ఫీజుల బాదుడు సరికాదు

19 Mar, 2016 01:05 IST|Sakshi
ఫీజుల బాదుడు సరికాదు

ఉన్నత విద్య క్రమేపీ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఐఐటీల్లో ఇప్పుడు వసూలు చేసే వార్షిక ఫీజును మూడు రెట్లు పెంచాలని ఐఐటీ మండలికి చెందిన స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. మండలి చైర్‌పర్సన్‌గా ఉన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

2013లో అప్పటికి రూ. 50,000గా ఉన్న వార్షిక రుసుమును రూ. 90,000కు పెంచారు. దీన్ని మూడు రెట్లకు...అంటే ఏడాదికి రూ. 3,00,000కు పెంచాలన్నది మండలి సిఫార్సు సారాంశం. దేశంలో ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి నంతవరకూ అత్యుత్తమ శ్రేణి విద్యా సంస్థలు ఐఐటీలే. బ్రిటిష్ పాలకుల కాలంలో నెలకొల్పిన ఇంజనీరింగ్ కళాశాలలు దేశ అవసరాలకు అనుగుణంగా లేవని గుర్తించిన కారణంగానే ఐఐటీలకు అంకురార్పణ చేశారు. అయితే అంతకు చాలా ముందే 1945లో బ్రిటిష్ పాలన ఇంకా కొనసాగుతుండగానే ‘యుద్ధానంతర పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన సాంకేతిక సిబ్బందిని సమకూర్చే లక్ష్యంతో ఉన్నత సాంకేతిక విద్యా సంస్థలను నెలకొల్పడం కోసం’ సిఫార్సులు చేసేందుకు ఎన్‌ఆర్ సర్కార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటుచేశారు.

ఈ కమిటీ 1948లో తన నివేదికను సమర్పించింది. ఎంఐటీ స్థాయి విద్యా సంస్థల్ని దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని అది సిఫార్సు చేసింది. ఐఐటీలకు బీజం అక్కడుంది. ఖరగ్‌పూర్ ఐఐటీకి కెనడా, చెన్నై ఐఐటీకి ఆనాటి పశ్చిమ జర్మనీ, కాన్పూర్ ఐఐటీకి అమెరికా, బాంబే ఐఐటీకి ఆనాటి సోవియెట్ యూనియన్ అన్నివిధాలా సాయం అందించి వాటి ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి.

ఇలా అంకురించిన ఐఐటీలు కాలక్రమంలో విస్తరించాయి. 1994 నాటికి దేశంలో ఏడు ఐఐటీలుండగా ఇప్పుడవి 23కు చేరుకున్నాయి. అంటే దాదాపు రాష్ట్రానికొకటి చొప్పున ఉన్నట్టు లెక్క. ఈ ఆరున్నర దశాబ్దాల చరిత్రను తిరగేస్తే మన ఐఐటీలకు గర్వించదగిన చరిత్రే ఉంది. అందులో చదువుకున్నవారు భిన్న రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మొదలుకొని రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత గవర్నర్ రఘురాంరాజన్ వరకూ వారిలో ఎందరో ఉన్నారు. వాణిజ్య, రాజకీయ, సామాజిక సేవారంగాల్లో ఇప్పుడు మార్మోగే పేర్లలో ఐఐటీ పూర్వ విద్యార్థుల సంఖ్యే అధికం.

నిరుడు తొలిసారిగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ప్రపంచస్థాయి అత్యుత్తమశ్రేణి విద్యా సంస్థల జాబితాలో ఢిల్లీ ఐఐటీకి చోటు దక్కింది. పేరు ప్రఖ్యాతులొచ్చిన ఐఐటీలకు అంత సులువుగా ఆ ఖ్యాతి దక్కలేదు. దాని వెనక అనేక మంది విద్యావేత్తల మేధో శ్రమతోపాటు మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు అవసరమైన వనరులన్నీ వాటికి అందు బాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వమూ, అనేక పారిశ్రామిక సంస్థల పాత్ర కూడా ఉంది. ఈ విద్యా సంస్థలు సాధిస్తున్న విజయాలను గమనించి సహజంగానే  తమ దగ్గర కూడా ఐఐటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు బయల్దేరాయి. దురదృష్టవ శాత్తూ పాలకులుగా ఉన్నవారు అలాంటి డిమాండ్లను రాజకీయ కోణంలో మాత్రమే ఆలోచిస్తున్నారు. తీరుస్తున్నారు.

ఫలితంగా ఐఐటీల సంఖ్య పెరిగింది తప్ప నాణ్యత నాసిరకంగానే ఉంటున్నది. అవసరమైన అధ్యాపక బృందాన్నీ, పరిశోధనలకు వీలుగా మౌలిక సదుపాయాలనూ, వీటన్నిటి నిర్వహణకూ ఆర్థిక వనరులనూ కల్పించకుండా ఐఐటీలు ఏర్పాటు చేస్తూ పోతే లాభమేమిటి? వాటిని చూపించి పుట్టగొడుగుల్లా కోచింగ్ సంస్థలు పుట్టుకు రావడం మినహా, విద్యార్థుల్ని నిలువుదోపిడీ చేయడం మినహా మరే ప్రయోజనమూ కలిగిన దాఖలాలు లేవు.

చెప్పాలంటే ఎంతో పేరుప్రఖ్యాతులు గడించిన ఐఐటీలే ఇటీవలికాలంలో పలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. అధ్యాపక ఖాళీలు దాదాపు 43 శాతం వరకూ ఉన్నాయి. పాత ఐఐటీల్లోని అధ్యాపకులే కొత్త ఐఐటీల బోధనలో పాలుపంచుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో అధ్యాపకులకు కలిగే మానసిక ఒత్తిడి...పరిశోధనల్లో, సృజనలో అది కలిగించే ప్రభావం వగైరాల సంగతి ఎవరూ చూడటం లేదు. ఐఐటీల్లో పరిశోధనలకు అవసరమైన అన్ని సదుపాయాలనూ కల్పిస్తేనే ఆ రంగంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. భారీయెత్తున సాగే పరిశోధనలే అంతిమంగా నిపుణులైన శాస్త్రవేత్తలతోపాటు మెరికల్లాంటి అధ్యాపకుల్ని రూపొందిస్తాయి. ఆర్ధిక వనరుల కొరత పేరుతో పరిశోధనలకు గండి కొడితే ఇతరేతర నష్టాల మాట అటుంచి ఐఐటీలు ఎప్పటికీ అధ్యాపకుల కొరతతో సతమతమవుతాయి.

ఉన్నత విద్యారంగంపట్ల పాలకులు అనుసరించే వైఖరి ఆ రంగం ఎదుగు దలకు శాపంగా మారింది. ప్రస్తుతం వివిధ ఐఐటీల్లో 80,000మంది విద్యార్థులు చదువుకొంటుండగా ఐఐటీల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు వగైరాలకు ఏడాదికి రూ. 2,500 కోట్లు వ్యయమవుతున్నదని ఒక అంచనా. ఒక్కో ఐఐటీ విద్యార్థికి నాలుగేళ్ల డిగ్రీ కోర్సుకు ప్రభుత్వం పెట్టే ఖర్చు రూ. 14 లక్షలు కాగా, వారినుంచి ఇప్పుడు వసూలు చేస్తున్నది రూ. 3.6 లక్షలు మాత్రమేనని కొందరనే మాట నిజమే కావొచ్చు.

అయితే అది దేశ పురోగతికి, సామాజికాభివృద్ధికి ఈ సమాజం పెట్టాల్సిన పెట్టుబడి. దాన్ని విస్మరించి ఫీజులు పెంచితే నిరుపేద, అట్టడుగు వర్గాల పిల్లలకు ఐఐటీల వంటి ఉన్నతశ్రేణి సంస్థల తలుపులు మూసినట్టే అవుతుంది. పెంచిన ఫీజులు చెల్లించడానికి వీలుగా వారికి రుణాలిప్పిస్తామని చేసే వాదనలో పసలేదు. అలాంటి చర్య వారిని అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తుంది. ‘మంచి వేతనాల’ అన్వేషణలో విదేశాలకు వలసపోయేలా చేస్తుంది.

యూపీఏ హయాంలో నియమించిన కాకోద్కర్ కమిటీ ఉన్నత విద్యా సంస్థలు ప్రభుత్వమిచ్చే నిధులతో కాక సొంత వనరులతో ఎదగాలని సూచించింది. ఇప్పుడు ఐఐటీ మండలి చేసిన ఫీజుల పెంపు సిఫార్సు కూడా ఆ దిశగా వేసే అడుగే. దీన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే సామాన్యులకు ఉన్నత విద్య భారంగా మారుతుంది.

మరిన్ని వార్తలు