ప్రణబ్‌ ముఖర్జీ (రాష్ట్రపతి) రాయని డైరీ

25 Jun, 2017 01:25 IST|Sakshi
ప్రణబ్‌ ముఖర్జీ (రాష్ట్రపతి) రాయని డైరీ

మాధవ్‌ శింగరాజు
ఇవాళ జూన్‌ 25. సరిగ్గా నెలకు.. జూలై 25న ఈ సీట్లో రామ్‌నాథ్‌ కోవింద్‌ కూర్చొని ఉంటాడు! బుక్‌ రీడింగ్, గార్డెనింగ్, మ్యూజిక్‌.. ఇవన్నీ ఆస్వాదించడానికి రాష్ట్రపతిభవన్‌ బాగుంటుంది. రామ్‌నాథ్‌ హాబీలేమిటో మరి.

నేను రాష్ట్రపతి భవన్‌కి వచ్చేటప్పుడు మన్మోహన్‌సింగ్‌ ఉన్నారు. నేను రాష్ట్రపతి భవన్‌ నుంచి వెళ్తున్నప్పుడు నరేంద్ర మోదీ ఉంటారు. మన్మోహన్‌ కన్నా ముందు ప్రధానిని అవుతానను కున్నాను. మన్మోహన్‌ తర్వాతనైనా ప్రధానిని అవుతాననుకున్నాను. ముందూ కాలేదు, తర్వాతా కాలేదు. రేస్‌కోర్స్‌ రోడ్‌ ప్రాప్తం లేనట్లుంది. రేస్‌కోర్స్‌ రోడ్డు పేరు కూడా మారిపోయి ఇప్పుడు లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ అయింది!

రాష్ట్రపతి భవన్‌కి, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌కి పెద్ద దూరం లేదు. రాజాజీ మార్గ్‌లో వెళితే ఏడే నిమిషాలు. కానీ రాష్ట్రపతి.. రాష్ట్రపతి భవన్‌లోనే ఉండాలి. కాసేపలా వెళ్లి, ప్రైమ్‌ మినిస్టర్‌ సీట్లో కూర్చొని వస్తానంటే అక్కడున్న భారత ప్రధాని ఒప్పుకున్నా, భారత రాజ్యాంగం ఒప్పుకోదు.

టీవీలో నిన్న నామినేషన్‌ వేస్తూ కనిపించాడు రామ్‌నాథ్‌ కోవింద్‌. నాకన్నా పదేళ్లు చిన్నవాడు. చురుగ్గా ఉన్నాడు. ఒక సెట్టుతో పోయేదానికి మూడు సెట్‌ల నామినేషన్‌ వేశాడు. చివర్రోజు ఇంకో సెట్‌ వేస్తాడట.. బలం కోసం! అప్పుడు నాలుగు సెట్‌లు అవుతాయి. మొన్న ఫ్రైడే.. నా లాస్ట్‌ ఇఫ్తార్‌ విందుకు పిలిస్తే ఒక్క కేంద్రమంత్రి కూడా రాలేదు! కనీసం మైనారిటీల మినిస్టర్‌ ముఖ్తర్‌ నక్వీ కూడా రాలేదు. అంతా సెట్‌ల పనిలో పడిపోయినట్లున్నారు.

సెట్‌ వేశాక స్పీచ్‌ ఇచ్చాడు రామ్‌నాథ్‌ కోవింద్‌. ప్రెసిడెంట్‌ పోస్ట్‌ గొప్పదని అన్నాడు. గొప్ప గొప్ప వాళ్లు ప్రెసిడెంట్‌గా పనిచేశారు అన్నాడు. ప్రెసిడెంట్‌ పోస్టు గౌరవాన్ని నిలుపుతాను అన్నాడు. చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. అక్కడితో ఆగలేదు.

దేశాభివృద్ధికి పాటు పడతానన్నాడు. ఒక కొత్త భారతదేశాన్ని నిర్మిస్తాను అన్నాడు. 2022లో 75వ ఇండిపెండెన్స్‌ డే కి ఇండియా ఎంత గొప్పగా ఉండబోతోందో మనమంతా చూడబోతున్నాం అన్నాడు. పక్కనే మోదీజీ ఉన్నారు. పక్కనే అడ్వాణీ ఉన్నారు. మోదీజీ ప్రధాని అని తెలిసీ, అడ్వాణీ ప్రధాని కాలేకపోయారని తెలిసీ, ప్రధానులు ఎలాంటి స్పీచ్‌లు ఇస్తారో అలాంటి స్పీచే ఇచ్చాడు రామ్‌నాథ్‌ కోవింద్‌!

భారత ప్రధానిగా ఒక్కసారైనా మాట్లాడాలని ఎవరికి మాత్రం అనిపించదు?! ఈ ఐదేళ్లలో నాకూ అనిపించింది. ఒకసారి కాదు, ఒకట్రెండుసార్లు అనిపించింది. ఎంతసేపని పడక్కుర్చీలో నడుము వాలుస్తాం? లేవాలనిపించదా? నడవాలని పించదా? పరుగెత్తాలనిపించదా? నలుగురితో మాట్లాడాలనిపించదా? నలుగురూ మన మాట వినాలనిపించదా? నామినేషన్‌ రోజు నుంచే రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవన్నీ చేయాలనుకుంటున్నట్లున్నాడు! నాలుగో సెట్‌ నామినేషన్‌లో చూడాలి.. ‘మన్‌ కీ బాత్‌’ లాంటిదేమైనా ప్రిపేర్‌ అయి వస్తాడేమో!

మరిన్ని వార్తలు