బలపడవలసిన బంధం

20 Feb, 2018 00:22 IST|Sakshi

భారత్‌–ఇరాన్‌ల మధ్య చిరకాల స్నేహబంధం ఉన్నా తరచుగా వచ్చిపడే సమస్య లతో అది ఒడిదుడుకులే  ఎదుర్కొంటున్న దశలో ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహాని ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకూ మూడు రోజులు భారత్‌లో పర్యటించడంతోపాటు వివిధ రంగాల్లో తొమ్మిది ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మన దేశం ఆధ్వర్యంలో ఇరాన్‌లో చాబహార్‌ ఓడరేవు నిర్మాణం తొలి దశ గత డిసెంబర్‌లో పూర్తయింది. దాని కార్యకలాపాల నిర్వహణలో పాలుపంచుకోవడం, సరుకులపై ద్వంద్వ పన్నుల నివారణ, వైద్యం, ఇంధన రంగాల్లో సహకారం, నేరస్తుల అప్పగింత తదితర ఒప్పందాలు ఇప్పుడు కుదిరాయి. మన దేశంతో ఉన్న చెలిమికి ఇరాన్‌  ఆదినుంచీ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఉగ్రవాదం విషయంలో మన దేశం వైఖరికి మద్దతు పలుకుతోంది. భద్రతా మండలిలో మనకు శాశ్వత సభ్యత్వం రావాలని కోరుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ 2016లో ఆ దేశంలో పర్యటించాక దానికి కొనసాగింపుగా రౌహాని ఇక్కడికొచ్చారు. ఇరాన్‌పై కయ్యానికి కాలుదువ్వుతున్న ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ వచ్చి వెళ్లిన నెల రోజులకు ఈ పర్యటన జరిగింది.

 పరస్పరం శత్రు దేశాలుగా భావించుకుంటున్న రెండు దేశాలతో ఏకకాలంలో మిత్రత్వం నెరపడం కాస్త కష్టమైన విషయమే. లౌక్యంగా వ్యవహరించడం, ఎవరి దగ్గర వారి మాట మాట్లాడటం, సర్ది చెప్పడానికి ప్రయత్నించడం వంటివి ఎల్ల కాలమూ ఉపయోగపడవు. దానికి పరిమితులు ఉండి తీరతాయి. అటు పాకి స్తాన్‌తోనూ, ఇటు భారత్‌తోనూ స్నేహాన్ని కొనసాగించడం... అదే సమయంలో పాక్‌కు సైనిక సాయం అందిస్తుండటం, ఇద్దరికీ ఆయుధాలు అమ్మడం ఒక్క అమెరికాకే చెల్లింది. ఇరాన్‌కు పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఇరాక్, సిరియా, టర్కీ, అజర్‌బైజాన్‌లు ఇరుగుపొరుగు దేశాలుగా ఉన్నాయి. ఇరాక్‌తో కొన్ని దశాబ్దాల క్రితం ఇరాన్‌కు పొరపొచ్చాలు రావడం... అవి యుద్ధానికి దారి తీయడం చరిత్ర. ఇప్పుడవి మిత్ర దేశాలే. సౌదీ అరేబియా, యూఏఈ, ఒమ న్‌లకూ... ఇరాన్‌కూ మధ్య పర్షియన్‌ జలసంధి ఉంది. అయితే పరస్పరం సరి హద్దుల్లేని ఇజ్రాయెల్‌తో, అసలు పశ్చిమాసియాకు దరిదాపుల్లోనే లేని అమెరికాతో దానికి శత్రుత్వం అధికం. ఈ శత్రుత్వం అన్ని ప్రపంచ దేశాలతోపాటు మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. సమస్యంతా ఇదే. జార్జి బుష్‌ పాలనలో, ఒబామా తొలి దశ పాలనా కాలంలో ఇరాన్‌తో మన దేశం చెలిమికి అమెరికా నుంచి ఆటం కాలెదురయ్యాయి. ఇరాన్‌ అణ్వాయుధాల తయారీకి పూనుకుంటున్నదని ఆరో పించి అమెరికా ఆంక్షలకు దిగింది. అనంతరకాలంలో భద్రతామండలి ద్వారా కూడా వాటిని అమలు చేయించింది. మన ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి ఈ ఆంక్షలు పెద్ద ఆటంకంగా మారాయి. అలాగే మన దేశం నుంచి ఇరాన్‌కు అందాల్సిన సాయాన్ని అడ్డుకున్నాయి.

