తాతాచార్ల కథలు

5 Nov, 2018 00:08 IST|Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

తాళపత్రాల్లో అగ్గిపురుగులకు ఆహుతౌతున్న తెలుగు సాహిత్యాన్ని పరిష్కరించి, పునరుద్ధరించిన మహనీయుడు సి.పి.బ్రౌన్‌. ఆయన వెలుగులోకి తెచ్చిన పుస్తకాల్లో ‘తాతాచార్ల కథలు’ ఒకటి.తాతాచార్యులు తెలుగు బ్రాహ్మణుడు, ‘50 ఏళ్ల’ వయసు కలవాడు, పొడగరి, దృఢకాయుడు, హాస్యప్రియుడు, సంస్కృతం బాగా చదువుకున్నవాడు. వైద్య గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలు ఈయన వద్దనే బ్రౌన్‌ చదువుకున్నట్లు తెలుస్తోంది. ఈయనను నెల్లూరు వాసిగా బ్రౌన్‌ స్వయంగా తన పరిచయ వాక్యాల్లో రాశాడు. ఈయన చెప్పిన కథలు తాతాచార్ల కథలు. వీటికి వినోద కథలని పేరు. తాతాచారి చెప్పిన కథలను విన్న బ్రౌన్‌ 1855లో ఇండియా వదిలి లండన్‌కు వెళ్లేముందు ప్రచురించాడు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదం ‘పాపులర్‌ తెలుగు టేల్స్‌’ పేరుతో ప్రచురితమైంది. 1916లో వావిళ్ల వారు తాతాచారి కథలను ‘ఎడిటెడ్‌ బై గురజాడ అప్పారావు, ద ఆథర్‌ ఆఫ్‌ కన్యాశుల్కం’ అని అట్టపై వేసి పునర్ముద్రించారు. ఇవే 1926లో ఒకసారి, 1951లో మరోసారి పునర్ముద్రణ పొందాయి. ‘సి.పి.బ్రౌన్‌ సంతరించిన తాతాచార్ల కథలు’ పేరుతో 1974లో బంగోరె సంపాదకుడిగా చతుర్థ ముద్రణ వచ్చింది.

‘గుడిని మసీదుగా మార్చిన రాయీజీ’ కథలో రాయీజీ ఒక నవాబు దగ్గర దివానుగా పనిచేస్తూ  విశ్వాసపాత్రుడిగా మెలుగుతూ ఒక పేటలో గుడిని నిర్మాణం చేస్తూవుంటాడు. ఆ విషయం నవాబుకు తెలియడంతో గుడి నిర్మాణం పూర్తయ్యేసరికి దాన్ని మసీదుగా రూపుదిద్దుకునేలా చేసి నవాబు మన్ననలు పొందుతాడు. ‘దుగ్గిశెట్టి కొడుకులు’ కథలో నెల్లూరులోని వెంకటగిరి కోటపైకి పిండారి దళం(ఊర్లు దోచుకుని జీవించేవారు) దండెత్తి రాకుండా కోట చుట్టూ వున్న మట్టిగోడలు బలంగా ఏర్పాటుచేసినట్లు ఉంది. ఆనాడు జరిగిన సంఘటననే చారిత్రక నేపథ్యంలో కథగా వివరించాడు. ఈ పిండారి దళం తరువాత గుంటూరు, మచిలీపట్నం, కడప జిల్లాల్లో దండెత్తి నష్టపరిచినట్లు తెలుస్తోంది. ‘నవాబు రూపాయిలు– రాణి ముద్రలు’ కథలో కుంఫిణీ ప్రభుత్వం పాత నాణేలను మాయం చేసి కొత్త నాణేలను ప్రవేశపెట్టిన ప్రస్తావన ఉంది. 1780–90 ప్రాంతాల్లో కుంఫిణీ వారు ‘అర్కాటు రూపాయిలు’ ముద్రించినట్లు తెలుస్తోంది. ఈ కథల ద్వారా రెండు శతాబ్దాల కాలం నాటి నవాబు పరిపాలన, సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులతోపాటు కులవృత్తులు, వ్యవసాయం లో రైతుల శిస్తుభారం వంటి చారిత్రకాంశాలెన్నో తెలుస్తాయి. బిల్మక్తా (= ఒక పనిని నిర్ణయించుకున్న కాంట్రాక్టు మొత్తం), ఇద్దుము (= రెండు తూములు; ధాన్యం కొలత), ముంగోరు (=పంటను ఆసామి రెండు భాగాలూ, సాగుచేసిన రైతు ఒక భాగమూ పంచుకొనే పద్ధతి) వంటి ఆనాడు వ్యవహారంలో ఉన్న మాండలిక పదాలెన్నో ఈ కథల్లో ఉన్నాయి. డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి

మరిన్ని వార్తలు