రెండు రాష్ట్రాల్లో బ్యాలెట్ పోరు!

25 Nov, 2014 00:21 IST|Sakshi

శాంతిభద్రతల రీత్యా సమస్యాత్మకమైన జార్ఖండ్, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ మంగళవారం జరగనున్నది. జార్ఖండ్‌లో నక్సలైట్ల సమస్య, జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదం మొదటినుంచీ ప్రభుత్వాలకు పెను సవాలుగా మారాయి. కనుకనే కట్టుదిట్టమైన భద్రత కోసం రెండు రాష్ట్రాల్లోనూ అయిదు దశల పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలి దశలో జార్ఖండ్‌లో 13 స్థానాలకూ... జమ్మూ-కశ్మీర్‌లో 15 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

81 స్థానాలున్న జార్ఖండ్‌లో తమ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనని బీజేపీ విశ్వసిస్తున్నది. దాదాపు ఎన్నికల సర్వేలన్నీ ఆ మాటే చెబుతున్నాయి.  87 స్థానాలున్న జమ్మూ-కశ్మీర్‌లో 44 స్థానాలకుపైగా గెలిచి అధికారాన్ని అందుకోవడమే లక్ష్యమంటూ ‘మిషన్ 44 ప్లస్’ పేర తన శ్రేణుల్ని బీజేపీ ఉత్సాహపరుస్తున్నది. గత కొన్నేళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)లు ప్రధాన భూమిక పోషిస్తుండగా ఈసారి ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న జనాదరణ ఆసరాతో బీజేపీ బలమైన పక్షంగా ముందుకొచ్చింది.

కశ్మీర్ లోయలో రెండు ప్రాంతీయ పార్టీలకూ పలుకుబడి ఉంటే జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్ గణనీయంగా సీట్లు గెల్చుకుని ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నది. ఈసారి మాత్రం కాంగ్రెస్ దివాలా తీసే స్థాయికి చేరుకుంది. అటు కశ్మీర్ లోయలో ఎన్‌సీ పరిస్థితీ అంతే. రెండు పార్టీల కూటమి పాలనపై వచ్చిన అవినీతి ఆరోపణల పర్యవసానమిది.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూలోని రెండు స్థానాలనూ, లడఖ్ స్థానాన్నీ కైవసం చేసుకున్న బీజేపీ ఆ రెండుచోట్లా ఈసారి అధిక సంఖ్యలో అసెంబ్లీ సీట్లు గెలుచుకోగలమన్న నమ్మకంతో ఉంది. పీడీపీ కశ్మీర్ లోయ ప్రాంతంలోని మూడు లోక్‌సభ స్థానాలనూ సొంతం చేసుకుంది. ఈసారి కనీసం 35 అసెంబ్లీ స్థానాలు గెల్చుకోవడమే కాక జమ్మూ, లడఖ్ ప్రాంతాల్లో సైతం ప్రభావాన్ని చూపి పీడీపీ సొంతంగా అధికారాన్ని కైవసం చేసుకోగలదని సర్వేలు అంచనావేస్తున్నాయి.
 
కల్లోల కశ్మీరంలో సమస్యల విస్తృతి ఎక్కువే. అభివృద్ధి, నిరుద్యోగం ఆ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు. అభివృద్ధికి ఉగ్రవాదమే ప్రధాన ఆటంకంగా ఉన్నదని ప్రభుత్వాలు చెబుతాయి. అయితే, 2001 నుంచీ చూస్తే హింసాకాండ క్రమేపీ తగ్గుముఖం పడుతున్నది. ఆ ఏడాది 4,500 మంది ప్రాణాలు కోల్పోతే 2009లో అది 375కు చేరుకుంది.

ఈ ఏడాది ఇంతవరకూ 134 మంది హింసాకాండలో చనిపోయారు. గతంతో పోలిస్తే విద్య, ఉపాధి, పర్యాటక రంగాల్లో మెరుగుదల కనబడుతున్నది. అయితే, ఇది ఉండాల్సినంతగా లేదన్నది నిజం. ఇప్పటికీ ఎన్నికల బహిష్కరణ  విధానానికే కట్టుబడి ఉన్న హుర్రియత్ కాన్ఫరెన్స్ ప్రభావం గతంతో పోలిస్తే ఇప్పుడు తక్కువే.

