కార్తీ (చిదంబరం తనయుడు) రాయని డైరీ

4 Mar, 2018 02:03 IST|Sakshi

కస్టడీ కంఫర్ట్‌గా ఉంది. ఫేస్‌లే ఫ్రెండ్లీగా లేవు. క్వొశ్చన్స్‌ కూడా కంఫర్ట్‌గా ఉన్నాయి. క్వొశ్చనింగే అన్‌ఫ్రెండ్లీగా ఉంది.
‘ఎంత తిన్నావ్‌?’ అని నవ్వుతూ అడిగితే,   ‘ఇంత తిన్నాను’ అని నవ్వుతూ చెప్పనా?! నేనెక్కడ నవ్వుతూ చెబుతానోనని, నాకెక్కడా నవ్వు రాకుండా అడుగుతున్నారు వీళ్లు. అయినాగానీ సడన్‌గా నవ్వొచ్చేస్తోంది.
‘‘ఊరికే నవ్వెందుకొస్తుంటుంది! నువ్వు ఎవరి అదుపులో ఉన్నావో తెలుసా?’’ అన్నారు రెండో రోజు ఇంటరాగేషన్‌లో.
‘‘నేను ఎవరి అదుపులో ఉన్నా, నవ్వు నా అదుపులో ఉండదు. నవ్వడం నాకు ఇష్టం’’ అన్నాను.
‘‘నీ ఇష్టం నీ ఇంట్లో’’ అన్నాడు కుర్ర ఆఫీసర్‌. అతడెక్కడో ఆ మాట విన్నట్లున్నాడు. దాన్ని నా మీద ప్రయోగించాడు. అలాంటివే ఏవో రెండు మూడు కూడా ఉదయం ఇంటరాగేషన్‌ మొదలవగానే అతడే ప్రయోగించాడు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగితే తెలియదనుకున్నావా? చట్టానికి వెయ్యి కళ్లు.. ఇలాంటివి!
‘‘నా ఇష్టం నా ఇంట్లోనా! అయితే నన్ను  ఇంటికి పంపించండి. కాసేపు నవ్వుకుని వచ్చేస్తాను’’ అన్నాను.
కుర్ర ఆఫీసర్‌కి నవ్వు రాబోయింది. ఆపుకున్నాడు. సీనియర్‌ ఆఫీసర్‌లకు కోపం రాబోయింది. ఆపుకున్నారు. ఈ ఆఫీసర్లెందుకో రాబోతున్న దానిని ఆపుకుంటారు!
సీబీఐ ఆఫీసర్‌ ఆపుకుంటున్నాడని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ఆపుకుంటున్నాడనీ, అడ్వొకేట్‌ జనరల్‌ ఆపుకుంటున్నాడనీ.. నేనెందుకు ఆపుకోవాలి?!
‘‘నా నవ్వును ఆపకండి. ఆపితే, నవ్వుతో పాటు, నా ఆన్సర్లూ ఆగిపోతాయి’’ అని నవ్వాను.
‘‘నీతో నిజం ఎలా కక్కించాలో మాకు తెలుసు’’ అన్నాడు కుర్రాఫీసర్‌. అతడిని సీరియస్‌గా చూశాడు సీనియర్‌ ఆఫీసర్‌. ‘‘సారీ సర్‌.. బెదిరిస్తే నవ్వు ఆపుతాడనీ..’’ అన్నాడు కుర్రాఫీసర్‌.
‘‘బెదిరిస్తే నా నవ్వు ఇంకా ఎక్కువౌతుంది. చిన్నప్పుడు స్కూల్లో మా హెడ్‌మాస్టర్‌ నవ్వొద్దని చెప్పినందుకు నేను నవ్వును ఆపుకోలేక చచ్చాను’’ అని చెప్పాను. ‘‘తర్వాతేమైంది?’’ అని ఆసక్తిగా అడిగాడు కుర్రాఫీసర్‌. అతడి వైపు మళ్లీ సీరియస్‌గా చూశాడు సీనియర్‌ ఆఫీసర్‌.
సాయంత్రం అయింది.
‘‘మళ్లీ రేపొస్తాం. రేపైనా నవ్వకుండా చెప్పు’’ అని కుర్చీల్లోంచి లేచారు ఆఫీసర్లు.
‘‘ఒక్కసారి సెల్‌ఫోన్‌ ఇవ్వండి. మా మమ్మీడాడీతో మాట్లాడి ఇచ్చేస్తాను’’ అన్నాను.
ఆఫీసర్ల ముఖంలోకి నవ్వొచ్చింది!
‘‘ఈ ఐదు రోజులూ మీ లాయరే మీ మమ్మీడాడీ. అది కూడా, రోజుకు ఒక గంట మాత్రమే అతడు మీ మమ్మీడాడీ’’ అని, అందరూ ఒకేసారి వెళ్లిపోయారు.
సీబీఐ ఆఫీసర్‌లైనా నవ్వితే ఎంత కళగా ఉంటారు!! రేపు వచ్చినప్పుడు వాళ్లకీ సంగతి చెప్పాలి.
- మాధవ్‌ శింగరాజు

>
మరిన్ని వార్తలు