రారంభమైన కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు మూడు రోజులు కొనసాగి బుధవారం ముగుస్తాయి. దీంతోపాటు మరో పది ప్రతిపాదనలను అది పరిశీలిస్తుంది. మిగిలినవాటి మాట అటుంచి షీ జిన్‌పింగ్‌కు శాశ్వత అధ్యక్ష పదవి కట్టబెట్టే ప్రతిపాదనకు ఏకగ్రీవ ఆమోదం లభించడం లాంఛనప్రాయమేనని వేరే చెప్పనవసరం లేదు. చైనా అధికారిక పత్రికలన్నీ ఇప్పటికే అందుకాయన అన్నివిధాలా అర్హుడంటూ స్తోత్రపాఠాలు ప్రారంభించాయి. పద్నాలుగేళ్ల తర్వాత దేశ రాజ్యాంగానికి సవరణలు ప్రతిపాదించడం ఇదే మొదటిసారి.

ఇప్పుడున్న రాజ్యాంగ నిబంధన ప్రకారం అయిదేళ్లపాటు ఉండే దేశాధ్యక్ష పదవిలో రెండు దఫాలు మించి ఉండటం సాధ్యపడదు. ఆ లెక్కన 2013లో అధ్యక్షుడిగా ఎన్నికైన షీ జిన్‌పింగ్‌ 2023 వరకూ ఆ పదవిలో ఉండాలి. సవరణకు కేంద్ర కమిటీ ఆమోదం లభించాక మార్చి 5న ప్రా రంభం కాబోయే చైనా పార్లమెంటు నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ పరిశీలనకు వెళ్తుంది. 2,924మంది సభ్యులుండే ఆ సభ దీనికి ఆమోదముద్ర వేయడం ఖాయం.

నిరుడు అక్టోబర్‌లో జరిగిన పార్టీ కాంగ్రెస్‌లోనే షీ జిన్‌పింగ్‌ తిరుగులేని అధినాయకుడిగా రూపొందుతున్న దాఖలాలు కనబడ్డాయి. ఆ మహాసభల్లో జిన్‌పింగ్‌ వరసగా రెండోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడంతోపాటు దేశ చరిత్రలో అంతవరకూ మావో, డెంగ్‌ జియావో పింగ్‌లకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ‘మావో ఆలోచనా విధానం’, ‘డెంగ్‌ జియావో పింగ్‌ సిద్ధాంతం’ వరసలో షీ జిన్‌పింగ్‌ ‘నూతన శకంలో చైనా విశిష్ట తలతో కూడిన సామ్యవాద ఆలోచనా విధానం’ కూడా చేరింది.

మావో, డెంగ్‌లను మాత్రమే సంబోధించే ‘అధినేత’ పదాన్ని ఆయనకు కూడా ఉపయోగించడం ప్రారంభించారు. వాస్తవానికి నిరుడు జరిగిన పార్టీ కాంగ్రెస్‌ సందర్భంలోనే ‘శాశ్వత అధ్యక్ష పదవి’ షీ జిన్‌పింగ్‌ సొంతమవుతుందన్న ఊహాగానాలొచ్చాయి. ఎందుకంటే ఆ సమావేశాల్లో  జిన్‌పింగ్‌ వారసుడిగా ఎవరినీ ప్రముఖంగా చూపలేదు. సాధారణంగా ప్రధాన కార్యదర్శితోపాటు రెండో స్థానంలో ఉండేవారికి పార్టీ కాంగ్రెస్‌ నిర్వహణలో ముఖ్య బాధ్యతలు అప్పజెబుతారు. ఆ రకంగా వారు ప్రచారంలోకొస్తారు.

జిన్‌పింగ్‌ను తిరుగులేని అధినేతను చేయడానికి కొన్నేళ్లుగా చాలా ప్రయత్నాలే సాగుతున్నాయి. అందులో ‘అవినీతి వ్యతిరేక పోరు’ ప్రధానమైంది. జిన్‌పింగ్‌ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి కాగలరనుకున్న చోంకింగ్‌ మున్సిపల్‌ కమిటీ మాజీ కార్యదర్శి సన్‌ ఝెం కాయ్‌ తోపాటు ఆయనకు మద్దతునీయగలరని భావించిన మరో 12మంది సీనియర్‌ నాయకులపై అవినీతి ముద్రవేసి పార్టీ నుంచి బయటకు నెట్టడం ఆ ప్రయత్నాల్లో ఒకటి.  

తన అధికార పీఠాన్ని సుస్థిరం చేసుకోవడానికి షీ జిన్‌పింగ్‌ చేస్తున్న ప్రయత్నాలు ఏకకాలంలో ఆయన బలాన్ని, బలహీనతలను సూచిస్తాయి. పార్టీలో ప్రత్యర్థుల మాట అటుంచి కనీసం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసేవారెవరూ మిగల్లేదని ఈ పరిణామం తెలియజెబుతోంది. అది ఖచ్చితంగా ఆయన బలాన్నే సూచిస్తుంది. అదే సమయంలో ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధన ప్రకారం షీ జిన్‌పింగ్‌ పదవీకాలం మరో అయిదేళ్లుంటుంది. అది ముగిసే తరుణంలో శాశ్వత అధికారం కోసం ఆయన ప్రయత్నించవచ్చు. కానీ అప్పటికల్లా తనకు పార్టీపై పట్టు ఉంటుందో లేదోనన్న బెంగ ఆయనను పీడించడం వల్ల ముందే ఆ పని చేసినట్టు కనబడుతోంది.

ఆర్థిక రంగంతోపాటు ఇతర రంగాల్లో తీసుకోబోయే అనేక చర్యలు తనకు అవరోధాలవుతాయన్న భావన ఆయనకు కలిగినట్టుంది. మావో హయాంలో, మరీ ముఖ్యంగా సాంస్కృతిక విప్లవకాలంలో ఘోర తప్పిదాలు జరిగాయని, దీనంతటికీ ఒకే వ్యక్తి వద్ద అధికారం కేంద్రీకృతం కావడమే కారణమని డెంగ్‌ జియావోపింగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆరోపించింది.

ఇలాంటి ధోరణులు తలెత్తకుండా ఉండేందుకని 1982లో ఆమోదించిన దేశ రాజ్యాంగంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో ఎవరూ రెండు దఫాలకు మించి కొనసాగరాదన్న నిబంధన విధించారు. జిన్‌పింగ్‌కు ఇప్పుడున్న పదవులు తక్కువేమీ కాదు. ఆయన దేశాధ్యక్షుడు మాత్రమే కాక కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇవిగాక కేంద్ర మిలిటరీ కమిషన్‌ చైర్మన్, కేంద్ర జాతీయ భద్రతా కమిషన్‌ చైర్మన్, కేంద్ర సైనిక, పౌర ఏకీకృత అభివృద్ధి కమిషన్‌ తదితర అనేక పదవులున్నాయి.

ఒక వ్యక్తి వద్ద పదవులన్నీ కేంద్రీకృతమైనప్పుడు, తిరుగులేని అధికారాలు చేజిక్కించుకున్నప్పుడు పర్యవసానాలెలా ఉంటాయో చరిత్ర నిండా మనకు దాఖలాలు కనబడతాయి. అలాంటివారు నియంతలుగా మారి దేశ ప్రజలపై స్వారీ చేయడమే కాదు...వేరే దేశాలకు ముప్పుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మతిమాలిన విధానాల వల్ల ప్రపంచంలో దాని స్థానం క్రమేపీ పలచనవుతోంది.

ఆర్థికంగా పటిష్టంగా ఉన్న చైనా దాన్ని భర్తీ చేయాలని చూస్తోంది. అదే సమయంలో ఈ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా రూపొందాలనుకుంటోంది. ఇంటా బయటా ఇందుకెదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడానికి అవసరమైన సంపూర్ణమైన అధికారాలు తనకుండాలని షీ జిన్‌పింగ్‌ విశ్వసిస్తున్నారు. అది చివరకు జిన్‌పింగ్‌ను ఎక్కడికి తీసుకెళ్తుందో, చైనాను ఏ తీరానికి చేరుస్తుందో రాగలకాలంలో తెలుస్తుంది.

>
మరిన్ని వార్తలు