భయానకమైన రాజకీయ మలుపు

3 Oct, 2015 02:03 IST|Sakshi
భయానకమైన రాజకీయ మలుపు

జాతిహితం
 
బీజేపీ ప్రధాన జాతీయ పార్టీగా ఎదగడాన్ని నేను అతి దగ్గరగా పరిశీలించాను. అయినా, ‘‘అంచున ఉండే శక్తులు’’ అనే పదం ఎప్పుడు ఎలా పుట్టుకొచ్చిందో కచ్చితంగా చెప్పలేను. బహుశా 1992 చలికాలంలో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి ముందు అది వాడుకలోకి వచ్చి ఉండొచ్చు. మధ్యేవాద శక్తులు ఆ అంచున ఉండే శక్తులను సవాలు చేయలేక పోతే, అవి రూపాలను మార్చుకుని విస్తరిస్తాయి. ప్రధాన స్రవంతినే అవి మింగేస్తాయి. వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌లు ఒకప్పుడు అంచున ఉండే శక్తులు, నేడవి బీజేపీ ‘‘సోదర’’ సంస్థలు. సనాతన సంస్థ, సమాధాన సేన, అభినవ్ భారత్ నేటి శివారు సంస్థలు.

దాద్రీ ఘటన మన రాజకీయాల్లోని భయానకమైన మలుపును సూచిస్తోంది. బీజేపీ నిర్ద్వంద్వంగా ఖండించలేని లేదా తమకు సంబంధం లేదని ప్రకటించలేని హిందూ దురహంకార మూకల మిలిటెన్సీ పెరగడాన్ని అది సూచిస్తోంది. ఆ హత్యను అది విమర్శిస్తుందేగానీ మరో అరడజను విధాలుగా దాన్ని తక్కువ చేసి చూపుతోంది. అదెలాగో చూడాలంటే మీరు నా మిత్రుడు, బీజేపీ ఎంపీ, ఆర్‌ఎస్‌ఎస్ మేధావి తరుణ్ విజయ్ శుక్రవారం ‘‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’’లో రాసిన వ్యాసాన్ని చూడండి. మహమ్మద్ అఖ్ లాక్‌ను ‘‘కేవలం అనుమానంతోనే’’ మూకుమ్మడిగా కొట్టి చంపేయడాన్ని హిందుత్వ స్ఫూర్తి, భారతీయత అంగీకరించదు.

నా తండ్రి గోమాంసం తినలేదని రుజువైతే అప్పుడు ఆయన్ను ఎవరైనా తిరిగి తెస్తారా? అని ఆయన కుమార్తె అడగడం సరైనదే. అంటే, అతను ఒకవేళ నిజంగానే గోమాంసాన్ని తిని ఉంటే, అలా అని ఆ గుంపు వద్ద స్పష్టమైన ఆధారం ఉంటే, దానికి ప్రతీకారం తీర్చుకోవడం న్యాయమేనని అంతరార్థం. కానీ అసలు ప్రశ్న అతను గోమాంసం తింటే మాత్రం ఏం? అనేదే. ఉత్తరప్రదేశ్‌లో అది చట్టవిరుద్ధమేమీ కాదు. దాన్ని నిషేధించిన చోట అలాంటి నేరాలతో వ్యవహరించడానికి కఠిన చట్టాలున్నాయి.

సమస్యను తగ్గించి చూపే ప్రయత్నాలు
విడివిడిగా ఉన్న ఈ చుక్కలన్నిటినీ కలిపి చూద్దాం. మత (హిందూ) విశ్వాసులంతా గోమాంస భక్షణకు ప్రతీకారం తీర్చుకోడానికి సమీకృతం కావాలని పిలుపునివ్వడానికి గుడి లౌడ్ స్పీకర్‌ను ఉపయోగించుకున్నారు. స్థానిక ఎంపీ, కేంద్ర సాంస్కృతిక మంత్రితోపాటూ ఇతర బీజేపీ నేతలు కూడా ఆ ఘటనను ఖండించడంలో తరుణ్ విజయ్ చూపినంతగానూ తగ్గించి చూపే ప్రయత్నం చేశారు. మంగళూరులో ప్రేమ జంటలను చావ బాదడంపైనా, మహారాష్ట్ర, కర్ణాటకలలో హేతువాదులను హత్య గావించడంపైనా, ‘‘రామ్‌జాదే-హరామ్‌జాదే’’ (అక్రమ సంతానాన్ని గాక రాముని పుత్రులనే ఎన్నుకోవాలనే నినాదం), ‘‘ముస్లిం అయినా గానీ’’, ‘‘పాకిస్తాన్‌కు పొండి’’ వంటి వ్యాఖ్యలపైనా బీజేపీ ప్రతిస్పందనలు బాగా ఆలోచించి, విస్పష్టంగా ప్రకటించినవే. హిందు రాడికల్ శక్తుల ప్రమేయమున్న ఉగ్రవాద కేసులు నత్తనడక సాగడాన్ని వీటికి జోడించి మరీ చూడండి. అభినవ్ భారత్ నిజంగానే ఓ చిన్న అంచులోని బృందమే అయినట్టయితే, మరి అదేదో బాధిత సంస్థ అయినట్టు దాన్ని ఎందుకు కాపాడుతున్నట్టు?

