‘370’ వివాదం!

30 May, 2014 01:32 IST|Sakshi

సంపాదకీయం: దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో కీలకమైనదని అందరూ భావిస్తున్న కాశ్మీర్ విషయంలో మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన రోజే వ్యాఖ్యానించి ప్రధాని కార్యాలయం సహాయ మంత్రి జితేంద్రసింగ్ పెద్ద తేనెతుట్టెను కదిపారు. జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దుచేయడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఆయన ప్రకటన సారాంశం. ఆ అధికరణపై బీజేపీకున్న అభిప్రాయమేమిటో ఎవరికీ తెలియనిది కాదు. ఆ అభిప్రాయాన్ని కాంగ్రెస్‌వంటి పార్టీలు మాత్రమే కాదు...ఆ పార్టీతో ఎన్‌డీఏ కూటమిగా జట్టుకట్టిన పార్టీలు సైతం గతంలో వ్యతిరేకించాయి. మరికొన్ని అంశాలతోపాటు 370 జోలికెళ్లబోమని హామీ ఇచ్చాకే ఆ పార్టీలు ఎన్‌డీఏలో చేరడానికి అంగీకరించాయి. అంతమాత్రంచేత బీజేపీ ఆ విషయంలో తన వైఖరిని మార్చుకోలేదు. అయితే, 370 గురించి గతంలో బీజేపీ మాట్లాడినదానికీ, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విడుదలచేసిన మేనిఫెస్టోలో ఆ పార్టీ పొందుపరిచిన అంశాలకూ మధ్య వ్యత్యాసముంది.
 
 తమకు సొంతంగా మెజారిటీ వస్తే ఆ అధికరణను రద్దు చేస్తామని గతంలో చెప్పిన బీజేపీ...అందుకోసం సంబంధిత పక్షాలతో చర్చించి ఒప్పిస్తామని ఈసారి చెప్పింది. 370వ అధికరణ ఏ చారిత్రక సందర్భంలో రాజ్యాంగంలో వచ్చి చేరింది, దాన్ని రద్దు చేస్తే కలిగే పరిణామాలేమిటన్న అంశాలను పక్కనబెడితే... వివాదాస్పదం అనుకున్న ఏ అంశంపైన అయినా అందరితో చర్చించాలనుకోవడం, వారిని ఒప్పించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలనుకోవడం హర్షించదగిందే. ఇప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడింది కూడా దానికి భిన్నమైనది కాదు. అయితే, ఇలాంటి చర్చలు ఇప్పటికే మొదలయ్యాయని ఆయన చెబుతున్నారు.
 
 సరిగ్గా నెలక్రితం కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీషా గిలానీ చేసిన ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది. నరేంద్ర మోడీ తన వద్దకు ఇద్దరు దూతలను పంపారని, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సహకరించమని కోరారని ఆయన చెప్పారు. ఈ విషయంలో మోడీతో నేరుగా మాట్లాడే ఏర్పాటుచేస్తామని ఆ దూతలు చెప్పినట్టు వెల్లడించారు. హురియత్ నేతలను కూడా ఆ దూతలు కలిశారని, తాను మాత్రమే మోడీతో చర్చించేందుకు నిరాకరించానని కూడా గిలానీ చెప్పారు.
 
