వ్యూహాత్మక బంధం!

7 Jul, 2017 06:35 IST|Sakshi
వ్యూహాత్మక బంధం!

సిక్కిం సమీపంలోని సరిహద్దుల్లో చైనాతో మనకేర్పడ్డ వివాదం ముదురుతున్న తరుణంలో భారత్‌–ఇజ్రాయెల్‌ మధ్య ఉన్న చిరకాల చెలిమి ‘వ్యూహాత్మక భాగ స్వామ్యం’లోకి ప్రవేశించింది. దౌత్య పరిభాషలో ‘వ్యూహాత్మక భాగస్వామ్యా’నికి విస్తృతార్ధం ఉంటుంది. మన దేశానికి ఇలాంటి సంబంధాలు చాలా తక్కువ దేశాలతో–అమెరికా, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా వగైరాలతో ఉన్నాయి. ఇరు దేశా ల్లోనూ భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఇక వెనక్కు వెళ్లలేనంతగా ఈ సంబంధాలు పెనవేసుకుంటాయి. ఇవి ఆర్ధిక, రాజకీయ, రక్షణ, సాంకేతిక రంగాలకు విస్తరిస్తాయి.

అందుకే ప్రధాని నరేంద్రమోదీతో బుధవారం రెండు గంటలపాటు చర్చలు సాగిన తర్వాత మాట్లాడిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ తాజా బంధాన్ని ‘స్వర్గంలో కుదిరిన పెళ్లి’గా అభివర్ణించారు. అంతకుముందు రోజు ఈ ద్వైపాక్షిక బంధాన్ని ‘ఐ స్క్వేర్‌ టీ స్క్వేర్‌’(ఇజ్రాయెల్‌ టెక్నాలజీ, ఇండియన్‌ టాలెంట్‌) అని చమత్కరించారు. దేన్నయినా హత్తుకునేలా చెప్పే మోదీ దీన్ని ‘ఐ ఫర్‌ ఐ’(ఇండియా ఫర్‌ ఇజ్రాయెల్‌)గా వర్ణించి ఆ పదబంధానికుండే ‘కంటికి కన్ను’ అర్ధాన్నే మార్చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అంతరిక్ష పరిశోధన మొద లుకొని వ్యవసాయం, జల సంరక్షణ వగైరాల వరకూ ఏడు ప్రధానాంశాలున్నా రక్షణ, భద్రత అత్యంత కీలకం కాబోతున్నదని ఇరు దేశాల సంయుక్త ప్రకటన తెలియజెబుతోంది. ఈ ప్రకటన బహురూపాల్లో, వ్యక్తీకరణల్లో ఉండే ఉగ్రవాదాన్ని ఖండించడంతోనే సరిపెట్టలేదు.

ఉగ్రవాదానికి, ఉగ్రవాద ముఠాలకు మద్దతు, ప్రోత్సాహం, నిధులు, ఆశ్రయం కల్పించేవారికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించింది. భాగస్వాములు కాదల్చుకున్న దేశాలు ఈ స్థాయిలో దృఢంగా తనతో ఉండాలని మన దేశం ఎప్పటినుంచో కోరుకుంటున్నది. ఆ విష యంలో ఇజ్రాయెల్‌ ముందున్నట్టయింది. ఇజ్రాయెల్‌ మనతో పోలిస్తే చిన్న దేశమే కావొచ్చుగానీ... ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో దానికున్న అనుభవం అంతా ఇంతా కాదు. దానితో వ్యవహరించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అభి వృద్ధిలో కూడా ఆ దేశానికి పేరుప్రఖ్యాతులున్నాయి. భారత గడ్డపై జరిగే ఉగ్రవాద చర్యలన్నిటి మూలాలూ పాకిస్తాన్‌లో ఉన్నాయని మన దేశం తరచు చెబుతుంటుంది.

కొన్ని ఘటనలకు సంబంధించి కీలకమైన సాక్ష్యాధారాలను కూడా వెల్లడించింది. అయినా అమెరికా మొదలుకొని చాలా దేశాలు పరోక్షంగా విమర్శిం చడమే తప్ప నేరుగా పేరెట్టి మీ గడ్డ ఉగ్రవాదుల అడ్డాగా మారిందని పాకిస్తాన్‌కు ఎప్పుడూ చెప్పలేదు. ఆ విషయంలో ఇజ్రాయెల్‌ ఎలాంటి తడు ములాట లేకుండా గట్టిగా ఖండిస్తుందని ఈ సంయుక్త ప్రకటన స్పష్టం చేస్తున్నది. అయితే మనం కూడా ఆ స్థాయిలోనే స్పందించాల్సివస్తుంది. పాలస్తీనా సంస్థల కార్యకలాపాలు హింసాత్మక రూపం తీసుకున్నప్పుడు మన దేశం కటువైన భాష ఉపయోగించేది కాదు. సమస్య పరిష్కారానికి అన్ని పక్షాలూ శాంతి యుతంగా కృషి చేయాలని సూచించేది. ఇకపై మన ధోరణి కూడా మార్చుకోవాల్సి ఉంటుంది.  

