సత్వర న్యాయం

31 Jan, 2020 00:19 IST|Sakshi

రెండు నెలలక్రితం కుమురం భీం అసిఫాబాద్‌ జిల్లాలో చిరు వ్యాపారం చేసుకుంటున్న  మహిళను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులు షేక్‌ బాబు, షాబుద్దీన్, షేక్‌ మఖ్దూంలకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ ఉదంతం జరిగిన మూడు రోజులకు నిందితులను  పోలీసులు అదుపులోకి తీసుకుని చకచకా దర్యాప్తు చేశారు. గత నెల 11న ఫాస్ట్‌ట్రాక్‌  కోర్టు ఏర్పాటుకాగా 14న పోలీసులు చార్‌్జషీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఫాస్ట్‌ట్రాక్‌  కోర్టు కూడా అంతే వేగంతో దర్యాప్తు జరిపి 45 రోజుల్లో తీర్పు వెలువరించింది.  నిందితులకు ఉరిశిక్ష పడింది కనుక తెలంగాణ హైకోర్టు దీన్ని ధ్రువీకరించాల్సివుంటుంది. ఉరిశిక్ష విధింపు విషయంలో భిన్నాభిప్రాయం ఉన్నవారు సైతం తెలంగాణ పోలీ సులు  పకడ్బందీగా దర్యాప్తు చేయడాన్ని, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు కూడా ఈ కేసు విచారణను సత్వరం  పూర్తి చేయడాన్ని హర్షిస్తారు.

అత్యాచారాలు తరచుగా చోటుచేసుకోవడానికి గల ముఖ్య  కారణాల్లో వ్యవస్థలు సక్రమంగా స్పందించకపోవడం ఒకటని 2012లో నిర్భయ ఉదంతం  తర్వాత కేంద్రం నెలకొల్పిన జస్టిస్‌ జేఎస్‌ వర్మ కమిటీ చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు  చేసుకోవాలి. తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం  జరిపి, హత్య చేసిన ఉదంతంలో కూడా పోలీసులు ఇంతే వేగంతో స్పందించారు. ఘటన  జరిగిన 48 రోజుల్లో విచారణ పూర్తయి నేరగాడికి ఉరిశిక్ష పడింది. ఈ కేసు తీర్పును  సమీక్షించిన తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. గత నవంబర్‌  27న వైద్యురాలు దిశను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హతమార్చిన  నిందితులు ఆ తర్వాత డిసెంబర్‌ 6న ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆ నిందితులు ఇదే తరహాలో తెలంగాణ, కర్ణాటకల్లో 15మంది మహిళల ప్రాణాలు తీసినట్టు తమ దర్యాప్తులో  వెల్ల డైందని పోలీసులు చెప్పారు. యాదాద్రి జిల్లాలోని హాజీపూర్‌లో బాలికల ప్రాణాలు తీసిన  కేసులోని నిందితుడికి ఇంకా శిక్ష పడాల్సివుంది.

 సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబికి, మీడియాలో బాగా ప్రచారంలోకొచ్చిన  కేసుల విషయంలో మాత్రమే పోలీసులు శ్రద్ధ  పెడుతున్నారని, న్యాయస్థానాలు కూడా వేగంగా విచారణ చేస్తున్నాయన్న  విమర్శలున్నాయి. అత్యాచారం కేసుల్లో మాత్రమే కాదు... ఆడపిల్లల పట్ల జరిగే ఏ చిన్న  లైంగిక నేరంలోనైనా ఇదేవిధమైన శ్రద్ధ పెట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం.  ముఖ్యంగా తమ కుమార్తెను ఫలానా వ్యక్తి వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు  చేసినప్పుడు దాన్ని అత్యంత సాధారణమైన విషయంగా తీసుకోవడం పోలీసు విభాగాల్లో  రివాజు అయింది. అసలు బాధితులు ఫిర్యాదు చేసేవరకూ వచ్చారంటేనే పరిస్థితి వారి  చేయి దాటిపోయిందని అర్థం. మన సమాజంలో ఏ ఆడపిల్లయినా వేధింపులు ఎదుర్కొన్నప్పుడు అంత త్వరగా తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా సిద్ధపడదు. కుటుంబాల్లో ఆడపిల్లల్ని పెంచే విధానం ఇందుకు ఒక కారణం. అలా చెబితే తననే  నిందిస్తారేమో, అసలు బయటకే వెళ్లొద్దని కట్టడి చేస్తారేమో అని సందేహపడుతుంది.

చదువుకునే బాలికైతే చదువు ఆపేస్తారని భయపడుతుంది. వేధింపుల స్థాయి పెరిగాక తప్పనిసరై ఇంట్లో చెబుతుంది. తల్లిదండ్రులు సైతం పోలీసుల వరకూ వెళ్లకుండా ఈ సమస్యను పరిష్కరిద్దామని చూస్తారు. పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్తే కుటుంబం పరువు పోతుందని భయపడతారు. అందరూ వేలెత్తి చూపుతారని సందేహపడతారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మరింత తాత్సారం చేస్తే ఏమవుతుందో వేరే చెప్పనవసరం  లేదు. దిశ విషయంలో పోలీసులు వెంటనే స్పందించలేదు. ఆమె తన సోదరికి ఫోన్‌ చేసి తన టూ వీలర్‌ పాడైందని, బాగు చేసుకొస్తానని వెళ్లినవాడు ఇంకా రాలేదని చెప్పిన  కాసేపటికే స్విచాఫ్‌ కావడంతో వెంటనే ఆ కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కానీ వారి నుంచి సరైన స్పందన రాలేదని, వెంటనే కదిలివుంటే ఆమె ప్రాణాలు నిలిచేవని కుటుంబసభ్యులు ఆరోపిం చారు.

బాధితులకు ఎవరూ అండగా రారని, వారు  నిస్సహాయులని తెలిసినప్పుడే నేరగాళ్లు మరింత పేట్రేగిపోతారు. కనుకనే సమాజంలో  నిస్సహాయులుగా ఉండేవారి రక్షణకు ఉద్దేశించిన వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తున్నాయో, అవి తమ విధులను ఎలా నిర్వర్తిస్తున్నాయో ఎప్పటికప్పుడు తనిఖీ చేసే యంత్రాంగం  ఉండాలని జస్టిస్‌ జేఎస్‌ వర్మ కమిటీ సూచించింది. తనిఖీల్లో అలసత్వంతో ఉన్నట్టు  తేలినపక్షంలో కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది

.లోగడ వరంగల్‌ జిల్లాలో జరిగిన ఉదంతంలోగానీ, ఇప్పుడు సమత కేసు ఉదంతంలోగానీ సత్వర దర్యాప్తు జరగడం, వెనువెంటనే నేరగాళ్లకు కఠిన శిక్షలు పడటం వంటివి హర్షించదగ్గవే అయినా... వాటి  తీవ్రతతో నిమిత్తం లేకుండా ఏ కేసు విషయంలోనైనా ఇదే స్థాయిలో స్పందించే  స్వభావాన్ని పోలీసులు అలవర్చుకుంటే నేరస్వభావాన్ని మౌలిక దశలో కట్టడి చేయడం  వీలవుతుంది. ఈ క్రమంలో నిందితులు పలుకుబడి కలిగినవారైనా ఉపేక్షించకూడదు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో శాసనసభ్యుడిపై అత్యాచారం ఆరోపణలొచ్చినప్పుడు  పోలీసులు ఎంతో తాత్సారం చేయడం వల్ల అతగాడు మరింత రెచ్చిపోయాడు. ఆ ఎమ్మెల్యే  మనుషులు ఆమె తండ్రితోసహా కుటుంబంలో నలుగురిని హతమార్చడంతోపాటు రోడ్డు  ప్రమాదం పేరిట బాధితురాలినే హత్య చేయాలనుకున్నారు.

తీవ్రమైన నేరాలకు కఠిన శిక్షలు  విధించడానికి అనువుగా చట్టాలు సవరించడం, వెంటవెంటనే నేరగాళ్లకు శిక్షలు పడేవిధంగా అన్ని వ్యవస్థలూ చురుగ్గా పనిచేయడం నేరాలను అరికట్టడంలో ఎంతో  ఉపయోగపడతాయి. అదే సమయంలో మద్యపానం మహమ్మారిని అదుపు చేయడం, అశ్లీల వీడియోలపై కట్టడం చేయడం అత్యంత ముఖ్యం. ఒక మనిషి మృగంగా మారడానికి తోడ్పడుతున్న ఈ మాదిరి ప్రమాదకరమైన వాటిని నిర్మూలించకుండా నేరాలను అరికట్టడం సాధ్యం కాదు. కనుక ప్రభుత్వాలు వీటిపై కూడా దృష్టి పెట్టాలి. 

మరిన్ని వార్తలు