సాగుపై క్రీనీడలు

7 Sep, 2015 00:47 IST|Sakshi

       ఈసారి కూడా రుతు పవనాలు మొహం చాటేస్తాయని వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రారంభంలో చెప్పిన జోస్యం నిజమైనట్టే కనిపిస్తోంది. సాధారణంగా సెప్టెంబర్ మొదటి వారంలో రుతుపవనాలు వైదొలగడం మొదలెడతాయని, రాజస్థాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో అందుకు సంబంధించిన ఛాయలు కనబడుతు న్నాయని తాజాగా ఐఎండీ ప్రకటించింది. దేశ గ్రామీణ వ్యవస్థకు రుతు పవనాలు జీవనాడుల వంటివి. మన వర్షపాతంలో 70 శాతం రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. మనకున్న దాదాపు 16 కోట్ల హెక్టార్ల సాగుభూమిలో 65 శాతం వ్యవసా యాధారితం గనుక రుతు పవనాలు సక్రమంగా లేకపోతే ఆహారోత్పత్తులపై గణనీయమైన ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో వర్షపాతం లోటు జూలైలో 17 శాతం, ఆగస్టులో 23 శాతంగా ఉన్నదని ఐఎండీ లెక్కేయడం ఆందోళన కలిగిస్తుంది. ఆహార ధాన్యాల వార్షిక ఉత్పత్తిలో మూడో వంతు భాగాన్ని అందించే మహా రాష్ట్ర, కర్ణాటక, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను ఈసారి రుతుపవనాలు ప్రధానంగా దెబ్బతీశాయని క్రెడిట్ రేటింగ్ సంస్థ క్రిసిల్ విశ్లేషిస్తున్నది.


ఆ విశ్లేషణ మరో ఆసక్తికర విషయాన్ని చెప్పింది. దేశ వ్యవసాయోత్పత్తుల్లో 90 శాతాన్ని అందించే 14 రాష్ట్రాల్లో కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతాన్ని నమోదు చేశాయంటున్నది. మిగిలినవన్నీ సాధారణం...అంతకంటే తక్కువ వర్షపాతాన్ని పొందాయి. తెలుగు రాష్ట్రాలు రెండూ సాధారణంకంటే 13.7 శాతం తక్కువ వర్షపాతాన్ని నమోదు చేయగా పొరుగునున్న తమిళనాడులో ఇది -9.5 శాతంగా ఉన్నది. పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లు మాత్రమే అధిక వర్షపాతాన్ని పొందాయి. కేరళ, పంజాబ్‌లలో వర్షపాతం లోటు అధికంగానే ఉన్నా అక్కడున్న నీటిపారుదల సౌకర్యాలు దాన్ని భర్తీ చేస్తాయి. నిరుడు ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులవల్ల వ్యవసాయోత్పత్తులు 5 శాతం మేర తగ్గాయని గుర్తుంచు కుంటే ఈసారి ఎలా ఉంటుందో సులభంగానే అంచనా వేయొచ్చు.

  వర్షాలపై పెద్దగా ఆశ పెట్టుకోవద్దని ఐఎండీ చెప్పినప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఓ మాట అన్నారు. ఈ వర్షాల లేమి ఆహారోత్పత్తిపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని...దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చే ఇబ్బందేమీ ఉండదని ఆయన అంచనా వేశారు. లోటు ఉండొచ్చునని ఐఎండీ చెప్పిన వాయువ్య ప్రాంతంలోని పంజాబ్, హర్యానాల్లో నీటి పారుదల సౌకర్యాలు చాలినంతగా ఉండటమే ఆయన ఆశాభావానికి కారణం. జైట్లీ జోస్యం నిజం కావాలని చాలామంది అనుకుంటున్నా ప్రస్తుత వర్షాభావ స్థితే ఈ నెలాఖరు వరకూ కొనసాగుతుందని అంటున్నారు. మొత్తానికి ఎల్‌నినో ప్రభావం గట్టిగానే ఉన్నదని, వచ్చే ఏడాది కూడా ఇలాగే ఉండ వచ్చునని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయంగా తిండిగింజల ధరలు నియంత్రణలోనే ఉన్నాయి గనుక ఎల్‌నినో వల్ల వచ్చే ముప్పేమీ లేదని ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 అయితే ఇంతమాత్రాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసాతో ఉండటానికి వీల్లేదు. దేశంలో 56 శాతం జనాభాకు ఇప్పటికీ వ్యవసాయమే ఆధారం. బ్యాంకు లు పెట్టే నిబంధనల కారణంగా అధిక శాతం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులనే ఆశ్రయిస్తారు గనుక పంటలు దెబ్బతింటే అలాంటివారంతా మరింతగా అప్పుల్లో కూరుకుపోతారు. అటు రైతుకూలీలు కూడా ఆదాయం కోల్పోయి కష్టాల్లో పడతా రు. కనుక గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తీవ్రంగా దెబ్బతింటుంది. అందుకు సంబంధించిన జాడలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. వినియోగ వస్తువుల్ని ఉత్పత్తి చేసే హిందూస్థాన్ లీవర్ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ గణనీయంగా తగ్గిందని మొన్న జూలైలోనే ప్రకటించింది. నిరుడు వర్షాలు సరిగా లేకపోవడంతో దేశవ్యాప్తంగా 12,360మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని నేషనల్ క్రైం రికార్డు బ్యూరో తెలిపింది. ఈ ఏడాది ఇంతవరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతుల బలవన్మరణాలు గణనీయంగా ఉన్నాయి. పంటల బీమా పథ కం అమలవుతున్నా అందుకు సంబంధించిన పరిజ్ఞానం రైతుల్లో తగినంతగా లేక పోవడం...ఉన్నా ప్రీమియం కట్టలేకపోవడం వంటివి ఆచరణలో ఆ పథకాన్ని వెక్కిరిస్తున్నాయి. పంటల బీమా పథకంలో చేరని రైతుల్లో 46 శాతంమంది దానిపై ఆసక్తి లేదని చెప్పారని అసోచామ్ సర్వే వెల్లడించింది.

 ప్రభుత్వాల ఉదాసీనత వల్ల వ్యవసాయ సంక్షోభం అంతకంతకు పెరుగు తోంది. గత పదిహేనేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా మూడు లక్షలమందికి పైగా రైతులు మరణిస్తే...దాదాపు 20 లక్షలమంది రైతులు సాగునుంచి తప్పుకున్నారు. యూపీఏ సర్కారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల అధ్యయనానికి నియమించిన స్వామి నాథన్ కమిషన్ ఎన్నో విలువైన సూచనలు చేసింది.  తాము అధికారంలోకొస్తే ఆ సిఫార్సులను అమలు చేస్తామని ఘనంగా ప్రకటించిన బీజేపీ ఇంతవరకూ వాటి జోలికెళ్లలేదు.ముఖ్యంగా వ్యవసాయ పంటల ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధరలు నిర్ణయించాలన్న కమిషన్ సూచనను అమ లు చేస్తామన్నవారు ఇప్పుడు అలా ఇవ్వడం అసాధ్యమని సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేశారు.  ఇక రాష్ట్ర ప్రభుత్వాల సంగతి చెప్పేదేముంది?
 తాజాగా క్రిసిల్ గణాంకాలు చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కదలాలి. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. వ్యవసాయోత్పత్తులకు మెరుగైన మద్దతు ధరలు ప్రకటించడంతోపాటు తక్షణం ఉపాధి హామీ పథకం వంటివాటిపై దృష్టి పెట్టాలి. ఆహార ధాన్యాల సేకరణపై విధించిన పరిమితులను పూర్తిగా ఎత్తివేయాలి. రైతులను ప్రైవేటు మార్కెట్ శక్తుల బారిన పడేస్తే వారి పరిస్థితి మరింత దుర్భరమవుతుందని గుర్తించాలి. ఈ కష్టకాలంలో రైతులకూ, రైతుకూలీలకూ అండగా నిలవడం అవసరమని తెలుసుకోవాలి.

మరిన్ని వార్తలు