పెట్రో ధరలతో ఆటలా!

18 May, 2015 00:07 IST|Sakshi

చమురు ధరల విషయంలో మన ప్రభుత్వాలు చేసిన తప్పే చేస్తున్నాయి. తమ విధానాల్లోని లోపాలను సవరించుకోవడానికి బదులు, తమ తప్పులను సరిదిద్దు కోవడానికి బదులు సామాన్యులపై భారాన్ని నెట్టేసి చేతులు దులుపుకుంటు న్నాయి. తాజాగా మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. పెట్రోలుపై లీటరుకు రూ. 3.13, డీజిల్‌పై లీటరుకు రూ. 2.71 చొప్పున పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ శుక్రవారం ప్రకటించింది.  ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 75కు, డీజిల్ ధర రూ. 60కి చేరుకున్నాయి. పక్షం రోజుల వ్యవధి లో ఇలా ధర పెరగడం ఇది రెండోసారి. ఈ నెల 1న పెట్రోలుపై లీటరుకు రూ. 4, డీజిల్‌పై లీటరుకు రూ. 2.37 చొప్పున పెరిగాయి. చమురు ధరలు పెరగడంవల్ల పర్యవసానాలెలా ఉంటాయో తెలియనిది కాదు.

వీటి ధరలు పెరిగినప్పుడల్లా సరుకు రవాణాతోసహా అన్ని రకాల చార్జీలూ తడిసిమోపెడై నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతాయి. ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుల జీవితాలు అస్తవ్యస్థమవుతాయి. అయినా సరే ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. ధరల పెంపే పరిష్కారంగా మాట్లాడుతున్నాయి.
  అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాల కారణంగా ఏడెనిమిది నెలలుగా చమురు ధర క్రమేపీ తగ్గడం మొదలెట్టింది. నిరుడు మే 26న నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే సమయానికి ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌కు 115 డాలర్లుంటే నవంబర్ నాటికి అది 80 డాలర్లకు దిగివచ్చింది. ఈ జనవరినాటికి అది మరింత తగ్గి 43.36 డాలర్లకు చేరుకుంది. చమురు ధరలు ఇలా తగ్గుముఖం పట్టడం మోదీ ప్రభుత్వానికి బాగా కలిసొచ్చింది.

ఎందుకంటే మన చమురు అవసరాలు 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. కనుక చమురు ధరలు పడిపోవడమంటే మన కరెంట్ అకౌంట్ లోటు గణనీయంగా తగ్గిపోవడం...మన విదేశీ మారకద్రవ్యం ఆదా కావడం. డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ పెరగటం. అది బలపడటం. మొత్తంగా మన ద్రవ్య లోటు తగ్గడం. తగ్గిన చమురు ధర ఆర్థికవ్యవస్థ బలపడటానికి ఇన్నివిధాలుగా తోడ్పడినా సామాన్యుడికి మాత్రం నేరుగా కలిసొచ్చింది లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర 2005నాటి స్థాయికి పడిపోయినా పెట్రోల్, డీజిల్ ధరలు ఆ స్థాయిలో తగ్గలేదు. అప్పట్లో పెట్రోల్ ధర లీటరు రూ. 45, డీజిల్ రూ. 30.25 ఉండగా...ఈసారి పెట్రోల్ రూ. 59, డీజిల్ రూ. 48 ఉన్నాయి. నవంబర్ మొదలుకొని కేంద్ర ప్రభుత్వం నాలుగు దఫాలు ఎక్సైజ్ సుంకాలు పెంచడమే ఇందుకు కారణం. పెట్రోల్‌పై మొత్తంగా లీటర్‌కు రూ. 7.75, డీజిల్‌పై లీటర్‌కు రూ. 6.50 చొప్పున సుంకాలు పెరిగాయి.

ఇదే అదునుగా రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు భారం వేయడంవల్ల పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకొంచెం హెచ్చయ్యాయి. 2013 జనవరిలో ఆనాటి యూపీఏ సర్కారు చమురు ధరలపై నియంత్రణను ఎత్తేసింది. ఇకపై దేశంలో చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉంటాయని ఆ సందర్భంగా ప్రకటించింది. ఎన్డీయే సర్కారు తన వంతుగా నిరుడు అక్టోబర్‌లో డీజిల్ ధరలపై నియంత్రణను తొలగించింది. ధరలు పెంచినప్పుడల్లా అంతర్జాతీయ మార్కెట్‌ను చూపిన పాలకులు తగ్గే సందర్భం వచ్చేసరికి మాత్రం సుంకాలు పెంచి సామాన్య పౌరుల్ని దగా చేశారు.
   చమురు ధరలు మొన్న మార్చినుంచి మళ్లీ పైపైకి వెళ్లడం మొదలెట్టాయి. మార్చి నెలాఖరుకు బ్యారెల్ ముడి చమురు ధర 53.64 డాలర్లుంటే అది మే నెలకల్లా 64.05 డాలర్లకు ఎగసింది. ఇప్పుడది 68 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉంటాయి. డిమాండులో హెచ్చుతగ్గులు, చమురు ఉత్పాదక దేశాలు ఉత్పత్తిని పెంచడం లేదా తగ్గించడం, షేల్ చమురు మార్కెట్‌లోకి రావడం, పశ్చిమాసియాలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలు మొత్తంగా మార్కెట్‌ను నిర్దేశిస్తాయి. మన దేశానికి సంబంధించినంతవరకూ డాలర్‌తో రూపాయి మారకం రేటు అదనంగా ప్రభావితం చేస్తుంది.

ఇన్ని సంక్లిష్ట అంశాలతో ముడిపడి ఉండే పెట్రో ధరలపై నియంత్రణను తొలగించడం జనసామాన్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దూరదృష్టి పాలకులకు కొరవడింది. పర్యవసానంగా ఇరుగు పొరుగుతో పోల్చినా మన దేశంలో చమురు ధరలు మండిపోతున్నాయి. క్రితం వారం కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని గమనిస్తే ఇది అర్ధమవుతుంది. ఆయనిచ్చిన లెక్కల ప్రకారమే ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ 63.16 ఉండగా...పాకిస్థాన్‌లో 44.05, శ్రీలంకలో 54.75గా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన దేశంలో ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాలు విధించడంవల్లే ధరలు ఈ స్థాయిలో ఉంటున్నాయి. ప్రభుత్వాలు పెట్రోల్‌పై 50 శాతంపైగా, డీజిల్‌పై 38 శాతంపైగా పన్నులు, సుంకాలు వసూలు చేస్తున్నాయి.

ఈ సుంకాలద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు లక్షల కోట్ల రూపాయలకుపైగా వస్తున్నదని ఒక అంచనా. ఆదాయం కోసం ఇలా ఒక్క రంగంపైనే ప్రభుత్వాలు ఆధారపడటం సరైంది కాదని రంగరాజన్ కమిటీ సైతం తెలిపింది. అయినా ప్రభుత్వాల వైఖరిలో మార్పు రాలేదు సరిగదా...చమురు రంగంనుంచి మరింత ఆదాయాన్ని పిండుకునే దిశగా వెళ్తున్నాయని ఇటీవల విధించిన సుంకాల తీరు రుజువుచేసింది. పాలకులు హేతుబద్ధంగా ఆలోచించాలి. చమురు సంస్థలను తమ విధానాలతో నష్టపరుస్తూ అందుకు అంతర్జాతీయ కారణాలను చెప్పి తప్పించుకునే పద్ధతులకు స్వస్తి చెప్పాలి. సమస్త జీవన రంగాలతో ముడిపడి ఉండే పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి.
 
 
 

మరిన్ని వార్తలు