ఆర్థిక ఆసరాపై దృష్టి సారించాలి

12 May, 2020 00:04 IST|Sakshi

మూడో దశ లాక్‌డౌన్‌ గడువు వచ్చే ఆదివారంతో ముగియబోతుండగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దాదాపు యాభై రోజులక్రితం లాక్‌డౌన్‌ పరంపర మొదలయ్యాక ఇది ప్రధాని నిర్వహించిన అయిదో వీడియో కాన్ఫరెన్స్‌. కరోనా వైరస్‌ మహమ్మారితో అలుపెరగకుండా పోరాడుతున్న పలు రాష్ట్రాలు తమ ఆర్థిక ఇబ్బందులనూ, లాక్‌డౌన్‌ వల్ల ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలనూ, అది కొనసాగించడంలోని మంచిచెడ్డలనూ ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
(చదవండి: భారత్లోనే క్కువ: బ్ల్యూహెచ్వో)

అయితే కేంద్రం ఆలోచనలేమిటో మోదీ బయట పెట్టలేదు. అలాగే సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకూ ఏ మాదిరి చేయూతనిస్తారన్న స్పష్టత కూడా ఇవ్వలేదు. రాష్ట్రాలన్నీ కరోనా వ్యతిరేక పోరులో సమష్టిగా, చురుగ్గా పాల్గొనడం వల్లే ప్రపం చంలో దేశానికి మంచి పేరొచ్చిందని నరేంద్ర మోదీ చెప్పిన మాట వాస్తవం. అయితే ఆ క్రమంలో అవి పడుతున్న పాట్ల విషయంలో తగిన హామీ ఇస్తే బాగుండేది. వర్తమాన కాలంలో రాష్ట్రాలు మాత్రమే కాదు... కేంద్రం కూడా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయితే వాటిని అధిగ మించడానికి అవసరమైన వనరుల కల్పన కేంద్ర ప్రభుత్వానికే సాధ్యం. ఈ విషయంలో ఇప్పటికే ఆర్థిక నిపుణులు పలు సలహాలిచ్చారు.

ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలేవో, వేటిని అనుసరిస్తే తక్కువ నష్టంతో బయటపడటం సాధ్యమో కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. లాక్‌డౌన్‌ విధించి యాభైరోజులు కావస్తున్నా ఇప్పటికీ పీపీఈలపైనా, ఇతర వైద్య ఉపకరణాలపైనా జీఎస్‌టీ తొలగించమని రాష్ట్రాలు కోరే పరిస్థితి వుండకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలకు తన వంతుగా చేయాల్సిందేమిటన్నది కేంద్రం తనకు తానే చూడాలి. కరోనా విపత్తును అధిగమించడానికి ఇప్పటికే అమెరికా, జర్మనీ, బ్రిటన్‌ వంటివి తమ తమ జీడీపీల్లో పది శాతం మేర నిధుల్ని విడుదల చేసి రాష్ట్రాలకు బాసటగా నిలుస్తున్నాయి. మన దేశంలో కూడా అటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం వుంది. 

స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వలస కూలీల గురించి ప్రస్తావిస్తూ ‘ఇంటికి తిరిగి వెళ్లాలను కోవడం మానవ స్వభావమ’ని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలో నిజముంది. అయితే దాన్ని ముందే గుర్తించకపోవడం వల్ల అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు వలస కార్మికులు, వలస కూలీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. పని లేకపోవడానికి తోడు, ఆకలి రివాజుగా మారిన స్థితిని వలస కూలీలు తట్టుకోలేకపోయారు.
(చదవండి: వూహాన్లో ఆరు కొత్త కరోనా కేసులు)

ఇవిగాక కరోనా వైరస్‌ గురించి, తమలాంటి సామాన్య పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వెలువడుతున్న కథనాలు వింటూ స్వస్థలాల్లో తమ వారెలా వుంటున్నారోనన్న బెంగ వారిని అలుముకుంది. వీటన్నిటి పర్యవసానంగా వారు వందలు, వేల కిలోమీటర్లు నడిచి వెళ్లడానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. వివిధ నిబంధనల కారణంగా కావొచ్చు... వలసజీవుల కోసం నడుపుతున్న రైళ్లలో తమకు చోటు దొరకడం అసాధ్యమని భావించినవారు ఇప్పటికీ నడకనే నమ్ముకుని వెళ్తున్నారు.

ఒకపక్క దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఎలాంటి చర్యలు అవసరమన్న అంశంపై చర్చిస్తున్న తరుణంలో అందులో కీలక పాత్ర పోషించాల్సిన వలసజీవులను స్వస్థలాలకు తరలించే ప్రక్రియ కొనసాగు తోంది. ముందే ఎవరి ఇళ్లకు వారు వెళ్లే వెసులుబాటు కల్పిస్తే, వారంతా తిరిగొచ్చేందుకు ఎలాంటి చర్యలు అవసరమో ఇప్పుడు చర్చించే పరిస్థితి వుండేది. 

పౌరుల జీవికపై లాక్‌డౌన్‌ పెను ప్రభావాన్ని చూపుతున్న తీరును ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రస్తావించి కరోనా అంటే సాధారణ పౌరుల్లో వుండే భయాందోళనలను తొలగించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వైద్యరంగంలో మౌలిక సదుపాయాలు సక్రమంగా వుంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. వైద్యుల పర్యవేక్షణ వుంటుంది గనుక అందరిలోనూ వ్యాధులపై అవగాహన కలుగుతుంది. వాటి నివారణకు ఏం చేయాలో అర్ధం చేసుకుంటారు. వైద్య రంగ మౌలిక సదుపాయాలను మరింతగా అభివృద్ధి చేయాలంటే రూ. 16,000 కోట్లు అవసరమని జగన్‌మోహన్‌ రెడ్డి అభిప్రాయపడటంతోపాటు వడ్డీలేని రుణాలు లేదా తక్కువ వడ్డీ రుణాలు కల్పించడంతోపాటు వీటిని ద్రవ్యలోటు పరిమితుల పరిధినుంచి మినహాయించాలన్న సూచన కూడా చేశారు.

ఆరోగ్యంతోపాటు ఉపాధి కల్పనపై ఇప్పుడు అందరూ దృష్టి కేంద్రీకరించాలి. దాదాపు పది లక్షలమంది కార్మికులకు ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని ఆదుకుంటే జనంలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. అప్పుడు సరుకులకు డిమాండు ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థ సక్రమంగా అడుగేయాలంటే ఇదెంతో కీలకం. ఈ రంగాలకు చేయూతనిచ్చి, రెండు త్రైమాసికాలపాటు వీటికి వడ్డీ మాఫీ చేయాలన్న జగన్‌ సూచన కూడా శిరోధార్యం.  

లాక్‌డౌన్‌  అమలు అన్నిచోట్లా ఒకేలా లేదు. అంతర్రాష్ట్ర సరుకు రవాణాకు అడ్డంకులుండవని చెప్పినా, చాలా రాష్ట్రాలు వాటిని సక్రమంగా పాటించడం లేదు. ఈ వైఖరి వున్న సమస్యల్ని మరింత పెంచుతోంది. సరుకు రవాణా సరిగా లేకపోతే పరిశ్రమల్ని తెరిచి ఉపయోగం వుండదు. కావలిసిన ముడి సరుకు ఎక్కడో ఆగిపోతే ఉత్పత్తి స్తంభించిపోతుంది. ఇలాంటి లోపాల్ని సరిదిద్దాల్సిన అవసరం వుంది. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం సహజమే.

మహారాష్ట్ర వంటివి ఈ వ్యాధిని కట్టడి చేయడంలో ఎన్నో సమస్యలు ఎదు ర్కొంటున్నాయి. అటు వలస కార్మికులకు సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నాయి. అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఇప్పుడున్న లాక్‌డౌన్‌ నుంచి సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఏవిధమైన చర్యలు అవసరమో కేంద్రం సమగ్రమైన వ్యూహాన్ని రచించాలి. రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకునే చర్యలు ప్రకటించాలి.
(చదవండి: ఆపదలో ఆదుకుంది)

మరిన్ని వార్తలు