ఎటూ తేల్చని కర్ణాటక!

16 May, 2018 01:59 IST|Sakshi

ఈ ఏడాది చివరిలో జరగబోయే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకూ... వచ్చే సార్వత్రిక ఎన్నికలకూ రిహార్సల్‌ అనదగ్గ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు సర్వేలన్నీ కోడై కూసినట్టు చివరకు హంగ్‌ అసెంబ్లీ తప్పలేదు. ఈ ఎన్నికల్లో ఓటర్లు అన్ని పార్టీలకూ సమానంగా చుక్కలు చూపించారు. ఓట్ల లెక్కింపు సమయంలో క్షణక్షణానికీ పార్టీల తలరాతలు తారు మారవుతున్న తీరు గమనించి కాకలు తీరిన నేతలే గందరగోళంలో మునిగిపోయారు. ఎన్నికల ప్రచార ఘట్టంలో ప్రభుత్వ వ్యతిరేక పవనాల జాడలు పెద్దగా కనబడకపోయినా కాంగ్రెస్‌కు రెండో స్థానమే రాసిపెట్టి ఉందని మంగళవారం ఓట్ల లెక్కింపు మొదలైన కొన్ని గంటల్లోనే తేలిపోయింది. కానీ విస్పష్టమైన మెజారిటీ 112 స్థానాలకు సునాయాసంగా చేరుతుందనుకున్న బీజేపీ చివరాఖరికి 104 స్థానాల దగ్గర నిలిచిపోయింది. హంగ్‌ అసెంబ్లీ వచ్చినపక్షంలో ‘కింగ్‌ మేకర్‌’ కాగలదనుకున్న జనతాదళ్‌(సెక్యులర్‌) 37 స్థానాలే లభించినా కాంగ్రెస్‌ ఇచ్చిన బేషరతు మద్దతుతో ప్రభుత్వానికి సారథ్యంవహించేందుకు సిద్ధపడుతోంది. కానీ ఆ పార్టీ ఏకశిలా సదృశంగా లేదు. పార్టీ అగ్ర నాయకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ వర్గం, ఆయన కుమారులు రేవణ్ణ, కుమార స్వామిలకు చెరో వర్గమూ ఉన్నాయి. ఒకే గొడుగు కింద ఉన్నా ఇలా మూడు ముక్కలాటగా జేడీ (ఎస్‌) రాజకీయం నడుస్తోంది. ఇప్పుడు అందరి కళ్లూ రాజ్‌భవన్‌నే చూస్తున్నాయి. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో కర్ణాటకలో బీజేపీ సాధించిన విజయం ‘అసమానమైనదీ, అసాధారణమైనదీ’ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడాన్ని గమనిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీ కర్ణాటకను చేజారనీయదని, ఏం చేసైనా దాన్ని తన ఖాతాలో వేసు కుంటుందని స్పష్టంగా అర్ధమవుతోంది. గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ఎదురైన చేదు అనుభవాల పర్యవసానంగా ఈసారి కాంగ్రెస్‌ చురుగ్గా కదిలింది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ‘బీ’ టీమ్‌గా అభివర్ణించిన జేడీ(ఎస్‌) వద్దకు హుటాహుటీన సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్‌ గెహ్లాట్‌లను పంపింది. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని గవర్నర్‌ వజుభాయ్‌ వాలా చెబుతున్నారు గనుక కర్ణాటక ఉత్కంఠకు వెంటనే తెరపడే అవకాశం లేదు. ఆయన ఏకైక పెద్ద పార్టీ బీజేపీకి తొలి అవకాశం ఇస్తారా, ఎన్నికల అనంతరం కుదిరిన పొత్తులను పరిగణనలోకి తీసుకుం టారా అన్నది తేలాల్సి ఉంది. గోవా, మణిపూర్, మేఘాలయల్లో ఎన్నికల అనంతర పొత్తుల్ని పరి గణనలోకి తీసుకుని అక్కడి గవర్నర్లు బీజేపీ భాగస్వామ్యం ఉన్న కూటములకు అధికారం కట్టబెట్టారు.

 ఈ ఫలితాలు ఒకవిధంగా ఆశ్చర్యకరమైనవే. 104 స్థానాలతో అగ్ర స్థానంలో ఉన్న బీజేపీకి పోలైన ఓట్లలో 36.2 శాతం రాగా, 78 స్థానాలతో ఆ పార్టీకి చాలా దూరంగా రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు లభించాయి. అంటే బీజేపీకంటే కాంగ్రెస్‌కే 1.8 శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండుచోట్ల పోటీచేయగా సొంత నియోజకవర్గం చాముండేశ్వరిలో భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. గెలిచిన బాదామి నియోజకవర్గంలో స్వల్ప మెజారిటీ లభించింది. అంతేకాదు... ఆయన మంత్రివర్గ సహచరుల్లో 16మంది ఓడిపోయారు. నామమాత్రమే కావొచ్చుగానీ... కాంగ్రెస్‌ జాతీయ పార్టీ గనుక అభ్యర్థుల ఎంపిక విషయంలో సిద్ధ రామయ్యకు స్వేచ్ఛ లేదు. ఆయనకు ఇష్టమున్నా లేకున్నా దాదాపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు లభించాయి. బహుశా ఇది కొంప ముంచి ఉండొచ్చు. స్థానిక నాయకత్వాన్ని ఎదగనీయక పోవడం, ఎవరైనా బలం పుంజుకుంటున్నారని అనుమానం వస్తే పార్టీలో వారి వ్యతిరేకులకు ప్రోత్సాహమీయడం రివాజు. ఇలాంటివన్నీ సిద్ధరామయ్య ఉన్నంతలో అధిగమించి పాలనలో సమర్ధుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన వెనక పటిష్టమైన పార్టీ లేదు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రచార సభల వల్ల ఆయనకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఈసారి రాహుల్‌ ఎక్కువ ప్రచారసభల్లో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో మెజారిటీ లభిస్తే తానే ప్రధానినవుతానన్న ఆయన ప్రకటన పార్టీకి శిరోభారమైందన్న అభిప్రాయం ఉంది. ఇక లింగాయత్‌లను మైనారిటీ మతంగా పరిగణించాలన్న సిఫార్సు సైతం ఆ పార్టీకి పెద్దగా లాభించినట్టు లేదు. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం విషయంలో చెలరేగిన ఉద్యమం ఆ వర్గాల్లో పార్టీని పటిష్టపరచలేకపోయింది.

నిజానికి ప్రచార ఘట్టం తొలి దశలో కాంగ్రెస్‌ ముందంజలో ఉన్న ఛాయలు కనబడ్డాయి. అయితే నరేంద్ర మోదీ రంగంలోకి దిగాక ఇదంతా మారింది. బీజేపీ వ్యతిరేకత సన్నగిల్లింది. కానీ ఇది ఆ పార్టీని స్పష్టమైన విజేతగా నిలబెట్టలేకపోయింది. కానీ ఆ పార్టీ లక్ష్యం ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’ మాత్రం నెరవేరింది. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పుదుచ్చేరి, పంజాబ్‌ మినహా ఎక్కడా కాంగ్రెస్‌ విజయం సాధించలేకపోయింది. ఏకైక పెద్ద పార్టీగా అవతరించినచోట సైతం అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. నరేంద్రమోదీ– అమిత్‌ షాల నాయకత్వంలోని బీజేపీని ఢీకొనే సత్తా రాహుల్‌గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్‌కు లేదని తాజా ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. బీజేపీని ఎదిరించగలనన్న ధీమాతో అది ఒంటరిగా బరిలో నిలిచి తాను లాభపడకపోగా ఇతర పార్టీల విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఆదరాబాదరాగా జేడీ(ఎస్‌)కు సన్నిహితం కావడానికి ప్రయ త్నించిన కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఆ పార్టీతో పొత్తుకు సిద్ధపడితే రెండూ లాభపడేవి. ఇరు పార్టీలకూ కలిసి 54 శాతం ఓట్లు లభించేవి. కర్ణాటకలో బీజేపీకి ఉన్నంతలో అడ్డుకట్ట వేయ గలిగానన్న తృప్తి ఒక్కటే కాంగ్రెస్‌కు మిగిలింది. జాతీయ పార్టీగా తన పాత్ర ముగిసిందని, ప్రాంతీయ పార్టీలతో కలిసి నడిస్తేనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన ఉనికి మిగులుతుందని ఆ పార్టీ గుర్తించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు