విగ్రహాలపై ఆగ్రహం!

8 Mar, 2018 00:58 IST|Sakshi

వదంతుల వల్లనో, అనుమానాల వల్లనో మనుషుల్ని కొట్టి చంపుతున్న సంస్కృతి సామాజిక మాధ్యమాల ద్వారా పరివ్యాప్తమై అందరినీ బండబారుస్తున్న తరు ణంలో విగ్రహ విధ్వంసాలు అతి సాధారణమనిపించవచ్చు. కానీ మనమొక ప్రజా స్వామిక వ్యవస్థలో ఉన్నామని... ఈ హత్యలు, విగ్రహ విధ్వంసాలు నాగరిక విలు వలకే విరుద్ధమైనవని, అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు తెచ్చే దురం తాలని గ్రహించినప్పుడు ఆందోళనా, ఆవేదనా కలుగుతాయి. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడైన తర్వాత ఆ రాష్ట్రంలో రెండు మూడుచోట్ల బీజేపీ కార్యకర్తలు విజయోత్సాహంతో రష్యా విప్లవ నేత లెనిన్‌ విగ్రహాలను కూల్చారు.

కొన్నిచోట్ల సీపీఎం కార్యాలయాల్ని ధ్వంసం చేశారు. వీటిని చూసి ఉత్సాహపడిన తమిళనాడు బీజేపీ నేత హెచ్‌. రాజా ‘కులోన్మాది పెరియార్‌ ఇ.వి. రామస్వామి విగ్రహానికి కూడా ఇదే గతి పడుతుంద’ని ఫేస్‌బుక్‌లో హెచ్చరించడం, కొద్దిసేపటికే కొందరు దుండగులు వెల్లూరులో పెరియార్‌ విగ్రహాన్ని కూల్చడం జరిగిపోయాయి. ఆవేశం తలకెక్కి, విచక్షణ కోల్పోయిన గుంపు ఏదో చేసిందను కోవడానికి లేకుండా త్రిపుర గవర్నర్‌ తథాగతరాయ్, పలువురు బీజేపీ నేతలు ఆ ఉదంతాలను సమర్థిస్తూ మాట్లాడిన తీరు విస్మయం కలిగిస్తుంది. ఈ వరస విధ్వం సాలపై ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు.

కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకో మని ఆదేశించారు. కానీ ఆ పని మొట్టమొదటి ఉదంతం సమయంలోనే చేసి ఉంటే ఇవి జరిగేవి కాదు. పైగా అలా చేయడం ఘనకార్యమన్నట్టు సీనియర్‌ నేతలే మాట్లాడటం అగ్నికి వాయువు తోడైనట్టయింది. ఈ విధ్వంసానికంతకూ లక్ష్యంగా మారినవారు వ్యక్తిమాత్రులు కారు. తమ జీవితకాలంలో అందరిపైనా బలమైన ముద్రవేసిన నాయకులు. మార్పు కోసం తపించినవారు. మెరుగైన సమాజానికి పాటుబడినవారు. వారి భావాలతో ఏకీ భావం లేకపోవచ్చు.

వారెంచుకున్న మార్గాలు సరైనవి కావన్న అభిప్రాయం ఉండొచ్చు. వారి సిద్ధాంతాలు నచ్చకపోవచ్చు. విగ్రహాలను కూల్చినంతమాత్రాన ఆ భావాలు, సిద్ధాంతాలు మటుమాయమవుతాయని మతిమాలిన గుంపు అను కుంటే అనుకుని ఉండొచ్చు... కానీ బాధ్యతగల పదవుల్లో ఉన్నవారు, నాయకులైన వారు అదే తరహాలో ఆలోచించడం దిగ్భ్రాంతికరం. వీరిలో కొందరైతే లెనిన్‌ ఈ దేశానికి చేసిందేమిటని ప్రశ్నించారు. ఉగ్రవాది అన్నారు. విదేశీయుడన్నారు.

లెనిన్‌ అయినా, అంతకు చాలాకాలం ముందు మార్క్స్‌ అయినా మన దేశంపై బ్రిటిష్‌ వలసవాదుల పెత్తనాన్ని గట్టిగా వ్యతిరేకించారు. వివిధ రూపాల్లో ఇక్కడ జరుగు తున్న పోరాటాలను సమర్ధించారు. ప్రసార సాధనాలు అంతగాలేని 1850 సమ యంలో కూడా మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెల్లువెత్తుతున్న పోరాటాలను అధ్యయనం చేసి వాటిని విశ్లేషించినవాడు మార్క్స్‌. 1857నాటి సిపాయిల తిరు గుబాటుపై వచ్చిన వార్తల ఆధారంగా అమెరికాకు చెందిన న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌లో మార్క్స్, ఏంగెల్స్‌ పలు వ్యాసాలు రాశారు.

‘పూర్ణ స్వరాజ్‌’ కోసం పోరాడాలని 1929 డిసెంబర్‌ 19న లాహోర్‌లో కాంగ్రెస్‌ తీర్మానించడానికి పదేళ్లముందే భారతదేశం బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి సాధించాలని అభిలషిం చినవాడు లెనిన్‌. దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటులో ఎంఎన్‌ రాయ్‌లాంటి వారికి తోడ్పాటునందించాడు. సమాజానికి వ్యాధిగా పరిణమించిన కులాన్ని నిర్మూలించడానికి, మహిళలకు సమాన హక్కులు సాధించడానికి, హేతువాద దృక్పథాన్ని పెంపొందించడానికి పెరియార్‌ ఇ.వి. రామస్వామి చేసిన కృషి అసా ధారణమైనది. తమిళనాట ఆయన నాయకత్వంలో సాగిన ‘ఆత్మగౌరవ పోరాటం’ దక్షిణాదినంతటినీ ప్రభావితం చేసింది.

నవ భారతం ఏర్పడేనాటికల్లా దేశంలో అసమానతలు పోవాలని ఆయన కలలుకన్నాడు. ఇలాంటివారి విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల ఏం సాధించవచ్చనుకుంటున్నారో అనూహ్యం. ఇదే తర హాలో అడపా దడపా మహాత్మాగాంధీ విగ్రహాలనూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలనూ ధ్వంసం చేసిన వారున్నారు. వాటిని అవమానించిన వారున్నారు. నిరుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని నిరోధించడానికి గ్రామ పెద్దలు ప్రయత్నించారు. అందుకోసం అనేక నెలలపాటు దళిత సంఘాలు, పార్టీలు పోరాడ వలసివచ్చింది.

ఇంతకూ త్రిపురలో ఏం జరిగిందని అంత ఉత్సాహం? ఇరవైయ్యేళ్ల సీపీఎం పాలన అంతమై బీజేపీ అధికారంలోకొచ్చింది. పైగా గెలిచిన బీజేపీకి, ఓడిన సీపీఎంకూ మధ్య ఓట్ల వ్యత్యాసం అరశాతం కూడా లేదు. బీజేపీకి 43 శాతం ఓట్లొస్తే... సీపీఎంకు 42.7 శాతం వచ్చాయి. ఆ రాష్ట్రంలో అంతక్రితం కూడా సీపీఎం ఒకసారి ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సాధించడమే కాక వరసగా ఇరవైయ్యేళ్లు పాలించింది. జనం మెచ్చే రీతిలో పాలన అందించలేనప్పుడు ఓడిపోవడంలో వింతేమీ లేదు. ఆ ఓటమికి మూల కారణాలేమిటో ఓడిన పక్షం విశ్లేషించుకుంటుంది.

కొత్తగా అధికారంలో వచ్చిన పార్టీ తానిచ్చిన వాగ్దానాలేమిటో, వాటి అమలుకు తీసుకోవాల్సిన చర్య లేమిటో పరిశీలించుకోవాలి. ప్రజల సంక్షేమానికి ఇంకేమి కార్యక్రమాలు చేపట్టాలో నిర్ణయించుకోవాలి. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ సాధించినప్పుడు ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలనూ గెలుచుకుంది. కానీ మరికొన్ని నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో తుడిచి పెట్టుకుపోయింది.

ఎన్నికల్లో గెలవడమే సర్వస్వం అనుకోవడం, విలువలకు తిలోదకాలొదిలి వీరంగం వేయడం ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది. గెలిచిన పక్షం ఓడిన పార్టీ కార్యాలయాలనూ, ఆ పార్టీ స్ఫూర్తిదాయకమని భావించేవారి విగ్రహాలనూ ధ్వంసం చేయడం లాంటి పనులకు పాల్పడితే అది అంతిమంగా అరాచకానికి దారి తీస్తుంది. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుంది. గెలుపులోనూ హుందాగా ఉండటం ఏ పార్టీ అయినా అలవర్చుకోవాల్సిన మంచి లక్షణం.

మరిన్ని వార్తలు