చెల్లని ‘బహిష్కరణ’

19 Apr, 2018 00:25 IST|Sakshi

కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌.ఏ. సంపత్‌కుమార్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ గత నెల 13న తెలంగాణ శాసనసభ తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు సహజంగానే సంచలనం సృష్టించింది. ఆ శాసనసభ్యులిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ, అలంపూర్‌ స్థానాలు ఖాళీ అయినట్టు జారీ అయిన ప్రక టనను రద్దు చేయడంతోపాటు, వారి సభ్యత్వాలను కూడా హైకోర్టు పున రుద్ధరించింది. ఈ తీర్పు లోతుపాతులు, దాని పర్యవసానాలేమిటన్న విచికిత్స కన్నా ముందు హైకోర్టును ఒకందుకు అభినందించాలి. తమకు అన్యాయం జరి గిందని ఆశ్రయించిన శాసనసభ్యులకు సత్వర న్యాయం కలగజేయడానికి న్యాయ స్థానం కృషి చేసింది. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణకు దారితీసిన పరిస్థితులు దురదృష్టకరమైనవి. ప్రజాస్వామ్యప్రియులను కలవరపెట్టేవి. అసెంబ్లీ, శాసనమండలి ఉమ్మడి సమావేశాన్నుద్దేశించి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్, ఇతర పక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అంతవరకూ అభ్యంతరపెట్టాల్సిందేమీ లేదు. రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యలను గవర్నర్‌ ప్రసంగం విస్మరించిందనుకున్నప్పుడు నిరసనలు వ్యక్తం చేయడం మామూలే. కానీ ఆనాటి నిరసన కట్టు తప్పింది. నిరసన వ్యక్తం చేస్తున్నవారివైపు నుంచి హెడ్‌ ఫోన్‌ సెట్‌ పడగా అది శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలింది. దీన్ని అధికార టీఆర్‌ఎస్‌ తీవ్రంగా తీసుకుంది. ఆ మర్నాడు ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డిసహా 11మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బడ్జెట్‌ సమా వేశాలు ముగిసేవరకూ సస్పెండ్‌ చేయడంతోపాటు కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరిస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడం, అది ఆమోదం పొందడం అయింది.

మన చట్టసభల్లో సర్వసాధారణంగా అధికార పక్షం ఏమనుకుంటే అదే జరుగుతుంది. అంతమాత్రాన ఏదైనా అనుకోవడం, దాన్ని అమలు చేయడానికి పూనుకోవడం సరైంది కాదు. ఏ నిర్ణయమైనా విచక్షణాయుతంగా ఉండాలి. హేతుబద్ధమైనదన్న భావన అందరిలో కలగాలి. ఇప్పుడు చట్టసభల కార్య కలాపాలు ప్రత్యక్ష ప్రసారమవుతున్నాయి. ఎవరేం మాట్లాడుతున్నారు... ఎవరి ప్రవర్తనెలా ఉన్నదన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు హేతుబద్ధంగా ఉన్నారో, ఎవరు పిడివాదం చేస్తున్నారో సులభంగా విశ్లేషించుకుంటున్నారు. అందువల్ల చట్టసభల్లో చర్చలైనా, విమర్శలైనా నిర్మాణాత్మకంగా ఉండాలి. సభ్యుల వ్యవహారశైలి హుందాగా ఉండాలి. సభ తీసుకునే నిర్ణయాలు సహే తుకంగా అనిపించాలి. బహిష్కరణ వంటి తీవ్ర నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత సభ్యులకు నోటీసులిచ్చి, వారి అభిప్రాయాలను కూడా వింటే ఉంటే వేరుగా ఉండేది. అలా జరగకపోవడంతో తమపై అకారణంగా బహిష్కరణ వేటు వేశారని కోమటిరెడ్డి, సంపత్‌లు చేస్తున్న ఆరోపణలకు విలువ పెరిగింది. స్వామి గౌడ్‌కు అసలు గాయమే కాలేదని వారు వాదిస్తున్నారు. ఆ ఫుటేజ్‌ ఉంటే బహి ర్గతం చేయమని సవాలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జవాబు చెప్పకపోగా... హైకోర్టు అడిగినప్పుడు తత్తరపడటం, పరస్పర విరుద్ధమైన వాదనలు చేయడం... చివరకు అడ్వొకేట్‌ జనరల్‌ రాజీనామా బహిష్కృత ఎమ్మెల్యేల వాదనకు బలం చేకూర్చాయి. ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు ఫుటేజ్‌ విడుదల చేస్తే తమ ఎమ్మెల్యే ప్రవర్తన ఎలా ఉన్నదో, దాని పర్యవసానమేమిటో జనం చూస్తారు. అంతిమంగా అది ప్రభుత్వానికే లాభిస్తుంది. ఫుటేజ్‌ విడుదలపై నిర్ణయించాల్సింది శాసనసభే తప్ప తాము కాదని ప్రభుత్వం చెప్పడం... సభేమో మౌనంగా ఉండిపోవడం ఎవరి ప్రతిష్టనూ పెంచదు.

మన రాజ్యాంగం న్యాయ, కార్యనిర్వాహక, శాసనవ్యవస్థలకు పరిధుల్ని నిర్దేశించింది. ఒకదాని పరిధిలోకి మరొకటి జొరబడరాదని స్పష్టంగా చెప్పింది. అది వ్యవస్థల మధ్య సంఘర్షణను నివారించడానికి, రాజ్యాంగ పాలన సజావుగా సాగడానికే తప్ప ఆ పరిధులను చూపించి ఏ వ్యవస్థకా వ్యవస్థ తప్పించుకు తిరగడానికి కాదు. కానీ ఆచరణలో జరుగుతున్నది అదే. ఎలాంటి విమర్శలనైనా పట్టించుకోకుండా బండబారినట్టుండటం లేదా దబాయించడం కార్యనిర్వాహక వ్యవస్థ ఒక కళగా అభివృద్ధి చేసుకుంది. ఇక శాసనవ్యవస్థ తీరు విస్తుగొలిపేదిగా తయారైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత నాలుగేళ్లకాలంలో జోరుగా సాగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులే ఇందుకు నిదర్శనం. పార్టీ మారిన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయొచ్చునని ఫిరాయింపుల నిరోధక చట్టం స్పష్టంగా చెబుతున్నా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పట్టనట్టు వ్యవహరిస్తారు. పార్టీల నుంచి ఫిర్యాదులంది ఏళ్లు గడుస్తున్నా వాటి సంగతి తేల్చరు. ఫిరాయింపుదార్లకు మంత్రి పదవులు కట్టబెడుతున్నా వారికేమీ అనిపించదు. చిత్రమేమంటే ఫిరాయింపు ఎంపీల విషయంలో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సైతం మౌనంగా ఉండి పోతున్నారు. చట్టసభల ప్రత్యక్ష ప్రసారాల్లో స్పీకర్ల తీరు... ముఖ్యంగా ఉద్రి క్తతలు, గందరగోళస్థితి ఏర్పడినప్పుడు ఓపిగ్గా సభ్యులకు నచ్చజెప్పడం, ఉద్రిక్తతలు నివారించడం గమనిస్తే ముచ్చటేస్తుంది. ఇలాంటివారికి ఫిరాయింపు జరిగిందో లేదో తేల్చడం ఎందుకంత కష్టమనిపిస్తున్నది? న్యాయవ్యవస్థ నిల దీసినప్పుడు దాన్ని జోక్యం చేసుకోవడంగా భావించే శాసనవ్యవస్థ తన బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నట్టు? పరిధుల గురించి, అధికారాల గురించి, తమ స్వతంత్రత గురించి పట్టుబట్టే వ్యవస్థలు... అవి రాజ్యాంగం ద్వారా సంక్ర మించాయే తప్ప గాల్లోంచి ఊడిపడలేదని గుర్తించాలి. వాటి సారాంశం ప్రజా స్వామిక వ్యవస్థ పటిష్టతేనని తెలుసుకోవాలి. ఆ ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలి. సామాన్యులకే సహేతుకమనిపించని నిర్ణయాలు తీసుకుని లేదా నిర్ణయరాహి త్యాన్ని ప్రదర్శించి తమనెవరూ ప్రశ్నించవద్దంటే చెల్లదు.

మరిన్ని వార్తలు