సైనిక బలగాలకు అపరిమిత అధికారాలిస్తున్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం అమలు వల్ల తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకవలసి వస్తున్నదన్న అభిప్రాయం కశ్మీర్ పౌరుల్లో ఉంది. ఈమధ్యే శ్రీనగర్ సమీపంలోని ఛత్తర్‌గామ్‌లో జవాన్ల కాల్పుల్లో ఇద్దరు పిల్లలు మరణించడంతో ఆ సమస్య మళ్లీ ఎజెండాలోకొచ్చింది. రెండు నెలలక్రితం కశ్మీర్ లోయను చుట్టుముట్టిన వరదలు, విధ్వంసంనుంచి సామాన్య పౌరులు ఇంకా కోలుకోలేదు.
 
అన్ని సమస్యలూ ఒక ఎత్తయితే జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణ మరో ఎత్తు. ప్రతి ఎన్నికల్లోనూ ఈ అధికరణాన్ని రద్దుచేయాల్సిందేనని డిమాండు చేసే బీజేపీ... మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో స్వరం మార్చింది. తాము సొంతంగా అధికారంలోకొస్తే ఆ అధికరణాన్ని రద్దుచేయగలమని అంతవరకూ చెప్తూ వచ్చిన బీజేపీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం 370 అధికరణ రద్దుకు సంబంధిత పక్షాలతో మాట్లాడి ఒప్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికలకల్లా ఆ పార్టీ మరో మెట్టు కిందకు దిగింది. అసలు అది ఎన్నికల సమయంలో మాట్లాడాల్సిన విషయమే కాదన్నది.

రాష్ట్రంలో మోదీ ప్రభంజనం వీస్తున్న ప్రస్తుత దశలో దాన్ని లేవనెత్తడంవల్ల ఏదో మేరకు నష్టమే తప్ప లాభం చేకూరదన్నది బీజేపీ అంచనా. అయితే, ఇది లాభనష్టాలకు సంబంధించిన సమస్య కాదు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో నక్సలైట్ల సమస్య, ఆదివాసీల సమస్య ప్రస్తావనకు రాకుండా...జమ్మూ-కశ్మీర్‌లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం, 370వ అధికరణ చర్చకు రాకుండా ఎన్నికల పర్వాన్ని దాటేద్దామనుకోవడం అత్యాశే అవుతుంది.

1947లో అప్పటి కశ్మీర్ పాలకుడు హరిసింగ్ ఆ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేసినప్పుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజ్యాంగసభ చర్చించి 370వ అధికరణాన్ని చేర్చింది. దీని ప్రకారం విదేశీ వ్యవహారాలు, ఆర్థికం, కమ్యూనికేషన్లు, రక్షణ వంటివి మినహా మిగిలిన అంశాల్లో కేంద్రం చేసే చట్టాలేవీ అసెంబ్లీ ఆమోదిస్తే తప్ప జమ్మూ-కశ్మీర్‌కు వర్తించవు. జమ్మూ-కశ్మీర్‌కు వలసవెళ్లిన వేలాదిమంది ఈ అధికరణ కారణంగా వోటు హక్కు, ఆస్తి హక్కువంటివి కోల్పోవడమే కాకుండా ఉపాధికి సైతం అనర్హులవుతున్నారని నిరుడు డిసెంబర్‌లో అరుణ్ జైట్లీ ఆరోపించారు. తాము అధికారంలోకొస్తే ఆ అధికరణాన్ని రద్దుచేస్తామని చెప్పారు.

రాష్ట్రానికున్న ఆ ప్రత్యేక ప్రతిపత్తి క్రమేపీ నీరుగారుతున్నదని కశ్మీరీలు అంటుంటే... జమ్మూ-కశ్మీర్‌కున్న ప్రతిపత్తి వంటిది రాష్ట్రాలన్నిటికీ ఇస్తేనే దేశంలో ఫెడరల్ వ్యవస్థ నిజమైన అర్ధంలో వర్థిల్లుతుందని వాదిస్తున్నవారూ ఉన్నారు. సాధారణ సమయాల్లో ఇలాంటి కీలక సమస్యలు ఎటూ చర్చకు రావడంలేదు. కనీసం ఎన్నికల సందర్భంగానైనా ఆయా అంశాల్లోని గుణదోషాలను చర్చించడంవల్ల ఉపయోగమే గానీ ఎలాంటి అనర్థమూ కలగదని అన్ని పార్టీలూ గుర్తించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు