ఎట్టకేలకు లోక్‌పాల్!

18 Dec, 2013 23:17 IST|Sakshi

 రెండున్నరేళ్లుగా లోక్‌పాల్ బిల్లుతో యూపీఏ ప్రభుత్వం సాగిస్తున్న దోబూచులాట ముగిసింది. ఆ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల ముందుకు తీసుకు రావడంతో ఆగక మెరుపువేగంతో దాన్ని ఆమోదింపజేసుకుంది. ఉభయసభలూ ఆందోళనలతో అట్టుడికినా చర్చ, ఓటింగ్ జరిగిపోయాయి. సమాజ్‌వాదీ పార్టీ మినహా రాజకీయపక్షాలన్నీ ఒక్కటై అత్యుత్సాహంతో బిల్లుకు పచ్చజెండా ఊపాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఏదో వంకన బిల్లును దాటేయాలని చూస్తున్నాయని, అందువల్ల చర్చ అవసరం లేకుండానే ఆమోదించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తొలుత బీజేపీ ప్రకటించింది. ఇన్నాళ్లూ ఉప్పు, నిప్పులా ఉన్న పాలకపక్షం, అన్నా హజారే బృందం సంబంధాలు కూడా ఊహించని రీతిలో కొత్త మలుపు తిరిగాయి. అవినీతిపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రంగా దీన్ని అభివర్ణించడంతో పాటు ఈ బిల్లు సాకారం కావడానికి కారణం మీరంటే మీరని ఇద్దరూ పరస్పరం ప్రశంసించుకున్నారు. పొగడ్తల లేఖలు రాసుకున్నారు.
 
 బిల్లు విషయంలో ఎనలేని చొరవను ప్రదర్శించారని రాహుల్‌గాంధీని అన్నా హజారే అభినందిస్తే... ఈ సమస్యపై దేశం దృష్టి కేంద్రీకరించేందుకు అన్నా చేపట్టిన ఆందోళన దోహద పడిందని రాహుల్ పొగిడారు. వీరందరిలో ఇంత మార్పు రావడానికి కారణం ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలని వేరే చెప్పనవసరం లేదు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఊహించని రీతిలో 28 స్థానాలు గెలవడంతో ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీల గుండెల్లో గుబులు మొదలైంది. వెనువెంటనే లోక్‌పాల్ బిల్లును గట్టెక్కించకపోతే దేశమంతా ఢిల్లీ ఫలితాలే పునరావృతమైనా ఆశ్చర్యంలేదన్న నిర్ణయానికొచ్చాయి.    
 
 ఇంతకూ లోక్‌పాల్ నిజంగా బ్రహ్మాస్త్రమేనా? లేక అది అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నట్టు జోక్‌పాలేనా? పలువురు అంటున్నట్టు అది ఆరోవేలుగా మిగిలి పోతుందా? గతంలో ఇదే లోక్‌పాల్ బిల్లును యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దాన్ని ముక్తకంఠంతో తిరస్కరించిన అన్నా, కేజ్రీవాల్ ఇప్పుడు వేర్వేరు శిబిరాల్లో ఉన్నారు. అది సింహాన్ని సైతం ఒడిసిపట్టగలదని అన్నా అభివర్ణిస్తే... చిట్టెలుకను పట్టడానికి కూడా అది పనికిరాదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అన్నా బృందంలో కేజ్రీవాల్ భాగంగా ఉన్నప్పుడు రూపొందిన జన్‌లోక్‌పాల్ బిల్లుపై అప్పట్లో వివిధ వర్గాలనుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అన్నా బృందం తక్కువచేసి చూస్తున్నదని, అది రూపొందించిన జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సమాంతరంగా ఎలాంటి బాధ్యతా లేని మరో వ్యవస్థను ప్రతిపాదిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తాయి. తమ బిల్లుతో పోలిస్తే తీసికట్టుగా ఉన్నదని చెప్పి అప్పట్లో లోక్‌పాల్ బిల్లును అన్నా బృందం తిరస్కరించింది. కానీ, ఇప్పుడు ఆ బిల్లునే అన్నా హజారే ప్రశంసిస్తున్నారు.
 