దాద్రీ ఘటన మన రాజకీయాల్లో మలుపు అన్నాను. దేశ విభజన అల్లర్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక గుడి లౌడ్ స్పీకర్‌ను జనాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగించినందువల్ల మాత్రమే నేను అలా అనలేదు. అదీ ఒక ప్రాముఖ్యతగల విషయమే. అయినా దేవాలయాలు తమ మత విశ్వాసులను పిలవడం హిందూ సంప్రదాయమే. కానీ లౌకికశక్తులుగా తమకు తాము గొప్పలు చెప్పుకునే వారంతా ఈ ఘటనపై సాపేక్షికంగా మౌనంగా స్పందించడం అంతకంటే ముఖ్యమైన అంశం.

దాద్రీ ఢిల్లీకి కేవలం 40 నిమిషాల దూరంలోనే ఉంది. అయినా కాంగ్రెస్ అగ్ర నేతలెవరూ ఆ గ్రామానికి ఓ పాదయాత్రనో లేదా నిజనిర్ధారణ కార్యక్రమాన్నో సైతం చేపట్ట లేదు. లాలూ, నితీశ్, మమత అంతా లౌకికవాదుల ఓట్లను కోరుకునేవారే. అయినా ఆవుతో ముడిపడి ఉన్న విషయంలో జోక్యం చేసుకోవడానికి భయపడ్డారు. ఆవు పవిత్రత ఇప్పుడు పాకిస్తాన్ పట్ల శత్రుత్వమంత బహుముఖ పక్షపాత అంశంగా మారింది. హిందువులు అత్యధికంగా ఉండే రాష్ట్రమైన హరియాణా గోవధ చరిత్ర లేనిది. ఇప్పటికే అక్కడ గోసంరక్షణ చట్టం ఉన్నా, ఈ ఏడాది మార్చిలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరింత కఠిన పదజాలంతో కూడిన గోసంరక్షణ, గోవ్యాప్తి చట్టాన్ని చేశారు.

ముందుకు జరిగిన హిందుత్వ గోల్ పోస్ట్
ముందుగా గుర్తించాల్సింది, గోవధ నిషేధం నుంచి గోల్ పోస్టును గోవులను పెంపొందింపజేయడం వద్దకు జరిపారనేది. తద్వారా ఆ జంతువుకు పవిత్రతను మాత్రమేగాక, పరిపాలనలో చట్టబద్ధ హోదాను కూడా ఇచ్చారు. రెండు, దిగుమతి చేసుకున్న, క్యాన్లలోని గోమాంసాన్ని తినడాన్ని, గోవులను ‘‘వధించడానికి’’ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చెయ్యడాన్ని (దాన్ని నిరూపించేదెవరు?) కూడా నిషేధించారు. ఆ చ ట్ట ఉల్లంఘనకు జైలు శిక్షను 10 ఏళ్లకు పెంచారు. అంతేకాదు, కఠోరమైన నూతన అత్యాచార చట్టంలో లాగా దోషులుగా ఆరోపణకు గురైన వారిపైనే నిర్దోషులమని నిరూపించుకునే బాధ్యతను ఉంచారు. కనికరించి ఆవు వాంగ్మూలాన్ని మాత్రం ఆమోదనీయం చేయకుండా వదిలేశారు.

అంతేకాదు మరింత అసంబద్ధంగా స్వాధీనం చేసుకున్న మాంసాన్ని పరీక్షించడానికి రాష్ట్ర వ్యాప్తంగా లేబొరేటరీల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆ చట్టం నిర్దేశించింది. నేనేమైనా అతిశయోక్తులు చెబుతున్నానేమో అనుకుంటే ఆ చట్టం పూర్తి పాఠాన్ని మీరే చదవండి. ఏ గురుగావ్‌లోనో నివసిస్తున్న ఓ అత్యున్నత స్థాయి జపనీయ లేదా కొరియన్ ఎమ్‌ఎన్‌సీ ఎగ్జిక్యూటివ్ ఇంటిపై ఒక కానిస్టేబుల్ దాడి చేసి, అతని ప్రిజ్ నుంచి మాంసం ముక్కను తీసుకుని లేబొరేటరీలకు పంపే సన్నివేశం కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నాను. దయచేసి నవ్వేయకండి. అలాంటివి నిజంగానే జరుగుతాయి. అప్పుడు మోదీ కోరుకోని విధంగా ఓ మొట్టమొదటి స్థాయి దౌత్య సంక్షోభం తలెత్తడం, అది ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కడం మీరు చూడాల్సి వస్తుంది.

