కస్టడీ హింస ఆగుతుందా?

2 Nov, 2017 00:52 IST|Sakshi

కస్టడీ హింస, లా కమీషన్‌, జస్టిస్‌ బల్బీర్‌ సింగ్‌ కమీషన్‌

పోలీసు కస్టడీలో చిత్రహింసలు పెట్టే సంస్కృతి మన దేశ ప్రతిష్టనూ, నాగరిక సమాజ విలువలనూ కాలరాస్తున్నా... దాన్ని చూసీ చూడనట్టు వదిలేస్తున్న పాల కులకు తాజా లా కమిషన్‌ నివేదిక జ్ఞానోదయం కలిగించాలి. జస్టిస్‌ బల్బీర్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని కమిషన్‌ మంగళవారం సమర్పించిన నివేదిక చిత్రహింస లకు పాల్పడే పోలీసు అధికారులకు యావజ్జీవ శిక్ష విధించడంతోసహా కఠిన చర్యలుండాలని, అందుకు చిత్రహింసల నిరోధక బిల్లు తీసుకురావాలని సిఫార్సు చేసింది. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఏ పార్టీలు అధికారంలో ఉన్నా సామాన్య పౌరుల విషయంలో పోలీసుల ప్రవర్తన ఒకేలా ఉంటున్నది. పాలనలో ఎదురవు తున్న సవాళ్లను అధిగమించడానికి పోలీసులపై అతిగా ఆధారపడే ధోరణి పెర గడం వల్ల వారిని చక్కదిద్దాలన్న స్పృహ ప్రభుత్వాలకు కొరవడుతోంది. ‘మన పోలీసులకు తగినంత సామర్ధ్యం ఉండటం లేదు. సంస్థాగతంగా, శిక్షణ పరంగా ఎన్నో లోపాలున్నాయి. దానిపై పర్యవేక్షణ లేకపోవడం మూలంగా పోలీసు వ్యవస్థ అవినీతికీ, అణచివేతకూ మారుపేరుగా నిలిచింది’ అని బ్రిటిష్‌ వలసపాలనలో 115 ఏళ్లక్రితం రెండో పోలీసు కమిషన్‌కు నేతృత్వంవహించిన ఫ్రేజర్‌ వ్యాఖ్యా నించాడు. ఇన్నేళ్లు గడిచినా ఆ మాటలు వర్తమాన పోలీసు వ్యవస్థపై చేసిన వ్యాఖ్యా నాలేమోనని సంశయం తలెత్తే పరిస్థితులే ఉన్నాయంటే అందుకు నిందించవల సింది పాలకులనే.

అక్రమ నిర్బంధాల్లోనూ, చిత్రహింసల్లోనూ మన దేశానికున్న అపకీర్తి తక్కు వేమీ కాదు. ఇక్కడ నేరాలు చేసి విదేశాలకు పరారైనవారు పట్టుబడిన సందర్భాల్లో ఈ పరిస్థితిని చక్కగా వినియోగించుకుంటున్నారు. తమను భారత్‌కు అప్పగించ రాదంటూ అక్కడి న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. నిర్బంధంలో చిత్రహింసలు పెట్టబోమని, వారి ప్రాణాలకు పూచీ పడతామని లిఖితపూర్వకంగా హామీ ఇస్తే తప్ప కొన్ని దేశాల్లోని న్యాయస్థానాలు నేరస్తుల అప్పగింతకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. నాగరిక దేశాలేవీ కస్టడీలో ఉన్నవారిపై చిత్రహింసలకు పాల్పడకూడదని... నిర్బంధితులతో క్రూరంగా, అమానుషంగా వ్యవహరించకూడ దని...ఆ మాదిరి చర్యలకు పాల్పడకుండా భద్రతాబలగాలను అదుపు చేయాలని 1975 డిసెంబర్‌ 9న ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ చరిత్రాత్మక ఒడం బడికను ఆమోదించింది. దానిపై మరో 22 ఏళ్లకు... అంటే 1997 అక్టోబర్‌లో మన దేశం సంతకం చేసింది. కానీ సిగ్గుచేటైన విషయమేమంటే దాన్ని ఈనాటికీ ధ్రువీ కరించలేదు. అలా చేయాలంటే పార్లమెంటులో చిత్రహింసల నిరోధక బిల్లు ప్రవేశ పెట్టి దాన్ని చట్టం చేయాలి. ఏడేళ్లక్రితం అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చి రాజ్యసభలో ప్రవేశపెట్టిందిగానీ దాన్నిండా కంతలున్నాయని విపక్షాలు ఆరోపించడంతో అది సెలెక్ట్‌ కమిటీకి పోయింది. అక్కడితో దాని కథ ముగిసి పోయింది.
 
చిత్రహింసల నిరోధక బిల్లు తీసుకురావాలని సిఫార్సు చేయడంతో లా కమి షన్‌ ఆగలేదు. అది ఎలా ఉండాలో సూచిస్తూ ఒక ముసాయిదా బిల్లు రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. చిత్రహింసకు కమిషన్‌ ఇచ్చిన నిర్వచనం విస్తృత మైనది. పోలీసులు తమ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా లేదా అసంకల్పి తంగా గాయపరిచినా... ఆ గాయం శారీరకమైనదైనా, మానసికమైనదైనా ముసా యిదా బిల్లు ప్రకారం చిత్రహింసే అవుతుంది. చిత్రహింసల బాధితులకు తగిన పరిహారం అందించాలనడంతోపాటు చిత్రహింసలకు తాము బాధ్యులం కాదని నిరూపించుకునే భారాన్ని అధికారులపైనే మోపింది. ఇందుకు భారతీయ సాక్ష్యా ధారాల చట్టాన్నీ, నేరశిక్షా స్మృతినీ సవరించాలని కమిషన్‌ సూచించింది. బాధితు లకు అందజేసే పరిహారాన్ని వారికేర్పడ్డ గాయాల స్వభావాన్ని, విస్తృతిని బట్టి న్యాయస్థానాలు నిర్ణయించాలని తెలిపింది. చిత్రహింసలు పౌరులకున్న జీవించే హక్కునూ, స్వేచ్ఛనూ హరిస్తున్నాయని గుర్తుచేసింది. పాలకుల అధికార దర్పం పోలీసుల ద్వారానే ప్రధానంగా వ్యక్తమవుతుంది. తాము బయటకు వెళ్లినప్పుడల్లా అతిగా వ్యవహరించి హడావుడి చేసే పోలీసు విభాగంపై పాలకులకు సహజంగానే ఆపేక్ష ఏర్పడుతుంది.

పోలీసులవైపు తప్పు జరిగినా వెనకేసుకురావడం, వారి స్థైర్యం దెబ్బతింటుందనే వాదన చాటున నిర్లి ప్తంగా ఉండిపోవడం సాధారణ పౌరులకు ప్రాణాంతకమవుతున్నదని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. తమ ప్రతినిధులుగా అధికారం చెలాయిస్తున్నవారు చేసే చర్య లకు రాజ్యం బాధ్యతవహించాల్సి ఉంటుందని లా కమిషన్‌ నివేదిక చెప్పడమే కాదు... చిత్రహింసల బాధితుల రక్షణకూ, వారి ఫిర్యాదులు వినడానికి, సాక్షులకు బెదిరింపులు రాకుండా చూడటానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. పోలీసు చిత్రహింసలు సాధారణ పౌరులకు మాత్రమే కాదు... అప్పు డప్పుడు ఉన్నత స్థాయి వ్యక్తులకూ తప్పడం లేదు. నిరుడు కేంద్ర కార్పొరేట్‌ వ్యవ హారాల మంత్రిత్వ శాఖలో డైరెక్టర్‌ జనరల్‌గా ఉంటూ ఒక లంచం కేసులో అరెస్ట యిన బాల్‌కిషన్‌ బన్సల్‌ విషాద ఉదంతం ఇందుకు ఉదాహరణ. లంచం తీసు కుంటుండగా బన్సల్‌ను పట్టుకున్న సీబీఐ ఆ తర్వాత ఆయన భార్య, కుమారుడు, కుమార్తెలతో అతిగా వ్యవహరించిందన్న ఆరోపణలొచ్చాయి. బన్సల్‌ కస్టడీలో ఉండగానే ఆయన భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకోగా... బెయిల్‌పై బయటి కొచ్చిన బన్సల్‌ తన కుమారుడితోపాటు ఉసురుతీసుకున్నారు. చనిపోయిన వారంతా తమను ఫలానా ఫలానా సీబీఐ అధికారులు మానసికంగా, శారీరకంగా హింసించారని లేఖలు రాసిపోతే... ఆ సంస్థ తనపై తానే ఏడాదిపాటు దర్యాప్తు జరుపుకుని తమ అధికారులంతా నిర్దోషులని మొన్నీమధ్యే క్లీన్‌చిట్‌ ఇచ్చుకుంది. ఇలాంటి దుస్థితి మారాలి. ఐక్యరాజ్యసమితి ఒడంబడికను ధ్రువీకరించే అంశాన్ని పరిశీలించేందుకు మూడు నెలలక్రితం కేంద్రం ఒక కమిటీని నియమించింది. తాజా లా కమిషన్‌ నివేదిక ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. పోలీసు చిత్ర హింసల విషయంలో మన దేశానికున్న అపఖ్యాతి తొలగాలి. మనదీ నాగరిక సమా జమేనని చాటిచెప్పాలి.

మరిన్ని వార్తలు