రేడియో ఆయనకు మేలు చేసింది

21 Oct, 2013 01:44 IST|Sakshi
రేడియో ఆయనకు మేలు చేసింది

  నివాళి
 మరెందుచేతనో ఆయనకూ గుంటూరు శేషేంద్రశర్మగారికీ అంత పొసగేది కాదు. రావూరి భరద్వాజ హైదరాబాద్ స్టేషన్లో ఉన్నంతకాలం నేను అడుగు పెట్టను అని భీష్మించాడాయన.
 
 నా అదృష్టం ఇంకొకరికి లేదు. నేను ఇద్దరు జ్ఞానపీఠ అవార్డీలతో కలిసి, వారి పక్క సీట్లో కూచొని, ఉద్యోగం చేశాను. వారిలో ఒకరు అఖిలన్ గారు. మద్రాసు ఆలిండియా రేడియో కేంద్రంలో ఆయన సీటు నా సీటు పక్కపక్కనే. మరొకరు రావూరి భరద్వాజ. హైదరాబాద్ ఆలిండియా రేడియో కేంద్రంలో ఆయన సీటూ నా సీటూ పక్కపక్కనే. నేను 1977లో ఉద్యోగంలో చేరాను. అప్పటికే భరద్వాజగారు నా సీనియర్. నేను చేరిన వెంటనే నా పై అధికారి నాకు పరిచయం చేసిన మొట్టమొదటి కొలీగ్ భరద్వాజగారే. మొదటి పరిచయంలోనే ఆయన నాకు నచ్చారు. అంటే నచ్చేలా వ్యవహరించే గుణం ఏదో ఆయనలో ఉంది. భరద్వాజగారు మొదట ‘స్క్రిప్ట్ రైటర్’గా చేరినా ఆ తర్వాత ‘స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్’గా ఎక్కువ రోజులు పని చేశారు. అంటే ప్రసంగాలు, చర్చలు, ఇంటర్వ్యూలు, సాహిత్య కార్యక్రమాలు... ఇవన్నీ చూడాలి. చాలా ఒత్తిడి ఉండే పని అది.
 
 ఆ రోజుల్లో ఇప్పటిలా టీవీలూ విపరీత సంఖ్యలో చానల్సూ లేవు గనక- మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి, మా కవిత్వం రికార్డు చేయండి అని వెంటపడేవారు చాలామంది ఉన్నారు. వాళ్లతో భరద్వాజగారు ఓపికగా వేగడం నేను చూశాను. నాకు తెలిసి సుప్రసిద్ధ రాజకీయ నాయకులతో, స్వాతంత్య్ర సమరయోధులతో భరద్వాజగారు చేసినన్ని ఇంటర్వ్యూలు మరెవరూ చేయలేదు. అన్నీ గొప్ప గొప్ప ఇంటర్వ్యూలు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ప్రచార ప్రసంగాలను ప్రసారం చేయడం తప్పనిసరి. ఆ సమయంలో అందరు నాయకులూ ఒక్కలాగే వ్యవహరించరు కదా. పదాలు మార్చమంటే ఫలానా విషయం వద్దు అనంటే వినేవారు కాదు. అడ్డం తిరిగేవారు. ఇలాంటివారి ప్రసంగాన్ని రికార్డ్ చేయాలంటే ఒక్కటే విరుగుడు. భరద్వాజగారిని పిలవడమే. ఆయన వచ్చి చెప్తే- కాదు అనడానికి ఏమీ ఉండేది కాదు. ఆ విధంగా భరద్వాజగారు రేడియోకి చాలా మేలు చేశారు. ఆయన చేసిన మేలు, దాని నుంచి ఆయన పొందిన మేలు రెంటిలో ఏదీ తక్కువ కాదు.
 
 భరద్వాజగారు ఉద్యోగాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేవారు. టైమంటే టైమ్‌కే వచ్చేవారు. టైమ్ తర్వాతే వెళ్లేవారు. చాలా అరుదుగా లీవ్ పెట్టేవారు. అంతటి సిన్సియర్‌ను కూడా బాధించే సన్నివేశాలు తప్పలేదు. ఒకసారి ఒక స్టేషన్ డెరైక్టర్ అందరి ముందూ పట్టుకుని- ఆయన అంత పెద్ద రచయిత అనే సంగతి కూడా చూడకుండా- చెడామడా తిట్టేశాడు. భరద్వాజగారు ఎంత సున్నిత మనస్కులంటే వెంటనే గుండె పట్టుకొని కూలిపోయారు. హార్ట్ ఎటాక్. స్టేషన్ నుంచే హాస్పిటల్‌కు ఆగమేఘాల మీద తీసుకెళ్లాల్సి వచ్చింది. మరోసారి ఇలాగే మరో స్టేషన్ డెరైక్టర్ చాలా తీవ్రంగా తిట్టాడు. అంతేకాదు- సాయంత్రం కదా ఇప్పుడెవరూ లేరు. రేపు అందరి ముందూ నీ సంగతి తేలుస్తాను అన్నాడు. అయితే ఆ రాత్రే ఆ స్టేషన్ డెరైక్టర్ చనిపోయాడు. ఈ సంఘటనను భరద్వాజ ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు. మనుషులు అన్నీ తమ చేతుల్లో ఉంటాయని మిడిసిపోవడం గురించి చెప్పి, అహంకారాన్ని వదిలి, ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలని హితవు చెప్పేవారు. అప్పుడప్పుడు కొంటె పనులు కూడా చేసేవారు. ఒకాయన ఎప్పుడు రికార్డింగ్ జరిగినా ఓచర్ మీద సైన్ చేయాల్సి వచ్చినప్పుడు- రెవెన్యూ స్టాంప్‌కు అవసరమైన పదిపైసలో ఇరవై పైసలో ఇవ్వకుండా- నా దగ్గర వంద రూపాయలున్నాయి చిల్లరలేదు అని డబ్బు తీసుకొని వెళ్లిపోయేవాడు. ఒకసారి అదే మాట అన్నాడో లేదో భరద్వాజగారు అప్పటికే సిద్ధంగా ఉంచిన కవర్ ఆయన ముందుపెట్టారు. అందులో 99 రూపాయల ఎనభై పైసల చిల్లర ఉంది. వంద తీసుకొని అది ఇచ్చి పంపారు.
 
 మరెందుచేతనో ఆయనకూ గుంటూరు శేషేంద్రశర్మగారికీ అంత పొసగేది కాదు. రావూరి భరద్వాజ హైదరాబాద్ స్టేషన్లో ఉన్నంతకాలం నేను అడుగు పెట్టను అని భీష్మించాడాయన. శర్మగారి చివరి రోజుల్లో నేను ఈ విషయాన్ని గుర్తు చేసినప్పుడు- నేను అలా చేసి ఉండకూడదు అని పొరపాటు ఒప్పుకున్నారాయన. భరద్వాజగారికి చలం, కుటుంబరావు, ధనికొండ హనుమంతరావు గార్లంటే ఇష్టం. సినిమా రంగంలో ఆత్రేయ అంటే అభిమానం. తాను ఎంత ఉద్యోగ వత్తిడిలో ఉన్నా రాయడం మాత్రం మానేవారు కాదు. బహుశా ఆయన తెల్లవారే లేచి ఆఫీస్‌కు వచ్చేలోపు రాసేవారనుకుంటాను. అనుభవంలో లేనిది ఏదీ రాయకూడదు అనేవారు. ఒకసారి బొగ్గుగని కార్మికుల మీద కథ రాయడానికి బొగ్గుగనులకు వెళ్లి తలకు లైట్ వెలిగించుకుని బొగ్గు తట్టలు మోసి వచ్చానని నాతో చెప్పారు. అలాగే లారీ డ్రైవర్, క్లీనర్‌ల మీద కథ రాయడానికి ఒకసారి వాళ్లతో కలిసి చాలా దూరం ప్రయాణించి వచ్చానని కూడా చెప్పారు. ఇతర భాషల సాహిత్యంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటూ ఉండేవారు. ఆ భాషల్లో వస్తున్న సాహిత్యాన్ని పరిచయం చేసే ‘భారత భారతి’ కార్యక్రమాన్ని ఆయనే నిర్వహించేవారు.
 
 ఆయనకు ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల (ఏడు వరకే చదివారు) ఇంగ్లిష్ రాక ఉద్యోగపరమైన రాతకోతల కోసం కొంచెం అవస్థ పడేవారు. అప్పుడు వాడ్రేవు పురుషోత్తం వంటి మిత్రులు, నేను సాయం చేసేవాళ్లం. అలాంటి సమయాల్లో సోమర్‌సెట్‌మామ్ కథ ఒకటి గుర్తు చేసుకునేవారు. ఆ కథలో ఒక శ్రీమంతుడు. లేనిదంటూ లేదు. కాని చదువు రాదు. కనీసం సంతకం కూడా తెలియదు. ఒకసారి ఎవరో అంటారు- అంతా బాగనే ఉందికాని కనీసం సంతకం నేర్చుకునేంత చదువైనా చదువుకుని ఉంటే బాగుండేది అని. అప్పుడా శ్రీమంతుడు- ఆ చదువే వచ్చుంటే ఈసరికి చర్చ్‌లో బెల్స్ తుడిచే ఉద్యోగంలో ఉండేవాణ్ణే తప్ప ఇంత సంపాదించేవాణ్నా అంటారు. అది చెప్పి నవ్వేవారు. సరే మనకు డ్యాన్సు కూడా రాదు కదా ఏం చేద్దాం అనేవారు. కాని డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భవించడానికి ఆయన ఒక స్ఫూర్తిగా నిలిచాడని చాలామంది చెప్పుకోరు. భవనం వెంకటరామ్ ఆయనా మిత్రులు. ఒకసారి అడిగారట ఏం చదివావ్ అని. చదువుకునే వీలు లేక ఏమీ చదువుకోలేదు అని చెప్పారట. నీలాంటి వాళ్ల కోసం చదువుకునే ఏర్పాటు చేయాలి అని భవనం చెప్పారట. అలా వచ్చిందే ఓపెన్ యూనివర్సిటీ. దాని ప్రారంభానికి జ్ఞానీ జైల్‌సింగ్ వచ్చి తన ప్రసంగంలో ఆ సంగతి ప్రస్తావిస్తే ప్రసార సమయంలో భరద్వాజ రేడియో ఉద్యోగి కనుక రేడియోలో భరద్వాజ పేరు రాకూడదనే నియమాన్ని పాటిస్తూ కట్ చేశాడో ప్రబుద్ధుడు.
 
 భరద్వాజగారు రేడియోతో తన అనుబంధాన్ని చాలా సెంటిమెంటల్‌గా తీసుకునేవారు. ఆయన నవంబర్ 11న ఉద్యోగంలో చేరారనుకుంటాను. అందువల్ల రిటైరయ్యాక కూడా ప్రతి సంవత్సరం నవంబర్ 11న రేడియోకి వచ్చి, తిరిగి, అందరినీ పలకరించి, తృప్తి పడి వెళ్లేవారు. అలాంటి ఉద్యోగులు ఇవాళ ఎందరున్నారు. ఇచ్చిన పనిని ఎందరు గౌరవిస్తున్నారని? భరద్వాజ తన జీవితంలో చాలామంది నుంచి మేలు పొందారు. ఏదీ మర్చిపోలేదు. చాలామందికి మేలు చేశారు. అంతా మర్చిపోయారు. జీవితంలో ఆయన సంతోషం కంటే దుఃఖాన్నే ఎక్కువ చూశారనిపిస్తుంది. రెండు మూడు నెలల వ్యవధిలో ముగ్గురు సంతానాన్ని పోగొట్టుకున్న తండ్రి వేదన ఎవరికి తెలుస్తుంది? ఆయనకు ఏ మేలు జరిగినా నేను చాలా సంతోషించేవాణ్ని. జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు ఒక సామాన్యుడు సాధించదగ్గ అతి పెద్ద విజయంగా నాకు అనిపించింది.
 
 ఇప్పుడు ఆయన లేరు. కాని సాధించవచ్చు అని సంకల్పించినవారికి ఒక స్ఫూర్తిగా నిలిచిపోయారు కదా.
 - పి.ఎస్.గోపాలకృష్ణ
 హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం పూర్వ సంచాలకులు
 

మరిన్ని వార్తలు