నిఘా సంస్థలు... నియంత్రణలు!

30 Jul, 2013 05:19 IST|Sakshi

కొన్ని ఘటనలు ఊహించని చర్చకు దారితీస్తాయి. అంతవరకూ అమలులో ఉంటున్న వ్యవస్థల తీరుపై సందేహాలు రేకెత్తిస్తాయి. కొత్త ప్రశ్నలను ఎజెండాలోకి తెస్తాయి. ఈ దేశంలో ఎన్‌కౌంటర్లు కొత్తేమీ కాదు... ఏటా అవి పదుల సంఖ్యలో జరుగుతుంటాయి. కానీ, తొమ్మిదేళ్లక్రితం గుజరాత్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ మిగిలిన ఘటనల మాదిరిగా చరిత్ర అట్టడుగు పొరల్లో నిక్షిప్తమై ఉండిపోలేదు. ఇష్రాత్ జహాన్ అనే 19 ఏళ్ల యువతి, మరో ముగ్గురు యువకులు మరణించిన ఆ ఘటన... వచ్చే ఎన్నికల్లో దేశ ప్రధాని కాదల్చుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాజకీయ భవితవ్యానికి ఇప్పుడు పెద్ద పరీక్షగా నిలిచింది.

అంతటితో ఆగలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అత్యంత కీలకమైన రెండు సంస్థల మధ్య ఘర్షణకు వేదికైంది. అంతేనా... రహస్య సంస్థల పనితీరుపైనా, ఎవరికీ జవాబుదారీకాని వాటి వ్యవహారశైలిపైనా ఎన్నెన్నో ప్రశ్నలు రేకెత్తించింది. ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేసిన సీబీఐ... గుజరాత్‌కు చెందిన ఏడుగురు ఉన్నతాధికారులపైన అభియోగాలు మోపింది. వీరిలో అదనపు డీజీపీ స్థాయి అధికారినుంచి ఎస్‌పీ స్థాయి అధికారి వరకూ ఉన్నారు. అలాగే, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)కి చెందిన స్పెషల్ డెరైక్టర్ రాజీందర్ కుమార్, మరో మాజీ ఉన్నతాధికారి సుధీర్ కుమార్, మరో ముగ్గురు అధికారులు ఉన్నారు.

ఉద్యమాల్లో పాల్గొంటున్నవారిపై పోలీసులు కాల్పులు జరిపినప్పుడు బాధ్యులైన పోలీసులపై కేసులు పెట్టాలని, సస్పెండ్ చేయాలని విపక్షాలు డిమాండుచేస్తుంటాయి. అలా అడిగే ప్రతిసారీ ప్రభుత్వాలకు పోలీసుల నైతిక స్థైర్యమూ, అది దెబ్బతినగల ప్రమాదమూ కనిపిస్తుంటుంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ- విపక్ష సంవాదంలో వినిపించే ఈ వాదప్రతివాదాలు ఇప్పుడు ప్రభుత్వంలోనే భాగమైన రెండు విభాగాల మధ్య సాగుతుండటం ఒక వైచిత్రి. తమను సీబీఐ వేధిస్తున్నదని, ఈ కేసు సాకుతో తమ విభాగం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదకర క్రీడకు అది తెరలేపిందని ఐబీ ఆరోపిస్తున్నది. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అసిఫ్ ఇబ్రహీం ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఇది దేశ ఆంతరంగిక భద్రతకు చేటుతెస్తుందని కూడా హెచ్చరించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసుకునే చర్యలకు సీబీఐ వ్యవహారశైలి విఘాతం కలిగిస్తుందని కూడా చెప్పారు.

గుజరాత్ హైకోర్టు ఎన్‌కౌంటర్ నిజమైనదా, బూటకమైనదా తేల్చమంటే... ఆ ఘటనకు దారితీసిన గూఢచార నివేదికలో రంధ్రాన్వేషణ చేయడమేమిటన్నది ఐబీ అభ్యంతరం. ఇష్రాత్‌జహాన్, మరో ముగ్గురు నరేంద్ర మోడీని అంతమొందించేందుకు గుజరాత్ బయలుదేరారని అక్కడి పోలీసులకు ఉప్పందించింది ఐబీయే. ఎన్‌కౌంటర్ బూటకమైనదని తేల్చిన సీబీఐ... అసలు ఐబీ సమాచారంలో ఉద్దేశపూర్వక వ్యవహారమేమైనా ఉన్నదా, ఎన్‌కౌంటర్‌కు కుట్ర అక్కడే మొదలైందా అనే కోణాలను కూడా స్పృశిస్తోంది. దీనికే ఐబీ అభ్యంతరం చెబుతోంది. తమకు రకరకాల వర్గాల నుంచి సమాచారం అందుతుంటుందని, దాన్ని వెనువెంటనే శాంతిభద్రతలను చూసే విభాగాలకు పంపడం తమ ధర్మమని, ఇందులో దేశ భద్రత తప్ప తమకు మరేమీ గీటురాయి కాదని ఐబీ అంటున్నది. ఇప్పుడు సీబీఐ తీరువల్ల తమ సమాచార సేకరణ విధానానికి అవరోధం ఏర్పడుతుందని, అందువల్ల దేశ భద్రత దెబ్బతింటుందని అది చెబుతున్నది.

ఐబీ లేవనెత్తుతున్నవి కీలకమైన ప్రశ్నలే. సందేహంలేదు. కానీ, ఆ సంస్థకు వచ్చే సమాచారం నూరు శాతం లోపరహితమైనదని, సంబంధిత అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తున్నారని నిర్ధారించేది ఎవరు? ఆ సంస్థ జవాబుదారీ తనంతో పనిచేస్తుంటే ఇలాంటి ప్రశ్నలు తలెత్తేవి కాదు. ఐబీకానీ, విదేశాల్లో గూఢచర్యం నెరపే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా)కానీ... ఫోన్ సంభాషణలపైనా, ఇంటర్నెట్‌పైనా నిఘా ఉంచే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్‌ఓ)కానీ ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక అయిన పార్లమెంటుకు జవాబుదారీగా లేవు.

రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో ఉన్న కేంద్ర జాబితాలో ఐబీ ప్రస్తావన ఉన్నా దాని నిర్వహణ, నియంత్రణలకు సంబంధించి ఎలాంటి చట్టమూ లేదు. వీటి విధుల గురించి, నిధుల గురించి పార్లమెంటుకు ఏమీ తెలియదు. ఎన్నడో 126 సంవత్సరాలక్రితం వలసపాలకులు నెలకొల్పిన స్పెషల్ బ్రాంచ్ విభాగం ఐబీకి మాతృక. ఇలాంటి సంస్థల సేవలను అధికారంలో ఉన్నవారు దేశ భద్రతకంటే ప్రత్యర్ధి పార్టీలపై నిఘా వేసేందుకు, తమకొచ్చే ఓట్లు, సీట్ల లెక్కలు తెలుసుకునేందుకు వాడుకుంటున్నారని కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన పద్మనాభయ్య ఆమధ్య చెప్పారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బును జీతాలుగా తీసుకుంటూ ఇలాంటి పనులు చేసిపెట్టడం అధర్మమనిగానీ, తమ స్థాయికి తగనిదనిగానీ ఆ సంస్థల అధికారులెవరికీ అనిపించదు.

పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఇష్రాత్ జహాన్ ఉదంతంలో ఐబీ ఇచ్చిన సమాచారంపై కూపీ లాగడం సబబేనని ఎవరికైనా అనిపించకమానదు. స్వామికార్యంతోపాటు స్వకార్యం నెరవేర్చుకునే వారు ఎక్కడైనా ఉంటారు. 80వ దశకంలో ఇలాంటి పరిస్థితుల పర్యవసానంగానే తమ నిఘా సంస్థ ‘మిలిటరీ ఇంటెలిజెన్స్5’ (ఎంఐ5)లో సోవియెట్ గూఢచారులు వచ్చిచేరారని బ్రిటన్ గుర్తించి ఆ సంస్థకు చట్టరూపం ఇచ్చింది. అమెరికా గూఢచార సంస్థ కూడా చట్టబద్ధ సంస్థే. మరి మన గూఢచార సంస్థలే తాము అన్నిటికీ అతీతమన్నట్టు ఎందుకు వ్యవహరిస్తున్నాయి? గూఢచార సంస్థల అధికారాలు, వాటి నియంత్రణపై బీజేపీ ఎంపీ అర్జున్ మేఘ్వాల్ రూపొందించిన ప్రైవేటు బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లో చర్చకు రావాల్సి ఉంది. గూఢచార సంస్థలకు జవాబుదారీతనం కల్పించేందుకు ఆ చర్చ దోహదపడాలని అందరూ కోరుకుంటారు. చట్టబాహ్యతను ప్రభుత్వాలే ప్రోత్సహించడం అంతిమంగా ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది.
 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా