చరిత్ర సృష్టించిన కోహ్లీసేన

19 Jan, 2019 01:06 IST|Sakshi

భారత క్రికెట్‌ శుక్రవారంనాడు ఒక అద్భుతం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపైన మూడు ఫార్మట్ల లోనూ అజేయంగా నిలిచి చరిత్ర  సృష్టించింది. టెస్ట్‌ సిరీస్‌ను 2–1తోనూ, వన్‌డే పరంపరను  2–1తోనూ గెలుచుకొని టీ–20 సిరీస్‌ను డ్రా చేసుకున్నది. ఆస్ట్రేలియా గడ్డ మీద క్రికెట్‌ ఆడి ఓడిపోకుండా బయటకు వచ్చిన ఒకే ఒక దేశంగా ఇండియా రికార్డు నెలకొల్పింది. భారత క్రికెట్‌ జట్టు మూడవ వన్‌డేలో విజయం సాధించినప్పుడు మెల్బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో వేలమంది భారతీయ సంతతి క్రికెట్‌ అభిమానులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. భారత జట్టు నిన్నటి వరకూ ఆస్ట్రేలియాలోనూ, దక్షిణాఫ్రికాలోనూ ఒక్క సిరీస్‌ కూడా గెలవలేదు. మిగతా అన్ని దేశాలలోనూ భారత జట్టు విజయం సాధించింది. వెస్టిండీస్‌పైన నాలుగు సార్లూ, ఇంగ్లండ్, శ్రీలంకలపైన చెరి మూడు విడతలూ, న్యూజిలాండ్, జింబాబ్వేపైన  రెండు దఫాలూ ఇండియా గెలిచింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లపైన కూడా విజయం సాధించింది. ఇప్పుడు ఆస్ట్రే లియాపైన ఆధిక్యం చాటుకోవడంతో ఇక ఒక్క దక్షిణాఫ్రికాను మాత్రమే జయించవలసి ఉంది. విరాట్‌ కోహ్లీ నాయకత్వంలో అప్రతిహతంగా జైత్రయాత్ర చేస్తున్న జట్టు భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైనది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లోనూ, వికెట్‌కీపింగ్‌లోనూ ఎవ్వరికీ తీసిపోని క్రికెటర్లు భారత జట్టులో ఉన్నారు. ప్రపంచకప్‌ పోటీలలో పాల్గొనడానికి తహతహలాడుతున్న యువజట్టు అన్ని విభాగాలలోనూ, అన్ని ఫార్మాట్లలోనూ అద్వితీయమైన ప్రావీణ్యం ప్రదర్శిస్తున్నది.

ఆస్ట్రేలియాలో ముగిసిన మూడో వన్‌డేలో  ఎంఎస్‌ ధోని రాణించాడు. చివరి షాట్‌ను కొట్టి విజయం కైవసం చేసుకున్న  కేదార్‌ జాదవ్‌  61 పరుగులు, ధోనీ 87 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ధోనీ వరుసగా మూడు అర్ధ శతకాలు చేసి విమర్శకులకు తగిన సమాధానం చెప్పాడు.  లోగడ భారత జట్టు కెప్టెన్‌ అజహరుద్దీన్‌ తనపైన ఎవరైనా విమర్శిస్తే వారికి తన బ్యాట్‌ జవాబు చెబుతుందని అనేవాడు. అదే విధంగా ధోనీ పాటవం తగ్గిపోయిందనీ, ఆట నుంచి విరమించు కోవలసిన సమయం ఆసన్నమైందనీ, ప్రపంచకప్‌ దాకా ఆడలేడనీ విమర్శకులు సన్నాయినొ క్కులు నొక్కుతున్న తరుణంలో ధాటిగా ఆడి దీటుగా జవాబు చెప్పాడు. రాబోయే ప్రపంచ కప్‌ పోటీలో పాల్గొనే భారత జట్టులో తన స్థానం ఖరారు చేసుకున్నాడు. 231 పరుగులు చేయ వలసిన భారత జట్టు ఆ పని చివరి ఓవర్‌ దాకా ఆగకుండా కాస్త ముందుగానే చేయగలిగేది. ఆట అదుపు తప్పి పోలేదు. ధోనీ శతకం పూర్తి చేయాలనుకుంటే ఆట వేగం పెంచగలిగేవాడు. కానీ ధోనీ తన సహజ ధోరణిలో ‘మిస్టర్‌ కూల్‌’ అనే పేరు సార్థకం చేసుకుంటూ తొట్రుపడకుండా చివరి ఓవర్‌ వరకూ ఆడి విజయం సాధించాడు.

జట్టులో చివరి వరకూ వికెట్‌ కోల్పోకుండా ఆడుతూ గెలుపునకు అవసరమైన పరుగులు చేయడంలో (ఆటకు ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడంలో) ప్రపంచంలోనే ధోనీని మించిన క్రికెటర్‌ లేడు. ధోని వన్‌డేలలో 73 ఇన్నింగ్స్‌లలో ఆడి 46 ఇన్నింగ్స్‌లలో నాటౌట్‌ బ్యాట్స్‌మన్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ధోనీ ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలనే వివాదానికి అతడే తెరదింపాడు. 14 సంవత్సరాల నుంచి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడుతున్న తాను ఏ స్థానంలో రావాలో చెప్పలేననీ, కెప్టెన్‌ నిర్దేశించిన స్థానంలో బ్యాట్‌ చేస్తాననీ అన్నాడు. అనుభవం, ప్రావీణ్యం కలిగిన ధోనీ అయిదో స్థానంలో చక్కగా సరిపోతాడని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ధోనీ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలవడంలో ఆశ్చర్యం లేదు.‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ చహల్‌ విచిత్రమైన క్రీడాకారుడు. అతను ఆస్ట్రేలియా పర్యనలో ఉన్నాడు కానీ లేడు. జట్టుతో పాటు పర్యటించాడు కానీ జట్టులో లేడు. చిట్టచివరి మ్యాచ్‌లో చేర్చుకున్నారు. జట్టులోకి తీసుకోలేదని నిరాశానిస్పృహలకు లోను కాకుండా అవకాశం ఇవ్వగానే అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శన చేసిన అరుదైన లెగ్‌స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్‌. రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ కుదురుకుంటున్నట్టు కనిపించినప్పుడు 23వ ఓవర్‌లో చహల్‌కు కోహ్లీ పిలుపు అందింది.  ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ పీటర్‌ హాండ్సకాంబ్‌ 58 పరుగులు చేసి దూకుడు పెంచినప్పుడు చహల్‌ అత్యంత చాకచక్యంగా బౌల్‌ చేసి అతని వికెట్టు పడగొట్టాడు. అతనితో పాటు మరి అయిదుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ని చహల్‌ అవుట్‌ చేసి (6–42) భారత జట్టు విజయానికీ, చరిత్రను తిరగరాయడానికీ దోహదం చేశాడు. ఆస్ట్రేలియా బౌలింగ్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ ‘ఫాక్స్‌స్పోర్ట్స్‌’ టీవీ చానల్‌లో వ్యాఖ్యానిస్తూ ఈ హరియాణా కుర్ర వాడిని తెగమెచ్చుకున్నాడు. అంతకు మించిన

యోగ్యతాపత్రం ఎవరికి దొరుకుతుంది? గంగూలీ నాయకత్వంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో 2003–04లో సిరీస్‌ డ్రా చేసుకోగలి గింది. అదే విధంగా దక్షిణాఫ్రికాలో ధోనీ కెప్టెన్‌గా 2010–11లో భారత జట్టు ఓడిపోకుండా సిరీస్‌ డ్రా చేసుకున్నది. 1947–48 నుంచి ఇండియా టెస్ట్‌ క్రికెట్‌ ఆడుతున్నప్పటికీ విదేశాలలో మొదటి విజయం 1967–68 పర్యటనలో నవాబ్‌ ఆఫ్‌ పటౌడీ నాయకత్వంలోని జట్టుకు న్యూజిలాండ్‌లో లభించింది. అప్పటి న్యూజీలాండ్‌ జట్టులో కూనలు ఉండేవారు. ఇప్పటి అఫ్ఘానిస్తాన్‌ జట్టుకంటే బలహీనంగా నాటి న్యూజిలాండ్‌ జట్టు ఉండేది. అజిత్‌ వాడేకర్‌ కెప్టెన్‌గా ఇంగ్లండ్‌లో సిరీస్‌ గెలిచి నప్పుడు భారత జట్టును క్రికెట్‌ ప్రపంచం గుర్తించింది. 1983లో కపిల్‌దేవ్‌ నాయకత్వంలో ప్రపం చకప్‌ మొట్టమొదటిసారి గెలిచినప్పుడు భారత క్రికెట్‌ సగర్వంగా తలెత్తుకొని నిలిచింది. ఆ సన్ని వేశం క్రికెట్‌ అభిమానుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. ««ధోనీ కెప్టెన్‌గా 2013లో చాంపియన్స్‌ ట్రాఫీ గెలిచాం. ఈ సంవత్సరం మే 30న ఇంగ్లండ్‌లో ప్రారంభం కానున్న ఇంటర్నే షనల్‌  క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రపంచకప్‌ పోటీలో జయపతాకను ఎగరవేయగలిగితే కోహ్లీసేనకు చరిత్రలో చెరగని స్థానం దక్కుతుంది.

మరిన్ని వార్తలు