చమురు, గ్యాస్, పెట్రో కెమికల్స్‌ తదితర రంగాల్లో పెట్టుబడులకు కూడా అవి అవరోధమయ్యాయి. వీటి పర్యవసానంగా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతోపాటు అక్కడి ప్రజానీకం పడరాని పాట్లు పడ్డారు. ఔషధాలు, వైద్య పరికరాలపై ఆంక్షలు లేవని చెప్పినా, చెల్లింపుల మార్గాలన్నీ మూతపడటంతో అవి కూడా నిలిచిపోయాయి. ఫలితంగా లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. చాబహార్‌ ఓడరేవు నిర్మాణానికి మన దేశం దాదాపు ఒప్పందం ఖరారు చేసుకోబోతుండగా అది కాస్తా నిలిచిపోయింది. ఇలాంటి సమ యంలో సైతం ఇరాన్‌ మన దేశాన్ని అర్ధం చేసుకుంది. ఒబామా తన పాలన ముగు స్తున్న దశలో మరో అయిదు దేశాలను కలుపుకొని ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఆంక్షల సడలింపు మొదలైంది. ఇరాన్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు లభించాయని ప్రపంచ దేశాలతోపాటు మన దేశం కూడా అంచనా వేస్తున్న తరుణంలో ఒబామా అనంతరం అమెరికాలో ట్రంప్‌ ఏలుబడి ప్రారంభమైంది. మళ్లీ అనిశ్చిత వాతావరణం అలుముకుంది. ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని సవరించాలని ట్రంప్‌ పట్టుబడుతున్నారు. అందుకు అంగీకరిం చకపోతే ఒప్పందం నుంచి వైదొలగుతామని బెదిరిస్తున్నారు.

ఒకప్పుడు అమెరికా చెప్పినదానికల్లా వంతపాడే అలవాటున్న బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు ఇప్పటికైతే ట్రంప్‌ తీరును గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అకారణంగా పేచీకి దిగి పెట్టుబడులు పెట్టడానికొచ్చిన విస్తృత అవకాశాలకు ఆయన గండి కొడుతున్నారని ఆరోపిస్తున్నాయి. అయితే ఆ ఒప్పందానికి రేపు మే నెలలో ట్రంప్‌ మంగళం పాడితే ఏం చేస్తాయన్నది చూడాలి. మాట నిలకడలేని ట్రంప్‌ వెనక చేరి నష్టపోవడానికి అవి సిద్ధపడకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తన మిత్రులెవరో, గోడ మీద పిల్లివాటంగా మిగిలేదెవరో తేల్చుకోవడానికి ఇరాన్‌ సమాయత్తమవు తోంది. అందుకే రౌహానీ భారత్‌ పర్యటనకొచ్చారు.

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి. ఇటీవల తన ఎఫ్‌–16 విమానాన్ని సిరియా కూల్చేశాక ఆగ్రహించిన ఇజ్రాయెల్‌... దీని వెనక ఇరాన్‌ హస్తమున్నదని ఆరోపించింది. ఇక సిరియాతో కాక నేరుగా ఇరాన్‌తోనే తల పడతామంటున్నది. ఉన్నకొద్దీ ఈ ఘర్షణ వాతావరణం పెరిగేలా ఉంది తప్ప చక్క బడే సూచనలు కనిపించడం లేదు.  కారణాలు వేరే కావొచ్చుగానీ చాబహార్‌ పనులు నత్తనడకన సాగడం వెనక అమెరికా ఒత్తిళ్లు ఉన్నాయన్న అనుమానం ఇరాన్‌కు కలి గింది. మన దేశం వెనకడుగేస్తే సాయం అందించడానికి చైనా సిద్ధంగా ఉంది. అలాగే చైనా, రష్యాలు పాక్‌ సహకారంతో అఫ్ఘాన్‌లో శాంతి స్థాపనకు చేస్తున్న యత్నాలపైనా ఇరాన్‌ ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశం స్వీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమీయాలి. ఇరాన్‌తో మనకున్న సంబంధాల విషయంలో అమెరికాకు అసం తృప్తి ఉన్నా, ఇజ్రాయెల్, సౌదీలకు అభ్యంతరాలున్నా ఆదినుంచీ మనతో చెలిమికి ప్రాధాన్యమిస్తున్న ఇరాన్‌తో దౌత్యబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడం అన్ని    విధాలా అవసరం. రౌహానీ పర్యటనతో ఇరు దేశాల మధ్యా అపోహలన్నీ తొలగి, దృఢమైన సంబంధాలకు పునాది పడిందని ఆశించాలి.

మరిన్ని వార్తలు