నిజంగా ఇది ఘనతేనా?!

11 Dec, 2013 00:08 IST|Sakshi


సంపాదకీయం
 
 ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటీఓ) పుట్టి బుద్ధెరిగాక తొలిసారి 159 సభ్య దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇండొనేసియాలోని బాలిలో శనివారం కుదిరిన ఈ ఒప్పందం చరిత్రాత్మకమైనదని, ఇందులో మన దేశం పాత్ర ఘనమైనదని మన వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ ప్రకటించారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నదని కూడా ఆయన చెప్పారు. నిజమే...డబ్ల్యుటీఓ ఏర్పడి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా, పుష్కరం క్రితం దోహా రౌండు చర్చలు జరిగి దాని కొనసాగింపుగా ఏడెనిమిది దఫాలు మంత్రుల స్థాయి భేటీలు సాగినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. మొదట పెట్టుకున్న 2005 గడువు కూడా దాటిపోయి ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ పోతూ ఎట్టకేలకు ఇన్నాళ్లకు బాలిలో ఒక సమగ్ర ఒప్పందానికి రాగలిగారు. ఒప్పందం పర్యవసానంగా అంతర్జాతీయ వాణిజ్యం 62 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని, లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఊరిస్తున్నారు.
 
 పారిశ్రామిక ఉత్పత్తులపై వాణిజ్య సుంకాలు గణనీయంగా తగ్గడంవల్ల ప్రత్యేకించి మన దేశానికి కోట్లాది డాలర్లు ఆదా అవుతాయని చెబుతున్నారు. పెరుగుతున్న అవసరాల స్థాయిలో ఆహార పదార్థాల సరఫరా జరగాలంటే వాణిజ్యం తప్ప మార్గం లేదని... దేశాల మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందాలవల్ల మాత్రమే ప్రపంచ పౌరులంతా క్షేమంగా ఉండగలుగుతారన్నది డబ్ల్యుటీఓ ఏర్పాటులోని కీలకాంశం. నీటి పారుదల సదుపాయాలతో సాగుభూముల విస్తీర్ణాన్ని పెంచి, తిండిగింజల ఉత్పత్తిని అధికం చేసే మార్గం చూడకుండా... ఒప్పందాలతో ఆహారభద్రత సాధ్యమని చెబుతున్న డబ్ల్యుటీఓ పెద్దల సూక్తుల్ని అలా ఉంచి, ఇంతకూ బాలిలో సాధించింది నిజంగా ఘనమైనదేనా అని చూస్తే నిరాశచెందక తప్పదు.
 
  ప్రపంచ వాణిజ్యంలో ధనిక దేశాలు పెడుతున్న ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఒప్పందం కుదరడానికి తాము చేసిన కృషి ఫలించిందని, భవిష్యత్తులో విస్తృత ఒప్పందానికి ఇది బాటలు పరిచిందని ఆనంద్ శర్మ చెబుతున్న మాటలు వినడానికి బాగానే ఉన్నాయి. కానీ, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఇంతక్రితం జెనీవా చర్చల్లో అయినా, ఇప్పుడు బాలిలో అయినా మన దేశం తరఫున చర్చల్లో పాల్గొన్నవారు గట్టిగానే మాట్లాడారు. ఒక దశలో భారత్, ఇతర వర్ధమాన దేశాల వాదన పర్యవసానంగా ఇది కూడా అసంపూర్ణంగా ముగుస్తుందేమోనన్న భయాలూ వ్యక్తమయ్యాయి. నాలుగురోజుల చర్చలు ఏమాత్రం ఫలించనందున మరో రోజు పొడిగించారు కూడా. మన ఆహారభద్రత కార్యక్రమాలపైనా, మనం రైతులకు, ఇతర వర్గాలకూ ఇస్తున్న సబ్సిడీలపైనా ధనిక దేశాలు గట్టిగా పట్టు బట్టాయి. మొత్తం ఉత్పాదకతలో ఈ సబ్సిడీలు 10 శాతంకన్నా మించడానికి వీల్లేదని హఠాయించాయి. మన దేశ పరిస్థితులు, ఇక్కడి మన అవసరాలగురించి ఎంత చెప్పినా అవి తమ వైఖరిని సడలించుకోవడానికి ససేమిరా అన్నాయి.
 
