నిజంపై జులుం

18 Jun, 2015 12:16 IST|Sakshi
నిజంపై జులుం

దేశంలో అత్యవసర పరిస్థితి విధించి, భావప్రకటనా స్వేచ్ఛను అణగదొక్కి మరో పది రోజులకు నాలుగు దశాబ్దాలు పూర్తవుతుంది. అప్పటికీ, ఇప్పటికీ పాలకులు తెలివిమీరారు. బాహాటంగా అలాంటి చర్యకు పాల్పడకుండానే ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా తమకు ఎదురులేకుండా చేసుకోవాలను కుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఆన్‌లైన్ మీడియాకు చెందిన పాత్రికేయుడు జగేంద్ర సింగ్ ను ఇటీవల అత్యంత దుర్మార్గంగా హత్యచేసిన ఉదంతం ఈ సంగతినే ధ్రువపరుస్తున్నది.

జగేంద్ర సింగ్  ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కొంతకాలంగా ఉత్తరప్రదేశ్ మంత్రి రామ్మూర్తి సింగ్ వర్మ పాల్పడ్డారంటున్న అక్రమాలను వెలుగులోకి తెస్తున్నాడు. ఆయనా, ఆయన మనుషులు భూకబ్జాలకూ, అక్రమ మైనింగ్‌కూ పాల్పడుతున్నారని, ఒక అంగన్‌వాడీ కార్యకర్తపై అత్యాచారం చేశారని కథనాలు వెలువరించాడు. ఈ అక్రమాలన్నిటా స్థానిక పోలీసుల హస్తం ఉన్నదని చెప్పాడు.
 
 ఆ కథనాలతో ఆగ్రహించిన పోలీసులు ఆయన ఇంటిపై దాడిచేసి  జగేంద్ర సింగ్ ను కొట్టి ఆయనపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టారు. 60 శాతంపైగా కాలిన గాయాలతో వారంరోజులపాటు నరకయాతన అనుభవించిన జగేంద్ర సింగ్ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. తనపై దాడి చేసింది ఎవరెవరో, వారు ఎవరి తరఫున వచ్చారో చనిపోయే ముందు చెప్పాడు. ఎంతో ఆందోళన జరిగిన తర్వాత ఈ కేసులో మంత్రి, స్థానిక ఎస్‌ఐతోపాటు తొమ్మిది మందిని ముద్దాయిలుగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
 
 ‘నేను రాసిన రాతలపై అభ్యంతరం ఉంటే నాపై కేసులు పెట్టొచ్చు...మంత్రి నన్ను పిలిపించి కొట్టవచ్చు. కానీ, ఇలా నిలువునా నిప్పెడతారా...’ అని జగేంద్ర సింగ్ తన మరణవాంగ్మూలంలో వాపోయాడు. నిజమే... ఆయనను కొట్టి ఉండొచ్చు, ప్రలోభాలు చూపి నోరు నొక్కొచ్చు. మరెప్పుడూ ఇలాంటి సాహసానికి పాల్పడకుండా బెదిరించి ఉండొచ్చు. ఆయనపై కేసులు పెట్టొచ్చు...కోర్టులకు ఈడ్చవచ్చు. అయితే, అలా చేస్తే ఈ జితేంద్ర పోయి మరొకరెవరో రావచ్చు. వారు అంతకుమించిన చురుకుదనాన్ని ప్రదర్శించవచ్చు. కనుక జగేంద్ర సింగ్ ప్రాణాలు తీయడమే ఆ దుండగుల లక్ష్యమైంది. దాన్ని కూడా గుట్టు చప్పుడు కాకుండా చేస్తే ఆశించిన ఫలితం రాదు. అందుకే ఆ పనిని వీలైనంత కర్కశంగా, భయానకంగా ఉండేలా చేస్తేనే...
 
జగేంద్ర రలాంటివారందరిలోనూ భయోత్పాతం కలుగుతుందని వారు భావించారు. ఒకపక్క ఆ పాత్రికేయుడు చావుబతుకుల్లో ఉండగానే...పాత్రికేయ సంఘాలు ఆందోళన చేస్తుండగానే అధికార మదంతో కన్నూ మిన్నూగానని కొందరు సమాజ్‌వాదీ నేతలు జగేంద్ర సింగ్ ఇంటికెళ్లి మరింతగా బెదిరించారు. ‘ఎందుకు మంత్రిపై నిందలేస్తారు? మీ నాన్నను నిజంగా చంపదల్చుకుంటే కస్టడీలోనే పోలీసులు ఆ పని చేసేవారు’ అంటూ ఎస్‌పీ నేత మిథిలేష్ కుమార్ హెచ్చరించాడు. స్థానికులు ఆగ్రహించి వెంబడించడంతో అక్కడినుంచి ఆయన పలాయనం చిత్తగించాడు. మరో మంత్రి ప్రశాంత్ యాదవ్ అయితే ఈ ఉదంతాన్ని ప్రకృతి సహజమని, విధి లిఖితమని తేల్చాడు.
 
 జగేంద్ర సింగ్ గతంలో పాత్రికేయుడైతే కావొచ్చుగానీ... ఇప్పుడు కాదని, దేశంలో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న 30 కోట్లమందిలో అతను ఒకడని మరో ఎస్‌పీ నేత వ్యాఖ్య. ఒక దుర్మార్గమైన ఉదంతమూ, దాని వెంబడే మరికొందరి అమానుష వ్యాఖ్యలు యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించలేకపోయాయి. ఆరోపణలొచ్చిన మంత్రిని తొలగించే ఉద్దేశం లేదని సీఎం అఖిలేష్ ప్రకటించారు.

పోలీసుల దర్యాప్తు పూర్తయి ఆధారాలేమైనా లభిస్తేనే ఆ పని చేస్తారట! ఎమర్జెన్సీ విధించిననాటికీ, ఇప్పటికీ పరిస్థితులు ఎంతగా దిగజారాయో ఈ ఉదంతం వెల్లడిస్తుంది. అఖిలేష్ కేబినెట్‌లోని 48మంది మంత్రుల్లో 26మందిపై నేరారోపణలున్నాయి. ఈ ఉదంతంలో ఆరోపణలొచ్చిన వర్మ వారిలో లేరు. అంతటి నిజాయితీపరుణ్ణి అనవసరంగా రచ్చకీడ్చే ప్రయత్నంచేశాడని జగేంద్రపై ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. జగేంద్రను చంపడమే కాదు...అతన్ని బ్లాక్‌మెయిలర్‌గా చిత్రించే యత్నం చేస్తున్నారు.
 
 తమ ఇంట్లో కనీసం టీవీ సెట్ కూడా లేదని, తమ బ్యాంకు ఖాతాలన్నీ తనిఖీ చేసుకోవచ్చునని కుటుంబసభ్యులు చేస్తున్న సవాలుకు వారివద్ద జవాబులేదు. యూపీలో మాత్రమే కాదు...దేశంలోనే ఇలా నిజాలను బట్టబయలు చేస్తున్నవారిపైనా, పాత్రికేయులపైనా దాడులు పెరిగాయి. అక్రమాలకు పాల్పడేవారిలో అసహనం కట్టలు తెంచుకుంటున్నది. జగేంద్ర ఉదంతానికి ముందు యూపీలో మరో పాత్రికేయుణ్ణి తీవ్రంగా కొట్టి, తాళ్లతో మోటార్‌సైకిల్‌కు కట్టి ఈడ్చుకెళ్లారు. ఇంకా వెనక్కి వెళ్తే 2012లో మనోజ్ పాండే అనే పాత్రికేయుణ్ణి కాల్చిచంపారు. ఆ మరుసటి ఏడాది రాజేష్ వర్మ అనే పాత్రికేయుణ్ణి హతమార్చారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఆడియో, వీడియోలకు అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం నేతలు గత కొన్ని రోజులుగా ఎలా బెదిరిస్తున్నారో, ఏ రకమైన వాదనలు చేస్తున్నారో దేశమంతా చూస్తూనే ఉన్నారు. ఒక ఎంపీ అయితే కోపంతో ఊగిపోయి నోటికొచ్చినట్టు వదరడం చానెళ్లన్నీ చూపాయి. అధికారానికి రాకముందునుంచే తనకు గిట్టని మీడియాను ఏ కార్యక్రమానికీ పిలవకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించడం మొదలెట్టిన టీడీపీనుంచి ఇంతకంటే మెరుగైన ప్రవర్తనను ఆశించలేం.
 
 పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో పనిచేసేవారికి అంతో, ఇంతో రక్షణ ఉంటుంది. వారి తరఫున పోరాడేందుకు బలమైన పాత్రికేయ సంఘాలుంటాయి. కానీ, మారుమూల ప్రాంతాల్లో చిత్తశుద్ధితో పనిచేస్తున్న చిన్నతరహా మీడియా ప్రతినిధులకూ, అక్రమాలను సహించలేక సామాజిక మాధ్యమాలే వేదికగా పోరాడుతున్న అసంఖ్యాకమైన పౌరులకూ ఎలాంటి రక్షణా ఉండటం లేదు. డబ్బు, పలుకుబడి ఉన్నవారు అలాంటి వారిపై కక్షగట్టి అక్రమ కేసుల్లో ఇరికిస్తుంటే...దాడులు చేస్తుంటే వారు నిస్సహాయులుగా మిగులుతున్నారు. కనీసం ఇప్పుడు యూపీలో జరిగిన ఘోర ఉదంతం అందరి కళ్లూ తెరిపించాలి. ఎంత చిన్న స్వరంతోనైనా, ఎన్ని పరిమితులకు లోబడైనా చిత్తశుద్ధితో, నిర్భయంగా పోరాడుతున్నవారికి అందరూ అండగా నిలబడాలి. అలాంటివారి రక్షణకు అవసరమైన చట్టాలు ఏర్పడేందుకు కృషి జరగాలి.

మరిన్ని వార్తలు