అంతా విచిత్రం

20 Jun, 2015 03:36 IST|Sakshi
అంతా విచిత్రం

అక్షర తూణీరం
 
అంతా విచిత్రంగా ఉంది. ఏమీ అంతుబట్టడం లేదు. ఏపీ మొత్తం సాలెగూళ్లులా అల్లుకు పోయి ఉంది. కొంద రు యోగా చేస్తున్నారో, శిక్ష అనుభవిస్తున్నారో తెలియరా కుండా మెలికలు తిరిగి కని పిస్తున్నారు. అక్కడ ప్రశ్నార్థ కాలు, ఆశ్చర్యార్థకాలు గుట్టలుగా పడి ఉన్నాయి. కొన్ని కామాలు, మరికొన్ని చుక్కలు  ఇప్పుడే హెలికాప్టర్ దిగు తున్నాయి. సమానార్థకాలు, కాకువు దీర్ఘాలు, చప్ప రింతలు, నిష్టూరాలు, కొన్ని పలకరింతలు, కాసిని పుల కరింతలు పోలీసు వ్యానులో వచ్చి చోటు కోసం కాచు క్కూచున్నాయి. ‘చట్టం తన పని తాను చేసుకు వెళ్తుం ది’- ఇదొక ఆధునిక మహావాక్యం. పీవీ ప్రతిపాదించి దేశం మీదకు వదిలారు. దాని అవసరం, వినియోగం దినదినాభివృద్ధి చెందుతూ, ఆ వాక్యం వర్థిల్లుతోంది. చుట్టం కూడా అంతే, తన పని తాను చేసుకు వెళ్తాడు. తర్వాత ఉండమన్నా నిమిషం ఉండడు.

సంభాషణలను చెరపట్టడం మీద చర్చలు నడుస్తు న్నాయి. భారత దేశ రాజ్యాంగాన్ని కూలంకషంగా కాచి వడబోయాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రామాల్లో రచ్చబండలనించి సమస్త మాధ్యమాలూ ఫోన్ ట్యాపిం గ్ మీద చర్చిస్తున్నాయి. ఇతరుల రహస్యాలు వినడం తప్పా, ఒప్పా అనేది ముందు తేలాలి. ఆ తరువాత ఆ మాటల్లోని అవాకుల్నీ చెవాకుల్నీ పరీక్షించాలి. ఒక సారి దిగాక అక్కడిక ధర్మయుద్ధం, అధర్మయుద్ధం అంటూ ఉండదు. పద్మవ్యూహాలూ ఉంటాయి. అశ్వత్థామ హతః కుంజరఃలూ తప్పవు. సైంధవులూ ఉంటారు. శిఖండీ వస్తాడు. శల్య సారథ్యం నడుస్తూనే ఉంటుంది. అంతా బానే ఉంటుంది. పాపం ప్రజల మాటేమిటని ప్రజలు కాక మరెవరన్నా ప్రశ్నించుకున్నారా? ఉపన్యాసాలు, పరస్పర ఆరోపణలు కాకుండా విశేషాలేమన్నా ఉన్నాయా?

వెనకటికి ఓ కథ చెబుతారు. భర్త క్యాంపుకి పొరు గూరు వెళ్లాడు. కొన్ని వారాల తర్వాత ఫలానా రోజు వస్తున్నానని ఇంటికి తంతి కొట్టాడు. ఏదో తేడా వచ్చి చెప్పిందాని కంటే ఒకరోజు ముందే దిగాడు. ఇంటికి రాగానే భర్త చూడరాని దృశ్యం చూసి అవాక్కయ్యాడు. ఎలాగో వాక్కు తెచ్చుకుని ‘‘ఏమిటిది, తగునా?’ అని భార్యను ప్రశ్నించాడు. ‘‘ఏదైనా సహిస్తాను గాని మాట తప్పేతనాన్ని నేను భరించలేను. మీరు రేపొస్తానని ఇవ్వాళ రావడం ఘోరం. ఇది దుర్మార్గం. స్త్రీజాతినే అవమానించడం....’’ అంటూ పెద్ద దండకం అందు కుంది భార్య. ఈసారి ఆయన గారు నిజంగానే అవాక్క య్యారు. ఎందుకో ఈ మధ్య ఇలాంటి పాత కథలు గుర్తుకొస్తున్నాయి. నిజానికి ఇప్పుడు తలుచుకోవల్సింది కొత్త కథల్ని.

రాబోయే కథలని. అమరావతి ఆధు నిక-ప్చ్ కాదు, విశ్వవిఖ్యాత విశాల నగరంలో ఫోన్ ట్యాపింగ్‌లకు అవకాశం ఉండదు. నిక్షిప్తం  అవుతాయి గాని ఆ మాటలు ఏ పైశాచిక భాషలోనో రికార్డ్ అయి ఉంటాయి. ఎప్పుడైనా ఏలిన వారు మాత్రమే దాన్ని స్వార్థానికి గాని, నిస్వార్థానికి గాని వినియోగించుకో వచ్చు. అబ్బో, ఇంకా చాలా మతలబులుంటాయి. అవ న్నీ గోప్యం. చెప్పకూడదు.
 

 - శ్రీరమణ
 (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు