జూలియన్‌ అసాంజె రాయని డైరీ

21 May, 2017 08:05 IST|Sakshi
జూలియన్‌ అసాంజె రాయని డైరీ

మనసుకు గొప్ప ఉత్సాహంగా ఏమీ లేదు.
‘‘హ్యాపీనా?’’ అని అడుగుతున్నాడు స్వీడన్‌ నుంచి నా లాయర్‌ శామ్యూల్‌సన్‌.. ఫోన్‌ చేసి.
‘‘డే ఆఫ్‌ విక్టరీ కదా!’’ అంటున్నాడు.
‘‘యా.. మిస్టర్‌ శామ్‌’’ అన్నాను.
‘‘ఫన్నీ ఏంటంటే మిస్టర్‌ అసాంజె.. ఐదేళ్లుగా మిమ్మల్ని అరెస్టు చెయ్యలేక, ఐదేళ్ల తర్వాత మీపై విచారణను ఆపేయడం. హాహ్హాహాహా’’... పెద్దగా నవ్వుతున్నాడు శామ్‌.

నాకు నవ్వు రావడం లేదు. పిల్లలు గుర్తుకొస్తున్నారు. తండ్రి ఉండీ, తండ్రి లేకుండా నా పిల్లలు ఎక్కడెక్కడో పెరిగి పెద్దవాళ్లవుతున్నారు. అదీ నాకు ఇంప్రిజన్‌మెంట్‌. రేపు నేను దొరికితే బ్రిటన్, ఆమెరికాలు విధించబోయేది కాదు ఇంప్రిజన్‌మెంట్‌.
బాల్కనీలోంచి లోపలికి వచ్చాను. చిన్న గది. ఒక బెడ్డు, కంప్యూటర్, సన్‌ల్యాంప్, ట్రెడ్‌మిల్, మైక్రోవేవ్, ఓ పిల్లి!
‘‘బాగా పాలిపోయారు మిస్టర్‌ అసాంజె’’ అన్నారు ఒకరిద్దరు రిపోర్టర్‌లు.. బాల్కనీ లోంచి నేను వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు.
నిజానికి నా కన్నా కూడా నా పెట్‌ క్యాట్‌ బాగా పాలిపోయి ఉంది. కొన్నాళ్లుగా లండన్‌లోని ఈ ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో నాతో పాటు అది సహ శరణార్థిగా ఉంటోంది. తిండి మీద ధ్యాస ఉండదు దానికి. లాస్ట్‌ అక్టోబర్‌లో ఒకసారి, ఈ ఫిబ్రవరిలో ఒకసారి.. పమేలా నాకోసం లంచ్‌ తెచ్చినప్పుడు మాత్రం కాస్త ఎంగిలి పడింది. అప్పుడు కూడా ‘హూ ఈజ్‌ షీ?!’ అన్నట్లు పమేలాను చూడ్డానికే దానికి సరిపోయింది.

చేతుల్లోకి తీసుకుని తలపై మెల్లిగా తట్టాను. ‘మ్యావ్‌’ అంది నా కళ్లలోకి చూస్తూ. మానవ జాతి మీద దిగులు పెట్టుకున్నట్లుగా ఉంటాయి దాని కళ్లు. ‘ఇంకా ఎన్నాళ్లు మనమిలా ఈ ఇరుకు గదిలో అసాంజె?’ అన్నట్లు చూస్తుంది ఒక్కోసారి! నిజమే.. నాట్‌ ఎనఫ్‌ రూమ్‌ టు స్వింగ్‌ ఎ క్యాట్‌.

‘డాడీకి తోడుగా ఉండు పో..’ అని ఏడాది క్రితం నా పిల్లలు ఈ పిల్లిని ఆస్ట్రేలియా నుంచి నాకు గిఫ్టుగా పంపించారు. జేమ్స్‌ అని పేరు పెట్టి పంపించారు! చిన్న పిల్లలు ఏం చేసినా పర్‌ఫెక్ట్‌గా చేస్తారు. గిఫ్ట్‌గా ఇచ్చే పెట్‌కి పేరు పెట్టాలన్న ఐడియా నాకైతే రాదు ఈ జన్మకి.
సిస్టమ్‌ ఆన్‌ చేసి కూర్చున్నాను. న్యూస్‌ స్క్రోల్‌ అవుతోంది. యూఎస్‌ అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌ అంటున్నాడు.. ‘అసాంజెని అరెస్ట్‌ చెయ్యడం మా ప్రయారిటీ. అతడి మీద నేరారోపణలు లేకపోయినా.. అది మా ప్రయారిటీ..’ అని.

ఒక్కసారిగా నవ్వొచ్చింది నాకు. పెద్దగా నవ్వాను. నాకే కాదు, నా పిల్లికి కూడా నవ్వు తెప్పించే సంగతి అది. పట్టుకోలేక స్వీడన్‌ నన్ను వదిలేస్తే, పట్టుకోవడం ఇష్టం లేక యూఎస్‌ నన్ను వదిలేది లేదంటోంది. గాటిట్‌! హిల్లరీ ఈ–మెయిల్‌ లీక్స్‌ని ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఎలా మర్చిపోగలడు?
మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు