నెరవేరిన జలసంకల్పం

22 Jun, 2019 00:51 IST|Sakshi

గోదావరి జలాలను సమర్ధవంతంగా వినియోగించుకుని తెలంగాణలోని బీడు భూముల్ని సస్య శ్యామలం చేయాలన్న సంకల్పంతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ముగ్గురు ముఖ్య మంత్రుల సాక్షిగా శుక్రవారం ప్రారంభమైంది. మూడేళ్లనాడు మొదలైన ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు అనేకానేక అవాంతరాలకు, అవరోధాలకు ఎదురీదుతూ చకచకా ముందుకు సాగిన తీరు అపూర్వ మని చెప్పాలి. ఎన్నో ప్రాజెక్టులు, వందల కిలోమీటర్ల పొడవైన సొరంగాలు, రిజర్వాయర్లు, కాల్వలు, భారీ మోటార్లు... ఇవన్నీ మూడేళ్ల వ్యవధిలోనే పరిపూర్తి చేయడం అద్భుతం, అసాధా రణం. దాదాపు 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తూనే, జనం దాహార్తిని తీరుస్తూనే, పరి శ్రమల అవసరాలకు సైతం ఉపయోగపడేవిధంగా ఈ బృహత్తర ప్రాజెక్టును తీర్చిదిద్దారు. 

గోదా వరి నదీగర్భం నుంచి దాదాపు అరకిలోమీటరు ఎత్తులో నీళ్లను ఎత్తిపోసి అక్కడి నుంచి వివిధచోట్ల నిర్మించిన బరాజ్‌లకు వాటిని తరలించి బీడు భూములను చివురింపజేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే విధంగా వ్యవహరిస్తే, పొరుగు అవసరాలను పెద్ద మనసుతో అర్ధం చేసుకోగలిగితే రాష్ట్రాల మధ్య అవగాహన సాధ్యమేనని, జటిలమైన జల వివాదాలు సైతం సునాయాసంగా పరిష్కారమవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరూ పించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ నిర్మించాలనుకున్న సమయంలో పొరుగునున్న మహారాష్ట్ర అందుకు అభ్యంతరం చెప్పినప్పుడు ఆయన చేసింది ఇదే. అనేక ప్రత్యామ్నాయాలను ఆలోచించి చివరకు తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ వద్ద ఎత్తిపోతల చేపడతామని ప్రతిపాదించి, ఆ రాష్ట్రాన్ని ఒప్పించారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రం వ్యక్తం చేసిన ఎన్నో సందేహాలను ఆయన పటాపంచలు చేయగలిగారు. 

మన దేశంలో జలవివాదాలు ఎన్ని సమస్యలను సృష్టిస్తున్నాయో, ఆ వివాదాల కారణంగా జనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలుసు. అయినా నేతలు కాస్తయినా వెనక్కి తగ్గరు. తమ వాదనే సరైందంటూ కాలం గడుపుతారు తప్ప ప్రజలకు మేలు కలుగుతుందన్న వివేచనను ప్రదర్శించరు. రాజ్యాంగంలోని 262వ అధికరణ నదీజలాల వివాదాలు తలెత్తినప్పుడు ఏం చేయాలో వివరిస్తుంది. నదీజలాల వినియోగం, పంపిణీ, నియంత్రణ వగైరాలపై రాష్ట్రాల మధ్య జగడం వచ్చినప్పుడు దాని పరిష్కారం కోసం తగిన యంత్రాంగాన్ని పార్లమెంటు ఏర్పాటు చేయొచ్చునని ఆ అధికరణ వివరిస్తుంది. దాన్ని అనుసరించే 1956లో నదీ జలాల బోర్డు చట్టం, అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం వంటివి వచ్చాయి. బోర్డు ఏర్పాటు ఇంతవరకూ సాకారం కాకపోయినా నదీజలాల చట్టం కింద ట్రిబ్యునళ్లు ఏర్పడ్డాయి. కానీ వీటిల్లో చాలా ట్రిబ్యునళ్లు వివా దాలు బాగా ముదిరాక ఉనికిలోకొచ్చినవే. కానీ ఆశ్చర్యమేమంటే ఇవి అంతులేని జాప్యం తర్వాత ప్రకటించిన నిర్ణయాలు వివాదాలను ఏమాత్రం  పరిష్కరించకపోగా వాటిని మరింత జటిలంగా మార్చాయి. 

జలవివాదాలు సుప్రీంకోర్టు పరిధిలోకి రాబోవని నిబంధనలు చెబుతున్నా చివరకు అవి అక్కడికే చేరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తీర్పుల్ని అమలు చేయడానికి ససేమిరా అంటున్నాయి. ‘ప్రజల మనోభావాల’ను సాకుగా చూపు తున్నాయి. ఏతావాతా రాజ్యాంగ అధికరణలు, చట్ట నిబంధనల ప్రకారం వెళ్లాలనుకుంటే ఏళ్లకేళ్ల సమయం పడుతుంది తప్ప చివరకు ఏ ఫలితమూ లభించడం లేదు. వివాదాలు తలెత్తిన రాష్ట్రా ల్లోని ప్రజానీకానికి అగచాట్లు తప్పడం లేదు. వేర్వేరు దేశాల మధ్య కూడా జలవివాదాలు పరిష్కా రమవుతుండగా మన దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య అటువంటి సమన్వయం కొరవడుతోంది.  పర్యవసానంగా ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. విలువైన జలాలు సముద్రంపాలవుతున్నాయి. 

గోదావరి నదిలోనే ఏటా 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోందని ఒక అంచనా. రెండు రాష్ట్రాల్లోని కోట్లాదిమందికి ప్రాణాధారమైన గోదావరి నదిలో ఏటా మూడు నెలల పాటు...అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో నీటి లభ్యత అత్యధికంగా ఉంటుంది. కానీ దురదృష్టమేమంటే ఇలా వచ్చే నీరంతటినీ సంపూర్ణంగా వినియోగించుకునే సామర్థ్యం తెలుగు రాష్ట్రాలు రెండిటికీ లేదు. మరోపక్క ఈ రెండు రాష్ట్రాలూ తరచుగా కరువు వాతబడి ఎన్నో సమ స్యలను ఎదుర్కొంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఉపాధి అవకాశాలు ఆవిరై జనం పొట్టచేతబట్టుకుని వలసపోతున్నారు. ఊళ్లు బావురుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు సాకారం కావడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ఆదర్శనీయమైనది. గోదావరి జలాలను ఎగువనున్న మహారాష్ట్రతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలూ వినియోగించు కోవాల్సి ఉండగా ఇందులో కేవలం మహారాష్ట్ర మాత్రమే తన వంతు వాటాను మెరుగ్గా వాడుకో గలుగుతోంది. 

గోదావరి జల వివాద ట్రిబ్యునల్‌ ప్రకటించిన అవార్డు ప్రకారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ వాటాకు 1486 టీఎంసీల నీళ్లు వస్తాయి. ఇందులో తెలంగాణకు 912.250 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 509.546 టీఎంసీలున్నాయి. నదుల్లో సమృద్ధిగా నీళ్లున్నప్పుడు సమస్యలు తలెత్తే ప్రశ్నే ఉండదు. అలా లేనప్పుడే వివాదాలు ముసురుకుంటాయి. కృష్ణానదిలో ఎప్పుడూ నీళ్లు సరిగా పారే పరిస్థితి లేనందువల్ల పంపకాల్లో పేచీ వస్తోంది. అది తరచుగా వివాదాల్లో చిక్కుకుం టోంది. గోదావరికి నీటి లభ్యత విషయంలో ఎప్పుడూ ఇబ్బంది లేదు. అలాగని ఇకముందూ ఇలాగే ఉంటుందనుకోవడానికి లేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై  తెలంగాణకు మహారాష్ట్రతో అవగాహన కుదిరినట్టే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య కూడా నదీజలాల విషయంలో సమ న్వయం, సదవగాహన ఏర్పడితే ఈ రెండు రాష్ట్రాల భవిష్యత్తూ దివ్యంగా ఉంటుంది. శుక్రవారం నాటి చారిత్రక ఘట్టం అది నూటికి నూరుపాళ్లూ సాధ్యమేనని బాస చేస్తోంది.

మరిన్ని వార్తలు