కాలుష్య నరకాలు!

17 May, 2016 04:50 IST|Sakshi
కాలుష్య నరకాలు!

ఇప్పటికీ మన నగరాలు మృత్యువునే ఆఘ్రాణిస్తున్నాయని తాజాగా విడుదలైన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ధ్రువపరుస్తోంది. ఈ విషయంలో మన ప్రభు త్వాలు శ్రద్ధ పెట్టడం లేదని...అవసరమైన పర్యవేక్షణగానీ, దిద్దుబాటు చర్యలుగానీ ఉండటం లేదని ఈ నివేదిక నిరూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 103 దేశాల్లోని 3,000 నగరాలను అధ్యయనం చేసి సంస్థ ఈ నివేదికను వెలువరించింది.

వీటితోపాటు కొన్ని పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ కూడా సర్వే చేసింది. ఒక ప్రాంతంలోని వాతావరణంలో ప్రతి ఘనపు మీటర్‌కు సగటున అత్యంత సూక్ష్మ ధూళి కణాలు ఎన్ని మైక్రోగ్రాముల్లో ఉన్నాయో లెక్కగట్టి అక్కడి కాలుష్యం ఏ స్థాయిలో ఉన్నదో అంచనా వేయడం ఈ సర్వేలోని ప్రధానాంశం. ఒక ఘనపు మీటర్‌లో ఉండే సూక్ష్మ ధూళి కణాలు 25 మైక్రో గ్రాములు మించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నాణ్యతా ప్రమాణాలు చెబుతున్నాయి. ఇంతకన్నా అధిక పరి మాణంలో ధూళి కణాలున్న నగరాలను కాలుష్య నగరాలుగా లెక్కేస్తారు.

ఈ ప్రాతిపదికన రూపొందించిన అత్యంత కాలుష్య నగరాల జాబితాలో సగం మన దేశానికి చెందినవే కావడం ఆందోళన కలిగించే అంశం. గత నివేదికలో మొదటి స్థానంలో ఉన్న దేశ రాజధాని నగరం ఢిల్లీ ఈసారి 11వ స్థానానికి పడిపోయింది. ఈ నివేదిక వెల్లడయ్యాక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నగర పౌరులను అభినం దించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లో విడుదల చేసిన నివేదికతో పోలిస్తే ఢిల్లీ నగరం పరిస్థితి స్వల్పంగా మెరుగైన మాట వాస్తవమే అయినా...మరీ అంత సంబరపడేదేమీ లేదు. ప్రపంచంలో మరో నగరం ఢిల్లీని మించిపోయింది గనుక ఇది కాస్త వెనకబడింది. ఢిల్లీ స్థానాన్ని ఇరాన్‌లోని జబోల్ ఆక్రమించింది.
 
వాయు కాలుష్యంవల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. మన దేశం విషయానికే వస్తే 2013లో ఈ కాలుష్యం బారినపడి 14 లక్షలమంది అర్ధంతరంగా మరణించారు. అంతకు మూడేళ్ల మునుపు ఇలాంటి అర్ధంతర మరణాలు అందులో సగం కన్నా తక్కువే. కనుక మన నగరాల పరిస్థితి రోజురోజుకూ దిగజారు తున్నదని అర్ధం. మనం పీల్చే గాలిలో నైట్రేట్, సల్ఫేట్, కార్బన్, సోడియం, కాడ్మి యం, పాదరసం అణువులు ఉంటున్నాయని...అవి ప్రాణాలను తోడేస్తున్నాయని పర్యావరణవేత్తలు తరచు హెచ్చరిస్తున్నారు. మునుపటి కాలంతో పోలిస్తే కేన్సర్ రోగుల సంఖ్య పెరగడం, క్షయ, ఆస్తమా వంటి వ్యాధులు ఉగ్రరూపం దాల్చడం ఈ దుస్థితి వల్లనే. వాయు కాలుష్యంవల్ల హృద్రోగాలు, గుండెపోట్లు కూడా పెరుగు తున్నాయి. ఇలాంటి వ్యాధులు ఆయా కుటుంబాలను మాత్రమే కాదు...మొత్తం దేశ ఆర్ధిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేస్తున్నాయి. మన జీడీపీలో 3 శాతాన్ని వాయు కాలుష్యం మింగేస్తున్నదని ప్రపంచ బ్యాంకు ఆమధ్య హెచ్చరించింది.
 