 లోక్‌పాల్ నియామకం, తొలగింపు దగ్గరనుంచి దాని పనితీరు వరకూ అన్నిటిలోనూ అన్నా బృందం అప్పట్లో ప్రతిపాదించిన అంశాలకూ, ఇప్పటి బిల్లుకూ పోలికలు లేవు. ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత, స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి... వీరంతా ఎంచుకున్న మరొకరూ కలిసి లోక్‌పాల్‌ను ఎంపికచేస్తారని ప్రభుత్వ బిల్లు పేర్కొంది. ఇలాగైతే, రాజకీయ నాయకుల మాటే నెగ్గుతుంది గనుక ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు...కాగ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉమ్మడిగా నామినేట్ చేసే సభ్యుడొకరు, వీరితోపాటు ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత ఉండాలని జన్‌లోక్‌పాల్ ప్రతిపాదించింది. లోక్‌పాల్ తొలగింపునకు ఏ పౌరుడు చేసే ఫిర్యాదు అయినా సుప్రీంకోర్టు పరిశీలించవచ్చునని జన్‌లోక్‌పాల్ చెప్పగా, ప్రభుత్వం లేదా 100మంది ఎంపీలు సుప్రీంకోర్టుకు ఫిర్యాదుచేసినప్పుడే ఆయనను తొలగించాలని ప్రభుత్వ బిల్లు నిర్దేశిస్తోంది. సీబీఐ డెరైక్టర్ నియామకం, ఆ సంస్థ పనితీరు కూడా ఇప్పటిలా ప్రభుత్వం కనుసన్నల్లోనే ఉంటాయి. దాన్ని స్వతంత్ర సంస్థగా ఉంచాలన్న జన్‌లోక్‌పాల్ ధ్యేయం నెరవేరలేదు. కాకపోతే దానికి ప్రభుత్వంతోపాటు లోక్‌పాల్ అనే మరో బాస్ తయారవుతారు. సంస్థ డెరైక్టర్ ఎంపికను ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన కొలీజియం చూస్తుందని బిల్లు చెబుతోంది.
 
 లోక్‌పాల్‌తోపాటే అచ్చం అదే నిబంధనలతో రాష్ట్రాల్లో లోకాయుక్తలు ఏర్పడాలన్న అన్నా బృందం సూచనకు గండికొట్టి ఏడాదిలోగా లోకాయుక్తలను రాష్ట్రాలు ఏర్పాటుచేయాలని కొత్త బిల్లు నిర్దేశించింది. లోక్‌పాల్ ఏర్పాటుకు ప్రాణమనదగ్గ సిటిజన్స్ చార్టర్ ప్రస్తావన కొత్త బిల్లులో లేదు. వాస్తవానికి అన్నా నిరాహారదీక్ష చేసినప్పుడు సిటిజన్స్ చార్టర్‌ను లోక్‌పాల్‌లో భాగం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. పౌర సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యే అధికారుల ప్రాసిక్యూషన్‌కు వీలుకల్పించే ఆ నిబంధన లేకుండా సామాన్య జనానికి లోక్‌పాల్ వల్ల ఒరిగేదేమీ ఉండదు. అందుకోసం వేరే చట్టం తెస్తామని  కేంద్రం అంటోంది. అదెంతవరకూ ఆచరణలోకొస్తుందో చూడాలి. న్యాయమూర్తులు, ఎంపీలతోసహా అందరినీ లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలన్న జన్‌లోక్‌పాల్ సంకల్పానికి కూడా బిల్లు గండికొట్టింది. బిల్లులో న్యాయమూర్తుల ప్రస్తావన లేదు. న్యాయమూర్తుల జవాబుదారీతనం బిల్లు ఆ సంగతిని చూస్తుందని ప్రభుత్వం అంటోంది. అలాగే, ఎంపీల విషయంలోనూ బిల్లు కొన్ని మినహాయింపులనిచ్చింది. తప్పుడు ఫిర్యాదులిచ్చే వారికి ఏడాది ఖైదు విధించవచ్చని పొందుపరిచిన నిబంధనవల్ల చిత్తశుద్ధితో ఫిర్యాదుచేసేవారు సైతం జంకుతారు. మొత్తానికి దాదాపు అయిదు దశాబ్దాలనుంచి రకరకాల రూపాల్లో పార్లమెంటు ముందుకొచ్చి కూడా ఆమోదానికి నోచుకోని లోక్‌పాల్ బిల్లు తొలిసారి చట్టం కాబోతున్నది. ఎన్ని లోటుపాట్లున్నా అది సాకారం కావడమే వర్తమాన అవసరం. ఆచరణలో ఎదురయ్యే సమస్యలనుబట్టి సవరణల ద్వారా కట్టుదిట్టం చేయడానికి ఎటూ వీలుంటుంది. ఆ కోణం నుంచి చూస్తే లోక్‌పాల్ రాకను స్వాగతించవలసిందే.
 

మరిన్ని వార్తలు