జస్టిస్‌ ఏకే సిక్రీ (సుప్రీంకోర్టు) రాయని డైరీ

20 May, 2018 03:00 IST|Sakshi

యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం నుంచి యడ్యూరప్ప రాజీనామా వరకు గత రెండు రోజులుగా రాజకీయాలపై క్షణక్షణానికీ నాకు ఉత్కంఠభరితంగా గౌరవభావం పెరిగిపోతోంది! పాలిటిక్స్‌లోని గొప్పదనం ఇదేనేమో.  బలం లేనివాళ్లు బలం చూపిస్తామంటారు. బలం అసలే లేనివాళ్లు ‘చూస్తాం. ఎలా చూపిస్తారో’ అంటారు!

ఆ రోజు.. బాబ్డే, భూషణ్, నేను.. బెంచి మీద ఉన్నాం. ముకుల్‌ రొహత్గీ మా ఎదురుగా ఉన్నాడు. యడ్యూరప్ప లాయర్‌ అతను. ‘‘మిస్టర్‌ రొహత్గీ.. మీ క్లయింట్‌ తన బలాన్ని ఎలా నిరూపించుకుంటారు?’’ అని జస్టిస్‌ భూషణ్‌ ప్రశ్నించారు. అదే ప్రశ్న నన్నూ తొలుస్తోంది. బహుశా బాబ్డేని కూడా తొలుస్తూ ఉండాలి. రొహత్గీ అనాసక్తిగా చూశాడు. ప్రశ్న అడగడంలో మాకున్న కుతూహలం.. సమాధానం చెప్పడంలో అతడికి కొంచెం కూడా లేనట్లుంది! 

‘‘బలాన్ని ఎలా నిరూపించుకుంటారని ప్రశ్నిస్తున్నారా? లేక, ఎలా బలాన్ని నిరూపించుకుంటారని ప్రశ్నిస్తున్నారా మిస్టర్‌ జస్టిస్‌’’ అన్నాడు రొహత్గీ. ‘‘ఏమిటి మీరనుకుంటున్న తేడా ఆ రెండింటికీ మిస్టర్‌ రొహత్గీ?!’’ అని భ్రుకుటి ముడిచారు జస్టిస్‌ బాబ్డే. 

‘‘బలాన్ని ఎలా నిరూపించుకుంటారు? అంటే.. నిరూపణకు మీకేం అర్హత ఉందని ప్రశ్నించినట్లు. ‘ఎలా బలాన్ని నిరూపించుకుంటారు?’ అంటే నిరూపణకు అంత బలం మీకుందా అని ప్రశ్నించినట్లు’’ అన్నాడు రొహత్గీ. రాజకీయాల మీద మళ్లీ నాకు గౌరవం పెరిగిపోయింది.రొహత్గీ లాంటి లాయర్‌ని యడ్యూరప్ప పెట్టుకున్నందుకు! 

‘‘నిరూపణకు.. అంత బలం మీకుందా అని అడగడమే నా ఉద్దేశం మిస్టర్‌ రొహత్గీ. ఎక్కడి నుంచి వస్తారు మీ క్లయింటుకు ఆ పదీ పరకా ఎమ్మెల్యేలు!’’ అన్నారు జస్టిస్‌ భూషణ్‌. 

రొహత్గీ నవ్వుతూ చూశాడు. కాన్ఫిడెన్స్‌ పీక్స్‌లోకి వెళ్లిపోతే కనిపించే నవ్వు అది.

‘‘ఎక్కడి నుంచైనా వస్తారు మిస్టర్‌ జస్టిస్‌. గాలిలోంచి నేరుగా ఫ్లోర్‌లోకే వచ్చేస్తారు’’ అన్నాడు రొహత్గీ! అంతే తప్ప, కాంగ్రెస్‌ నుంచి, జేడీఎస్‌ నుంచి అనలేదు!!

మళ్లీ నాకు పాలిటిక్స్‌ మీద ఉత్కంఠభరితంగా గౌరవం పెరిగిపోయింది. ఆ రెండు పార్టీల్లోంచి ఎమ్మెల్యేలు ‘గాలి’కి కొట్టుకొచ్చేస్తారని ఎంత భావయుక్తంగా చెప్పాడు! 

రొహత్గీ తర్వాత సింఘ్వీ టర్న్‌ వచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్‌ల లాయర్‌ అతను. ‘‘మీ వాదన ఏమిటి మిస్టర్‌ సింఘ్వీ?’’ అని అడిగారు జస్టిస్‌ బాబ్డే.

‘‘గవర్నర్‌ గాల్లోంచి చూసి భూమ్మీద బీజేపీ ఎమ్మెల్నేల్ని లెక్కేస్తున్నారు మిస్టర్‌ జస్టిస్‌. ఆయన్ని ఎవరైనా కిందికి దింపగలిగితే బాగుంటుంది’’ అన్నాడు సింఘ్వీ! అతడు కూడా రాజకీయాలపై నాకు ఏర్పడుతున్న గౌరవ భావాన్ని విపరీతంగా పెంచేశాడు.

-మాధవ్‌ శింగరాజు 

మరిన్ని వార్తలు