లంకపై శాఖాచంక్రమణం!

29 Mar, 2014 23:30 IST|Sakshi

సంపాదకీయం
 
 శ్రీలంక సైన్యం అక్కడి తమిళులను ఊచకోత కోసిన వైనంపై తరచు వెల్లడయ్యే హృదయవిదారక దృశ్యాలు ఎలాంటివారినైనా కంటతడి పెట్టిస్తాయి. నిరాయుధులైన పౌరులను నగ్నంగా కూర్చోబెట్టి కాల్చిచంపడం, బందీగా పట్టుబడిన తమిళ టైగర్ల అధినేత ప్రభాకరన్ కుమారుడు పన్నెండేళ్ల పసివాడు బాలచంద్రన్‌ను అమానుషంగా హతమార్చడం, యాంకర్‌గా పనిచేసిన యువతిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని కాల్చిచంపడంవంటి ఉదంతాలన్నీ వీడియోల్లో రికార్డయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకలో మానవహక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ దర్యాప్తునకు వీలుకల్పించే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు మన దేశం గైర్హాజరవడం ఆశ్చర్యం కలిగించే పరిణామం.
 
 లంక పేరెత్తితే అంతెత్తున లేచే ద్రవిడ పార్టీలు కూడా ఈసారి మౌనంగా మిగిలిపోవడం అంతకన్నా దిగ్భ్రాంతికరం. అయిదేళ్లక్రితం ఎల్‌టీటీఈ లక్ష్యంగా శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతంలో అక్కడి ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. అది అంతర్యుద్ధంగా మారి అక్కడున్న సామాన్య తమిళులు లక్షలాదిమంది చెట్టుకొకరు, పుట్టకొకరై ప్రాణాలు అరచేతబట్టుకుని తమిళనాడు చేరారు. మార్గమధ్యంలో ఎందరెందరో హత్యలకు, అత్యాచారాలకు గురయ్యారు. ఉగ్రవాదంపై పోరాటమని చెప్పుకున్నా లంక సైన్యం సాగించిందంతా నరమేథమే. ఆ నరమేథంపై ఎన్ని సాక్ష్యాలు లభ్యమైనా లంక సర్కారు బుకాయిస్తూ వస్తోంది.
 
 అయితే, తమిళుల ఊచకోత సాగుతున్నప్పుడుగానీ, అది పూర్తయ్యాకగానీ ప్రధాన ద్రవిడ పార్టీలు నోరెత్తలేదు.  కానీ, ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఆ పార్టీలన్నీ పోటీపడి లంక తమిళుల హక్కుల పరిరక్షణలో తమను మించినవారు లేరన్న అభిప్రాయం కలగజేయడానికి ప్రయత్నించాయి. తమిళనాట జరిగే ఈ తంతుకు అనుగుణంగా వ్యవహరించడం కేంద్ర ప్రభుత్వానికీ అలవాటైపోయింది. అందువల్లే తమిళనాడులో ఎలాంటి నిరసనలూ వ్యక్తంకాని 2009లో మానవ హక్కుల మండలిలో లంకను మన దేశం బేషరతుగా సమర్థించింది. అటు తర్వాత ద్రవిడ పార్టీలన్నీ లంక అమానుషాలపై నిప్పులు చెరిగి, ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెచ్చినప్పుడు వారి అభీష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే మన దేశం 2009నాటి విధానానికి పూర్తి భిన్నమైన వైఖరిని తీసుకుని 2012, 2013 లలో లంకకు వ్యతిరేకంగా ఓటేసింది. ఇప్పుడు లంకపై మళ్లీ మానవహక్కుల మండలిలో తీర్మానం రాబోతున్నదని తెలిసినా ఎన్నికల్లో పీకల్లోతు మునిగిపోవడంవల్ల కావొచ్చు...ద్రవిడ పార్టీలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.


  అసలు తమిళనాడు పార్టీల తీరే కాదు...అంతర్జాతీయంగా అమెరికా వైఖరి కూడా అలాగే ఉన్నది. ఎల్‌టీటీఈపై యుద్ధం పేరిట లంక సైన్యాలు సాగిస్తున్న అకృత్యాల గురించి పూర్తి సమాచారం ఉన్నా ఏ దశలోనూ అమెరికా జోక్యం చేసుకోలేదు. తమకు సైతం తలనొప్పిగా తయారైన ‘ఉగ్రవాది’ ప్రభాకరన్, ఆయన నేతృత్వంలోని ఎల్‌టీటీఈ ముగిసిపోతుంటే ‘అనవసరం’గా మాట్లాడటం ఎందుకని మిన్నకుండిపోయింది. అంతా పూర్తయ్యాక ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి పావులు కదిపింది. మానవ హక్కుల చాంపియన్‌గా అవతారమెత్తింది. అందులో భాగంగానే లంకకు వ్యతిరేకంగా ఈ అయిదేళ్లనుంచీ తీర్మానాలు తీసుకువస్తున్నది. అందులో అమెరికాకు ప్రయోజనాలున్నంత మాత్రాన తీర్మానాన్ని వ్యతిరేకించవలసిన అవసరమేమీ లేదు. గురువారం జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 23 దేశాలు ప్రతికూలంగా 12 దేశాలు వ్యవహరించాయి. మన దేశంతోపాటు మరో 12 దేశాలు గైర్హాజరయ్యాయి.
 
 ఈ తీర్మానం గత తీర్మానాల తరహాలో కాకుండా ఒక దేశ సార్వభౌమత్వాన్ని భంగపరిచేదిగా, అనుచితమైన తరహాలో ఉన్నదని మన దేశం చెబుతోంది. అందువల్లే ఈసారి గైర్హాజరు కావలసి వచ్చిందని సంజాయిషీ ఇస్తోంది. నిజమే, గతంలో తీర్మానాలు మానవహక్కుల ఉల్లంఘనకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని లంక అధ్యక్షుడు రాజపక్సేను కోరడంతో సరిపెట్టాయి. ప్రస్తుత తీర్మానం అందుకు భిన్నంగా అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని పిలుపునిచ్చింది. అలాంటి దర్యాప్తు ఏదైనా చివరకు రాజపక్సేను యుద్ధ నేరస్తుడిగా ప్రకటించే స్థితికి చేర్చే అవకాశం లేకపోలేదు. ఈ పరిణామాలను ముందే ఊహించడంవల్ల కావొచ్చు...లంకతో చైనా చెలిమి బలపడుతున్న తీరు, దానివల్ల మనకు ఎదురుకాగల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కావొచ్చు, యూపీఏ నుంచి వైదొలగుతామని తరచు హెచ్చరించే డీఎంకే ఇప్పుడు మిత్ర పక్షంగా లేకపోవడంవల్ల కావొచ్చు... మన దేశం ఓటింగ్‌కు గైర్హాజరైంది. భారత్ తాజా వైఖరికి కృతజ్ఞతగా శ్రీలంక తన చెరలో ఉన్న భారతీయ జాలర్లను బేషరతుగా విడుదలచేస్తానని ప్రకటించింది.
 
  అసలు ప్రపంచంలో ఎన్ని దేశాలు మానవహక్కులను గౌరవించి, వాటిని త్రికరణశుద్ధిగా అమలు చేస్తున్నాయని పరీక్ష పెడితే అత్తెసరు మార్కులైనా తెచ్చుకోగలవి వేళ్ల మీద లెక్కబెట్టే స్థాయిలో ఉంటాయి. ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు తమకు గిట్టనివారిపై ఒత్తిళ్లు తెచ్చేందుకు, వారిని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి మాత్రమే తోడ్పడుతున్నాయి. వర్తమాన అంతర్జాతీయ పరిస్థితుల్లో వీటికి ఇంతకుమించి విలువ ఉండటం లేదు. ఇది చేదు నిజం. అంతమాత్రాన లంక అమానుషాలపై అసలు దర్యాప్తే వద్దనడం సరికాదు. ఒక ప్రాంతంలో లక్షలాదిమంది పౌరులు తమ సైన్యం చేతుల్లోనే ఘోర దురంతాలను చవిచూస్తే...అంతర్జాతీయ సమాజం పాక్షిక దృష్టితోనే దానిపై స్పందించడం ఒక విషాదం.
 

>
మరిన్ని వార్తలు