కళ–రాజకీయం

23 Aug, 2018 01:23 IST|Sakshi
అటల్‌ బిహారీ వాజ్‌పేయి

జీవన కాలమ్‌

అటల్‌ బిహారీ వాజ్‌పేయి కన్నుమూసిన రోజు ఒకానొక ఇంగ్లిష్‌ టీవీ చానల్‌ ‘నివాళి’ని ప్రసారం చేసింది. వివరాలు గుర్తు లేవు. అవసరం లేదు. వాజ్‌ పేయి 2004 సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయారు. ఆయన పాత్రికేయులతో మాట్లాడుతుండగా ఒక కార్యకర్త ఫోన్‌ పట్టుకుని పరుగున వచ్చాడు– ఫోన్‌లో పాక్‌ అధ్యక్షుడు ముషార్రఫ్‌. అందరూ బయటికి నడిచారు. కాసేపయ్యాక ఈ పాత్రికే యుడు– వినోద్‌ శర్మ లోనికి వచ్చారు. ‘ఎలా ఓడి పోయారు? ఏమయింది?’ అని ముషార్రఫ్‌ పరామ ర్శించారట. వాజ్‌పేయి నవ్వి ‘ఓడిపోయాను. అంతే’ అన్నారట. ఇదీ సంఘటన. ఒక ఎదురుదెబ్బకి నవ్వుకునే, తలవంచి అంగీ కరించే సామర్థ్యం (సెన్సాఫ్‌ హ్యూమర్‌) వాజ్‌పేయి సొత్తు.

ఇది రాజకీయ నాయకుడి ‘పదును’ కాదు. ఒక కళాకారుడి చరిత్రలో ఎన్నో రంగాలకు చెందిన ఎందరో కళాకారులు రాజకీయ ప్రవేశం చేశారు. ప్రస్తుతం మనసులో కదిలే పేరు– పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. ఎల్లప్పుడూ మనస్సులో కదిలే ఉదాహరణ– అన్నగారు– ఎన్టీఆర్‌. ఆయన నేషనల్‌ ఫ్రంట్‌ అధ్య క్షులుగా ఉన్న రోజుల్లో– నాచారం స్టూడియోలో మేనక, విశ్వామిత్ర షూటింగ్‌ జరుగుతున్నప్పుడు వీపీ సింగ్‌ వంటి ఎందరో  జాతీయ నాయకులు– గెడ్డంతో మీనాక్షి శేషాద్రితో నటించే తమ నాయ కుడిని నోళ్లు తెరిచి చూస్తూ కూర్చోవడం నాకు గుర్తుంది. అప్పుడు నేనక్కడ ఉన్నాను. అస్మదాదు లకు ఆ దృశ్యం కొత్త కాదు. కానీ ఈ ప్రేక్షక సము దాయానికి కొత్త.చాలా ఏళ్ల కిందట– మద్రాసు సెంట్రల్‌ పక్క నున్న మైదానంలో ప్రపంచ ప్రఖ్యాత వస్తాదు మహమ్మదాలీ విన్యాసాల ప్రదర్శన జరిగింది. ఆనాడు నేనక్కడ ఉన్నాను. ఆనాటి ముఖ్యమంత్రి ఎమ్జీఆర్‌ ముఖ్య అతిథి. ఆయన మహమ్మదాలీ ఉన్న ‘రింగు’లోకి వచ్చారు. ఒకే ఒక్కసారి రెండు పిడికిళ్లు ఆయనతో కలిపారు. అంతే, ప్రేక్షకులు విర్రవీగి పోయారు. వారిలో కొందరికి అలీ ఎవరో తెలియక పోవచ్చు. కానీ అందరికీ ఎమ్జీఆర్‌ తెలుసు.

మరి రొనాల్డ్‌ రీగన్‌ అనే నటుడు అమెరికా అధ్యక్షుడయ్యారు. ఆర్నాల్డ్‌ స్వీడ్జిగర్‌ కాలిఫోర్నియా గవర్నరయ్యారు. మొన్ననే కన్నుమూసిన కరుణానిధి తమిళ సినీ రంగంలో చరిత్రను సృష్టించిన రచయిత. అన్నాదురై రచయిత. జయలలిత నటీమణి. మరి ఇమ్రాన్‌ఖాన్‌ ఆ పదవిలో ఏం చేస్తారు? అయిదు బంతులతో ప్రత్యర్థిని ఏమార్చి– ఆరో బంతితో వికెట్‌ని కైవసం చేసుకోవడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అయిదుసార్లు వికెట్‌కి దూరంగా పరిగెత్తే బంతుల్ని ప్రయోగించి ఒక్క బంతిని ఇన్‌స్వింగర్‌గానో, యార్కర్‌గానో ప్రయోగించే కుశా గ్రత క్రీడాకారుడి చాకచక్యం. ముందు ముందు ఎన్ని బంతులు– మనల్ని ఏమారుస్తాయో చూడాలి. వాజ్‌పేయి తన రాజకీయ జీవితమంతా కవి తని సాధనంగా, ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి పరికరంగా పార్లమెంటులోనూ, బయటా వాడుతూ వచ్చారు. ఆయన ప్రసంగాలలో ‘కవి’ ఎప్పుడూ ప్రధాన పాత్రని పోషించేవాడు.

సందర్భం కాకపోయినా ఓ గొప్ప కళాకారుడైన రాజకీయ నాయకునితో అనుభవాన్ని ఉటంకించాలి. 1990 ప్రాంతాలలో అనుకుంటాను– అమెరికా వెళ్లాం. నేనూ, జేవీ సోమయాజులు మరి ఒకరిద్దరు మిత్రులూ ఐక్యరాజ్యసమితిని చూడటానికి వెళ్లాం. అప్పట్లో ప్రధాని పీవీ నరసింహారావు భారతదేశ ప్రతినిధిగా ప్రతిపక్ష నాయకులు వాజ్‌పేయిని పంపారు. భారతదేశ విభాగంలో ఆనాడు వాజ్‌పేయి ఒక్కరే కూర్చుని ఉన్నారు. వెళ్లి నమస్కరించాం. ముందురోజు తెలుగువారికి ప్రదర్శన ఇచ్చామని విన్నవించాం. వెంటనే ఆయన స్పందన ‘అలాగా! తెలిస్తే నేనూ వచ్చేవాడినే!’ ఆయన మూర్తీభవించిన సంస్కారం. భారతీయ విభాగం ముందు వారితో ఫొటోలు తీయించుకున్నాం. దురదృష్టం. నా దగ్గ రున్న వేలాది ఫొటోలలో అదొక్కటే కనిపించలేదు.రాజకీయ నాయకుడికి ‘కళ’ ఒక దన్ను. వారి విధానాలకు కొత్త దిశనీ, రుచినీ సమకూరుస్తాయి. వాజ్‌పేయి వస్తుతః కవి. దాదాపు పదమూడు సంవత్సరాల కిందటే రాజకీయ సన్యాసం చేసిన ఆ కవి అంతఃచేతన మౌనంగా ఇన్నేళ్లూ మనస్సులోనే ఎన్ని కవితలల్లిందో, వేళ్లు ఎన్ని కవితల్ని మౌనంగా మనస్సులో రచించాయో తెలియదు. ‘కళ’లో జీవలక్షణం ఉంటుంది. అందుకనే మరో పదేళ్లు ఆ నిశ్శబ్ద పథికుని మౌన చేతన– ఆయనకు ప్రాణం పోసింది.

గొల్లపూడి మారుతీరావు 

మరిన్ని వార్తలు