 ఇందులో నిజం లేదని హురియత్ నేతలనగా, తాము ఎవరినీ దూతలుగా పంపలేదని బీజేపీ తోసిపుచ్చింది. ఆ వచ్చినవారి పేర్లు బయటపెట్టాలని కూడా సవాల్ చేసింది. మరి ఇప్పుడు మంత్రిగారు చెబుతున్నదేమిటి? సంబంధిత పక్షాలతో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని ఆయనంటున్నారు. ఆ ‘సంబంధిత పక్షాలు’ ఎవరో వెల్లడిస్తే విషయం మరింత స్పష్టంగా ఉండేది. జమ్మూ-కాశ్మీర్‌లో పాలకపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్, విపక్షమైన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)వంటివి తమతో ఎవరూ చర్చించలేదంటున్నాయి. తాను మాట్లాడలేదని గిలానీ అంటే...తమనూ ఎవరూ కలవలేదని హురియత్ నేతలు చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సంప్రదిస్తున్న నేతలెవరు? జితేంద్రసింగ్ వివరణ ఇస్తే తప్ప ఈ సంగతి తె లిసే అవకాశం లేదు.  రాజ్యాంగ సభ చర్చించి చేర్చిన 370వ అధికరణ వెనక పెద్ద చరిత్రే ఉన్నది. జమ్మూ-కాశ్మీర్ పాలకుడు హరిసింగ్ 1947లో ఆ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేసినప్పుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆ అధికరణ వచ్చిచేరింది. దీనికింద విదేశీ వ్యవహారాలు, ఆర్ధికం, కమ్యూనికేషన్లు, రక్షణ వంటివి మినహా మిగిలిన అంశాల్లో జమ్మూ- కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదిస్తే తప్ప కేంద్రం చేసే చట్టాలేవీ ఆ రాష్ట్రానికి వర్తించవు. అందువల్ల జమ్మూ-కాశ్మీర్‌కు పౌరసత్వం, ఆస్తిహక్కు వంటి అంశాల్లో సొంత చట్టాలున్నాయి. పర్యవసానంగా బయటివారు అక్కడ ఆస్తులు సమకూర్చుకోవడం సాధ్యంకాదు.
 
 రాజ్యాంగ సభ అవసరంలేదని భావిస్తే తప్ప 370ను రద్దుచేయడం సాధ్యంకాదని అదే అధికరణలోని మూడో క్లాజు చెబుతోంది. అసలు రాజ్యాంగ సభే 1957లో రద్దయింది గనుక అలాంటిదే మరో సభ ఏర్పడి దీన్ని కాదంటే తప్ప రద్దుచేయడం అసాధ్యమని కొందరి వాదన. అయితే, ఇందుకు భిన్నంగా...రాజ్యాంగంలో ఏమి ఉన్నా వాటిని రద్దుచేసే/సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని 368వ అధికరణ చెబుతున్నది. ఇందులో చివరకు చెల్లుబాటయ్యేది ఏమిటన్న సంగతి అలా ఉంచితే రాజ్యాంగాన్ని సవరించడానికి సభలో మూడింట రెండువంతుల మెజారిటీ అవసరం. లోక్‌సభలోగానీ, రాజ్యసభలోగానీ ప్రస్తుతానికైతే అలాంటి మెజారిటీ ఎన్‌డీఏకు లేదు. కనుక 370 అధికరణ రద్దు ఇప్పటికిప్పుడైతే అసాధ్యం. పైగా ఈ అధికరణ గురించి ఆలోచించాల్సినంత అత్యవసర పరిస్థితులేవీ కాశ్మీర్‌లో ప్రస్తుతానికి లేవు.
 
 మరి కేంద్రమంత్రి అంత ఆదరాబాదరాగా, బాధ్యతలు చేపట్టిన వెంటనే దాన్ని గురించి ప్రకటించాల్సిన అవసరం ఏముంది? ఒకపక్క యూపీఏ హయాంలో హరించిన రాష్ట్రాల హక్కులను పునరుద్ధరిస్తామని ఎన్నికల సందర్భంగా బీజేపీ చెప్పింది. ఇప్పుడు కాశ్మీర్ అనుభవిస్తున్న ప్రత్యేక హక్కుల్లో కొన్నింటిపై బీజేపీకి అభ్యంతరం ఉండొచ్చుగానీ వాటిల్లో చాలాభాగం ఇతర రాష్ట్రాలకు వర్తింపజేయవలసినవి ఉన్నాయని గుర్తించాలి. ఒక్క యూపీఏ పాలనలో మాత్రమేకాదు... ఇందిరాగాంధీ పాలనాకాలం నుంచి ‘ఉమ్మడి జాబితా’ క్రమేపీ చిక్కిపోతూ వస్తున్నది. కేంద్రం ఏదో సాకుతో ప్రతి రంగంలోనికీ చొరబడి రాష్ట్ర ప్రభుత్వాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చింది. దీన్ని సరిచేయవలసిన ప్రస్తుత తరుణంలో అందులో భాగంగా 370 అధికరణ గురించి కూడా చర్చిస్తే అందరూ స్వాగతిస్తారు. కేంద్రమంత్రి ఈ సంగతిని గుర్తించాలి.

>
మరిన్ని వార్తలు