రాఫెల్ వైపే మొగ్గు

27 Sep, 2016 01:57 IST|Sakshi

ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం భారత్, పాకిస్తాన్‌ల మధ్య వాగ్యుద్ధం తీవ్ర స్థాయికి చేరి, అది యుద్ధ వాతావరణం దిశగా పోతున్నదని అందరూ అనుకుంటున్న సమయంలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై భారత్-ఫ్రాన్స్ దేశాలు సంతకాలు చేశాయి. వాస్తవానికి ఇప్పుడు కుదిరిన ఒప్పందం లాంఛనమే. ప్రధాని నరేంద్ర మోదీ 17 నెలలక్రితం ఫ్రాన్స్ వెళ్లినప్పుడు ఇందుకు సంబంధించి సూత్ర ప్రాయమైన అంగీకారం కుదిరింది. ఇంకా వెనక్కు వెళ్తే 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కోసం వాటిని ఉత్పత్తి చేసే డసాల్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తంగా రూ. 1.34 లక్షల కోట్ల వ్యయంతో 126 యుద్ధ విమానాలు కొనడం దాని సారాంశం.
 
 2015కల్లా 18 విమానాలను సమ కూరుస్తామని ఆ సందర్భంగా డసాల్ట్ సంస్థ పూచీపడింది. కానీ అందుకు సంబం ధించిన తదుపరి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. నేరుగా 18 విమానాలు అంద జేసి, మిగిలిన 108 విమానాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీచేసి బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్(హెచ్‌ఏఎల్)లో వాటిని ఉత్పత్తిచేసేలా లెసైన్స్ ఇస్తామన్న సంస్థ మళ్లీ వెనక్కు తగ్గింది. నిరుడు ఏప్రిల్‌లో మోదీ ఫ్రాన్స్ పర్యటించినప్పుడు కదలిక వచ్చింది. పాత ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. గతంలో యూపీఏ ప్రభుత్వం నేరుగా డసాల్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోగా... అందుకు భిన్నంగా మోదీ ఫ్రాన్స్ ప్రభుత్వంతో దీన్ని ముడిపెట్టారు. 36 విమానాలు అందజేయడం ఆ ఒప్పందం సారాంశం. వాటి విలువ రూ. 64,000 కోట్లుగా లెక్కేశారు.
 
 అయినా తుది ఒప్పందానికి ఇన్నాళ్ల సమయం పట్టింది. ఈ 17 నెలల బేరసారాల్లో ఇది ప్రస్తుతం రూ. 59,000 కోట్లకు చేరిందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ప్రకటిం చారు. ఇప్పుడు కూడా తొలి విమానం మరో రెండేళ్లకుగానీ అందదు. రక్షణ ఒప్పం దాలు ఎంత సంక్లిష్టమైనవో, అవి సాకారం కావడానికి ఎంత సుదీర్ఘ సమయం అవసరమవుతుందో దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు. అందువల్లే ఈ విషయంలో చాలా ముందుచూపు అవసరమవుతుంది. మరో పాతికేళ్లకు ఎలాంటి పరిస్థితులుం టాయో, వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు మనం తీసుకోవలసిన చర్యలేమిటన్న అంశాల్లో స్పష్టమైన అవగాహన ఉండాలి. అందుకు అనుగుణంగా అడుగులేయాలి.
 
 ఎన్నో ఏళ్లుగా మన వైమానిక దళం యుద్ధ విమానాల కొరతను ఎదుర్కొం టున్నది. ఒకప్పుడు పాకిస్తాన్‌ను గడగడలాడించిన మిగ్-21, మిగ్-27 యుద్ధ విమానాలకు వయసు మీదపడింది. అవి తెల్ల ఏనుగుల్లా మారాయి. ఖర్చు బారెడు.. ప్రయోజనం మూరెడు అన్న చందంగా తయారైంది. పేరుకు వంద విమా నాలున్నాయన్న పేరే గానీ... వాటిలో ఏ సమయంలోనైనా దాదాపు 60కి మించి అందుబాటులో ఉండవు. మిగిలినవి ఎప్పుడూ మరమ్మతుల్లోనే ఉంటాయి. గతంలో మనతో పోలిస్తే ఎంతో వెనకబడి ఉన్న పాక్ కొన్నేళ్లుగా రక్షణ కొనుగోళ్లలో చురుగ్గా ఉంది. పాక్ సంగతి వదిలిపెట్టినా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగానే ఈ కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. ప్రతి దేశమూ రక్షణ అవసరాలపై చేస్తున్న వ్యయాన్ని బాగా పెంచింది. ఈ నేపథ్యంలో వైమానిక దళం వినతులపై ప్రభుత్వం దృష్టిసారించింది. 2000 సంవత్సరంలో యుద్ధ విమానాల కొనుగోలుకు నిర్ణయిం చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు వాటిని అమ్ముతామంటూ పోటీప డటం మొదలెట్టాయి.
 
