మహాద్భుతం!

19 Dec, 2014 01:09 IST|Sakshi

గగనవీధుల్లో విజయ పరంపరను కొనసాగిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గురువారం అత్యంత కీలకమైన జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగాన్ని సునాయాసంగా పూర్తిచేయగలిగింది. ప్రయోగ సమయం అనుకున్నకంటే అరగంట ఆలస్యమైందన్న మాటేగానీ మిగిలినవన్నీ ముందుగా నిర్దేశించిన ప్రకారం పూర్తయ్యాయి. మన శాస్త్రవేత్తల ప్రతిభాపాటవాలను ప్రపంచానికి చాటిచెప్పాయి. ఈ ప్రయోగం అనేక విధాల ఎన్నదగినది. రానున్న కాలంలో మనం సైతం వ్యోమగాములను అంతరిక్షానికి పంపేందుకు ఈ ప్రయోగం ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులో వాడిన కేర్ మాడ్యూల్ వ్యోమగాములను ఉద్దేశించిందే. భవిష్యత్తులో అచ్చంగా వ్యోమగాములను పంపినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోవడానికి దీన్ని రూపొందించారు. ఒక చిన్న బెడ్ రూమ్‌ను పోలివుండే ఈ మాడ్యూల్‌లో ముగ్గురు వ్యోమగాములు ప్రయాణించడానికి వీలుంటుంది. అలాగే రాకెట్‌కు రెండు దశల్లో వాడిన బూస్టర్లు సైతం మన శాస్త్రవేత్తలకు ఎనలేని ఆత్మస్థైర్యాన్ని అందించగలిగాయి.
 
 మొదటి దశలో ఉపయోగించిన ఎస్-200 బూస్టర్లు, రెండో దశ లోని ఎల్-110 బూస్టర్లు శాస్త్రవేత్తలిచ్చిన కమాండ్లకు అనుగుణంగా సక్రమంగా పనిచేసి నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ దూసుకెళ్లడానికి తోడ్పడ్డాయి. ఇన్నాళ్లూ ఇస్రో చేసిన ప్రయోగాలకూ, ఈ ప్రయోగానికీ గుణాత్మకమైన మార్పు కూడా ఉన్నది. మన శాస్త్రవేత్తలు లోగడ ఏ ప్రయోగంలోనూ ఇంత బరువైన రాకెట్‌ను ఉపయోగించలేదు. ఇది ఏకంగా 6,30,000 కిలోలు! ఇందులో కేర్ మాడ్యూల్ బరువు 3,775 కిలోలు. ఇంత బరువైన మాడ్యూల్‌ను భూమికి 126 కిలోమీటర్ల ఎత్తులో ఆ రాకెట్ జారవిడ్చగా అది సురక్షితంగా భూమార్గం పట్టింది. మాడ్యూల్ వెనక్కి వస్తున్న క్రమాన్నంతటినీ పరిశీలించి తమ అంచనాలు ఎలా ఉన్నాయో...ఎక్కడెక్కడ సవరించుకోవడం అవసరమో నిర్ధారించుకోవడానికి ఈ ప్రయోగం శాస్త్రవేత్తలకు ఉపయోగపడింది. అలాగే రాకె ట్‌పైనా, మాడ్యూల్‌పైనా వాతావరణ ప్రభావం, దాని పీడనం ఎలా పనిచేశాయో...రాకెట్ సామర్థ్యం ఎలాంటిదో అధ్యయనం చేయడానికి కూడా తోడ్పడింది.
 
 మాడ్యూల్ వేగాన్ని కొంతదూరం వరకూ దానికున్న మోటార్ల ద్వారా నియంత్రించి అటు తర్వాత ఆ మాడ్యూల్‌కు అమర్చిన ప్యారాచూట్లు తెరుచుకునేలా చేసి అది నేరుగా బంగాళాఖాతంలో పోర్టుబ్లెయిర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో 20 నిమిషాల్లో పడేలా చేయడం ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియంతా అనుకున్నట్టే సాగడం...ప్యారాచూట్లు సైతం ఎలాంటి లోపమూ లేకుండా పనిచే సి సహకరించడం కీలకమైనది. ఇందువల్ల భవిష్యత్తులో వ్యోమగాములను అంతరిక్షానికి పంపి వారిని తిరిగి సురక్షితంగా తీసుకురాగలిగిన సామర్థ్యాన్ని మన శాస్త్రవేత్తలు సొంతం చేసుకున్నట్టయింది. ఇలాంటి సామర్థ్యం ఇంతవరకూ రష్యా, అమెరికా, చైనాలకు మాత్రమే ఉంది.
 
 ఈ ప్రయోగం మరో రకంగా కూడా ముఖ్యమైనది. రాకెట్‌లోని రెండు దశలూ సక్రమంగా పనిచేశాయని రుజువైంది. ఇక క్రయోజనిక్ ఇంజన్(సీ-25)ను వాడే మూడో దశను కూడా విజయవంతం చేయగలిగితే మనం వ్యోమగాములను పంపగలిగే సామర్థ్యాన్ని పూర్తిగా సంతరించుకున్నట్టవుతుంది. అంతేకాదు...భారీ ఉపగ్రహాల ప్రయోగానికి ఇకపై విదేశాలపై ఆధారపడవలసిన అవసరం ఉండదు.  అంతరిక్షం మన ఊహలకూ, అంచనాలకూ దాదాపు దగ్గరిగానే ఉన్నా అక్కడ హఠాత్తుగా అత్యంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి.
 
 అలాగే రాకెట్‌లోని వ్యవస్థలు అత్యంత సంక్లిష్టమైనవి. ఏ చిన్న లోపం ఏర్పడినా మొత్తం అంతా కుప్పకూలుతుంది. రాకెట్ ప్రయోగానికి భారీ మొత్తంలో ఇంధనం అవసరమవుతుంది. అది ముందే విడుదల కావడం లేదా హఠాత్తుగా అవసరమైనదానికంటే ఎక్కువ విడుదలకావడం వంటి ప్రమాదాలు ఎప్పుడూ పొంచివుంటాయి. అంతేకాదు...రాకెట్‌కు, మాడ్యూల్‌కు వాడే లోహాలైనా, మిశ్రమ లోహాలైనా రాకెట్ గమనంలో ఎదురయ్యే వాతావరణపరమైన ఒత్తిళ్లను ఎంత సమర్థవంతంగా తట్టుకుంటాయో ఖచ్చితంగా అంచనా వేసుకోగలగాలి.  ఈ మొత్తం ప్రక్రియలో శాస్త్రవేత్తల కళ్లుగప్పి ఏ చిన్న లోపం సంభవించినా అది తీసుకొచ్చే నష్టం అపారమైనది. వ్యోమగాములను పంపే ప్రయోగమైతే ఇక చెప్పేదేముంది?!
 
  అంతరిక్ష వైజ్ఞానిక ప్రగతిలో మన శాస్త్రవేత్తల కృషి అనుపమానమైనదీ... అసమానమైనదీ! వైఫల్యాలు లేవని కాదు...కానీ, అటువంటి వైఫల్యాలను భవిష్యత్తు విజయాలకు సోపానాలుగా మలచుకోవడం ముఖ్యం. మన శాస్త్రవేత్తలు ఆ పనిని దిగ్విజయంగా పరిపూర్తి చేయగలిగారు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలన్నీ విజయం సాధించినా భారీ బరువుండే ఉపగ్రహాలను మోసుకుపోగల జీఎస్‌ఎల్‌వీల మాత్రం వారికి అంత సులభంగా పట్టుబడలేదు.
 
 అందుకు కారణం అందులో వాడే క్రయోజనిక్ ఇంజన్లే. అతి శీతల స్థితిలో సైతం పనిచేయగల ఆ ఇంజన్లను మనకు అందజేయడానికి 1992లో రష్యా ఒప్పందం కుదుర్చుకున్నా అనంతరకాలంలో జరిగిన అణు పరీక్షలు దానికి ఆటంకంగా నిలిచాయి. అమెరికా ఒత్తిడితో ఆ దేశం క్రయోజనిక్ ఇంజిన్‌లు ఇవ్వడం మానుకుంది. అయినా ఇస్రో శాస్త్రవేత్తలు దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజిన్‌ను ఉపయోగించి తీరాలన్న సంకల్పంతో ఎంతో శ్రమపడ్డారు. ఈ ఏడాది జనవరిలో జీఎస్‌ఎల్‌వీ-డీ5ను విజయవంతంగా ప్రయోగించి ఆ సంకల్పాన్ని సాకారం చేసుకున్నారు. ఇప్పుడు సంవత్సరం చివరిలో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ఘనవిజయం కొసమెరుపు వంటిది. అందువల్లే ఇస్రో శాస్త్రవేత్తలకు దేశం మొత్తం నీరాజనాలు పడుతున్నది. ఈ విజయం మరిన్ని విజయాలకు స్ఫూర్తినిచ్చి అంతరిక్షంలోకి భారత్ సైతం వ్యోమగాములను పంపే రోజొకటి వస్తుందని ఆశించవచ్చు.

మరిన్ని వార్తలు