లాక్‌డౌన్‌ విచికిత్స

9 Apr, 2020 00:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనడానికి గత నెల 25 నుంచి దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ ఈ నెల 14తో ముగిసే తరుణంలో దాన్ని పొడిగించడమా, కొన్ని ప్రాంతాలకు పరి మితం చేయడమా, పూర్తిగా తొలగించడమా అనే అంశాలు చర్చలోకి వస్తున్నాయి. ఆ మహమ్మారి తీవ్రత స్వల్పంగా మందగించిందన్న అభిప్రాయం కలుగుతున్నా, లాక్‌డౌన్‌ను కొనసాగించడమే అన్నివిధాలా ఉత్తమమని దాదాపు అన్ని రాష్ట్రాలూ అభిప్రాయపడుతున్నాయి. కేరళ, పంజాబ్‌ మాత్రం దశలవారీ ఉపసంహరణ అవసరమని తెలిపాయి. అయితే ఆ రాష్ట్రాలు కూడా పంటల కోత, సాగు దిగుబడుల తరలింపు, వాటి మార్కెటింగ్‌ వగైరా కార్యకలాపాలు సజావుగా చూడటం కోసం కొన్ని మినహాయింపులివ్వాలంటున్నాయి. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడే కార్యక్రమాలనూ, ఇత రత్రా కార్యకలాపాలనూ యధావిధిగా నిలిపివేయాలని చెబుతున్నాయి.

లాక్‌డౌన్‌ కొనసాగించాల్సిం దేనంటున్న రాష్ట్రాల భయాందోళనలు కూడా సహేతుకమైనవే. దాన్ని తొలగించిన పక్షంలో కరోనా కేసుల సంఖ్య పెరిగితే ఆ రద్దీని తట్టుకోవడం ఇప్పుడు అమల్లోవున్న ప్రజారోగ్య వ్యవస్థలకు పూర్తిగా అసాధ్యం. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలతో నేతలతో మాట్లాడుతూ ప్రస్తుత స్థితిని సామాజిక అత్యవసర పరిస్థితితో పోల్చిన తీరు వర్తమాన వాతావరణా నికి అద్దం పడుతుంది. సాధారణ పౌరుల జీవనం సంక్షోభంలో పడకుండా చూడటం... అదే సమ యంలో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల ముందున్న పెను సవాళ్లు. ఈ రెండింటి మధ్యా సమతూకం వుండేలా చూడటానికి కొన్ని రంగాల కార్యకలాపాలను అనుమతించవలసిందేనన్న అభిప్రాయం కూడా వుంది. సుదీర్ఘకాలం లాక్‌డౌన్‌ అమలైతే జనమంతా ఆర్థిక ఇక్కట్లలో పడతారని  కేరళ చేసిన హెచ్చరిక గమనించదగ్గది. ఇవి శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే లాక్‌డౌన్‌ ఉద్దేశం దెబ్బతినడంతోపాటు ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యమే గల్లంతవుతుందని తెలిపింది.

ఈ సమస్యలను దృష్టిలో వుంచుకునే కావొచ్చు... ఈ పోరాటం మరింత శక్తిమంతం కావ డానికి వీలుకల్పించే ఆర్థిక చర్యలను, ఇతరత్రా విధానాలను ప్రకటించాలని కొందరు పార్లమెంటరీ పక్ష నేతలు సూచించారు. దశలవారీగా లాక్‌డౌన్‌ను సడలించినా, ఇదే మాదిరి కొనసాగించినా నరేంద్ర మోదీ చెప్పినట్టు మారిన పరిస్థితుల్ని అర్ధం చేసుకుని దేశం కొత్త తరహా పని సంస్కృతికి, కొత్త నమూనాలకు అలవాటుపడటం తప్పనిసరి. ప్రస్తుత లాక్‌డౌన్‌ కాలంలో సామాన్యులు అనేక విధాల ఇబ్బందులు పడుతున్న మాట, రాష్ట్ర ప్రభుత్వాలకు వనరుల కొరత వాస్తవమే అయినా... మన దేశంలో కరోనా వ్యాప్తి తీరు గమనిస్తే అది కొద్దో గొప్పో నియంత్రణలోకి వస్తున్నదని కొందరు ఆశాభావంతో వున్నారు. అయితే వేరే దేశాల తరహాలో విస్తృత స్థాయి పరీక్షలు జరగడంలేదు గనుక దీన్ని పూర్తిగా విశ్వసించడానికి లేదు. అందుకే మతపరమైన కార్యక్రమాలనూ, ఉత్సవాలనూ, సాంస్కృతిక కార్యకలాపాలనూ, విద్యారంగాన్ని మరికొన్ని రోజులు నిలిపివుంచక తప్పదు. సాధారణ పరిస్థితుల్లో ఒక రోగి దాదాపు 400మందికి ఈ వ్యాధి అంటించగలడన్న అంచనాలున్నాయి.

లాక్‌డౌన్‌ వల్ల అది కేవలం ముగ్గురికి పరిమితమవు తుందని అమెరికాకు చెందిన అధ్యయన సంస్థ చెబుతోంది. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్‌ తాకిడి అధికంగా వున్నదని, మరికొన్నిచోట్ల తక్కువగా వున్నదని ప్రభుత్వాలకు అవగాహన ఏర్పడింది. ప్రస్తుతం వెల్లడవుతున్న కేసుల్లో అత్యధిక భాగం లాక్‌డౌన్‌ విధించకముందు రోగులకు సోకిన వైరస్‌ కారణంగా వస్తున్నవే. ఇప్పుడున్న లాక్‌డౌన్‌ గడువు పూర్తయ్యేనాటికి కొత్తగా వైరస్‌ సోకిన కేసులు ఎన్ని వున్నాయో నిపుణులకు స్థూలంగా తెలిసే అవకాశం వుంది. దాన్నిబట్టి హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాలు మినహా మిగిలినచోట్ల కొన్ని సడలింపులివ్వడం ఎంతవరకూ మంచిదో ప్రభుత్వాలు పరిశీలించవచ్చు. నగరాలు, పట్టణాల్లో చిన్నా చితకా పనులు చేసుకునే వారూ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధికి గండిపడటంతో పల్లెబాట పట్టారు. పరిమితంగానైనా కొన్ని రంగాలను తెరవాలనుకుంటే అలాంటి వారందరినీ వెనక్కు తీసుకురావడం ఎలా అన్న సమస్య వుంటుంది.

కొంత ముందు చూపుంటే వీరిని ఉన్నచోటేవుంచి స్థానికంగా కరోనా కట్టడికి అమలు చేసే పలు కార్యక్రమాల్లో వీరి సేవలు వినియోగించుకోవడం వీలయ్యేది. లాక్‌డౌన్‌ ఉపసంహరించుకున్నప్పుడు వారంతా యధావిధిగా తమ పనుల్లోకి  వెళ్లడం సాధ్యమయ్యేది. ఈ కరోనా వైరస్‌  పౌరులందరికీ ఏకకాలంలో అనేక అంశాలు నేర్పింది. వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణం తదితరాలను ఇన్నాళ్లూ పెద్దగా పట్టించుకోని వారంతా వాటి ప్రాధాన్య తేమిటో గ్రహిస్తున్నారు. వాహనాల రాకపోకలకు బ్రేక్‌ పడటం, కాలుష్య కారక పరిశ్రమలు మూత బడటం వంటి కారణాలతో వాతావరణ కాలుష్యం, నదుల కాలుష్యం తగ్గింది. జనమంతా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం సాధ్యపడింది.

మనుషుల సంచారం పెద్దగా లేకపోవడంతో పక్షుల కిలకిలారావాలు వినబడుతున్నాయి. భయంభయంగా సంచరించే జంతువులకు ఇప్పుడు కాస్తంత స్వేచ్ఛ లభించింది. అలాగే మన ప్రజారోగ్య వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. విపత్తులు తలెత్తినప్పుడు తట్టుకోవడానికి అనువుగా వాటిని తీర్చిదిద్దడమెలా అన్న అంశాన్ని ప్రభుత్వాలు ఆలోచించేలా చేసింది. అసంఘటిత రంగ కార్మికులకు సైతం ఏదో రకమైన రక్షణలు కల్పించకపోతే ఆపత్కాలంలో ప్రభుత్వాలపై పెను భారం పడుతుందన్న అవగాహన కలిగించింది. లాక్‌డౌన్‌పై మరోసారి ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించబోతున్నారు గనుక అప్పటికల్లా లాక్‌డౌన్‌పైనా, అమలు చేయాల్సిన ఇతర చర్యలపైనా స్పష్టత వస్తుంది.

మరిన్ని వార్తలు