ఐసీయూలో ఆస్పత్రులు

16 Sep, 2015 00:25 IST|Sakshi

మారుమూల పల్లెటూళ్లు మొదలుకొని దేశ రాజధాని న్యూఢిల్లీ వరకూ ఆస్పత్రులన్నీ ఒక్క తీరుగానే ఉన్నాయి. అవి సాధారణ పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్య విధ్వంసం ఏ స్థాయిలో జరుగుతున్నదో, అందులో సామాన్యులెలా సమిథలవుతున్నారో ‘సాక్షి’ ఈ నెల 7వ తేదీనుంచి ఆరు రోజులపాటు వెలువరించిన ధారావాహిక కథనాలు కళ్లకు కట్టాయి. సర్కారు దవాఖానాలు నిలువెల్లా చీడపట్టి రోగులకు ఏ స్థాయిలో నరకాన్ని చూపిస్తున్నాయో... కార్పొరేట్ ఆస్పత్రులు డబ్బు జబ్బు ప్రకోపించి ఎలా నిలువు దోపిడీ చేస్తున్నాయో ఆ కథనాలు వెల్లడించాయి.
 
 ఈ రకమైన దుస్థితిపై అన్నిచోట్లా ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒక్క విధంగానే ఉన్నదని ఢిల్లీ మహా నగరంలో గత వారం రోజుల్లో చోటు చేసుకున్న రెండు విషాద ఘటనలు నిరూపించాయి. మొదటిది దక్షిణ ఢిల్లీలో ఒకటో తరగతి చదువుతున్న ఏడేళ్ల అవినాష్ రౌత్ ఉదంతం. ఢిల్లీలో అడ్డూ ఆపూ లేకుండా స్వైర విహారం చేస్తున్న డెంగీ వ్యాధికి ఇంతవరకూ బలైపోయిన 11మందిలో అవినాష్ ఒకడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అవినాష్‌ను అత డి తల్లిదండ్రులు ఆరు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అందరికందరూ అతన్ని చేర్చుకోవడానికి నిరాకరించారు. చివరిలో చేర్చుకున్న ఆస్పత్రి వైద్యులు అప్పటికే ఆలస్యమైపోయిందని తేల్చారు. ఆ బాలుడు నిస్సహాయ స్థితిలో మరణించాడు. కుమారుడికి సకాలంలో వైద్యం అందించలేకపోయామని కుమిలిపోతున్న అతని తల్లిదండ్రులు అవినాష్ అంత్యక్రియలు పూర్తికాగానే తిరిగొచ్చి తమ ఇంటిపైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు.
 
 ఈ ఘటన తర్వాత మేల్కొన్నట్టే కనబడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రులన్నిటికీ హెచ్చరికలు జారీచేశాయి. వైద్యాన్ని నిరాకరించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నాయి. ఇదంతా కొనసాగుతుండగానే మరో బాలుడు ఆరేళ్ల అమన్ శర్మ కూడా ఇలాంటి దుర్మార్గానికే బలయ్యాడు. అమన్ తల్లిదండ్రులు కూడా మహా నగరంలో సర్కారీ పెద్దాసుపత్రి సఫ్దర్‌జంగ్ మొదలుకొని నాలుగు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. తెల్లవార్లూ ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి ఆత్రంగా పరుగులెడుతూనే ఉన్నారు. అయినా అవినాష్‌కు ఏం జరిగిందో అమన్‌కూ అదే అయింది. సకాలంలో చికిత్స అందక పోవడంతో అమన్ కన్నుమూశాడు.
 
  రాష్ట్రపతి మొదలుకొని ప్రభుత్వాధినేతలందరూ... అత్యున్నత స్థాయి అధికారగణమంతా కొలువుదీరిన ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఇద్దరు పిల్లలను పొట్టనబెట్టుకున్న ఉదంతాలివి. మీడియా దృష్టి పడింది గనుక ఇవి బయటికొచ్చాయిగానీ రాని ఉదంతాలు ఎన్ని ఉంటాయో అంచనా వేయలేం. దేశ రాజధాని నగరంలోని ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు లేవని, చాలినన్ని పడకలు లేవని, అక్కడి వైద్యులకు మానవతా దృక్పథం కొరవడిందని... ప్రాణం మీదికొచ్చిన రోగినైనా నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేయగల దుర్మార్గం అక్కడ రాజ్యమేలు తున్నదని అందరికీ తెలియడం కోసం ఇద్దరు పిల్లలు కడతేరవలసి వచ్చింది. ఒక కుటుంబం మొత్తం ప్రాణార్పణ చేయాల్సివచ్చింది.
 
  కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు కావస్తున్నది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ సారథ్యాన్ని స్వీకరించి ఏడు నెలలవుతోంది. ఇద్దరూ వైద్య రంగాన్ని గాలికొదిలారని ఈ ఉదంతాలు రుజువు చేశాయి. ఇది ఢిల్లీకి పరిమితమైన ధోరణి మాత్రమే కాదు. కొంత హెచ్చుతగ్గులతో దేశమంతా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉన్నదని తరచు బయటపడుతున్న దారుణ ఉదంతాలు తెలియజెబుతున్నాయి. ఈమధ్యే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మూషికాలు కొరికేసిన కారణంగా నెలలు నిండని బాలుడు మృత్యువాత పడ్డాడు. ‘సాక్షి’లో వెలువడిన ధారావాహిక కథనాలకు స్పందించిన ఎంతోమంది ప్రభుత్వాసుపత్రుల్లోని నిర్లక్ష్యాన్ని, కార్పొరేట్ ఆస్పత్రుల్లోని నిలువు దోపిడీని కళ్లకుగట్టారు.
 
 ఆ అనుభవాలను చదివిన వారెవరైనా ఆసుపత్రి గడప తొక్కే దుస్థితి తమకెదురుకావొద్దని మొక్కుకుంటారు. లాభార్జనపై దృష్టి పెరగడం, ఆ క్రమంలో నైతిక విలువలకు తిలోదకాలొదలడం దాదాపు అన్ని రంగాల్లోనూ పెరిగినా వైద్య రంగంలో ఇది శ్రుతిమించిన దాఖలాలు కనబడుతున్నాయి. మనుషులు సహజాతాలను కోల్పోయి, రోబోలుగా మారుతున్న వైనం వెల్లడవుతోంది. వైద్య విద్య అంగట్లో సరుకయ్యాకే వైద్యులు వ్యాపారులయ్యారు. కార్పొరేట్ వైద్యం లాభాలార్జించిపెట్టే పెద్ద బిజినెస్‌గా మారింది.
 
 లాభం తప్ప ప్రాణం గురించి పట్టని కార్పొరేట్ ఆస్పత్రుల బారి నుంచి ఇక జనానికి విముక్తి లభించే అవకాశం లేదని ఈమధ్యే నీతి ఆయోగ్ కేంద్ర ఆరోగ్య శాఖకు రాసిన లేఖ చదివితే అర్ధమవుతుంది. ప్రస్తుతం ప్రజారోగ్య రంగానికి జీడీపీలో ఖర్చుచేస్తున్న ఒక శాతం మించి నిధులు వెచ్చించడం సాధ్యంకాదని ఆ లేఖ చెబుతున్నది.
 
 2020 నాటికి జీడీపీలో 2.5 శాతాన్ని ప్రజారోగ్యానికి కేటాయించాలన్న తాజా జాతీయ ఆరోగ్య విధానం ముసాయిదా లక్ష్యాలను సవరించుకొమ్మని ఆ లేఖ సూచిస్తున్నది. రోగులకు మందులు, చికిత్స, ఇతర పరీక్షలు...అన్నీ బీమా రంగంద్వారానే సాగాలంటున్నది. అంటే ఇప్పుడు ఢిల్లీలోనూ, దేశంలోని ఇతరచోట్లా వైద్య రంగంలో కనిపిస్తున్న జాడ్యం రాగలకాలంలో మరింత ముదురుతుందన్న మాట! వాస్తవానికి  వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్రజారోగ్యంపై పెట్టే పెట్టుబడులు చాలా తక్కువని జాతీయ ఆరోగ్య విధానం ముసాయిదా గణాంకాలతో సహా వివరించింది. దీన్ని పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పింది. నీతి ఆయోగ్‌లో ఘనులు మాత్రం అందుకు విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసే ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ విషయంలో జనం మేల్కొని ప్రభుత్వాలను గట్టిగా నిలదీయకపోతే ఈపాటి వైద్య సదుపాయాలు కూడా భవిష్యత్తులో దుర్లభమవుతాయి.

మరిన్ని వార్తలు