కుమార సంగక్కర రాయని డైరీ

23 Aug, 2015 09:52 IST|Sakshi
కుమార సంగక్కర రాయని డైరీ

చివరి టెస్టు! శారా ఓవల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నట్టుగా లేదు. ఫేర్‌వెల్ మూడ్‌ని చెదరగొట్టడానికి మా వాళ్లంతా బ్యాటింగులోకి దిగుతున్నట్టుగా ఉంది. స్కూల్లో చేరినప్చడు కొత్త పిల్లవాడిపై చూపే స్నేహాన్ని, ఉత్సాహాన్ని... ఇప్చడు ‘స్కూల్’ నుంచి వెళ్లిపోబోతున్న ఈ పాత పిల్లాడిపై అంతా చూపిస్తున్నారు. ఆశీర్వచనాలు అందిస్తున్నారు. హృదయానికి బాగా దగ్గరగా వచ్చి హత్తుకుంటున్నారు. స్టేడియంలోని ఈ ఉద్వేగాల హెచ్చుతగ్గులు నన్ను తాకకుండా వెళ్లిపోతున్నవేమీ కాదు.

గంభీరంగా ఆడే ప్రయత్నం చేస్తున్నాను. సెంచరీ కొట్టడంపై నా దృష్టి లేదు. కానీ ప్రతి బంతినీ కొట్టాలి. బలంగా కొట్టాలి. చివరి వరకూ ఎంటర్‌టైన్ చెయ్యాలి. నన్నీ స్థాయికి ఎవరైతే తీసుకువచ్చారో వారందరి కోసం ఒక్కో బంతినీ కొట్టాలి. ‘చివరి’ అనే మాట నాలోని ఏ నాడీమండల హృదయ కణజాలంలోనో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆట మధ్యలోనే బ్రేక్‌డౌన్ అయిపోతానా... ఎమోషనల్ గా!

స్టాండ్‌లో కూర్చుని ఉంది ఎహాలి. నా జీవిత భాగస్వామి. తనవైపు చూసే సాహసం చెయ్యలేకపోతున్నాను. నాకు తెలుసు తను నన్నే చూస్తూ ఉంటుందని. ఆ చిరునవ్వు... నేను వీడ్కోలు తీసుకుంటున్న క్షణాల్లోనూ అలాగే దృఢంగా ఉంటుంది. గట్టి అమ్మాయి. నా స్ట్రగుల్స్ మొత్తం తనకు తెలుసు. తన స్థిరత్వం ఒక్కటే నాకు తెలుసు. స్టేడియంలో తను ఉంటే... బిగించి ఉన్న ఆ పెదవులలోని స్థిరత్వం... పెవిలియన్ ను దాటుకుని వచ్చి నాలోకి ప్రవహిస్తున్నట్లు ఉంటుంది. నా ప్రతి ఆటలోనూ తను ఉంది. ఇప్చడూ ఉంది ఈ చివరి మ్యాచ్ లో. మామూలుగానే ఉందా? మూమూలుగానే ఉన్నట్లు ఉందా?

సంగ... సంగ... స్టేడియంలో పెద్దగా అరుపులు! సముద్రపు హోరులా! అంత హోరులోనూ ఉబికి రాబోయే నా కన్నీళ్ల హోరును నేను స్పష్టంగా వినగలుగుతున్నాను. బ్యాట్ పెకైత్తి అభివాదం చేయడానికి శక్తి చాలడం లేదు. స్ట్రయిట్ ఇంటూ ద క్రౌడ్... సిక్సర్‌ని కొట్టడానికి బ్యాట్ పైకి లేపినంత తేలిక కాదేమో, ఆఖరి మ్యాచ్ లో ఫ్యాన్స్ కోసం బ్యాట్ ను పైకి లేపి గాలిలో ఆడించడం! ఇవాళ నా నుంచి వాళ్లేమీ కోరుకోవడం లేదు. నన్ను నన్నుగా తప్ప. హౌ లక్కీ అయామ్! పదిహేనేళ్లు నన్ను ఆదరించిన వారికి ఒక్కరోజులో నేనేమి ఇవ్వగలను? గుండె నిండా కృతజ్ఞత మాత్రం ఉంది.

వచ్చిన రోజుల్ని మర్చిపోలేను. నా ఫస్ట్ కోచ్, నా ఫస్ట్ స్కిప్పర్, నా ఫస్ట్ టెస్ట్, నా ఫస్ట్ వన్డే, నా ఫస్ట్ సిక్స్, నా ఫస్ట్ సెంచరీ! వెళ్లిపోతున్న రోజునూ మర్చిపోలేను. నా ఫ్యాన్స్, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా ఫ్యామిలీ, ఇంకా... కోహ్లీ హ్యాండ్‌షేక్, టీమిండియా ‘గార్డ్ ఆఫ్ ఆనర్’! ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ కలిస్తేనే నేను. నాదంటూ ఏం లేదు. నేనంటూ ఏం లేను. థ్యాంక్యూ శ్రీలంక.


మాధవ్ శింగరాజు

మరిన్ని వార్తలు