నరేంద్రమోదీ తాజా పర్యటన ఇజ్రాయెల్‌తో మనకున్న సంబంధాలను పున ర్నిర్వచించింది. ఇజ్రాయెల్‌ అనుసరిస్తున్న విధానాన్ని ఒకప్పుడు యూదు మత వాదంగా, జాత్యహంకారంతో సమం చేస్తూ అంతర్జాతీయ వేదికలపై మాట్లాడిన మన దేశం ఇప్పుడు దాన్ని పూర్తిగా విడనాడిందని ఆయన పర్యటన స్పష్టం చేసింది. కొన్ని దశాబ్దాలుగా భారత్‌ అలా అంటున్నా ఇజ్రాయెల్‌ ఏనాడూ నొచ్చు కోలేదు. మనతో ఉన్న సంబంధాలపై ఆ ప్రభావం పడనీయలేదు. మోదీకి స్వాగతం చెప్పిన సందర్భంగా హత్తుకున్న నెతన్యాహూ ఈ రోజు కోసం ఇజ్రాయెల్‌ ఏడు దశాబ్దాలుగా వేచి చూస్తున్నదని చెప్పడాన్నిబట్టే భారత్‌తో సాన్నిహిత్యం కోసం ఆ దేశం ఎంత తహతహలాడుతున్నదో అర్ధం చేసుకోవచ్చు.

నిజానికి నరేంద్ర మోదీ కూడా ఆ స్థాయిలోనే ఇజ్రాయెల్‌ పట్ల తనకున్న మమకారాన్ని వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ మంత్రుల హోదాలో ఆ దేశం వెళ్లిన ఎల్‌కే అద్వానీ మొదలుకొని సుష్మా స్వరాజ్‌ వరకూ నేతలందరూ తప్పనిసరిగా పక్కనున్న పాల స్తీనా కూడా వెళ్లేవారు. ఆ దేశం మనసు కష్టపెట్టుకుంటుందన్న భావమే ఇందుకు కారణం. కానీ నరేంద్రమోదీ ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. అయితే అంతర్జాతీయంగానూ, పశ్చిమాసియాలోనూ మారిన పరిస్థితుల నేప థ్యంలో ఒకరితో స్నేహసంబంధాలు ఏర్పడినంత మాత్రాన వేరొకరితో అవి నిలిచిపోతాయనుకోవాల్సిన అవసరం లేదు.

నిజానికి ఇన్నేళ్లుగా మన దేశం అరబ్బు దేశాలతో చెలిమి చేస్తున్నా అవి కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌నే బహి రంగంగా సమర్ధిస్తూ వచ్చాయి. ఇజ్రాయెల్‌తో మన సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నా ఆ దేశం కశ్మీర్‌ వివాదంలో ఎప్పుడూ మనల్నే సమర్ధించింది. అరబ్బు దేశాలతో మన వాణిజ్యం 2016–17లో 12,000 కోట్ల డాలర్ల మేర ఉంది. ఇందులో 5,000 కోట్ల డాలర్లు ఎగుమతులు, 7,000 కోట్లు దిగుమతులు ఉంటాయని ఒక అంచనా. అదే ఇజ్రాయెల్‌తో చూస్తే ఆ వాణిజ్యం మొత్తం 500 కోట్ల డాలర్లు మాత్రమే. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక ఇజ్రాయెల్‌తో మనకున్న ఆయుధ కొనుగోళ్లు 117 శాతం పెరిగిన మాట వాస్తవమే అయినా ఇప్పటికీ రష్యాయే మన ప్రధాన అమ్మకందారు. ఖతార్‌తో కలహం వచ్చాక అరబ్బు దేశాల శిబిరం సమైక్యంగా లేదు.

మోదీ ఈ రెండేళ్లలోనూ పశ్చిమాసియాలోని దేశాలన్నీ పర్యటించారు. ఇన్నాళ్లకు ఇజ్రాయెల్‌ను ఎంచుకున్నారు. ఉగ్రవాదంపై మన దేశం చేసే పోరు భవిష్యత్తులో కొత్త రూపు సంతరించుకుంటుందని ఈ పర్యటన తేటతెల్లం చేసింది. ఉగ్రవాదంపై అంత ర్జాతీయ ఒడంబడిక కోసం రెండు దశాబ్దాలుగా సాగుతున్న చర్చలు ఆ పదానికివ్వాల్సిన నిర్వచనం దగ్గరే కొట్టుమిట్టాడుతున్న తరుణంలో... ఇజ్రా యెల్‌తో మనకేర్పడిన తాజా బంధం దానికి కొత్త ఊపునిస్తుందని... వ్యవసాయ, జల సంరక్షణ విధానాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతుందని చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు