మళ్లీ అదే తీరు!

3 Jul, 2019 02:02 IST|Sakshi

యధాప్రకారం ముంబై మళ్లీ కుంభవృష్టిలో చిక్కుకుంది. దశాబ్దకాలంలో కనీవినీ ఎరుగని స్థాయిలో పడిన భారీ వర్షంతో ఆ మహా నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. 28మంది మృత్యు వాత పడటం, రోడ్లపై గంటలతరబడి ట్రాఫిక్‌ స్తంభించిపోవడం, మెట్రో రైళ్ల దారంతా వరద నీటితో నిండటం, వందలాది విమానాలు రద్దు కావడం గమనిస్తే బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరే షన్‌(బీఎంసీ) గతానుభవాలనుంచి ఏమీ నేర్చుకోలేదని అర్ధమవుతుంది. ఏటా వర్షాకాలంలో ముంబైకి ఈ వరదకష్టాలు తప్పడం లేదు. ముంబై నగరవీధుల నుంచి తాము తోడిపోసిన నీరు మూడు సరస్సుల నీటితో సమానమని అధికారులు చెబుతున్నారంటే ఆ నగరం ఎంత గడ్డు స్థితిలో ఉందో తెలుస్తుంది. జూన్‌ నెల మొత్తం కురవాల్సిన వర్షంలో 85 శాతం కేవలం నాలుగు రోజుల్లో పడిందని వాతావరణ విభాగం చెబుతోంది. భారీవర్షం పడినప్పుడు వరద నీరంతా పోవడానికి వీలుగా డ్రెయినేజీ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని బీఎంసీ ఏడాది క్రితం ప్రకటించింది. అందు కోసం దాదాపు రూ. 1,600 కోట్ల వ్యయం చేసింది. కానీ చివరికి ఫలితం మాత్రం ఎప్పటిలానే ఉంది.

ఒకపక్క చెన్నై మహానగరం గొంతెండి దాహార్తితో అలమటిస్తోంది. సరిగ్గా అదే సమయానికి పడమటి దిక్కునున్న ముంబై మహానగరం పీకల్లోతు వరదనీటిలో చిక్కుకుని బిక్కుబిక్కుమని కాలం గడుపుతోంది. ఈ రెండు సమస్యలకూ మూలం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల్లోనే ఉంది. నగరాల్లో ఆకాశహర్మ్యాలుంటాయి. వేలాదిమందికి ఉపాధి కల్పించే భారీ సంస్థలుంటాయి. విశాలమైన రోడ్లు, వాటిపై దూసుకుపోయే కార్లుంటాయి. ఇవి మాత్రమే నగరానికి ఆనవాళ్లని చాలా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కానీ అవి సురక్షితంగా ఉండాలంటే వాటికి సమీపంలో చెరువులు, సరస్సులుండాలి. కురిసే వర్షాన్నంతా అవి ఇముడ్చుకోగలగాలి.  చెట్లు, తుప్పలు, గడ్డి వగైరాలు కనబడాలి. ఇవన్నీ నగర కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. వాతావరణ సమతుల్య తను కాపాడతాయి. భూగర్భ జలవనరులను పెంచుతాయి. వీటన్నిటినీ ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తే నగరాల్లో ఇంతచేటు వేసవి తాపం ఉండదు. అంతేకాదు, కురిసే నీరు నేలలోకి ఇంకేందుకు వీలుండాలి. కానీ నగరాలన్నీ సిమెంటు రోడ్లతో నిండిపోతున్నాయి. ఎక్కడికక్కడ భారీ భవనాలు నిర్మాణమవుతున్నాయి.

వీటి సంగతలా ఉంచి ఉపాధి నిమిత్తం, చదువుల కోసం, ఇతరత్రా అవ కాశాల కోసం జనమంతా నగరాలవైపు చూడక తప్పనిస్థితి కల్పించినప్పుడు వారికి అవసరమైన పౌర సదుపాయాలన్నీ అందుబాటులోకి తీసుకురావాలి. సురక్షితమైన మంచినీరు లభ్యమయ్యేలా చూడటం, మురుగునీటి వ్యవస్థ, చెత్త తొలగింపు ఈ సదుపాయాల్లో కీలకం. చెత్త తొలగింపు అనేది నగరాలను ఇప్పుడు పట్టిపీడిస్తున్న సమస్య. ప్రస్తుతం ముంబై వరదనీటిలో చిక్కుకోవడానికి ప్రధాన కారణం కూడా ఈ చెత్తేనని అధికారులు చెబుతున్నారు. జనం వాడి పారేసిన ప్లాస్టిక్‌ సీసాలు, సంచులు వగైరాలు డ్రైనేజీ వ్యవస్థకు పెద్ద అవరోధంగా నిలిచాయని వారు చెబుతున్న మాట. నగరాన్ని వరదలు ముంచెత్తడానికి కురిసిన వాన నీరంతా సక్రమంగా పోయే దోవ లేక పోవడమేనని ఇప్పుడు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. నగరంలో ప్లాస్టిక్‌ సంచులు, సీసాలు ఉత్పత్తిని, వినియోగాన్ని నిరోధించి వాటి స్థానంలో పర్యావరణహితమైన ఇతర ప్రత్యా మ్నాయాలను ఇన్నేళ్లుగా అమల్లోకి ఎందుకు తీసుకురాలేకపోయారో పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. శివారు ప్రాంతాల్లో డంపింగ్‌ యార్డులు పెట్టి అక్కడ చెత్తను పారబోయడం పరి ష్కారం కాదు. ఆ చెత్తను రీసైక్లింగ్‌ చేసుకుని, తిరిగి వినియోగించగలిగే వ్యవస్థలు రూపొందించాలి.

ముంబైలోని విరార్, జుహూ, మలాద్, గోరెగావ్, పోవై, అంధేరి, బొరివ్లీ, శాంతాక్రజ్, చెంబూర్, వొర్లి, పణ్వేల్, ఠాణే వంటి ప్రాంతాలు నడుంలోతుకు మించిన వరదనీటితో విల విల్లాడాయి. భారీ వర్షాలు ముంచెత్తిన ప్రతిసారీ ఈ ప్రాంతాల్లో ఇదే దుస్థితి. కాస్త ముందు చూపు ఉండి, ఏ ఏ ప్రాంతాలను తరచు వరద నీరు ముంచెత్తుతున్నదో గమనించి, ఆ నీరంతా పోవడానికి అనువైన కాల్వలను ఏర్పాటు చేస్తే సమస్య తలెత్తదు. కానీ ఆ పనులేవీ సక్రమంగా సాగటం లేదు. ముంబైలో కురిసిన వాన నీరంతా అటు సముద్రంలోగానీ, దానికి ఆనుకుని ఉన్న మహుల్, మహిం, ఠాణే కయ్యల్లోగానీ కలుస్తుంది. కొంత నీరు మిథి నదిలో కలుస్తుంది. మిథి తీరంలో అక్రమ కట్టడాలు పెరిగి, దాని దోవ కుంచించుకుపోవడంతో  వరదనీరు పట్టాలపైకి చేరుతోంది. ఫలితంగా ప్రతిసారీ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

 వర్షాకాలంలో ఈ మహానగరం ఎందుకిలా తల్లడిల్లుతున్నదో ముంబై ఐఐటీ, గాంధీనగర్‌ ఐఐటీ బృందాలు అధ్యయనం చేశాయి. వివిధ రకాల చర్యలను సూచిస్తూ నివేదికలిచ్చాయి. కానీ వాటిని అమలు చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వమూ, బీఎంసీ కూడా విఫలమయ్యాయి. నిజానికి రెవెన్యూపరంగా చూస్తే దేశంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లన్నిటికంటే బీఎంసీ రాబడే అధికం. కానీ సమర్ధవంతమైన ప్రణాళికలు రూపొందించుకుని నగరాన్ని తీర్చిదిద్దడంలో ఆ సంస్థ పదే పదే విఫలమవుతోంది. మన పొరుగునున్న చైనాలో నగరాలు ఇలా తరచు వరదల వాతబడుతున్న తీరుచూసి ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ 2013లో ఒక ప్రణాళిక ప్రకటించారు. చుక్క నీరు కూడా వృథా కాని రీతిలో కురిసిన వర్షం నీటినంతటినీ ఒడిసిపట్టాలని, అదంతా ఇముడ్చుకోవడానికి అనువైన సరస్సులు, చెరువులు నగరాల వెలుపల ఉండాలని, మురుగునీరు పునర్వినియోగానికి అవసరమైన సహజ విధానాలు అమలుకావాలని ఆదేశించారు. అయిదారేళ్లు గడిచాక చూస్తే ఆ నగరాలు అన్నివిధాలా మెరుగ్గా మారాయి. సంకల్పం ఉంటే సాధించలేనిదంటూ ఉండదు. అది కొరవడటం వల్లే మన దేశంలో ముంబైకి, చెన్నైకి, అనేక ఇతర నగరాలకూ తరచుగా ఈ ఈతిబాధలు! 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాక్‌కు ఎదురుదెబ్బ

దుర్వినియోగానికి తావీయొద్దు

పరిష్కారం అంచుల్లో కర్ణాటకం

ఏపీకి ‘నవరత్నాల’ హారం

అన్నదాతకు ఆసరా ఎలా?

జనం చూస్తున్నారు...జాగ్రత్త!

మళ్లీ ‘రాజద్రోహం’

‘రాజన్న రాజ్యం’ లక్ష్యంగా...

గ్రామీణంవైపు అడుగులు

ఆశల సర్వే!

ఎట్టకేలకు...

అత్యంత అమానుషం

అమెరికా ఒత్తిళ్లు

మంచంపట్టిన ప్రజారోగ్యం

‘మూకదాడుల’ బిల్లు జాడేది?

విలక్షణ పాలనకు శ్రీకారం

మమత ‘మందుపాతర’

నెరవేరిన జలసంకల్పం

జమిలి పరీక్ష

కీలెరిగి వాత

పసితనంపై మృత్యుపంజా

ఇంత దారుణమా!

వికటించిన మమతాగ్రహం

అట్టుడుకుతున్న హాంకాంగ్‌

దౌత్యంలో కొత్త దారులు

జన సంక్షేమమే లక్ష్యంగా...

సరైన తీర్పు

విదేశీ ‘ముద్ర’!

ఆర్‌బీఐ లక్ష్యం సిద్ధిస్తుందా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