లాడెన్ పత్రాలు... నిజాలు

23 May, 2015 01:15 IST|Sakshi
లాడెన్ పత్రాలు... నిజాలు

ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉగ్రవాద ఘటనలకు కారకుడైన అల్ కాయిదా అగ్రనేత బిన్ లాడెన్‌ను హతమార్చి నాలుగేళ్లు కావస్తున్న సందర్భంగా అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన పత్రాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నిజానికి ఆ పత్రాలు వెల్లడించిన అంశాల్లో చాలా భాగం అందరికీ తెలిసినవే. లాడెన్ గురించి ఇన్నాళ్లుగా అనుకుంటున్నవే... అంచనా వేస్తున్నవే.

 

అయితే ఈ పత్రాలద్వారా వాటికి సాధికారత వచ్చింది. పరిమిత సంఖ్యలో విడుదలైన పత్రాలు గనుక ఇందులో లాడెన్ సంపూర్ణ చిత్రం ఆవిష్కృతం కాలేదు. అవన్నీ పూర్తిగా విడుదలైతే వివిధ అంశాల విషయంలో అతని ఆలోచనా ధోరణులెలా ఉన్నాయో...ఉగ్రవాదానికి తానే ఊపిరీ, ఊతం కావడానికి దారితీసిన పరిస్థితులేమిటో అంచనా వేయడానికి వీలవుతుంది.

ఇప్పుడు విడుదలైన పత్రాల్లో రేఖామాత్రంగా లాడెన్ ఆలోచనలు తెలుస్తున్నాయి. అంతేకాదు...పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో అతనికీ, అతని సహచరులకూ ఉన్న సంబంధాలూ, చుట్టరికాలూ ప్రపంచానికి ‘సాధికారికంగా’ అర్థమవుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు సమీపంలోని అబ్తాబాద్‌లో ఉన్న లాడెన్ స్థావరంపై 2011 మే 2న  అమెరికా దళాలు మెరుపుదాడి చేసి మట్టుబెట్టాయి. ఎక్కడో పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో తోరాబోరా కొండల్లో అజ్ఞాతజీవితం సాగిస్తుంటాడని అందరూ అంచనా వేసిన లాడెన్ తమ గడ్డపైనే పట్టుబడటంతో పాకిస్థాన్ ఇరకాటంలో పడింది.
 
లాడెన్ ‘చంపదగిన శత్రువే’ కావొచ్చు. పలు దేశాల్లో మారణహోమం సృష్టించిన అల్ కాయిదా సంస్థకు ఆద్యుడు కావొచ్చు. కానీ, వ్యక్తులుగా అలాంటి వారిని హతమార్చినంత మాత్రాన సాధారణ పరిస్థితులు ఏర్పడతాయనుకోవడం భ్రమే. లాడెన్ స్వయంగా యుద్ధంలో పాల్గొన్నవాడు కాదు. విధ్వంసక చర్యల్లో నేరుగా పాల్గొన్న అనుభవమైనా అతనికి ఉన్నట్టులేదు. కానీ, అతను నెలకొల్పిన సంస్థ వివిధ దేశాల్లో వ్యాప్తి చెందడమేకాక... దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పుట్టి విస్తరించినవి ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఇతర సంస్థలతో సమన్వయం సాధించి ముందుకెళ్తుంటే, మరికొన్ని ఎక్కడికక్కడ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి. వాటిల్లో చాలా సంస్థలు దెబ్బతిన్నట్టే తిని మళ్లీ మళ్లీ జీవం పోసుకుంటున్నాయి.

కనుక లాడెన్ ఆలోచన లు, అభిప్రాయాలు ఏమిటో...అవి ఉగ్రవాద సంస్థలకు ఎలా తోడ్పడ్డాయో అధ్యయనం చేయడంవల్ల వాటి నియంత్రణకు ఒక దోవ దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బయటపెట్టిన పత్రాల్లోని కొన్ని అంశాలు ఆసక్తి కలిగిస్తాయి. ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలను నాలుగేళ్లక్రితం ప్రజాస్వామిక విప్లవం ఊపేసినప్పుడు అందరూ దాన్ని కీర్తించారు. ఆ దేశాల్లో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న నియంతలు మట్టికరిచి అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆవిర్భవిస్తాయని అంచనావేశారు. కానీ, బిన్ లాడెన్ వేరేలా ఆలోచించాడు. అక్కడ సాగుతున్న ఆందోళనలు ఉగ్రవాద సంస్థల విస్తరణకు దొరికిన మంచి అవకాశంగా భావించాడు. ఇస్లామిస్టులు వాటిల్లో పాలుపంచుకుని, ఆ ఉద్యమాల తీరుతెన్నులను మార్చాలని సూచించాడు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లోని చాలా దేశాలు ఉగ్రవాదంతో ఉసూరుమంటున్న తీరును గమనిస్తే చివరకు లాడెన్ కోరికే నెరవేరిందని అర్థమవుతుంది.

సమస్త వనరులూ అందుబాటులో ఉన్న అమెరికా తదితర దేశాలకు ఇలాంటి ప్రమాదాన్ని ముందే పసిగట్టడం, జాగ్రత్తపడటం కష్టమేమీ కాదు. అవి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి వేరొకలా ఉండేది. కానీ, కొన్నిచోట్ల ఆ ఉద్యమాలను సమర్థిస్తున్నట్టే నటించి వాటిని నట్టేట ముంచడం, తమ తైనాతీలు నియంతలుగా ఉన్నచోట వాటిని అణిచేందుకు తోడ్పడటం వంటి చర్యలకు పూనుకున్నాయి. పర్యవసానంగా ఆ దేశాల్లో ఉగ్రవాదం ఇప్పుడు బలంగా వేళ్లూనుకుంది. చివరిరోజుల్లో బిన్ లాడెన్‌ను ఎవరూ పట్టించుకోని స్థితి ఏర్పడిందని, అతను దాదాపు ఒంటరయ్యాడన్నది కూడా నిజం కాదని ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి.

పశ్చిమాసియాలో పాలకులతో సంఘర్షిస్తున్న తీరు సరికాదని... ఇందువల్ల ప్రధాన శత్రువు అమెరికాను దెబ్బతీసే లక్ష్యానికి విఘాతం కలుగుతుందని హెచ్చరించడం...అందుకనుగుణంగా యెమెన్‌లో అల్‌కాయిదా సంస్థ తన ధోరణిని మార్చుకోవడం ఇందులో కనిపిస్తుంది. అల్ కాయిదా ఏ తరహా దాడులు నిర్వహించాలన్న విషయంలోనూ లాడెన్‌తో అబూ ముసబ్‌లాంటి నేతలు విభేదించిన సంగతి ఈ పత్రాల్లో వెల్లడైంది. భారీ దాడులు జరపాలని లాడెన్ భావిస్తే చిన్న తరహా దాడులతోనే పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయగలమని అబూ ముసబ్ వాదించాడు.
 
ఈ పత్రాల ద్వారా అల్ కాయిదా సంస్థకూ, పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకూ మధ్య ఉన్న సంబంధాలు వెల్లడయ్యాయి. పాక్ సైన్యం తమపై దాడులు విరమించు కుంటే... వారిపై తెహ్రీక్-ఎ-తాలిబన్(టీటీపీ) దాడులు చేయకుండా చూస్తామని అల్ కాయిదా నేత ఒకరు ఐఎస్‌ఐతో బేరసారాలాడటం ఇందులో కనబడుతుంది. ఉగ్రవాదం వేళ్లూనుకోవడానికీ, విస్తరించడానికీ దానికి ప్రభుత్వాలపరంగా అందు తున్న అండదండలే కారణమని లాడెన్ పత్రాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఒక దేశంలో ఉగ్రవాది మరోచోట దేశభక్తుడు కావొచ్చునని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్ ఎప్పుడో అన్నారు.

అలా అనుకోవడంవల్లే లష్కరే తొయిబావంటి సంస్థలకు ఆ దేశ పాలకులు అండగా నిలిచారు. చివరకు ఆ ఉగ్రవాదం వారినే కాటేసే స్థాయికి చేరింది. లిబియా, సిరియా వంటి దేశాల్లో తమ చర్యలవల్ల ఉగ్రవాద ముఠాలు లాభ పడుతున్నాయని...తమ ఆయుధాలు, డబ్బు ఆ ముఠాలకు చేరుతున్నదని తెలిసినా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలూ తమ వైఖరిని మార్చుకోలేదు. ఫలితంగానే ఐఎస్‌ఐఎస్ ఇరాక్, సిరియావంటిచోట్ల మారణ హోమాన్ని సృష్టిస్తున్నది. లాడెన్ పత్రాలనుంచి గుణపాఠాన్ని గ్రహిస్తే...ఇకపై సరిగా వ్యవహరిస్తే ఉన్నంతలో పరిస్థితి మెరుగవుతుందని అమెరికా తదితర దేశాలు గుర్తించాలి.

మరిన్ని వార్తలు