 పోటీదారు ఉత్పత్తి చేసే యుద్ధ విమానాలతో పోలిస్తే తమ ఉత్పత్తులు అన్నివిధాలా మెరుగైనవని ఒప్పించే ప్రయత్నం చేశాయి. జాబితా నుంచి తమ దేశానికి చెందిన సంస్థను ప్రాథమిక దశలోనే తొలగించారని తెలుసు కున్నాక అమెరికా తీవ్ర నిరాశకు గురైంది. భారత్‌ను ఒప్పించడంలో విఫలమయ్యా రన్న అభిప్రాయం అమెరికా ప్రభుత్వానికి కలగడంతో భారత్‌లో తమ రాయ బారిగా ఉన్న తిమోతి రోమెర్‌ను పదవినుంచి తప్పించారన్న కథనాలు వచ్చాయి. చివరకు ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్‌ను ఎంపిక చేశారని తెలిశాక బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాలకు చెందిన కన్సార్టియానికి కూడా తీవ్ర అసంతృప్తి కలిగింది. తాము ఉత్పత్తి చేసే యుద్ధ విమానాలతో పోలిస్తే రాఫెల్ ఏమంత మెరుగైంది కాదన్న ప్రచారాన్ని ప్రారంభించాయి.  
 
 అయితే ఇప్పుడు కుదిరిన ఒప్పందాన్ని మెచ్చుకుంటున్నవారున్నట్టే విమర్శి స్తున్నవారూ లేకపోలేదు. తక్షణం వినియోగంలోకొచ్చే విధంగా 36 యుద్ధ విమా నాలు మన అమ్ములపొదిలో చేరబోతున్నాయని నిరుడు మోదీ ప్రకటించారు. ఇప్పుడు పరీకర్ చెబుతున్న ప్రకారం తొలి విమానం రావడానికే మరో రెండేళ్లు పడుతుంది. వాస్తవానికి 36 యుద్ధ విమానాలూ మన వైమానిక దళ అవసరాలకు ఏమాత్రం సరిపోవు. కనీసం వంద విమానాల అవసరం ఉన్నదని అంటున్నారు. ఈ స్థితిలో గత 17నెలలుగా ఫ్రాన్స్ ఎటూ తేల్చకుండా నాన్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసేందుకు వెనకాడింది. అందువల్లే ఒక దశలో పరీకర్ విసుగు చెంది ప్రత్యామ్నాయ ప్రతిపాదనల వైపు మొగ్గుచూపారు.
 
 లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్ తదితర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆ మూడు సంస్థలూ సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి అంగీకరించాయి కూడా. వీటిలో ఏదో ఒక సంస్థను ఖరారు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పరీకర్ అన్నారు. అయితే అనూహ్యంగా మళ్లీ రాఫెల్ రంగంలోకొచ్చింది. ఇందులో ఎన్నో అనుకూ లాంశాలు లేకపోలేదు. మన అవసరాలకు తగిన విధంగా విమానం డిజైన్‌లో మార్పులు చేసేందుకూ... ముఖ్యంగా లేహ్‌వంటి గడ్డకట్టే చలి ప్రాంతాల్లో కూడా అవి సమర్ధవంతంగా పనిచేసేందుకూ డసాల్ట్ చర్యలు తీసుకుంటున్నది. అలాగే పలు ఇతర సదుపాయాల కల్పనకు కూడా అంగీకరించింది. అయితే కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అలాగే ఉండిపోయింది. మన హెచ్‌ఏఎల్‌లోనే వాటిని ఉత్పత్తి చేసేలా ఒప్పించి ఉంటే ఎన్‌డీఏ సర్కారు నినాదం ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తి నెరవేరేది. రక్షణ అవసరాలు తరుముకొస్తున్న సంగతి వాస్తవమే అయినా ఈ విషయంలో మరింత పట్టుబట్టవలసింది.

మరిన్ని వార్తలు