ప్రపంచబ్యాంకు నివేదికను విశ్లేషిస్తే దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడ వుతున్నాయి. ప్రపంచ కాలుష్య నగరాల్లో మన దేశానికి చెందిన పది నగరా లుంటే అందులో అన్నీ ఉత్తరాది లేదా మధ్య భారత్‌లోనివే. పైగా ఇవన్నీ జనాభా సాంద్రత అధికంగా ఉండే నగరాలు. ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు నగరాలు- అలహాబాద్, కాన్పూర్, ఫిరోజాబాద్, లక్నోలు ఇందులో ఉన్నాయి. పంజాబ్‌లోని లూథియానా, ఖన్నా నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. వెనకబాటుతనం పోవడం, ఉపాధి అవకాశాలు పెంపొందడం, సౌకర్యాలు పెరగడం...ఆ క్రమంలో పట్టణాలు, నగరాలు ఏర్పడటం ఆహ్వానించదగ్గదే. ఉపాధి కల్పనవల్ల ప్రజల జీవనప్రమాణాలు పెరుగుతాయి. విద్య, వైద్యం, పౌష్టికాహారం మెజారిటీ ప్రజలకు అందుబాటులోకొస్తాయి. మంచిదే.

కానీ ఈ క్రమంలో నిర్దిష్టమైన ప్రణాళిక, ముందుచూపు అవసరమవుతాయి. సర్వస్వం ఒకేచోట కేంద్రీకరిస్తే నలు మూలలనుంచీ అక్కడికి వలసలు మొదలవుతాయి. పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమైతే అది ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది. మురికివాడలు విస్తరించడం, ప్రజారోగ్యం చిక్కుల్లో పడటం, నేర సంస్కృతి పెరగడంలాంటి  దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఇందుకు భిన్నంగా నగరాలు, పల్లెసీమల మధ్య అంతరాలు తగ్గించడానికి ప్రయత్నిస్తే, గ్రామాల్లోనే తగిన ఉపాధి అవకాశాలను కల్పిస్తే నగరాలపై ఒత్తిడి తగ్గుతుంది. కానీ పాలకులు ఈ విషయంలో చేసిన తప్పే చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధానాలు, చేతివృత్తులకు తోడ్పాటునీయకపోవడం వంటివి నగరాలకు వలసలను పెంచుతున్నాయని గుర్తించడం లేదు. కాస్తో కూస్తో సంపాదించుకోవాలన్నా, పూట గడవాలన్నా వలస పోవడం తప్ప మార్గం లేదని పలువురు భావించే పరిస్థితులు కల్పిస్తున్నారు.

ప్రపంచ జనాభాలో సగానికి పైగా...అంటే 54 శాతం నగరాలు, పట్టణాల్లోనే నివశిస్తున్నదని ఐక్యరాజ్యసమితి ఆమధ్య ప్రకటించింది. ఇది అంతకంతకూ పెరుగుతుందని కూడా అంచనా వేసింది. దీన్ని అరికట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయని కూడా చెప్పింది. కానీ వినేవారెవరు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందించిన ప్రణాళికలను చూస్తే భవిష్యత్తులో మరో కాలుష్య నగరం ఆవిర్భవించబోతున్నదని సులభంగానే చెప్పవచ్చు. అభివృద్ధిని అక్కడే కేంద్రీకరించి, ఉపాధి కోసం జనమంతా ఆ నగరానికి చేరుకోక స్థితిని కల్పించడం మంచిది కాదని ఆయనకు అర్ధం కావడం లేదు. ఇందువల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల్లో ఏర్పడే అసంతృప్తి మాట అటుంచి ఆరోగ్యకరమైన వాతా వరణం కాస్తా కాలుష్యమయం అవుతుందని ఆయన గుర్తించడం లేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక అందరి కళ్లూ తెరిపించాలి. నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిస్తే సొంత వాహనాల వాడకం తగ్గుముఖం పడుతుంది. కాలుష్య కారక పరిశ్రమలనూ, వాహనాలనూ గుర్తించి చర్యలు తీసుకునే పటిష్టమైన నిఘా వ్యవస్థ కూడా పరిస్థితిని గణనీయంగా మెరుగు పరుస్తుంది. పది లక్షలకు పైబడిన జనాభా ఉన్న నగరాల్లో జాతీయ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ)లను ఏర్పాటు చేయడం హర్షించదగిందే. అయితే ఆ గణాంకాలను విశ్లేషించి మరెలాంటి చర్యలు అవసరమవుతాయో ఎప్పటికప్పుడు మదింపు వేయడం, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఆ దిశగా ప్రభుత్వాలన్నీ కదలాలని జనం కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు