ప్రాణాంతక శస్త్రచికిత్సలు

12 Nov, 2014 00:00 IST|Sakshi

దశాబ్దాలు గడుస్తున్నా మన దేశంలో కుటుంబ నియంత్రణ కోసం నిర్దేశిస్తున్న లక్ష్యాలు పేద జనాలకూ, మరీ ముఖ్యంగా ఆ వర్గంలోని మహిళలకూ ప్రాణాంతకంగానే ఉంటున్నాయని ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శిబిరంలో జరిగిన విషాదకర ఉదంతం రుజువు చేస్తున్నది. ఆ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో 85 మంది మహిళలకు నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు వికటించి సోమవారం 10మంది మరణించగా, వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 40 మంది మహిళల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని అక్కడినుంచి అందుతున్న సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. శిబిరం నిర్వహించిన నలుగురు వైద్యులు కేవలం ఆరు గంటల వ్యవధిలో ఈ 85మందికీ ఆపరేషన్లు చేయడం, దాదాపు ఈ ఆపరేషన్లన్నిటికీ ఒకసారి వాడిన కత్తెరలు, సూదులు, బ్లేడ్‌లవంటి సామగ్రిని మళ్లీ మళ్లీ ఉపయోగించడం దిగ్భ్రాంతిగొలిపే విషయాలు. ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి అమర్ అగర్వాల్ సొంత జిల్లాలోనే ఇలాంటి ఉదంతం చోటు చేసుకున్నదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. బాధితులంతా వెనకబడిన ప్రాంతంలోని గ్రామాలకు చెందినవారు కావడం, వారంతా దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారే కావడం యాదృచ్ఛికం కాదు. నానాటికీ పెరుగుతున్న జనాభాను అదుపుచేయడం కోసం అమలు చేస్తున్న కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు మొదటినుంచీ పేద వర్గాలను లక్ష్యంగా చేసుకునే సాగుతున్నాయి.

1975లో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో దేశమంతా...మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ శస్త్ర చికిత్సలు విచ్చలవిడిగా సాగాయి. పెళ్లికాని యువతీ యువకులను సైతం బలవంతంగా శిబిరాలకు రప్పించి, వారికి శస్త్రచికిత్సలు చేశారని వెల్లడైనప్పుడు అందరూ నిర్ఘాంత పోయారు. నిర్దిష్ట గడువు విధించి అధికార యంత్రాంగానికి లక్ష్య నిర్దేశం చేయడంవల్లనే ఈ దారుణాలన్నీ చోటుచేసుకున్నాయని, ఇకపై దీన్ని మారుస్తామని అనంతర కాలంలో పాలకులు హామీ ఇచ్చారు. ‘కుటుంబ నియంత్రణ’ కాస్తా ‘కుటుంబ సంక్షేమం’ అయింది. ప్రజల్ని చైతన్యవంతులను చేయడంద్వారా, వారికి చిన్న కుటుంబంవల్ల కలిగే లాభాలను వివరించడం ద్వారా, వారి స్వచ్ఛంద అనుమతితోనే ఈ కార్యక్రమాన్ని చేపడతామన్న మాటలూ వినిపించాయి.

 కానీ క్షేత్రస్థాయిలో అప్పటినుంచీ పెద్దగా మారిందేమీ లేదని అడపా దడపా వస్తున్న వార్తలు చెబుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు టార్గెట్లు విధించడం ఆగలేదు. ఆ టార్గెట్లు అక్కడినుంచి మళ్లీ కింది స్థాయికి వెళ్లడమూ మానలేదు.  కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకయ్యే వ్యయాన్నంతా భరిస్తున్న కేంద్రం...అందుకోసం రాష్ట్రాల్లో ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నారో సరిగా పర్యవేక్షిస్తున్నట్టులేదు. బలప్రయోగం చేయకపోవచ్చుగానీ... శస్త్ర చికిత్స చేయించుకున్నపక్షంలో డబ్బు ముట్టజెబుతామని, వారిని తీసుకొచ్చే ఆరోగ్య కార్యకర్తలకు మరికొంత ఇస్తామని చెబుతూ సాగించే ఈ తతంగం నిరుపేద ల జీవితాల్లో సంక్షోభాన్ని సృష్టిస్తున్నది. బిలాస్‌పూర్ ఆరోగ్య శిబిరం విషయమే తీసుకుంటే ఆ శిబిరంలో శస్త్ర చికిత్స చేయించుకోవడానికి వచ్చిన మహిళకు రూ. 1,400, ఆమెను తీసుకొచ్చిన ఆరోగ్య కార్యకర్తకు రూ. 200 చొప్పున అందజేశారు. ఆకలి, అనారోగ్యం, పోషకాహారలేమితో ఇబ్బందులు పడే నిరుపేద గ్రామీణుల దగ్గరకెళ్లి ఇంత డబ్బు వస్తుందని ఆశపెడితే సహజంగానే ఇళ్లల్లోని మహిళలపై ఒత్తిళ్లు మొదలవుతాయి. ఇలాంటి శస్త్ర చికిత్సలు పురుషులు చేయించుకోవడమే ఉత్తమమని, వారైతే కొన్ని గంటల వ్యవధిలోనే తమ పనులు తాము యథావిథిగా చేసుకునే వీలుంటుందని నచ్చజెప్పేవారుండరు. చెప్పినా వినే పరిస్థితీ ఉండదు. చివరకు ఈ భారం మహిళలపైనే పడుతుంది.

 పదిహేనేళ్ల క్రితం రూపొందించిన జాతీయ జనాభా విధానం... పునరుత్పత్తికి సంబంధించిన సేవలు పురుషులకు ‘చాలా తక్కువ’గా అందుతున్నాయని తేల్చింది. దీన్ని సరిచేస్తే ఆ మేరకు మహిళల ఆరోగ్యం కుదుటపడుతుందని అభిప్రాయపడింది. కానీ, ఇన్నేళ్లు గడిచినా ఆ పరిస్థితి కాస్త కూడా మారలేదు. హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఇతర శారీరక సమస్యల కారణంగా అసలే ఇబ్బందులు పడే మహిళలు అపరిశుభ్ర వాతావరణంలో జరిగే ఇలాంటి ఆపరేషన్లవల్ల మృత్యువుకు చేరువవుతున్నారు. బిలాస్‌పూర్‌లో శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళలకు రక్తహీనత ఉన్నదని, శస్త్ర చికిత్స సమయంలో అయిన గాయాలు సెప్టిక్ అయి వారి ఆరోగ్యం క్షీణించి మరణించారని వైద్యులు చెబుతున్నారు. రోజూ ఇంటిల్లిపాదికీ వండివార్చే మహిళ పౌష్టికాహార లోపంతో, రక్తహీనతతో బాధపడుతున్నదని యునిసెఫ్ నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 70 శాతంమంది మహిళలు భారత్‌లో ఇలాంటి స్థితిని ఎదుర్కొంటున్నారని, అందువల్లే నిరుడు గర్భధారణ, ప్రసవ సమయాల్లో 50,000మంది మహిళలు మరణించారని ఐక్యరాజ్యసమితి ఇటీవలి నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాము శస్త్ర చికిత్సలు చేయబోయే నిరుపేద మహిళల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదో చూడవలసిన కనీస బాధ్యత వైద్యులపై ఉంటుంది. లక్ష్యాలను త్వరగా సాధించాలన్న తొందరో, మరేమోగానీ బిలాస్‌పూర్‌లో ఇలాంటి ప్రాథమిక జాగ్రత్తలేవీ తీసుకోలేదని అర్థమవుతున్నది. ఈ ఉదంతానికి కారకులైన నలుగురు వైద్యులను సస్పెండ్ చేశామని ఛత్తీస్‌గఢ్ సర్కారు చెబుతోంది. బాధిత కుటుంబాలకు పరిహారమూ ప్రకటించింది. మరి పాలకుల నైతిక బాధ్యత మాటేమిటి?  స్వచ్ఛందంగా సాగుతున్నదనుకుంటున్న ఈ కార్యక్రమంలోని లొసుగులను గుర్తించి, జనాభా నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను పునస్సమీక్షించడం అవసరమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది.
 

మరిన్ని వార్తలు