  చివరకు వివాద పరిష్కారంగా నాలుగేళ్లపాటు మాత్రం ఇలాంటి సబ్సిడీలను కొనసాగించుకోవడానికి అనుమతినిచ్చే నిబంధనకు అంగీకరించాయి. ఒప్పందంలో ఈ నిబంధన ఉంచడానికి ఒప్పుకుంటే నాలుగేళ్ల తర్వాత అయినా పంచాయతీ మొదలయ్యేది. ఇక్కడి ఆహారభద్రతా చట్టంకింద నిరుపేద వర్గాలకు చవక ధరల్లో ఇవ్వబోయే తిండిగింజలు, ఆహారధాన్యాలకు ప్రకటించే కనీస మద్దతు ధరలు, ఎఫ్‌సీఐ ద్వారా చేసే ఆహారధాన్యాల సేకరణ వగైరాలన్నీ మూలనబడేవి. అలాగే, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)వంటివి కూడా అస్తవ్యస్తమయ్యేవి. నిత్యావసరాల ధరలు చుక్కలనంటినప్పుడు ప్రభుత్వాలవైపుగా జరిగే మార్కెట్ జోక్యం వంటివి కూడా అటకెక్కేవి. సదస్సులో ద్వైపాక్షిక చర్చల ద్వారా, పేద దేశాలను కూడగట్టడం ద్వారా ఇలాంటి నిబంధన లేకుండా చూసినందుకు, కఠిన వైఖరి అవలంబించి నందుకు భారత్ తరఫున పాల్గొన్న ప్రతినిధివర్గాన్ని అభినందించాల్సిందే.
 
 మన పథకాలు వారి నియమనిబంధనల చట్రంలోకి రాకుండా చేసినందుకు ప్రశంసించాల్సిందే. అయితే, ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. నాలుగేళ్ల గడువు లేదన్న మాటేగానీ రాగలరోజుల్లో కుదరబోయే సమగ్ర ఒప్పందంలో అసలు దీనికి సంబంధించిన నిబంధన ఉండబోదన్న హామీ ఏదీ పేద దేశాలకు లభించలేదు. అలాంటి హామీ ఉంటేనే తాము ఈ ఒప్పందానికి అంగీకరిస్తామని కరాఖండీగా చెప్పివుంటే ఎప్పటిలాగే బాలి చర్చలు కూడా విఫలమయ్యేవేమో. అయితే, పేద దేశాలు అమలుచేస్తున్న పథకాలన్నిటికీ రక్షణ ఉండేది. తమ సార్వభౌమాధికార హక్కుల్ని కాపాడుకోవడంలో పేద దేశాలు
 విఫలమయ్యాయి. రాజీకి సిద్ధపడ్డాయి.
 
  ధనిక దేశాలన్నీ తమ దేశాల్లో వ్యవసాయ రంగానికి ధారాళంగా సబ్సిడీలను ఇస్తున్నాయి. అమెరికా ప్రత్యక్ష వ్యవసాయ సబ్సిడీలు సాలీనా 2 వేల కోట్ల డాలర్ల పైమాటే. యూరోప్ దేశాలు ఇచ్చే ఆ తరహా సబ్సిడీలు 5 వేల కోట్ల డాలర్లకన్నా ఎక్కువ. పర్యవసానంగానే అక్కడి కార్పొరేట్ సంస్థలు కళకళలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ దేశాల గుత్తాధిపత్యం సాగుతోంది. కానీ, భారత్ అయినా, ఇతర వెనుకబడిన దేశాలైనా కేవలం నిరుపేదల ఆకలిమంటల్ని చల్లార్చ డానికి, బక్కరైతులను ఆదుకోవడానికి మాత్రమే సబ్సిడీలిస్తున్నాయి. ఈ తేడాను స్పష్టంగా ఎత్తిచూపి ధనిక దేశాల ఎత్తుగడలను సమర్ధవంతంగా తిప్పికొట్టవలసిన పేద దేశాలు ఆ కృషిలో విఫలమయ్యాయి. వాస్తవానికి సబ్సిడీలు, స్వీయ రక్షణ సుంకాల విషయాలకు సంబంధించిన ఏఎస్‌సీఎం ఒప్పందంపై కూడా బాలి చర్చల్లో తేల్చుకోవాలని మన కేంద్ర కేబినెట్ గతంలో నిర్ణయించింది. కానీ, ఇప్పుడు కుదిరిన ఒప్పందంలో దాని ఊసేలేదు. పేద దేశాలకు ఆచరణలో ఎన్నో అడ్డంకుల్ని సృష్టించే, గుదిబండగా మారే ఇలాంటి ఒప్పందాన్ని వేనోళ్ల కీర్తించడమే కాదు... ఆ ఘనత మనదేనని ఆనంద్‌శర్మ చాటుకోవడం విడ్డూరం.
 

>
మరిన్ని వార్తలు