ఎదురులేని గో రాజకీయాలు
ఈ చట్టాన్ని, దానిలోని అసంబద్ధతలన్నిటితో సహా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడమే ఇక్కడ ముఖ్యమైన అంశం. కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు దానికి అనుకూలంగా ఓటు చేశారు. ఆ పార్టీ అత్యంత సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుదా ముఖ్యమంత్రిని అభినందించారు. గో రాజకీయాలకు ఎదురే లేదని హిందుత్వ గ్రూపులు కనిపెట్టాయి. ములాయం-అఖిలేశ్ ప్రభుత్వం దాద్రీ ఘటనపై స్పందించిన తీరు అన్నిట్లోకీ అత్యంత దిగ్భ్రాంతికరమైనది. వారి పోలీసులు ఆ మాంసాన్ని పరీక్షకు పంపారు. ఎక్కడికో నాకు తెలియదు. పొరుగు రాష్ట్రమైన హరియాణాలో అలాంటి ల్యాబ్‌లను ఇంకా నిర్మించనే లేదు. సునంద థరూర్ మరణించిన రెండేళ్లకు ఆమె విసెరా శాంపుల్స్‌ను అమెరి కాకు పంపాల్సి వచ్చింది! ఫోరెన్సిక్ సైన్స్ అలాంటి స్థితిలో ఉన్న దేశంలో మనం జంతు మాంసం ఏ జాతికి చెందినదో తెలుసుకోవాల్సి వస్తోంది.

ఇది, ఏప్రిల్ 2007 చివర్లో 43 డిగ్రీల ఎండలో మిట్టమధ్యాహ్నం వేళ నేను ఉత్తరప్రదేశ్‌లోని ధరంపూర్ గ్రామానికి వెళ్లినప్పటి సంగతిని గుర్తుకు తెస్తోంది. ఆ గ్రామం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బింజోర్‌కు వెలుపల ఉన్నది. ఆ ప్రాంతం కూడా దాద్రీ, ముజఫర్‌నగర్‌లతో కూడిన మతపరంగా సున్నితమైన అర్థచంద్రాకార ప్రాంతంలో భాగం. అది శాసనసభ ఎన్నికల కాలం. బీజేపీ యువ మోర్చాలో సాపేక్షికంగా జూనియర్ కార్యకర్తగా ఉన్న అశోక్ కటారియా జనాన్ని ఉత్సాహపరిచే పాత్ర పోషిస్తున్నాడు. హిందూ మహిళల అభ ద్రత గురించి, ఐఎస్‌ఐ సెల్స్ చురుగ్గా ఉండటం, ఆ జిల్లాలో ముస్లింల జనాభా 41 శాతానికి చేరడం వల్ల జాతీయ భద్రతకు ఏర్పడిన ముప్పు గురించి అతడు మాట్లాడాడు. ఇక ఆ తదుపరి మాంసం తినడంపైకి వెళ్లాడు.

‘‘వాళ్లప్పుడు కుక్కలు, పిల్లులు, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు, పాములను, భగవంతుడు, ప్రకృతి సృష్టించిన ఏ జంతువునైనా తినొచ్చు. కానీ ఒక్క గోమాంసం తినడం మాత్రం మానుకోవాలి. ఎందుకంటే గోవు మాకు మాతృమూర్తి. ఎవడైనా ఆవును చంపాడంటే ఆ లం.......కును మేం చంపిపారేస్తాం’’ అంటూ విరుచుకుపడ్డాడు. అప్పటికి అక్కడికి రాజ్‌నాథ్ సింగ్ కొంత అసమ్మతిపూర్వకంగా తల పంకిస్తూ వచ్చాడు. ‘‘యువ రక్తం కదా, ఒక్కోసారి వేడెక్కిపోతూ ఉంటుంది’’ అంటూ ఆయన తర్వాత దాన్ని తక్కువ చేసి చూపారు. ఆయన ఈ వారం జరిగిన దానికి కూడా అసమ్మతి చూపుతారనే ఆశిస్తున్నాను. అయితే కటారియా ఇప్పుడు, సాధ్వీ నిరంజన్ జ్యోతితోపాటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులలో ఒకరు.

ఒబామాను చూసి నేర్చుకోండి
శుక్రవారం తెల్లారి నేనిది రాస్తుండగా టీవీలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఓరెగాన్ కాల్పులపై మాట్లాడుతున్నారు. అది ప్రపంచంలోనే అత్యంత ఫెడరల్ దేశం. శాంతిభద్రతల విషయంలో ఆయన మాట చెల్లదు. అయినా ఆయన కేవలం రెండు గంటల్లోనే సాహానుభూతితో, ఉద్వేగంతో బహిరంగంగా మాట్లాడుతున్నారు. పదిహేను రోజుల క్రితమే ‘‘కూల్ క్లాక్ అహ్మద్’’ సమస్యలో జోక్యం చేసుకున్నారు. ఆయన ఎవర్నీ సంతృప్తి పరచడం లేదు, తిరిగి భరోసానిస్తూ రాజధర్మాన్ని నిర్వర్తిస్తూ చాలా చిన్నదైన మైనారిటీ అయిన, భారత్‌లో కంటే చాలా ఎక్కువ అనుమానాస్పదంగా చూసే ముస్లింలకు చేయి చాస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి మీడియా సలహాలు నచ్చవు. కనీసం ఆయన తన మిత్రుడు బరాక్‌ను చూసైనా నేర్చుకోవాలి.


 - శేఖర్ గుప్తా
 twitter@shekargupta
 

మరిన్ని వార్తలు