ఇలా చేయడం సబబేనా?!

20 Sep, 2013 23:10 IST|Sakshi

సంపాదకీయం: యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... గురువారం మీడియా మోసుకొచ్చిన రెండు కథనాలు అందరినీ ఆలోచింపజేశాయి. విస్మయపరిచాయి. ప్రజల క్షేమానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు అమెరికా ఎలా ఆలోచిస్తుందో, మన దేశం ఎలా వ్యవహరిస్తుందో ఆ రెండు కథనాలూ పట్టి చూపాయి. మొదటిది... ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ సంస్థ ఉత్పత్తి చేసిన ఔషధాలను నిషేధించడానికి గల కారణాలను తెలిపే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నివేదిక. రెండో కథనం అణు కర్మాగారాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు చెల్లించాల్సిన నష్టపరిహారానికి సంబంధించింది. ర్యాన్‌బాక్సీ విషయంలో రెండేళ్లనాటి తమ నిర్ణయంపై ఇప్పుడు ఎఫ్‌డీఏ ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా ఉంది. ర్యాన్‌బాక్సీ ఉత్పత్తి చేసిన మందుబిళ్లల్లో ‘వెంట్రుకలా కనబడుతున్న’ పదార్ధం ఉన్నదట. అలాగే, కొన్ని మందుబిళ్లలపై నల్లటి మచ్చలు కనబడ్డాయట. ఆ మచ్చలు నూనె అవశేషాలు కావొచ్చని ఎఫ్‌డీఏ పరిశీలన తేల్చింది.
 
 ఇంత నిర్లక్ష్యంగా ఉత్పత్తి చేస్తున్న ఔషధాలవల్ల తమ ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ముంచుకొస్తుందన్న ఉద్దేశంతో వాటి దిగుమతులను నిషేధించింది. మంచిదే. తమ ప్రజల క్షేమంపై అక్కడి ప్రభుత్వ విభాగం అంతటి ఆదుర్దా కనబర్చడాన్ని చూసి ముచ్చటపడాల్సిందే. అభినందించాల్సిందే.  కానీ, అదే సమయంలో మన పాలకులకు అలాంటి లక్షణాలు కొంచెం కూడా లేవన్న సంగతిని వెల్లడించే కథనాన్ని చూసి విచారించక తప్పదు. ఒబామా ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గిన యూపీఏ ప్రభుత్వం అణు పరిహార చట్టంలోని నిబంధనలను నీరుగార్చడానికి సిద్ధపడు తున్నదని రెండో కథనం చెబుతోంది. 2008లో యూపీఏ సర్కారు అమెరికాతో చేసుకున్న పౌర అణు సహకార ఒప్పందం తర్వాత రెండేళ్లకు తీసుకొచ్చిన అణు పరిహార బిల్లుపై తీవ్ర చర్చ జరిగింది.
 
  ప్రమాదాలు సంభవించినప్పుడు అణు విద్యుత్ కర్మాగారాన్ని నిర్వహించే సంస్థే ప్రజలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని బిల్లు చెప్పడాన్ని సభ్యులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. నాసిరకం పరికరాలవల్ల ప్రమాదం జరిగిందని తేలిన సందర్భాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామగ్రిని సమకూర్చిన సంస్థ నుంచి కర్మాగార నిర్వాహకులు పరిహారాన్ని రాబట్టడానికి వీలుకల్పించాలని అప్పట్లో సభ్యులంతా పట్టుబడితే చివరకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రతిపక్షాలు కోరినట్టే బిల్లును సవరించింది. పర్యవసానంగా అణు పరిహార చట్టంలో సెక్షన్ 17(బీ) వచ్చిచేరింది. రియాక్టర్ల లోపం కారణంగా అణు ప్రమాదం సంభవించినపక్షంలో ఆ కర్మాగారాన్ని నిర్వహించే భారత అణు ఇంధన సంస్థ (ఎన్‌పీసీఐఎల్) సరఫరాదారు నుంచి గరిష్టంగా రూ.1,500 కోట్లు పరిహారాన్ని రాబట్టవచ్చని ఈ చట్టం చెబుతోంది.
 
 బాధ్యతరహి తంగా నాసిరకం సరుకు అంటగట్టినప్పుడు అందుకు ఫలితం అనుభవించాలంటే అమెరికా, రష్యా తదితర దేశాలు ససేమిరా అంటున్నాయి. ఆ నిబంధనను తొలగిం చడం లేదా సవరించడం చేస్తే తప్ప అణు విద్యుత్కేంద్రాల ఏర్పాటుకు తాము ముందుకు రాబోమని ఆ రెండు దేశాలూ పట్టుబడుతున్నాయి. అందువల్లే అణు విద్యుత్కేంద్రాల ఏర్పాటులో జాప్యం చోటు చేసుకుంటోంది. మరోపక్క పరిహారం ఇంత తక్కువగా ఉండటంపై పలు స్వచ్ఛంద సంస్థలు అప్పట్లోనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వమూ, ప్రతిపక్షాలూ కూడా ఈ విషయంలో దేశ ప్రజలకు అన్యాయం చేశాయని ధ్వజమెత్తాయి. ఆ చట్టంపై సుప్రీంకోర్టులో దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.

 

మెక్సికో జలసంధిలో కొన్నేళ్ల క్రితం బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) సంస్థ నౌక నుంచి చమురు లీకైనప్పుడు పర్యావరణం ధ్వంసమైందని ఆరోపిస్తూ... అందుకోసం దాదాపు రూ.95,000 కోట్లు డిపాజిట్ చేయాలని అమెరికా సెనెటర్లు బీపీ సంస్థను డిమాండ్ చేశారు. 20,000 మంది మరణానికి దారితీసిన భోపాల్ దుర్ఘటన మిగిల్చిన విషాదఛాయలు ఇంకా కళ్లముందే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఫుకుషిమా అణు విద్యుత్కేంద్రంలో జరిగిన ప్రమాదంవల్ల జపాన్‌కు సంభవించిన నష్టం 3 లక్షల కోట్ల రూపాయల పైమాటే. అణు విద్యుత్కేంద్రంలో సంభవించే ప్రమాదం వెనువెంటనే వేలాది మంది మరణానికి దారితీయడమే కాదు... వేల ఏళ్లపాటు దుష్ర్పభావాన్ని చూపుతుంది. ఇంతటి అపారమైన నష్టాన్ని తెచ్చిపెట్టే ఘటన జరిగినప్పుడు పరిహారాన్ని కేవలం రూ.1,500 కోట్లకే పరిమితం చేయడమేమిటని పలువురు అణు శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వాదిస్తున్నారు. జరిగిన నష్టాన్ని బట్టి పరిహారాన్ని నిర్ణయించాలి తప్ప అందుకు పరిమితులు విధించడం మంచిదికాదని అంటున్నారు.
 
 ఇలాంటి పరిస్థితుల్లో అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆ చట్ట నిబంధనలను మరింత నీరుగార్చే పనికి యూపీఏ ప్రభుత్వం పూనుకున్నదని మీడియా కథనాలు చెబుతున్నాయి. పరిహార చట్టంలోని సెక్షన్ 17పై అణు శక్తి విభాగం అటార్నీ జనరల్ అభిప్రాయం కోరగా... నిబంధన ప్రకారం సరఫరాదారు నుంచి పరిహారాన్ని రాబట్టాలో, వద్దో నిర్ణయించుకోవాల్సింది నిర్వాహక సంస్థ ఎన్‌పీసీఐఎల్ మాత్రమేనని ఆయన చెప్పారని ఆ కథనాలు అంటున్నాయి.

అంటే, ప్రమాదం జరిగినప్పుడు విదేశీ సంస్థ నుంచి పరిహారం రాబట్టడానికి బదులు, ఈ దేశ ప్రజలు పన్నుల ద్వారా చెల్లించిన మొత్తాన్నే ఖర్చుచేస్తారన్నమాట! ఎంత ఘోరం?! పార్లమెంటు చేసిన చట్టానికే తూట్లుపొడిచే ఇలాంటి ప్రయత్నాలపై సహజంగానే నిరసనలు వెల్లువెత్తాయి. కథనాల్లో వాస్తవం లేదని కేంద్రం కొట్టిపారేస్తున్నా వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ నెల 27న ఒబామాతో మన్మోహన్ శిఖరాగ్ర భేటీ జరిగే నాటికి అణు పరిహార చట్టంపై ఆ దేశానికున్న అభ్యంతరాలను తీర్చాలన్న తహతహ, అక్కడి వారి మెప్పు పొందాలన్న ఆత్రుత మన దేశాధినేతల్లో కనబడుతోంది. ర్యాన్‌బాక్సీ విషయంలో అంత తీవ్రంగా స్పందించిన అమెరికాను చూసైనా మన పాలకులు నేర్చుకోవాలి. లక్షల మంది ప్రాణాలతో, జీవితాలతో ముడిపడి ఉన్న అంశంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే దేశ ప్రజలు క్షమించరని గ్రహించాలి.

మరిన్ని వార్తలు