విద్యార్థులపై తూటా

1 Feb, 2020 00:07 IST|Sakshi

మహాత్ముడి 72వ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలంతా ఆయనకు నివాళులర్పిస్తున్న వేళ న్యూఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ర్యాలీ నిర్వహిస్తున్న జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై ఒక దుండగుడు గురువారం కాల్పులు జరిపిన దృశ్యాలు అందరినీ దిగ్భ్రాంతిపరిచాయి. నడిరోడ్డుపై పట్టపగలు ఇంతక్రితం ఎవరూ కాల్పులకు తెగబడలేదని కాదు. మూడు దశాబ్దాలక్రితం ముంబై మహానగరాన్ని గడగడలాడించిన మాఫియా ముఠాలు ఆధిపత్యం కోసం పరస్పరం తుపాకులతో తలపడిన సందర్భాలున్నాయి. ఒక్కోసారి కిరాయి గూండాలు వ్యాపారిపైనో, పారిశ్రామికవేత్తపైనో గురిపెట్టిన ఉదంతాలున్నాయి. అయితే అవన్నీ పోలీసులు ఘటనా స్థలి దరిదాపుల్లో లేనప్పుడు, వారు అప్రమత్తంగా లేనప్పుడు జరిగినవే. కానీ గురువారం నాటి ఉదంతం తీరు వేరు. అక్కడ పోలీసు బలగాలున్నాయి. రాజ్‌ఘాట్‌ వైపు వెళ్లే విద్యార్థుల్ని బలప్రయోగం చేసైనా నిరోధించడానికి ఆ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయి.

ఈలోగా నాటు తుపాకి ధరించిన దుండగుడు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులను గురి చూస్తూ... ‘స్వాతంత్య్రం కావాలా మీకు, ఇదిగో తీసుకోండి’ అంటూ కాల్చి ఒక విద్యార్థిని గాయపరిచాడు. ఇదంతా కెమెరాల సాక్షిగా, పోలీసు బలగాల సాక్షిగా జరిగిపోయింది. ఆరు వారాలక్రితం అదే విశ్వవిద్యాలయం విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగినప్పుడు ఆ ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీలు ఝుళిపించిన ఢిల్లీ పోలీసులు... ఆ తర్వాత పలుమార్లు ఆందోళనల్ని అడ్డుకోవడంలో అతిగా ప్రవర్తించిన పోలీసులు ఈసారి ఆ దుండగుడు తుపాకి తీసినా, దాంతో విన్యాసాలు చేసినా, చివరకు కాల్పులు జరిపినా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. న్యూజిలాండ్‌లో నిరుడు మార్చిలో క్రైస్ట్‌ చర్చి నగరంలో 51మందిని ఊచకోత కోసిన దుండగుడి వైనం ఎవరూ మరిచిపోరు. అతగాడు ఈ దాడినంతటినీ ఫేస్‌బుక్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఢిల్లీలో కాల్పులకు తెగబడిన దుండగుడు కూడా దాడికి ముందు ఫేస్‌బుక్‌లో లైవ్‌ ఇచ్చాడని చెబుతున్నారు.

 
దుండగుడు అప్పటివరకూ ఆ ఆందోళనకారులతోనే ఉన్నాడని, ఉన్నట్టుండి వేగంగా ముందు కొచ్చి కాల్పులు జరిపాడని, ఇది హఠాత్‌ సంఘటన గనుక తేరుకోవడానికి కొంత సమయం పట్టిందని పోలీసులు ఇస్తున్న సంజాయిషీ ఎవరినీ సంతృప్తిపరచదు. ఊహించని పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అవసరమైన శిక్షణ వారికుంటుంది. నిత్యం అలాంటి పరిస్థితులతో వ్యవహరిస్తుంటారు కాబట్టి అందుకు సంబంధించిన నైపుణ్యం మెరుగుపడాలి తప్ప తగ్గకూడదు. పైగా అంతవరకూ ఆందోళనకారుల్లో ఒకడిగా ఉన్నవాడు తమవైపు తుపాకి ధరించి, కేకలు పెడుతూ వస్తుంటే అతన్ని అదుపులోకి తీసుకోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఆ క్షణంలో అతగాడెవరో తెలిసే అవకాశం లేదు. ఆందోళనకారులవైపునుంచి వస్తున్నాడు గనుక తమకే హాని తలపెట్టొచ్చునని అనుమానం కలగాలి. కనీసం మతి చలించినవాడేమోనన్న సందేహమైనా రావాలి. కానీ పోలీసుల తీరు చూస్తే ఎంతో భరోసాతో ఉన్నట్టు కనబడింది. కాల్పులు జరుపుతున్నాడని అర్థమయ్యాక ఆందో ళనకారులు కూడా ఎదురుదాడికి ప్రయత్నించివుంటే మరెంతమందికి హాని కలిగేదో ఊహించలేం. ఉద్రిక్తతలను ఉపశమింపజేయడానికి, ఆ క్రమంలో అవసరమైతే బలప్రయోగం చేయడానికి అక్కడ సిద్ధంగా వున్న పోలీసులు అంత నిర్లిప్తంగా ఉండిపోవడాన్ని ఎవరూ ఊహించలేరు.

ఇందుకు ఏ సంజాయిషీ చెప్పినా అది సాకు మాత్రమే అవుతుంది. ఢిల్లీ పోలీసుల నిర్వాకం వెల్లడికావడం ఇది మొదటిసారి కాదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన జేఎన్‌యూపై ముసుగులు ధరించిన దుండగులు దాడి చేసి, లేడీస్‌ హాస్టల్‌తోసహా పలుచోట్ల దాదాపు మూడు గంటలపాటు బీభత్సం సృష్టించిన రోజున కూడా వారు ప్రేక్షకపాత్రే పోషించారు. విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల నుంచి తమకు అనుమతి అందలేదని తప్పించుకోజూశారు. ఆరోజు నిర్వా్యపకత్వం సరే... ఆ తర్వాతైనా సమర్థత చాటుకోలేక పోయారు. ఇంతవరకూ ఆ దుండగుల్లో ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేకపోయారు. దేశ రాజధాని నగరంలో శాంతిభద్రతల పరిస్థితి ఇంత అధ్వాన్నంగా వుంటే ప్రపంచ దేశాల్లో మన పరువు దెబ్బతినదా? కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌తో మాట్లాడారు. కానీ 24 గంటలు గడిచినా ఆ యువకుడు ఏ సంస్థకు చెందిన వాడో, నాటు తుపాకి అతనికెలా వచ్చిందో, ఫేస్‌బుక్‌లో అతను పెట్టిన ఉన్మాద రాతల వెనక ఎవరు న్నారో పోలీసులు ఇంకా ఆచూకీ రాబట్టినట్టు లేదు. 

ఢిల్లీలో ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలతోపాటు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం సాగుతోంది. కనుక ఈ రెండూ పరస్పర ప్రభావితాలవుతున్నాయి. ‘మీరు మోదీవైపు ఉంటారా, షహీన్‌బాగ్‌ వైపా?’ అని అమిత్‌ షా నేరుగానే ప్రచార సభల్లో ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మరో అడుగు ముందుకేసి దేశద్రోహుల్ని కాల్చి చంపాలంటూ సభికులతో నినాదాలు చేయించారు. అటు కాంగ్రెస్‌ సైతం షహీన్‌బాగ్‌ ఆందోళనల్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) పార్టీ ఈ ఉద్యమానికి దూరంగా తమ ప్రభుత్వం అయిదేళ్లలో సాధించిన విజయాల గురించి చెప్పుకుంటోంది. ఆందోళనపై కేజ్రీవాల్‌ స్పష్టమైన వైఖరి తీసుకోలేదు. ఎన్నికల్లో గెలుపు సాధించడం కోసం ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, ప్రజానీకంలో ఒకరకమైన అభద్రతా భావాన్ని కలగజేయడం బాధ్యతారాహిత్యమని నాయకులు గుర్తించాలి. ఇప్పుడు ఢిల్లీలో కాల్పులకు తెగబడి అరెస్టయిన యువకుడు ఇలాంటి ఉద్రిక్తతలతో ప్రభావితమయ్యాడని అర్ధమవుతోంది. కనుక నేతలు సంయమనం పాటించాలి. ఆచితూచి మాట్లాడాలి. 

మరిన్ని వార్తలు