లక్ష్మణరేఖ!

19 May, 2016 04:24 IST|Sakshi
లక్ష్మణరేఖ!

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్మొహమాటంగా మాట్లాడతారని పేరుంది. న్యాయ వ్యవస్థ తీరుతెన్నుల గురించి వారం రోజుల వ్యవధిలో ఆయన రెండుసార్లు చేసిన వ్యాఖ్యానాలు సంచలనం కలిగించాయి. న్యాయవ్యవస్థ తన పరిధిని, పరిమితులను అతిక్రమిస్తున్నదన్నదే ఆ రెండు వ్యాఖ్యల సారాంశం. శాసన, కార్య నిర్వాహక వ్యవస్థల అధికారాల్లోకి న్యాయవ్యవస్థ చొరబడుతున్నదని వారంక్రితం ఆయన విమర్శించారు. దానిపై వివరణను కోరిన సందర్భంలో ఈసారి మరింత స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పారు. కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకోవలసిన నిర్ణయాలను దానికే వదిలేయాలి తప్ప ఆ పని న్యాయవ్యవస్థ నెత్తిన వేసుకోరాదని ఆయన హితవు పలికారు.

అంతేకాదు...న్యాయవ్యవస్థ క్రియాశీలతకు నిగ్రహం అవసరమని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ తనకు తాను లక్ష్మణరేఖ గీసు కోవాలని కూడా సూచించారు. అరుణ్ జైట్లీ కన్నా ముందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం న్యాయమూర్తుల సదస్సులో ఈ మాదిరే అన్నారు. న్యాయస్థానాలు హద్దు మీరుతున్నాయని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ పోకడలపై నేతలు ఆందోళన వ్యక్తం చేయడం ఇది మొదటిసారేమీ కాదు. ఆమాటకొస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సైతం దానిపై పలుమార్లు మాట్లాడారు. నాలుగేళ్లక్రితం అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.హెచ్. కపాడియా న్యాయ వ్యవస్థ క్రియాశీలత ఒక్కోసారి పరిధులను దాటుతోందని, ఇందువల్ల శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య ఉండాల్సిన సమతుల్యత దెబ్బతింటున్నదని అంగీకరించారు. ‘న్యాయం చేయాలన్న ఆత్రుతే’ అందుకు కారణమని ఆయన సంజాయిషీ ఇచ్చుకున్నారు.

అరుణ్‌జైట్లీ గతంలో కూడా న్యాయవ్యవస్థ లోటుపాట్లపై నిశితమైన విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా కూడా పనిచేశారు గనుక ఆయన అభిప్రాయాలు కొట్టేయదగ్గవి కాదు. న్యాయమూర్తులుగా పనిచేసేవారు రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవులనూ అంగీకరించరాదని 2012లో ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన సూచించారు. అక్కడితో ఆగలేదు...కొందరు న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత వచ్చే పదవులు ఆశించి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాస్తున్నారని కూడా ఆరోపించారు. ‘న్యాయమూర్తులు రెండు రకాలు... కొందరు న్యాయం తెలిసున్నవారైతే, మరికొందరు న్యాయ శాఖ మంత్రి తెలిసున్నవారు’ అని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.

వాటి సంగతలా ఉంచితే న్యాయవ్యవస్థ పరిధులు, పరిమితుల గురించి అరుణ్ జైట్లీ చేస్తున్న వ్యాఖ్యలతో బహుశా కాంగ్రెస్ కూడా ఏకీభవిస్తుంది. కామన్వెల్త్ క్రీడల స్కాం, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం మొదలుకొని బొగ్గు కుంభకోణం వరకూ ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎన్నో ఎదురుదెబ్బలు తింది. సీబీఐని యూపీఏ సర్కారు ఆటబొమ్మగా మార్చిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసి ఈ కేసుల పర్యవేక్షణను సుప్రీంకోర్టు తానే చేపట్టింది. ఆ పరాభవాన్ని కాంగ్రెస్ అంత సులభంగా మరిచిపోదు.

అయితే న్యాయవ్యవస్థ క్రియాశీలత అవసరాన్ని ఏర్పరిచిందీ, అది విస్తరించ డానికి దోహదపడిందీ కార్యనిర్వాహక వ్యవస్థ వైఫల్యాలేనన్న సంగతి మర్చి పోకూడదు. అధికారంలో ఉన్నవారు రాజ్యాంగానికీ, చట్టాలకూ అనుగుణంగా వ్యవహరిస్తే న్యాయవ్యవస్థ క్రియాశీలత అవసరమే ఏర్పడి ఉండేది కాదు. అయి దేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో జనం ఓట్లతో నెగ్గితే ఆ తర్వాత తమను ఎవరూ ఏమీ చేయలేరని, తాము ఎవరికీ జవాబుదారీ కాదని నాయకులు భావిస్తున్నారు. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారి చర్యలను నియంత్రించే చట్టాలు లేదా నిబంధనలుంటే వాటిని ఏమార్చడానికి సందేహించడం లేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాలకుల తీరుతెన్నులను గమనిస్తే ఈ సంగతి బోధపడుతుంది. అవతలి పార్టీల నుంచి గెలిచినవారిని బహిరంగ సభల్లో కండువాలు కప్పి ఆహ్వానించడానికి రెండు రాష్ట్రాల్లోని సీఎంలూ సందేహించడం లేదు. ఇలా చేయడం అనైతికమనుకోవడం లేదు. ఒకపక్క ఇంత దిగజారుడు పనులకు పాల్పడుతూ ప్రజల కనీసావసరాలపై దృష్టి సారించడానికి సమయం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటపుడు కరువు విషయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైతే...ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే ఉలికిపాటు ఎందుకు? తమ అధికారాల్లోకి చొచ్చుకొస్తున్నదని నొచ్చుకోవడం ఎందుకు? దేశంలో కరువుకాటకాలు అలముకున్నప్పుడు ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలో చెప్పడానికి 2005 నాటి విపత్తు నివారణ చట్టంతోపాటు 2009లో రూపొందిన కరువు మాన్యువల్, 2010నాటి జాతీయ విపత్తు నివారణ మార్గ దర్శకాలు ఉన్నాయి. అయినా చాలా రాష్ట్రాలకు వాటిని అమలు చేయాలన్న స్పృహే లేకపోయింది.  

ఈమధ్యే ‘నీట్’పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా జైట్లీ ప్రస్తా వించారు. పరీక్షల నిర్వహణ తమ పరిధిలోనిదైతే వాటిని ఎప్పుడు నిర్వహించాలో, ఏమి చేయాలో సుప్రీంకోర్టు చెప్పడమేమిటని రాష్ట్రాలు అడుగుతున్నాయని కూడా అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయాలున్న మాట నిజమే. కానీ వైద్య విద్యా రంగాన్ని మాఫియా శాసిస్తుంటే, నిజమైన అర్హతలున్నవారికి సీట్లు దక్కని పరిస్థితులుంటే, విద్య అంగడి సరుకవుతుంటే ఇన్ని దశాబ్దాలుగా నిర్లిప్తంగా ఉండిపోయిన ప్రభుత్వాల నిర్వాకం వల్లనే సుప్రీంకోర్టు రంగంలోకి దిగిందని గుర్తుంచుకోవాలి. ఉత్తరాఖండ్ వ్యవహారంలోనూ అంతే. ఒక ప్రభుత్వానికి మెజా రిటీ ఉన్నదో, లేదో తేలాల్సింది చట్టసభలోనే అన్న సంగతి మరిచి ప్రవర్తించడం వల్లనే అక్కడ సుప్రీంకోర్టు జోక్యం అవసరమైంది.   

ఏ వ్యవస్థకుండే అధికారాలకైనా ప్రాతిపదిక రాజ్యాంగమే. రాజ్యాంగం మూడు వ్యవస్థలకూ ఇచ్చిన అధికారాలైనా... నిర్దేశించిన పరిధులు, పరిమితులు అయినా ప్రజల ప్రయోజనాలనూ, శ్రేయస్సునూ కాంక్షించి రూపొందించినవేనని మరిచి పోకూడదు. తమ అధికారాలను న్యాయవ్యవస్థ కబ్జా చేస్తున్నదని ఆరోపించే ముందు తమ నిర్వాకం ఎలా ఉన్నదో, తమ పరంగా జరుగుతున్న తప్పులేమిటో మిగిలిన రెండు వ్యవస్థలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. లోటుపాట్లను సరిదిద్దు కోవాలి. అది జరగనంతకాలం న్యాయవ్యవస్థ క్రియాశీలతను హర్షించడమే కాదు... అది మరింత విస్తరించాలని అందరూ కోరుకుంటారు.

మరిన్ని వార్తలు